29 December 2017 Written by 

గిట్టుబాటు కాని సేద్యం

rytuఅది ఏ వ్యాపారమైనా సరే, వస్తువు ఉత్పత్తి ధర కన్నా, వినియోగదారునికిచ్చే ధర అధికంగానే ఉంటుంది. కారణం, అందులో ఖర్చులు పోను కొంత ఆదాయానికే ఆ వస్తువును విక్రయిస్తుంటారు. అందువల్ల వ్యాపారం ఎప్పుడూ మూడుపువ్వులు ఆరు కాయలుగానే ఉంటుంది. కానీ, ఇక్కడలా కాదు. ఇది వ్యవసాయం. స్వేదంతో కలిపి చేసే సేద్యం. ఆరుగాలం కష్టపడి, తొలికోడి కూయకముందే పంటపొలాల్లోకి వెళ్ళి రాత్రనక, పగలనక శ్రమిస్తేనే ధాన్యం గింజలు రాలేది. అన్నదాతలైన రైతన్నల నిరంతర శ్రమే పంటపొలాల్లో మొలకలెత్తుతుంది. అందరికీ అన్నం పెట్టేది ఆ గింజలే. అయితే, ఇక్కడ మాత్రం రైతన్నకు ఎలాంటి గిట్టుబాటు ధరలూ ఉండవు. పంటచేలల్లో అత్యంత తక్కువ ధరతో పంటలు కొనుగోలు చేసేసి, రైతన్నలకు టోపీ పెట్టేసి, మార్కెట్లో ఎంత వీలైతే అంత ఎక్కువ ధరకు ఆ పంటను అమ్మేసుకోవడం..అదొక వ్యాపారం. పంటచేలో ఉత్పత్తులు, మార్కెట్లోకి వస్తే వ్యాపారవస్తువులైపోతాయి. దళారులు, వ్యాపారులు రైతులను బురిడీ కొట్టించి పంటలను కొనుగోలు చేసుకుపోవడం అనాదిగా వస్తున్నదే. దీనికి అంతెక్కడ?.. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. బక్కచిక్కిన బడుగు రైతులు పంటలు పండించుకోవడమే ఒక పెద్ద యాతనగా మారిన నేటి రోజుల్లో పొలం దున్నుకోవడం, విత్తనాలు తెచ్చుకోవడం, నాట్లేసుకోవడం, పంటలు పండేదాకా ఆకాశం కేసి ఆశగా చూస్తూనే ఉండడం, ఈలోగా ఏ అకాల వర్షాలో, మాయదారి వరదలో వచ్చి పంటల్ని ముంచేయడం, తెచ్చుకున్న అప్పులు కాస్తా పెరిగి పోయి, జీవితాలు సాగక చివరికి.. ఆత్మహత్యల దారి పట్టడం.. ఇది కూడా ఎంతోకాలంగా వస్తున్నదే. దేశా నికి వెన్నెముక రైతులేనని ఒకవైపు పొగుడుతూనే, మరోవైపు వారికి ఎలాంటి చేయూతను అందివ్వక నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడం వల్లనే రైతులు సేద్యంపై విరక్తి పెంచుకుంటున్నారు. రైతులను ఆదు కునేందుకు అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి అనేకానేక పథకాలున్నా అవి రకరకాల నిబంధనలతో ఉండడం వల్ల అసలైన నిరుపేద, బడుగు బలహీనవర్గాల రైతులకు అందడమే లేదన్నది బహిరంగ రహస్యమే. ఈ కష్టాలన్నీ చాలవన్నట్లు మరోవైపు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, నాశిరకం పురుగుమందులు ఇలాంటివన్నీ రైతును నష్టాల పాలుచేసేందుకు నిత్యం ఎదురుచూస్తూనే ఉంటాయి.

రైతు ఎంతో కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇప్పించాలంటూ రైతులు ఎంతోకాలం నుంచి కోరుకుంటున్నా ప్రభుత్వాల నుంచి ఆశించిన స్పందన ఉండడం లేదు. దేశవ్యాప్తంగా రైతన్నలకు ఇదొక శాపం. సరైన గిట్టుబాటు ధరలు లేక, వ్యవసాయం అప్పులమయంగా మారి కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో నిత్యం నానా బాధలు పడుతున్నారు. కష్టపడి పంటలు పండించుకున్నా ఆశించిన ఫలింపు లేక, ఫలింపు వచ్చినా అనుకున్న ధరలు లేక దిగాలుపడిపోతున్నారు. అన్ని ఆటుపోట్లను, ప్రకృతి విపత్తులను దాటుకునివచ్చినా, చివరికి ఇక ఎటూ తప్పించుకోలేరంటూ దళారులు వికటాట్టహాసం చేస్తుంటారు. దళారుల మాయాజాలంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. వ్యవసాయం కుదేలైపోయి, రైతన్నలు దిగాలైపోయి గత రెండు దశాబ్దాల్లో కనీసం మూడు లక్షల మందికిపైగానే పేదరైతులు ఆత్మహత్యల దారి వెతుక్కున్నట్లు అంచనాలు చెప్తూనే ఉన్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడం బాధాకరం. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పత్తి, మిరప పంటల ధరల తగ్గింపుతో రైతులు కనీసం 6వేల కోట్లకు పైగానే నష్టపోయారని, అదేవిధంగా మిరప ధరలు తగ్గిపోవడంతో కనీసం మూడున్నర వేల కోట్లకు పైగానే రైతులకు నష్టాలు వాటిల్లాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఒక ఉదా హరణ మాత్రమే. రైతులకు మద్దతు ధర ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్నాటక రాష్ట్రాల్లో రైతులు రోడ్లెక్కి అరిచినా ప్రయోజనం శూన్యం. దేశవ్యాప్తంగా రైతులకు కనీస మద్దతు ధర

ఉండాలని, లేకుంటే రైతుల కష్టాల నుంచి గట్టెక్కలేరని అనేక కమిటీలు సూచించినా వినేవారెవరు?.. రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యమని, రైతు హాయిగా ఉంటేనే వ్యవసాయానికి మనుగడ ఉంటుందని డా.స్వామినాధన్‌ సూచించినా ఎవరూ చెవికెక్కించు కోవడం లేదు. సరికదా అమానవీయంగా, అమాను షంగా పంటల ధరలను తగ్గించివేస్తుండడం ఇంకా దారుణం. దేశంలో దాదాపు 30 కోట్ల మంది రైతులు, వ్యవసాయంపై ఆధారపడిన వారు, ఇంకా లెక్కకు మించిన రైతు కుటుంబాల వారు ఉన్నారు. వారందరి సంక్షేమం చూడాల్సిన గురుతర బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. అయితే, రైతులకు అందని పథకాలు పెట్టి, ఇవ్వాల్సిన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, ఎప్పటికప్పుడు లేనిపోని హామీలతో కాలయాపన చేసుకుంటూపోతే చివరికి వ్యవసాయం కూడా దిక్కులేనిదైపోతుంది. వ్యవసాయమే లేకుంటే దేశం ఏమైపోవాలి?.. అందుకే, రైతు కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి. వారికి ఏ కష్టాలు, నష్టాలు లేకుండా వారిని కలకాలం చల్లగా చూసుకోవడం అందరి బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వాలు, పాలకులు అందుకు కంకణబద్ధులు కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పంటలు సక్రమంగా పండేందుకు ఉన్న అన్నిరకాల వనరులను పటిష్టవంతం చేయాల్సి ఉంది. రైతుకు ప్రాణప్రదమైన గిట్టుబాటు ధరలను సక్రమమైన పద్ధతిలో సత్వరం సరికొత్తగా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వేదంతో చేసే సేద్యం.. చివరికి స్వేదాన్నే మిగిలిస్తే రైతన్నలు ఇక ఎలా బతకాలి?... వ్యవసాయ రంగంలో ఇకనైనా రైతు భద్రతకు, రైతు సంక్షేమానికి కొంగ్రొత్త విధానాలను ప్రవేశపెట్టి, చిత్తశుద్ధితో కార్యాచరణ పథకాలను అమలుచేయడమే తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వాలు గుర్తించాలి. భారతదేశం సౌభాగ్యవంతమైన దేశం. ఆ సౌభాగ్యం వీడిపోకుండా... తన వెన్నెముకతో ఎల్లకాలం నిలబెట్టేది సాక్షాత్తూ అన్నదాతే. అందుకే, అన్నదాతలు దేశసౌభాగ్య ప్రదాతలు. వారికి కష్టకాలం రాకూడదు. రైతన్నలు కన్నీరు పెట్టుకోకుండా, వారికి అన్నివిధాలా చేయూతను అందించే పవిత్రమైన బాధ్యతను ఎట్టిపరిస్థితుల్లోనూ పాలకులు, ప్రభుత్వాలు విస్మరించకూడదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter