Friday, 29 December 2017 06:24

ఇజ్రాయిల్‌-పాలస్తీనా సమస్యకు చెక్‌పెట్టిన ఆనం

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది కాకులు దూరని కారడవి... వన్యమృగాలను వేటాడుతూ అవంతి రాజ్యం యువరాణి చంద్రసేన(అనుష్క) రథంపై అక్కడకు వచ్చింది. ఎంతో అందాల రాశి, చూపులను అట్టే కట్టిపడేసే సౌందర్యం ఆమెది. అంతలో పెద్ద దొంగల ముఠా గుర్రాలపై వచ్చి ఆమెను చుట్టుముట్టింది. ఆ ముఠా నాయకుడు అందాల చంద్రసేన(అనుష్క)పై కన్నేసాడు. ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలనుకున్నాడు. టపా టపా నాలుగు బాణాలేసి ఆమె అంగరక్షకులను హతమార్చాడు. ఆమెను నిరాయుధురాలిగా మార్చాడు. ఆమెను సమీపించి ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను పక్కనే వున్న పొదల్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేస్తుండగా, ఎక్కడి నుండో ఓ బాణం రివ్వున దూసుకొచ్చి బందిపోటు ముఠా నాయకుడి తలలో దిగింది. అంతే అతను చంద్రసేన(అనుష్క) చేయి వదిలి కుప్పకూలాడు. ఆ సంఘటనతో హతాశులైన మిగతా బందిపోటులు బాణం దూసుకొచ్చిన వైపు చూసారు. ఓ నల్లటి గుర్రం... దానిపై నల్లటి దుస్తులు, కళ్ళకు నల్లద్దాలు పెట్టిన విజయేంద్ర బాహుబలి(వివేకా) టపాటపా బాణాలు వదులుకుంటూ వారిని సమీపించాడు. రావడంతోనే చంద్రసేన(అనుష్క)కు అడ్డంగా నిలబడి బంది పోట్లతో పోరాటం మొదలుపెట్టాడు. తాను బాణాలు వేయడమే కాక చంద్రసేన(అనుష్క) చేత కూడా ఒకేసారి ధనుస్సును ఎక్కుపెట్టించి మూడేసి బాణాలు వేయించసాగాడు. అలా ఇద్దరూ కలిసి మెలిసి బాణాలు వదిలేటప్పుడే ఇరువురి చూపులు కలిసాయి. అలా చూపులు కలిసే కొద్ది రెట్టించిన ఉత్సాహంతో బాణాలు వేయడంతో పది నిముషాలకే దొంగల ముఠా పూర్తిగా హతమైంది. తన మాన ప్రాణాలు రక్షించినందుకు చంద్రసేన(అనుష్క) విజయేంద్ర బాహుబలి(వివేకా) వైపు ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా, అనురాగంగా, ఆరాధనతో చూసింది. జగదేక వీరుడా.... ఈ యువరాణి ఇక నీ సొంతం... ఈ రాణిని, ఈ రాజ్యాన్ని ఇక నువ్వే ఏలుకో అని చెప్పి చేయి చాచింది. విజయేంద్ర బాహుబలి(వివేకా) ఆమె చేయిని అందుకోబుతుండగా టంగ్‌ టంగ్‌... అంటూ గంట మోగిన శబ్దం.

ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(66). ఒక్క నిమిషం పాటు ఆయన ఎక్కడున్నాడో ఆయనకే అర్ధం కాలేదు. తీరాచూస్తే ఏ.సి సెంటర్‌లోని తన ఇంట్లో, తన బెడ్‌రూంలో తన బెడ్‌పైనే

ఉన్నాడు. చంద్రసేన, బందిపోట్లు రావడం, తాను వారితో ఫైట్‌ చేయడం... ఈ సీన్‌లన్నీ కల అని గ్రహించేసరికి మనిషిని బాగా నీరసం ఆవహించేసింది. ఛ...ఛ... మంచికల... కంప్లీట్‌ కాకుం డానే బ్రేక్‌ పడింది. కంటిన్యూ అయ్యుంటే ఇంకేం జరిగివుండేదో అని బాధపడుతుండగా... నాయనా, వివేకా అనే పిలుపు వినిపించింది. ఎవరూ, చీకటిలో కనిపించడం లేదని వివేకా అడిగాడు. నేను నీ ఎదురుగానే వున్నాను నాయనా, నువ్వు కళ్లకు పెట్టుకున్న నల్లద్దాలు తీస్తే నేను కనపడతాను అని ఆ కంఠం చెప్పింది. రాత్రి పడుకునేటప్పుడు కళ్లకున్న నల్లద్దాలు తీయడం మరచిపోయిన సంగతి వివేకాకు అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే నల్లద్దాలు తీసాడు. అంతే ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఎదురుగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ జీసెస్‌... స్వామీ, ఏమి నా భాగ్యమూ... గంట కొట్టి నా కలకు భంగం కలిగించింది మీరేనా... మీరని తెలియక ఏవేవో తిట్టుకున్నాను, నన్ను క్షమించండి, అయినా మీరేంటి స్వామీ ఇలా మెసేజ్‌ లేకుండా వచ్చేసారు. మామూలుగా శివుడు, బ్రహ్మ లాంటి వాళ్ళు ప్రత్యక్షం కావాలంటే ఏళ్ల తరబడి తపస్సు చేయాలి, మీరేంటి అప్లికేషన్‌ పెట్టకుండానే ప్రత్యక్షమయ్యారని అడిగాడు. పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి దేవుళ్లకు విధివిధానాలుంటాయి, వాటిని మేం ఫాలో అవుతుంటాం... అయినా నీకు గ్రేడ్‌-1 భక్తుడి హోదా ఇచ్చి వున్నాం, నీ దగ్గర మేం ఎప్పుడంటే అప్పుడు ప్రత్యక్షం కావచ్చు. ఈరోజు క్రిస్‌మస్‌... నాకెందుకో ముందుగా నిన్ను చూడాలనిపించింది. అందుకే వచ్చానన్నాడు జీసెస్‌. అందుకు వివేకా... వస్తే వచ్చారు, ఇంకో పది నిముషాలు లేటుగా వచ్చివుంటే నాకొస్తున్న కల కంప్లీట్‌ అయ్యుండేది... నేను మళ్ళీ నిద్రపోయినా అలాంటి కల రాదుకదా స్వామి... భలే కలను చెడగొట్టారు ప్రభు అని నవ్వుతూ అన్నాడు. తర్వాత జీసెస్‌ వుండి... నాయనా, నాకొక సమస్య వచ్చింది, నువ్వే పరిష్కారం చూపాలి అని అడిగాడు. ఏంటో చెప్పు స్వామి అని వివేకా అడిగాడు. ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య జెరూసలేం వివాదం నడుస్తోంది కదా... ఇరు దేశాల వాళ్ళు ఆ నగరం మాదంటే మాదని కొట్టుకుంటున్నారు. ఇటీవల ట్రంప్‌ కూడా జెరూసలేంను ఇజ్రాయిల్‌ దేశంలో వున్న నగరంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దీనివల్ల అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుడు పేరుతో మారణహోమాలు, రక్తపాతం జరుగకూడదు. ఆ నగరం అందరిదీ... అన్ని మతాల వారికి పవిత్రమైన నగరం. ఆ నగరం కోసం యుద్ధాలు, రక్తపాతాలు జరుగకూడదు. నువ్వే ఏదన్నా మార్గం చూడాలి అని కోరాడు. అప్పుడు వివేకా... నువ్వు చర్చి కెళ్లి తలక్రింద డన్‌లప్‌ దిండు పెట్టుకుని హాయిగా నిద్రపో ప్రభు... నీ సమస్యను నేను పరిష్కరిస్తా... అని హామీ ఇచ్చాడు. జీసెస్‌ సంతోషంతో అక్కడ నుండి మాయమయ్యాడు.

్య్య్య్య్య

రాత్రి 10గంటలయ్యింది. వివేకా బెడ్‌ మీద అటు ఇటు పొర్లాడుతూ నిద్ర పోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. నిద్రపడితే బ్యాలెన్స్‌ కల వస్తుందేమోనని ఆశ... ఎంతకీ నిద్రపడితే కదా... అప్పుడే గంటలు మోగాయి, వెంటనే జీసెస్‌ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వివేకా ఆయనకు నమస్కరించాడు. థ్యాంక్స్‌ వివేకా అని జీసెస్‌ అన్నాడు. దానికి వివేకా... మేమంతా మీకు ఋణపడి వుంటుంటాం... అలాంటిది ఈ అల్పమానవుడికి మీరు థ్యాంక్స్‌ చెప్పడమేంటి అని అన్నాడు. జెరూసలేం సమస్యను బాగా పరిష్కరించావు. ఇప్పుడెవరూ ఈ సీటీ మాకు కావాలని అడగడం లేదు. కాకపోతే అక్కడ ఏవో వింత జీవులు కరుస్తూ ప్రజలు భయాందోళనలతో బ్రతుకుతున్నారు. ఇజ్రాయిల్‌, పాలస్తీనా దేశాలు ఆ వింత జీవుల పైనే దృష్టిపెట్టి అవేవో కనుక్కునేందుకు పరిశోధనలు చేస్తున్నాయి. ఇంతకీ ఏం చేసావు నాయనా అని అడిగాడు. ఏం లేదు ప్రభు... మా నెల్లూరు ముదురుదోమలు 4 టన్నులు తీసుకెళ్ళి జెరూ సలేంలో వదిలాను, ఇక ఇజ్రాయిల్‌, పాలస్తీనాలు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడం ఉండదు. భూమి అంతమయ్యే వరకు ఈ రెండు దేశాలు కలిసి వాటితో యుద్ధం చేస్తూండాల్సిందే అని వివేకా చెప్పాడు. ఔరా... ఏం తెలివి అంటూ జీసెస్‌ ముక్కు మీద వేలేసుకున్నాడు.

Read 90 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter