ఉండవల్లిలోని హైటెక్ రత్న చంద్రబాబు నివాసం. రాజమౌళిని తీసుకుని అమరావతి పరిసరాలన్నీ చూపించి, ఎక్కడ కోటలు రావాలి, ఎక్కడ కందకాలు తవ్వాలి, ఎక్కడ అశ్వదళాలు, గజదళాల శాలలు నిర్మించాలన్న దానిపై ఆయనకు సూచనలిచ్చి చంద్రబాబు అప్పుడే వచ్చాడు. హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేసాడు. ఆ క్షణంలో ఆయనకు మనిషన్నాక కూసంత కళాపోషణ వుండాలి, లేకుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏటుంటాది అనే ముత్యాలముగ్గు సినిమాలోని రావుగోపాలరావు డైలాగ్ గుర్తుకొచ్చింది. బాడీలో ఏబిసిడి విట మిన్లు లోపించినట్లే ఎంటర్టైన్మెంట్ అనే విటమిన్ లోపించినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదని భావించిన చంద్రబాబు ఏదన్నా సినిమా చూసి తరిద్దామని 'మా' టీవీ ఛానెల్ పెట్టాడు. అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సీమటపాకాయ్' సినిమా వస్తుంది. అందులో ఓ సన్నివేశం... అమెరికా నుండి బ్రహ్మానందం తన భార్య, కూతురును వెంటబెట్టుకుని పెద్ద కోటీశ్వరుడైన తన బావ షియాజీషిండే ఇంటికి వస్తాడు. అల్లరి నరేష్ అతని కొడుకే! ఆ పెద్ద భవంతిలో షియాజీషిండే, అతని భార్య సుధ, కొడుకు అల్లరి నరేష్, మిగతా కుటుంబసభ్యులు పనిమనుషుల్లాగా వుంటారు. పని మనుషులుగా వుండే ఎల్.బి.శ్రీరాం, గీతా సింగ్‌లు ఓనర్లుగా కనిపిస్తారు. ఏమైందిరా, ఇంత బికారులు ఎలా అయ్యారురా అని బ్రహ్మానందం అడుగుతాడు. అందుకు అల్లరి నరేష్... రాత్రి డ్రైవర్‌తో నాన్న పేకాట ఆడాడు. జోకర్ అతనికి పడింది, ఆస్తి మొత్తం అతనికే పోయింది అని చెబుతాడు. ఈ సీన్ చూసిన చంద్రబాబు పకపక నవ్వుతూ... నిజజీవితంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారేమోననుకుని, ఈరోజు విశేషా లేంటో చూద్దామని ఏబిఎఫ్ న్యూస్ ఛానెల్ పెట్టాడు. స్క్రీన్‌పై ఐ.టి మంత్రి లోకేష్ కనిపించేసరికి చంద్రబాబు ఆసక్తిగా ఆందోళనగా చూడసాగాడు. వీడేం మాట్లాడి ఏం నెత్తి మీదకు తెస్తాడోనని ఆయన బిత్తరబిత్తరగా వున్నాడు.
లోకేష్ ప్రెస్‌మీట్... ప్రతి ఏడాది ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా ఆస్తులు ప్రకటించడానికే మీడియాను పిలిచాను. మాది చాలా పేదకుటుంబం... నేను పాలు అమ్ముకుంటే, మా నాన్న జున్ను, లస్సీ, మజ్జిగ అమ్ముతున్నారు. మా అమ్మ తోటకూర, పాలకూర కట్టలు, నా భార్య కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే మేం బ్రతుకుబండిని నెట్టుకొస్తున్నాం. పాలు అమ్మగా వచ్చిన ఆదాయంతోనే దేవాన్ష్‌కు పాల డబ్బాలు కొంటున్నాం. ప్రతి నెల రేషన్‌షాపులో రెండు రూపాయల బియ్యం కొంటూ నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. ప్రతి ఏటా చంద్రన్న కానుక ఇస్తుండబట్టి సంక్రాంతి పండక్కి అరిసెలు చేసుకోగలుగుతున్నాం. ఏదో రూపాయి రూపాయి కూడబెట్టి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఫ్లాట్లు, ఒక ఇల్లు, హెరిటేజ్ ఫ్యాక్టరీ కట్టుకున్నాం. అన్నీ అమ్ముకోగా, తెచ్చిన అప్పులు పోగా నా ఆస్తి 13కోట్లు అని చెప్పాడు.
అది వినగానే చంద్రబాబు షాక్ తిన్నాడు. వెంటనే భువ నేశ్వరి, బ్రాహ్మణి అంటూ కేకేసాడు. ఏమైందండి అంటూ భువ నేశ్వరి, మామగారు అంటూ బ్రాహ్మణి పరుగెత్తుకుంటూ వచ్చారు. చంద్రబాబు వారితో... ఏం చేస్తున్నాడు వాడు, పేకాట ఆడుతు న్నాడా, ఇంకేమైనా చేస్తున్నాడా... తెలివైన వాడని లోకేష్‌కు బాధ్యతలు అప్పగిస్తే ఆస్తులను కర్పూరంలా కరిగించేస్తాడా... అని ఆవేశపడసాగాడు. అసలు ఏం జరిగిందండి అని భువనేశ్వరి అడిగింది. ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు 300 కోట్లు వున్న ఆస్తులను ఇప్పుడు 13కోట్లకు తెచ్చాడు. ఎక్కడ పేకాట ఆడి ఈ ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడో... వచ్చాక నిలదీసి అడగండి అని బాధ్యతగల తండ్రిగా చెప్పాడు. అప్పుడే నైట్‌రైడర్, ముదురుదోమల శాఖ మంత్రి పి.నారాయణ అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. సార్, వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్స్ అందరూ మన లోకేష్‌ను ఆదర్శంగా తీసుకుని ఆస్తులు ప్రకటిస్తున్నారు. ఒక్కసారి 'టైమ్స్ నౌ' ఇంగ్లీష్ ఛానెల్ పెట్టండి అని అడిగాడు. ప్రపంచ కుబేరులందరూ లోకేష్‌ను ఐకాన్‌గా తీసుకోవడమేంటనుకుంటూ చంద్రబాబు ఆ ఛానెల్ పెట్టాడు.
ప్రపంచంలో మేటి కోటీశ్వరుడు బ్రూనైసుల్తాన్ ఆస్తుల ప్రకటన... పాడుబడిన కోట పాతిక లక్షలు, తుప్పు పట్టిన విమానాలు నాలుగు 10లక్షలు, పది హెలికాఫ్టర్లు, నాలుగు వేల ఎకరాల భూములు, వెయ్యి కిలోల బంగారం... అంతా కలిపి నా ఆస్థి విలువ నాలుగు కోట్లు...
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం ఆలీబాబా...
చిరిగిన చొక్కాలు పది, కుట్లు పిగిలిన ఫ్యాంట్లు పాతిక, 30 దేశాలలో ఇండస్ట్రీస్, 300 బ్యాంకులలో అకౌంట్లు, నాలుగు టన్నుల గోల్డ్, 10వేల ఎకరాల పొలాలు, మొత్తం ఆస్థి విలువ 4.15 కోట్లు...
ఐ.టి దిగ్గజం బిల్‌గేట్స్...
రంగులు వెలసిన ఇల్లు, అన్ని దేశాలలోనూ సాఫ్ట్వేర్ కంపెనీలు, పది జతల బట్టలు, నాలుగు జతల బూట్లు, ఒక పెంపుడు కుక్క... మొత్తం ఆస్థి విలువ 10.24 కోట్లు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని...
రెండు విమానాలు, నాలుగు హెలికాఫ్టర్లు, రెండు రాష్ట్రాలలో చమురు కంపెనీలు, నాలుగు రాష్ట్రాలలో విద్యుత్ ప్రాజెక్టులు, 29 రాష్ట్రాలలో మాల్స్, ముంబైలో 30 అంతస్థుల భవనం... అన్నీ కలిపి ఆస్థి విలువ 7.24కోట్లు.
టీవీలో ఇక్కడితో ఆస్తుల ప్రకటనలు ముగిసాయి. న్యూస్ రీడర్ మళ్ళీ అదే అంశాన్ని కొనసాగిస్తూ... వీళ్ళంతా స్వచ్ఛంధంగా ఆస్తులు ప్రకటించడానికి ముఖ్య కారణం ఏపి ఐ.టి మంత్రి లోకేష్. ఎంత ఎదిగినా ఒదిగి వుండాలని, ఎన్ని కోట్లు సంపాదించినా తిండికి టికానా లేనట్లే వుండాలన్న ఆయన నిరాడంబర సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని తమ ఆస్తులను ప్రకటించినట్లు ఈ ప్రపంచ కుబేరులందరూ పేర్కొన్నారు. లోకేష్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది కుబేరులు తమ ఆస్తులు ప్రకటించడానికి ముందుకొస్తున్నారు అంటూ న్యూస్ రీడర్ ముగించింది. అదంతా విన్న చంద్రబాబు మనసులో తండ్రిని మించిన తనయుడవని పించుకున్నావు, గ్రేట్ లోకేష్ అంటూ అభినందించాడు.