Friday, 17 November 2017 06:39

పాదయాత్ర ప్లాన్‌తో బాబుకు షాకిచ్చిన లోకేష్‌

Written by 
Rate this item
(0 votes)

galpika'జగనన్నా జగనన్నా మీ వెంటే మేమన్నా... రాజన్న పుత్రుడవు, రైతన్న మిత్రుడవు' అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌తో సాగుతున్న జగన్‌ పాద యాత్రను ఉండవల్లిలోని తన ఇంట్లో కూర్చుని 'ఆత్మసాక్షి' ఛానెల్‌లో చూస్తున్నాడు నవ్యాంధ్రసారధి, హైటెక్‌రత్న చంద్రబాబునాయుడు. జమ్మల మడుగు ప్రాంతంలో పాదయాత్ర జరుగుతోంది. జనం పోటెత్తినట్లు వచ్చారు. అటు ఆదినారాయణరెడ్డి, ఇటు రామసుబ్బారెడ్డిలు తన పార్టీ లోనే వున్నా జగన్‌ కోసం అంతమంది జనం రావడం చూసి చంద్రబాబు బిత్తరపోయాడు. వెంటనే మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ చేశాడు. ఆదినారాయణరెడ్డి ఫోన్‌ ఎత్తగానే... నీ నియోజకవర్గంలో ఏం జరుగు తుందో చూస్తున్నావా? అని ప్రశ్నించాడు. అందుకు ఆదినారాయణరెడ్డి... నా నియోజకవర్గంలో జరిగేదేముంది... పగలు ఎండకాస్తోంది, రాత్ర యితే చీకటి పడుతోంది... అప్పుడప్పుడూ మబ్బు కాస్తే వర్షం పడు తోంది. ఎక్కడైనా ఇదేగా జరిగేది అని చెప్పాడు. వెంటనే టీవీ ఆన్‌చేసి చూడు... నీ నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్రకు ఎంతమంది జనం వచ్చారో! మీరిద్దరు వుండి కూడా అంతమంది జనం అక్కడకు వెళ్లడమేంటని చంద్రబాబు అడిగాడు. అందుకాయన... జనానికి, ఓట్లకు సంబంధం లేదు సీఎం గారు... మొన్న నంద్యాలలో కూడా జగన్‌ వస్తే ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. మీరొస్తే ఈగలు తోలుకుంటున్నాం, అంతమాత్రం చేత ఓట్లు వాళ్లకు పడ్డాయా? మనకు పడ్డాయా? ఓట్ల లెక్కకు పాదయాత్ర జనం లెక్కకు సంబంధం లేదప్పా... వాళ్ళంతా పెళ్ళిళ్ళకు వచ్చిన జనం... మా ఊర్లో చేడమ్మ తల్లి జాతరకు కూడా జనం బ్రహ్మాండంగా వస్తారు, అలాగని ఎన్నికల్లో ఆ చేడమ్మ తల్లి వచ్చి పోటీ చేసినా డబ్బు లియ్యందే ఓట్లేయరు, మీరేం వర్రీకాకండి, ఎన్నికలంతా లెక్కా చారంతోనే జరిగిపోతాయని చెప్పి పెట్టేశాడు. ఆదినారాయణరెడ్డి మాటతో చంద్రబాబు మనసు కుదుటపడలేదు. 'ఆత్మసాక్షి' ఛానెల్‌లో జగన్‌కు వస్తున్న జనాన్ని చూస్తూ అన్యమనస్కంగానే వున్నాడు. దీనికితోడు అప్పుడే పాదయాత్రలో చిన్న విరామం అంటూ న్యూస్‌ రీడర్‌ చెప్పాడు. వెంటనే వాణిజ్య ప్రకటనలు... ''వేల కిలోమీటర్ల నడక... నేలపైనే పడక... ఎన్ని వందల కిలోమీటర్లు నడిచినా పాదాలకు నొప్పులు తెలియవు... జగన్‌ పాదయాత్రలో అద్భుత రహస్యం... ఆడిడాస్‌ బూట్లు... మీరూ కొనండి... పాదయాత్ర చేయండి'' అంటూ ఒక యాడ్‌... అది అయిపోగానే... ''రామ్‌రాజ్‌ బనియన్లు, డ్రాయర్లు... నాడు రాజశేఖరరెడ్డి నుండి నేడు జగన్మో హన్‌రెడ్డి దాకా పాదయాత్రకు అందరూ వాడే డ్రాయర్లు... మీరెక్కడ నడుస్తున్నా రామ్‌రాజ్‌ డ్రాయర్‌ మీ వెంటే'' అంటూ ఇంకో యాడ్‌. వీటిని చూడగానే చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో పాటే జగన్‌ పాదయాత్రను ఆపే ఐడియా కూడా వచ్చింది. వెంటనే ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్‌ను పిలిపించాడు. ఆయనకు చెవిలో ఏదో వూదాడు.

----

జగన్‌ పాదయాత్ర జమ్మలమడుగు వైపు నుండి పొద్దుటూరు రోడ్డులో రాసాగింది. ఆ రోడ్డు పొడవునా ఆంధ్రప్రభుత్వ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హోర్డింగ్‌లు... వాటిపై ఇలా వ్రాసి వుంది. ''అతి నడక అనర్ధదాయకం... ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ళ చిప్పలు అరిగి కీళ్ళ వాతం వచ్చి, ఎముకలు చచ్చుబడిపోవచ్చు. పాదయాత్రలు మానుకోండి.. మీ కాళ్ళను కాపాడుకోండి.''

ఇట్లు

మీ ఆరోగ్యం కోసం తపించే...

ఆరోగ్యశాఖ మంత్రి

కామినేని శ్రీనివాస్‌...

దారి పొడవునా ఇవే హోర్డింగ్‌లు. ఆ హోర్డింగ్‌ల మీద వ్రాసిన మెసేజ్‌ చదివి జగన్‌ నవ్వుకున్నాడు. తన పాదయాత్రకు బ్రేక్‌ వేయడానికి చంద్రబాబు వేసిన ప్లాన్‌ అని గ్రహించాడు. వెంటనే తన సెల్‌ఫోన్‌ తీసి ఒక మెసేజ్‌ టైప్‌ చేసి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఫోన్‌కు పోస్ట్‌ చేసాడు.

్య్య్య్య్య

చంద్రబాబు ఛాంబర్‌లో ఆయనతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, దేవినేని ఉమలు వున్నారు. మనం పెట్టిన హోర్డింగ్‌లు చూసి ఆ జగన్‌ భయపడతాడా? పాదయాత్ర ఆపుతాడా? అని చంద్రబాబు అనుమానంగా అడిగాడు. ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది సార్‌, అంత భయపెట్టేలా హోర్డింగ్‌లు రాయించానని కామినేని శ్రీనివాస్‌ చెప్పాడు. అప్పుడే తన సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో కామినేని దానిని ఓపెన్‌ చేసి చూసాడు.

''కాలు కదిలితే కొవ్వు కరుగుతుంది...

కాలు పరుగెడితే గుండె స్పీడవుతుంది...

కాలు ముందుకు పడితే షుగర్‌ వెనకడుగు వేస్తుంది...

కాలు కదం తొక్కితే బి.పి. పరారవుతుంది...

మీ హోర్డింగ్‌ల మీద వీటిని వ్రాయించండి.

ఇట్లు

మీ,

జగన్‌.

ఆ మెసేజ్‌ చూడగానే కామినేని బిత్తరపోయాడు. ఇతని పాదయాత్రను ఆపేదెట్లా అని చంద్రబాబు దిగులుపడ్డాడు. అప్పుడే ఐ.టి మంత్రి లోకేష్‌ అక్కడకు వచ్చాడు. విచారంగా వున్న తన తండ్రిని చూసి విషయం ఏంటని అడిగాడు. పక్కనే వున్న దేవినేని... ఏం చెప్పమంటావు బాబూ... జగన్‌ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి మీ తండ్రిగారిలో నరాలు ఎక్కువుగా స్పందిస్తున్నాయి. ఆయనేమో ముఖ్యమంత్రి, పాదయాత్ర చేయకూడదు... 2002లో వై.యస్‌. పాద యాత్ర చేసాడు, సీఎం అయ్యాడు. 2013లో మీ నాన్నగారు పాదయాత్ర చేసారు, సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ జగన్‌ పాదయాత్ర చేస్తున్నాడు... అదే మీ నాన్నగారి బెంగ అని చెప్పాడు. అది విన్న లోకేష్‌... ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, పాదయాత్రను పాదయాత్రతోనే కొడతాను, అతనికంటే ఎక్కువ కిలోమీటర్ల దూరం నడిచి శెభాష్‌ అనిపించుకుంటాను... ఇదే నా శపథం అంటూ తొడ చరిచాడు. లోకేష్‌ ఉత్సాహం చూసి చంద్రబాబుతో పాటూ మంత్రు లందరిలోనూ ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. వెంటనే లోకేష్‌కు బట్టలు సర్ధి, నాలుగు జతల బూట్లు పెట్టి రెడీచేసి బండెక్కించి పంపారు. చంద్రబాబు రాత్రి రెండు పుల్కాలు తిని లోకేష్‌ నా వరాల పుత్రుడు.. పాదయాత్ర చేస్తానని చెప్పి నా గుండెల్లో వున్న భారం దించాడు. జగన్‌కన్నా ఎక్కువ దూరం పాదయాత్ర చేస్తానన్నాడు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు తిరుగుతాడేమో నా బంగారు కొండ అని మురిసి పోతూ... సుమతి శతకం తీసి

''పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా

పుత్రుని గనుగొని పొగడగ

బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతి''

అనే పద్యం చదువుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు.

----

తెల్లారింది. చంద్రబాబు లేచి రోజువారీ కార్యక్రమాలు ముగించు కుని హాల్‌లోకొచ్చి టీవీ ఆన్‌ చేసి కూర్చున్నాడు. లోకేష్‌ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని తిరుపతి నుండి పాదయాత్ర మొదలుపెడతాడేమోనని చంద్రబాబు ఆలోచించసాగాడు. అప్పుడే న్యూస్‌ ఛానెల్‌ 'చంద్రజ్యోతి'లో బ్రేకింగ్‌ న్యూస్‌... కాశ్మీర్‌ నుండి కన్యాకుమారికి పాదయాత్రను మొదలుపెట్టిన నారా లోకేష్‌... కాశ్మీర్‌లో పాదయాత్రను ప్రారంభించిన కాశ్మీర్‌ సీఎం మెహబూబా మఫ్తీసయ్యద్‌.. అని న్యూస్‌రీడర్‌ చెప్పగానే... జగన్‌ కంటే ఎక్కువ దూరం పాదయాత్ర చేస్తానంటే ఇదా... అని చంద్రబాబు అలాగే షాక్‌కు గురై కుర్చీలో కూలబడ్డాడు.

Read 98 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter