11 January 2018 Written by 

సవాల్‌ విసురుతున్న సైబర్‌ క్రైమ్‌

cyberపెద్దనోట్ల రద్దుతో దేశంలో కాలక్రమేణా డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న ప్రస్తుత దశలో, ఇదే అదనుగా భావిస్తున్న సైబర్‌ నేరగాళ్ళు పూర్తిస్థాయిలో విజృంభించి ఆన్‌లైన్‌ మోసాలు, చీటింగ్‌లతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తుండడం దేశవ్యాప్తంగా కలవరం కలిగిస్తోంది. ఒకవైపు నగదు రహిత చెల్లింపులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంటే, మరోవైపు సైబర్‌ దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వైనం దేశప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా ఈ సైబర్‌ నేరాల విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారమే చూసినా సైబర్‌ నేరాలు 6 శాతానికి పైగా పెరిగాయంటే, వీటి తీవ్రత ఎంతగా పెరుగుతోందో అర్ధమవుతూనే ఉంది. అయినా, ఇది సాదాసీదా విషయం కాదు. ప్రభుత్వాలు వెంటనే కదలి ఈ నేరాలను నిలువరించి, నేరగాళ్ళ ఆటకట్టించాల్సి ఉంది. దేశంలో డిజిటల్‌ వ్యవస్థను పాదుకొల్పిన దశలో, అది ఆచరణలో ఎలాంటి వైఫల్యాలు చెందకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంతో అవసరం. ఇంటర్‌నెట్‌ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో డిజిటల్‌ సాంకేతిక నైపుణ్యం కొత్తపుంతలు తొక్కడం హర్షదాయకమేకానీ, ఆన్‌లైన్‌ లావేదేవీల విశ్వసనీయతకు గానీ, వ్యక్తిగత సమాచార భద్రతకు గానీ, ఇప్పుడు గానీ-ఎప్పుడు గానీ, ఎక్కడా ఎలాంటి ముప్పు వాటిల్లకుండా సకల జాగ్రత్తలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలదేనని వేరే చెప్పనక్కర లేదు. కనుక, ఆ దిశలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుని సైబర్‌ నేరాలను అణచివేయాలి. ఇప్పటికే, సైబర్‌ దుండగుల అరాచక ప్రవృత్తి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తూనే ఉంది. గత ఏడాది సైబర్‌ నేరముఠా ఒకటి 'వాన్న క్రై' పేరుతో సైబర్‌ దాడులు చేయడమే కాక, దాదాపు 175 దేశాలనే గడగడ వణికించిన విషయం అందరికీ తెలిసిందే. విశ్వవ్యాప్తంగా సాంకేతిక విజ్ఞానం పెరిగిపోతున్నదని ప్రపంచ మానవాళి సంబరపడిపోతున్న వేళ, ఇదే అదనుగా దొంగచాటుగా సైబర్‌ నేరాలు పెరిగిపోతుండడం ఎంతైనా విచారకరం. సమాచారం ఎంతో భద్రంగా ఉందనుకుంటే, అది కాస్తా సైబర్‌చోరుల హస్తగతమవుతుండడం, తద్వారా లేనిపోని నష్టాలు, కష్టాలు లుగుతుండడం అందరికీ వేదన కలిగించే విషయమే. బ్యాంకులకు సంబంధించిన సమాచారం, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల సమాచారం, వ్యక్తిగత సమాచారం..ఇలా ఏ సమాచారం కావాలన్నా సైబర్‌ చోరులు తమ హస్తలాఘవంతో తమ చేతికి చిక్కించుకోవడం జరుగుతోంది. అంతేకాక, ఎంతో కీలకమైన సంస్థల సమాచారాన్ని కూడా హ్యాకింగ్‌ చేసి నష్టాల పాలుచేయడం, ఆన్‌లైన్‌ దందాలు పెరిగిపోవడం, రకరకాల మోసాలతో అమాయకులకు కుచ్చుటోపీ పెట్టి నిలువు దోపిడీ చేస్తుండడం సైబర్‌ నేరగాళ్ళకు నిత్యకృత్యమైపోతోంది. డెబిట్‌ కార్డులు-క్రెడిట్‌ కార్డుల మోసాలు, ఆన్‌లైన్‌ మోసాలు చేస్తూ, జల్సాలు మరిగిన వేలాదిమంది దుండగులు సైబర్‌ నేరాలనే వృత్తిగా చేసుకుని అమాయకులను దోచుకుంటున్నారని, మనదేశంలోనూ ఈ తరహా నేరాలకు పాల్పడుతన్న వారెంతోమంది ఉన్నారని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్నెట్‌ను వేదికగా చేసుకుని, తద్వారా అదేపనిగా మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్ళ భరతం పట్టేదాకా ఈ దుస్థితి తొలగదు. కేంద్రం రంగంలోకి దిగి, సత్వరం ఈ సైబర్‌ నేరగాళ్ళను పటిష్టవంతమైన చర్యలతో నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ, ఆధార్‌ సమాచార భద్రతపై సందేహాలు తలెత్తుతున్న వేళ, ఇటీవల రిజర్వ్‌బ్యాంక్‌ అనుబంధ సంస్థ 'ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ-ఐడిఆర్‌బిటి విడుదల చేసిన ఒక నివేదిక మరింత ఆలోచనలు రేకెత్తిస్తోంది. సౖౖెబర్‌ నేరగాళ్ళకు, దేశం వెలుపల ఉన్న శత్రువులకు ఆధార్‌ ఒక లక్ష్యంగా మారగలదని, వారి చేతుల్లోకి ఆధార్‌ సమాచారం వెళితే ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల వ్యక్తిగత గోప్యతకు ఎంతో నష్టం కలుగుతుందన్నది ఆ నివేదిక సారాంశం. అనేక రకాల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సవాళ్ళను ఆధార్‌ ఎదుర్కొంటోందని, బయోమెట్రిక్‌ సహా ఆధార్‌ సమాచారాన్ని భద్రంగా కాపాడడం, ఎవరుపడితే వారు ఆ సమాచారాన్ని పొందకుండా నిరోధించడం ఇప్పు డొక సవాల్‌గా పరిణమించింది.

బ్యాంకింగ్‌ సహా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పథకాలకు బయోమెట్రిక్‌ విధానం విస్తరిం చిన నేపథ్యంలో దేశంలో తరచూ జరుగుతున్న సైబర్‌ దాడులు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. బయోమెట్రిక్‌ లేదా ఇతర ఆధార్‌ సమాచారం సంఘవిద్రోహశక్తుల చేతుల్లోకి వెళ్తే జరిగే నష్టం అంతా ఇంతా కాదని, అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల బయోమెట్రిక్‌ సమా చారాన్ని అత్యంత భద్రంగా కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇంత కీలకమైన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం అలక్ష్యం చేయకుండా సైబర్‌ నేరాలను అరికట్టాల్సి ఉంది. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలతో పాటు, దేశభద్రత కోసం.. ప్రజల ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో పనిచేసే సాంకేతిక నిపుణులతో కలసి సైబరాసురుల ఆట కట్టించేందుకు కార్యాచరణ పథకం రూపొందించాల్సి ఉంది. ఇంటర్నెట్‌లో ఎంతో ప్రావీణ్యమున్న లక్షలాదిమంది సాంకేతిక నిపుణులను రంగంలోకి దించి, ఆ సైబరాసురులకు అంతుచిక్కని విధంగా వ్యూహాలు రచించి, ప్రభుత్వ-ప్రజల సమాచారానికి రక్షణగోడగా నిలవాలి. సైబరాసురుల చేతికి సమాచారం చిక్కకుండా, దేశ-ప్రజల సమాచార భద్రతే ధ్యేయంగా అందరూ కృషి చేస్తే తప్ప ఈ సమస్య ఒక కొలిక్కి రాదు.

అవసరమైతే ఇతర దేశాల సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకుని, ప్రపంచవ్యాప్తంగా సైబరాసురుల ఆగడాలను అరికట్టేందుకు బృహత్తరమైన ప్రణాళికను రూపొందించి అమలుచేయాలి. అప్పుడే మనకూ.. మన సమాచారానికి సరైన భద్రత.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter