07 December 2017 Written by 

విలక్షణ నేత... మాదాల జానకిరాం కన్నుమూత

madalaజై ఆంధ్రా ఉద్యమసారధి, మెట్ట ప్రాంత నాయకుడు, మాజీమంత్రి మాదాల జానకిరామ్‌ (67) ఈనెల 6వతేదీ బుధవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో స్వర్గస్థులయ్యారు. గత కొన్ని రోజులుగా నెల్లూరులోని కిమ్స్‌ ఆసు పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 6వ తేదీన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించడానికి ముంబై నుండి ప్రత్యేకంగా ఎయిర్‌ అంబులెన్స్‌(విమానం)ను కూడా తిరుపతి ఎయిర్‌పోర్టుకు తెప్పించారు. మధ్యాహ్నం కిమ్స్‌ ఆసుపత్రి నుండి అంబులెన్స్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు తీసుకువెళుతుండగా గూడూరు దాటాక కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

జిల్లా రాజకీయాలలో మాదాల జానకిరామ్‌ది విలక్షణ మైన పాత్ర. ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడం ఆయన నైజం. దుత్తలూరు మండలం నర్రవాడ ఆయన స్వగ్రామం. విద్యార్థి దశలోనే జైఆంధ్రా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాలలో వెంకయ్యనాయుడు, చంద్ర బాబునాయుడు, వై.యస్‌.రాజశేఖరరెడ్డిల సమకాలీకుడు. 1978లో సంజయ్‌గాంధీ పిలుపుమేరకు కాంగ్రెస్‌లో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఉదయగిరి అసెంబ్లీ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి జనతాపార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు చేతిలో ఓడిపోయారు. తర్వాత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డితో విభేదించి కొంతకాలం రాజకీయాలకు దూరంగా వుండిపోయారు. 1989లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో ఉదయగిరి అసెంబ్లీ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాదాలకు అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన తెలుగు దేశం అభ్యర్థి కంభం విజయరామిరెడ్డిపై గెలుపొందారు. 1991-93ల మధ్య నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేబినెట్‌లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1992లో ఒంగోలు పార్ల మెంటు అభ్యర్థిగా మాగుంట సుబ్బరామరెడ్డిని రంగంలోకి తీసుకు రావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మాగుంట సుబ్బ రామరెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1994 ఎన్నికల్లో ఉదయగిరి కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా, ఆయనను అధిగమించి తిరిగి టిక్కెట్‌ తెచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో మేకపాటి వర్గం పూర్తిగా వ్యతిరేకంగా చేయడంతో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కంభం విజయ రామిరెడ్డి చేతిలో 27వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1996లో ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మాగుంట పార్వతమ్మ గెలుపు కోసం, 1998లో ఇదే నియోజకవర్గం నుండి రాజకీయ అరంగేట్రం చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపు కోసం ఆయన బాగా కష్టపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో మేకపాటి, కంభం వర్గాలు కలిసి పనిచేసినా కూడా ఇక్కడ వాళ్ళకు భారీ మెజార్టీలు రాకుండా అడ్డుకోగలిగాడు. 1999 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఉదయగిరి టిక్కెట్‌ వచ్చింది. అప్పటికే తెలుగుదేశంలో చేరిన మాదాల తెలుగుదేశం అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి గెలుపుకు సహకరించారు. 2004 ఎన్నికల్లో కావలి అసెంబ్లీ నుండి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత చంద్రబాబు విధానాలు నచ్చక ఆయన ముఖాన్నే నాలుగు తిట్టి బయటకు వచ్చేసారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా వుంటున్నారు.

జానకిరామ్‌కు స్వర్గీయ పి.వి.నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలుండేవి. మంత్రిగా వున్న కాలంలో ఢిల్లీలో కూడా చక్రం తప్పిన ఘనుడాయన.

స్వగ్రామమైన నర్రవాడలో తన తల్లి రాములమ్మ పేరు మీద ట్రస్టును నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిం చారు. వెంగమాంబ తల్లి అంటే ఆయనకు అత్యంత భక్తి. ఆ భక్తితోనే ఆమెకు ప్రత్యేక దేవాలయం నిర్మించారు. జైఆంధ్రా

ఉద్యమంతో పాటు నాగార్జునసాగర్‌ ఎడమకాలువ సాధన కోసం 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసారు. వెలుగొండ, సీతారాం సాగర్‌ ప్రాజెక్టుల కోసం పోరాటం చేశారు. విద్యార్థి దశ నుండే అయ్యప్ప భక్తుడైన ఆయన అయ్యప్పస్వామి మహత్యం పేరుతో ఒక సినిమాను, అలాగే వెంగమాంబ జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమాను నిర్మించారు. మాదాల జానకిరామ్‌ ఒక చరిత్ర వున్న నాయకుడు. నేటి తరాలకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతోంది 'లాయర్‌'.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter