నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్మెంట్ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును ఆశిస్తున్న నాయకులందరూ పైకి నారాయణ వస్తే తిరుగులేదని చెబుతున్నా లోపల మాత్రం ఆయన రాకుంటే బాగుండనుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి నగర ఇన్ఛార్జ్గా వ్యవహరి స్తున్నాడు. వచ్చే ఎన్నికలలోనూ ఆయన సీటుకు పోటీలో ఉంటాడనడంలో డౌట్ లేదు. 2014 ఎన్నికలలోనే నెల్లూరు సిటీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన 'నుడా' ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా మళ్ళీ సీటు కోసం పోరాడకుండా ఉండడు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు నుండి నేను పోటీ చేస్తానంటూ పాటపాడుతూనే వున్నాడు. ఇక నగరంలో సొంత వర్గం కలిగిన ఆనం కుటుంబం నుండి ఒకరు ఈసారి ఈ సీటును ఆశించ డంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అయితే ప్రతి ఎన్నికలలోనూ జిల్లాలో ఒక సీటును మహిళలకు ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో గూడూరు సీటు నుండి మహిళా అభ్యర్థిగా బి.జ్యోత్స్నలతను నిలబెట్టారు. ఈసారి అక్కడ జంపింగ్ ఎమ్మెల్యే పాశం సునీల్కే సీటు ఇవ్వొచ్చు. కాబట్టి నెల్లూరు నగరంలో మహిళకు అవకాశం కల్పించవచ్చనే దిశగా మాజీమున్సిపల్ ఛైర్పర్సన్ టి.అనూరాధ కూడా రంగంలో వున్నట్లు తెలుస్తోంది. ఎవరికివాళ్ళు మంత్రి నారాయణను క్రాస్ చేసి కాకుండా ఆయన అండదండలతోనే సీటు సాధించాలనుకుంటున్నారు.