పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం పొడవునా పర్యాటకులు రావడానికి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కదా?
2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈ పండుగను ప్రారంభిం చారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ అయిపోయింది. పక్షుల పండుగ పేరుతో ఏటా కోట్లు తగలేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలంటూ సినిమా యాక్టర్లను తీసుకొస్తున్నారు. గత ఏడాది ఈ పండుగ రసాభసాగా మారింది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని వర్గపోరుకు ఈ పండుగ ఒక వేదికగా మారుతోంది. పక్షుల పండుగ పేరుతో మూడురోజులు హడావిడి చేసి పర్యాటకంగా మమ అనిపించడం, ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడం షరా మామూలైపోయింది.
సంవత్సరంలో మూణ్ణాళ్ళ ముచ్చటగా కాకుండా సంవత్సరం పొడవునా పర్యాటకులు వచ్చేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంది. నేలపట్టు, పులికాట్ సరస్సులతో పాటు 180 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతాలు వున్న బీచ్‌లను, సోమశిల, కండ్లేరు రిజర్వాయర్లను, పెంచలకోన, ఉదయగిరి వంటి పర్వతకేంద్రాలను పర్యాటక అభివృద్ధికి నమూనాలుగా మార్చడంపై శ్రద్ధ చూపాలి.