17 November 2017 Written by 

నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలి

padavaకాసుల కోసం కక్కుర్తి పడి 23 మంది నిండుప్రాణాలను నిలువునా పొట్టనబెట్టుకున్నారు. కృష్ణానదిలో పవిత్రమైన హారతిని దర్శించుకోవాలన్న అమాయక పర్యాటకుల ప్రాణాలను గంగపాలు చేశారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే పడవను కొద్ది మార్పులు చేసి పర్యాటకుల పడవగా మార్చి ప్రైవేట్‌ నిర్వాహకులు నిర్లక్ష్యంతో పడవ నడపడం వల్లనే పడవ నీట మునిగిపోయింది. కన్నుమూసి తెరిచే లోగా అంతమంది జీవితాలు ఒక్కసారిగా జలసమాధి అయిపోయాయి. స్వార్ధం, ధనదాహం, అవినీతి, రాజకీయం అన్నీ కలగలిసి ఈ దుర్ఘటనకు దారితీశాయని చెప్పక తప్పదు. ప్రైవేట్‌ బోట్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లిప్తత కలసి వెరసి మొత్తం 23 మంది ప్రాణాలు హరీమన్నాయి. ఈ దుర్ఘటనలో ఎక్కువమంది ఒంగోలు వారే. అంతేకాదు, నెల్లూరుజిల్లా వాసులైన ముగ్గురు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఉన్నారు. ఏదేమైనా పడవ ప్రయాణంలో ఒక్కసారిగా ఇంతమంది మరణించడం అత్యంత బాధాకరం..దురదృష్టకరం. ఆకులు కాలాక చేతులు పట్టుకున్నట్లు, అంతమంది అత్యంత దయనీయంగా నీటిలో పడి దిక్కుతోచక.. ఊపిరాడక చనిపోయాక.. ఆ తర్వాత ఎవరెంత చేసినా.. ఎంతగా ఊరడించినా మృతుల కుటుంబా లకు జరిగిన లోటును పూడ్చగలమా?.వారి వేదనా రోదనలు తీర్చగలమా?...

ఒంగోలు వాకర్స్‌క్లబ్‌కు చెందిన 60 మంది బృందం ఇటీవల అమరావతికి వెళ్ళి అక్కడ పలు ప్రాంతాలు సందర్శించి, విజయవాడలోని పున్నమి ఘాట్‌కు చేరుకుని, కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద నిత్యహారతిని తిలకించాలనుకున్నారు. అప్పటికే సాయంత్రం నాలుగున్నర గంటలు కావడంతో, ఏపి పర్యాటకశాఖకు చెందిన పడవ చీకటి పడుతోంది కనుక ఆ సమయంలో రాదని చెప్పడంతో, వారు తమ నిర్ణయం మార్చుకుని ఉన్నా ఈ ప్రమాదం తప్పి ఉండేదేమో!.. కానీ వారు అక్కడే ఉన్న ప్రైవేట్‌ బోట్‌ను మాట్లాడుకున్నారు. అప్పుడు పర్యాటకసిబ్బంది నివారించి ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. అయితే, ఆ ప్రైవేట్‌ పడవే తమ పాలిట మృత్యుశకటమవుతుందని ఆ పర్యాటకులు ఊహించ లేకపోయారు. ఆ పడవకు ఆ నదిలో తిరిగేందుకు అనుమతి లేకపోయినా, దానిలో 20 మందిని కూడా ఎక్కించేందుకు వీలులేకపోయినా, ఏకంగా 38 మందిని ఎక్కించేశారు. మొత్తం 47 మందితో పడవ బయలుదేరినట్లు అంచనా. అది సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి 5.20 గంటల ప్రాంతంలో పవిత్ర సంగమం వద్దకు చేరిందని, అక్కడ గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే సంగమ ప్రాంతం కనుక, నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో పడవ కుదుపులకు గురై, కొంచెం ముందుకు వెళ్ళగానే నదిలో ఇసుకమేటలు తగిలి పడవ ఒరిగిపోవడం, ఆ అదురుకు సారంగి ఒక్కసారిగా పడవను పక్కకు తిప్పడంతో పడవ బోల్తా పడిపోయినట్లు సమాచారం. ఈత వచ్చినవాళ్ళు ఎలాగో ప్రాణాలు కాపాడు కున్నారు. మరికొందరు బోటుకు వేలాడుతూ నీటిలో పడకుండా బయటపడ్డారు. నదిలో సహాయకచర్యలు చేపట్టే ఎన్డీఎఫ్‌ బృందాలు ఆ సమయానికి అక్కడికి వచ్చి కొందరినైనా కాపాడడం అదృష్టమే. అయితే, అప్పటికే పలువురు నీటమునిగి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. కృష్ణానదిలోకి గోదావరి జలాలు ప్రవేశించే ప్రాంతం ఎంతో పవిత్రమైనదని, ఆ ప్రాంతాన్ని సందర్శించుకుంటే పుణ్యం వస్తుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ నదిలో అక్రమ పడవలు తిరుగుతున్నా పట్టించుకోకపోవడమే దారుణం. సంధ్యా సమయంలో కృష్ణమ్మ హారతిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు భద్రతకు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం..నదిలో అక్రమ పడవలు యధేచ్చగా తిరుగుతున్నా పట్టించుకునేవారు లేకపోవడం ఘోరాతిఘోరం. కృష్ణానదిలో ఈ పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి గురైన పడవకు జలవనరుల శాఖ నుంచి కానీ, పర్యాటకశాఖ, అగ్నిమాపకశాఖల నుంచి కానీ, ఏ శాఖ నుంచి కానీ ఎలాంటి కనీస అను మతులు లేకపోవడం, ఏ అనుమతులు లేకున్నా, అసలు చీకటి పడే సమయంలో పడవ నడపరాదనే నిబంధనలున్నా ఆ పడవ మాత్రం యధేచ్చగా నదిలో విహారం చేస్తుండడం... ఏమిటిదంతా?.. ఇంత జరుగుతున్నా.. వారి కాసుల కక్కుర్తికి అమాయకుల ప్రాణాలు బలవుతున్నా...అడిగేవారు, అడ్డుకునేవారు ఎవరూ లేకపోవడం ఎంత దారుణం?..ఇదంతా కేవలం మానవ తప్పిదమే, అటు పడవ నిర్వాహకులు..ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యమే అంతమంది నిండుప్రాణాలు బలికావడానికి కారణం కావడం విచారకరం. అందు లోనూ ప్రమాదం జరిగిన ప్రాంతంలో కనీసం పది నుంచి పదిహేను మీటర్ల లోతు ఉంటుంది. అంతే కాదు, పడవ నడిపిన సారంగి కొత్తవాడు కావడం, పడవ నడపంలో అనుభవం లేకపోవడం, పడవలో కనీస రక్షణ పరికరాలు కానీ, లైఫ్‌ జాకెట్లు కానీ లేకపోవడం, నదిలో ఏ దారిలో ఎలా వెళ్ళాలో తెలియక పోవడం.. వగైరాలన్నీ, కలసిరాని కాలం వస్తే ఎలా దుర్భరంగా ఉంటుందో అలా అన్ని దురదృష్టాలూ కదిలివచ్చి అమాయకుల్ని నిలువునా కాటేశాయి. నదుల్లో పడవలు తిరగాలంటే జలరవాణాశాఖ అనుమతి తప్పనిసరి. అయినా, వాటిని ఖాతరు చేసేవారు. పర్యాటకులు ప్రైవేట్‌బోటు ఎక్కి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారని ప్రభుత్వం చెప్తున్నా, పర్యాటక సిబ్బందే ఆ ప్రైవేట్‌ బోటును పర్యాటకులకు సూచించారనే వాదనలూ విని పిస్తున్నాయి. అదే నిజమైతే ఎంత ఘోరం?..నదుల్లో ఇలా అక్రమంగా పడవలు నడుపుతున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండడం వెనుక స్థానికంగా ఉన్న కొందరు ప్రముఖుల ప్రమేయం, రాజకీయ కారణాలు లేవనుకోలేం. ఇకనైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వదిలి.. ఆ అక్రమ ప్రైవేట్‌ పడవ యజమానులు, నిర్వాహకులపై..మొత్తంగా వీటి నిర్వహణలో ఉన్న పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో మరెక్కడా పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే, ఆ నిర్లక్ష్యం కూడా ప్రభుత్వ తప్పిదమే అవుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter