Friday, 12 January 2018 07:19

'కిమ్‌'కు మద్దతు పలికిన మోడీ

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ఉత్తరకొరియా రాజధాని పోగ్యాంగ్‌ నగరం. అధ్యక్ష భవనంలోని తన గదిలో కూర్చుని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ ఎన్‌డి టి.వి ఛానెల్‌ చూస్తున్నాడు. న్యూస్‌ బులెటిన్‌లో న్యూస్‌రీడర్‌ వార్తలు చదువుతుంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ చర్యలను సమర్ధించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ... ఉత్తరకొరియాపై అమెరికా దాడికి పాల్పడితే తాము ఉత్తరకొరియాకు అండగా నిలుస్తామని ప్రకటించిన మోడీ... కిమ్‌ ఎంతో సంయమనం, శాంతి, సహనం పాటిస్తున్నా ఆయనపై ట్రంప్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డ మోడీ... టీవీలో ఈ వార్తలు చూస్తున్న కిమ్‌కు తెగ ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత ఆనందమేసింది. ఇంతవరకు ప్రపంచంలో తనని తిడుతున్న వాళ్ళు తప్పితే సమర్ధించిన వాళ్ళు లేరు, కాని మొదటిసారిగా ఒక గొప్ప దేశం నుండి మద్దతు లభించిందని సంబరపడ్డాడు. వెంటనే మోడీకి ఫోన్‌ చేసాడు. ఢిల్లీలో వున్న మోడీ ఫోన్‌ ఎత్తగానే... కిమ్‌ ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ... మీలాంటి నాయకుడు మాకు మద్దతుగా నిలిస్తే ఒక్క అమెరికా మీదేం ఖర్మ, ప్రపంచం మొత్తం నెత్తిన అణుబాంబులు కురిపిస్తానని చెప్పాడు. దానికి మోడీ... మీలాంటి డేరింగ్‌, డాషింగ్‌ అధ్యక్షుడి సపోర్ట్‌ వుంటే మేము ప్రపంచాన్నే శాసిస్తామన్నాడు. ఏదేమైనా అనుకోకుండా మీలాంటి మిత్రుడు దొరకడం మాకు మహదానందంగా వుంది. మేము మీకు ఏ విధంగా సాయపడగలమో చెప్పండి అని కిమ్‌ కోరాడు. మీరు మా దేశ పర్యటనకు రావాలి, మీ నుండి మా ప్రజలు స్ఫూర్తి పొందాలి. అందుకే మిమ్మల్ని మా దేశానికి, అందులోనూ నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా పర్యటించాలని ఆహ్వానిస్తున్నాం అని మోడీ కోరాడు. మీరు చెబితే రాకుండా వుంటానా అని చెప్పి కిమ్‌ ఫోన్‌ పెట్టేసాడు.

-----

ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో గవర్నర్‌ నరసింహన్‌, హైటెక్‌రత్న చంద్రబాబునాయుడు, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, మేయర్‌ అజీజ్‌, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ రామకృష్ణ, కమిషనర్‌ ఆలీంబాషాలు వున్నారు. అప్పుడే హెలి కాఫ్టర్‌లు రెండొచ్చి గ్రౌండ్‌లో దిగాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలు సెక్యూరిటీ సిబ్బంది దిగారు. స్వాగత సత్కారాలయ్యాక ఓపెన్‌టాప్‌ మినీలారీలో ఎక్కి అందరూ నగర పర్యటనకు బయలు దేరారు. భూగర్భ డ్రైనేజీ కోసం గుంతలు తవ్విన రోడ్లపై వాహనం వెళుతుంటే లారీ అటూ ఇటూ ఊయల మాదిరిగా వూగసాగింది. అది చూసి కిమ్‌... ఇక్కడి రోడ్లు చాలా బాగున్నాయ్‌... వెహికల్‌లో పోతుంటే కూడా ఊయల ఊగినట్లుగా ఉంది. మా దేశంలోనూ ఇలాంటి రోడ్లు కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. వెంటనే వెంకయ్య... మీకూ హడ్కో నిధులు శాంక్షన్‌ చేయించి రోడ్లు పగులగొట్టిస్తే సరిపోద్దన్నాడు. అలా ట్రంకురోడ్డు, ఆత్మకూరు బస్టాండు, మినీబైపాస్‌ మీదుగా కిమ్‌ను తిప్పారు. మధ్యలో తవ్వేసిన రోడ్ల వద్ద కిలోల కొద్ది ధుమ్ములేచి కిమ్‌ ముక్కుల్లోకి, కళ్ళలోకి పోయింది. అప్పుడే చీకటి పడింది. కిమ్‌ మధ్య మధ్యలో చేతులను, కాళ్ళను గీరుకోసాగాడు. ఒళ్ళు ఏదో మంటగా, దురదగా వుండే సరికి తన ఒంట్లోనే ఏదో ప్రాబ్లం అనుకున్నాడు. వీళ్ళు అలా తిరుగుతూ ఎం.జి మాల్‌ వద్దకు వచ్చేసరికి అక్కడ స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66) వీరికి తారసపడ్డాడు. వెంకయ్య నాయుడు కిమ్‌కు వివేకాను పరిచయం చేశాడు. వివేకా అతనిని చూసి అమెరికా మీద అణుబాంబు వేస్తానంటూ తలతిక్కగా మాట్లాడే క్యాండెట్‌ ఇతనే కదా అని ముఖాన్నే అన్నాడు. వెంకయ్యకు ఏమి చెప్పాలో పాలుపోక అతనిని తప్పించుకుని ముందుకు కదిలారు. అలా చీకటి పడ్డాక పోలీసుగ్రౌండేకే వచ్చి హెలికాఫ్టర్‌ ఎక్కి తిరిగి బయలుదేరారు.

------

వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌. తన ఛాంబర్‌లో కూర్చుని డొనాల్డ్‌ట్రంప్‌ ఎన్‌డి టి.విలో వస్తున్న న్యూస్‌ చూస్తున్నాడు. పక్కనే తన కూతురు ఇవాంకా ట్రంప్‌, ఇతర మంత్రులు కూడా వున్నారు. అంతు తెలియని విషజ్వరంతో బాధపడుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌. తన టేబుల్‌ మీదున్న అణుబాంబు బటన్‌ను కాదుకదా, సర్వర్‌ను పిలిచేందుకు కాలింగ్‌ బెల్‌ కూడా కొట్టలేని విషమ పరిస్థితిలో కిమ్‌... ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్న కిమ్‌ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవని, ఇంకొన్నాళ్ళ పాటు ప్రపంచప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చని శాంతికాముకులు భావిస్తున్నారు. న్యూస్‌ రీడర్‌ చదువుతున్న ఈ వార్తలు విని... అక్కడ ట్రంప్‌తో పాటు అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. ఇవాంకా వుండి... ధాంక్యూ గాడ్‌, ఆ కిమ్‌కు తగిన శాస్తి చేసావు అని అంది. అది విని ట్రంప్‌... అలా కాదమ్మా అనాల్సింది, థ్యాంక్యూ మోడీజీ... ఆ కిమ్‌కు తగిన బుద్ధి చెప్పావు అని అన్నాడు. కిమ్‌ ఇలా కావడానికి, మోడీకి సంబంధమేంటని ఇవాంకా అడిగింది. అప్పుడు ట్రంప్‌ గట్టిగా నిట్టూర్పు వదులుతూ నీకు ఫ్లాష్‌బ్యాక్‌ చెబుతా విను తల్లి అంటూ... ఆ కిమ్‌ మాటకొస్తే అమెరికా మీద అణుబాంబు వేస్తా, అణుబాంబు బటన్‌ ఎప్పుడూ నా టేబుల్‌ మీదే వుంటుందని బెదిరించసాగాడు. వాడిని ఎలా లొంగదీయాలో తెలియక ఒక ఫ్రెండ్‌గా భారత ప్రధాని నరేంద్రమోడీని ఆశ్రయించాను. ఆయన భుజబలంతో కానిది బుద్ధిబలంతో చేయాలని చెప్పాడు. కిమ్‌తో స్నేహం చేసారు. ఆయనను తమ దేశానికి అందులోనూ నెల్లూరు పర్యటనకు ఆహ్వానిం చారు. కిమ్‌ ఎంతో ఆనందంగా వెళ్ళాడు. నెల్లూరులో ముదురుదోమలు ఆయనను పీకిపెట్టాయి. ఆ దోమల దెబ్బకే ఆయన ఇప్పుడు మంచానపడి అంతు తెలియని రోగంతో అల్లాడుతున్నాడని చెప్పాడు. అది విని ఇవాంకా... డాడ్‌... కిమ్‌ను నెల్లూరుకు ఆహ్వానించే బదులు నెల్లూరు దోమలనే ఉత్తరకొరియా అధ్యక్షుడి భవనంలో వదిలి ఉండొచ్చు కదా అని ధర్మసందేహం వెలిబుచ్చింది. అందుకు ట్రంప్‌... ఇండియా

వాళ్ళు... అందులోనూ నెల్లూరోళ్ళు దయార్ధహృదయులు, ధర్మాత్ములు... ఒక్కడి కోసం వందమందిని బాధపెట్టడం వారికిష్టం ఉండదు. ఆ దోమలను తెచ్చి ఉత్తరకొరియాలో వదిలితే కిమ్‌తో పాటు చాలామంది ఈ వింత రోగాలపాలవుతారు. మానవత్వానికే అది మాయని మచ్చ. అదీగాక నెల్లూరు దోమలు అక్కడి వాతావరణంలో తప్పితే ఇంకెక్కడా మనుగడ సాగించలేవు. కాబట్టే నెల్లూరుకు కిమ్‌ను ఆహ్వానించారమ్మా అని చెప్పి... థ్యాంక్యూ మోడీజీ... థ్యాంక్యూ నెల్లూరు, థ్యాంక్యూ నెల్లూరు మస్కిటోస్‌ అని చేతులెత్తి దండం పెట్టాడు.

Read 142 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter