Friday, 19 January 2018 12:33

తప్పిపోయిన వెంకయ్యనాయుడు

Written by 
Rate this item
(0 votes)

galpikaజనవరి 12వ తేదీ... వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళనాడు గవర్నర్‌ పురోహిత్‌, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, కామినేని శ్రీనివాస్‌ తదితరు లంతా సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు స్పెషల్‌గా చేయించిన అరిసెలు తిన్నారు. కార్యక్రమం ముగిసాక వెంకయ్యనాయుడు మైకు పట్టుకుని అందర్నీ ఉద్దేశించి నేను ఈరోజు నుండి 16వ తేదీ పొద్దున దాకా ఇక్కడే వుంటాను, అయితే ఎవరూ నన్ను కలవడానికి రావద్దు. మీరొ చ్చినా నేను కనిపించను అని చెప్పాడు. ఆ మాటకు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆయన అలా ఎందుకన్నాడో అర్ధం కాలేదు. సరేలే అంటూ ఎవరి దారిన వాళ్ళు పోయారు. వెంకయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆ రాత్రికి అక్కడే పడు కున్నారు.

----------

13వ తేదీ తెల్లవారుజామున 4గం టలు... నాకు ఇదే చివరి కూత అన్నట్లు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో భోగి పండుగ కోసం తెచ్చిపెట్టిన కోడిపుంజు కూత పెట్టింది. ఆ కూతకు వెంకయ్య సతీమణి ఉషమ్మకు టక్కున మెలకువ వచ్చింది. కళ్లు తెరచి చూస్తే వెంకయ్య లేడు. ఒకవేళ లేచి బాత్రూంకు వెళ్లాడేమోనని పది నిముషాల పాటూ కళ్ళు తెరచి చూడసాగింది. బాత్‌రూంలో ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఆమెకు అనుమాన మొచ్చింది. ఆదుర్దాగా లేచి బయటకొచ్చింది. కాని ఎక్కడా ఆయన కనిపించలేదు. ఆందో ళనతో హర్ష, దీపా వెంకట్‌లను లేపింది. అందరూ ఆందోళన చెందుతూ ట్రస్ట్‌ ప్రాంగణమంతా వెదుకుతూ బయటకొచ్చారు. అక్కడ గుడి వద్ద ఒక పిల్లాడు మాత్రం కని పించాడు. ధనుర్మాసం కాబట్టి తెల్లారు జామునే పూజారులు గుడి తెరచి పూజలు చేస్తుంటారు. పూజారి పెట్టే ప్రసాదం కోసమే ఆ పిల్లాడు అరగంట నుండి అక్కడ నిలబడి నట్లుగా వుంది. ఖాకీ నిక్కరు, లాగూ చొక్క వేసుకున్న ఆ పిల్లాడిని చూస్తే దీపావెంకట్‌కు ఎక్కడో చూసినట్లు అనిపించసాగింది. అయినా ఆ కుర్రాడి వద్దకు వెళ్ళి... బాబూ ఇటు వెంకయ్యనాయుడు తాత రావడం ఏమన్నా చూసావా అని అడిగింది. లేదమ్మా అని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. దీపావెంకట్‌కు బాధేసింది. వెంకయ్య ఫ్రెండ్స్‌ అందరికీ ఫోన్‌లు చేసి నాన్నగారు మీ ఇంటి కేమన్నా వచ్చారా అని అడిగింది. అందరి నుండి రాలేదని సమాధానం. ఈలోపు వెంకయ్య తప్పిపోయాడన్న వార్త దావా నలంలా వ్యాపించింది. టీవీ ఛానెల్స్‌ 'కత్తి మహేష్‌ వర్సెస్‌ అజ్ఞానవాసి' సబ్జెక్ట్‌ను కూడా పక్కన పెట్టేసి 'తప్పిపోయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - దేశం మొత్తం ఆందో ళన' అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌లు ఇవ్వసాగాయి. వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర కేబినెట్‌ సమావేశం పెట్టాడు. ఆయన ఎలా తప్పిపోయాడనే దానిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాడు. ఉపరాష్ట్రపతిని వెదకడానికి వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్‌లను రంగంలోకి దించారు. నెల్లూరుజిల్లాలోని అన్ని మండలాలను జల్లెడపట్టడానికి ప్రత్యేక బలగాలను నెల్లూ రుకు తరలించారు. వెంకయ్య తప్పిపోయా డనే సమాచారంతో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ రామకృష్ణ, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నాయకులందరూ ట్రస్ట్‌కు చేరుకు న్నారు. సోమిరెడ్డి అయితే భయపడుతున్న

ఉషమ్మ, దీపమ్మలను ఓదారుస్తూ.... భారత దేశంలో అణువణువు తెలిసిన నాయకు డమ్మా మా నాయుడు గారు. ఆయన తప్పి పోవడం పెద్ద జోక్‌. ఆయన కనిపించకుండా ఉండడం వెనుక ఏదో ట్విస్ట్‌ ఉంటుంది అని ధైర్యం చెప్పాడు.

వీళ్ళందరూ ఇక్కడ ఆందోళనలో

ఉండగానే పొద్దున గుళ్ళో ప్రసాదం కోసం నిలబడి వున్న కుర్రాడు సైకిల్‌పై తాటాకుల మోపులు తెచ్చి ట్రస్ట్‌ ప్రాంగణం వద్ద పెట్టాడు. మళ్ళీ సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాడు. కొద్దిసేపటికి ఇంకో తాటాకుల కట్ట తెచ్చాడు. ఇలా పది తాటాకుల కట్టలు అక్కడ పేర్చాడు. అందరూ ఆ కుర్రాడిని చూస్తున్నారేగాని, వెంకయ్య కనిపించలేదనే షాక్‌లో ఎవరూ సీరియస్‌గా పట్టించుకోలేదు. వీళ్ళు ఈ స్థితిలో ఉండగానే ఆ కుర్రాడు సైకిల్‌ టైరుతో కొద్ది సేపు ఆడుకున్నాడు. ఇంకో నలుగురు పిల్ల లను తోడు తీసుకుని వచ్చి టెంకాయ మట్ట మీద ఒకరు ఎక్కితే ఇద్దరు లాగే ఆటాడు కున్నారు. ఆ పిల్లలంతా చెట్లు ఎక్కి కొద్దిసేపు కోతికొమ్మచ్చి ఆడుకున్నారు. కొద్దిసేపు వంగులు దూకుళ్ళు, బిళ్లాకోడు ఆడుకు న్నారు. వెంకయ్య కోసం ఎవరి వెదుకు లాటలో వాళ్ళున్నారు. ఈ లోకంతో నాకేం సంబంధమన్నట్లు ఆ కుర్రాడు మాత్రం అక్కడ గురుకుల పాఠశాల విద్యార్థుల వసతి గృహం లోనే పడుకుని ఆ రాత్రికి నిద్రపోయాడు.

14వ తేదీ తెల్లారుజామున 3గంటలు. తలుపు తట్టిన శబ్దమొచ్చేసరికి తమ నాయన వచ్చాడేమోనని దీపావెంకట్‌ ఆత్రుతగా తలుపులు తీసింది. ఎదురుగా గుళ్లో చూసిన కుర్రాడు. ఏంటని అడిగింది. భోగి మంట వేసుకుందాం రామ్మా... అని ఆ పిల్లాడు పిలిచాడు. అందుకామె నాకు పండుగ చేసుకునే మూడ్‌ లేదు, మా నాయన వస్తేనే పండుగ చేసుకుంటాం అని చెప్పింది. దానికి ఆ పిల్లోడు ఆమె చేయి పట్టుకుని, మీ నాయన చిన్నపిల్లాడేం కాదు తప్పించుకుపోవడానికి, సాయంత్రానికల్లా వస్తాడులే రామ్మా అంటూ భోగి మంట వద్దకు తీసుకెళ్లాడు. ఉషమ్మ, హర్షలు కూడా లేచి భోగిమంట వద్దకు వచ్చారు. ఆ కుర్రాడు వరుసబెట్టి తాటాకులను మంటలో వేస్తున్నాడు. కరెంట్‌ స్థంభాల తీగలను తాకేలా మంట ఎగబాకింది. అక్క డున్న స్కూల్‌ పిల్లలు ఆ మంటలు చుట్టూ చేరి చలి కాచుకుంటూ కేరింతలు కొడుతు న్నారు. భోగి మంటలు అయ్యాక ఆ పిల్లోడు దీపాతో... బజారుకుపోయి చికెన్‌ తెస్తాను, నాకు దోశ, చికెన్‌ చేసి పెట్టమ్మా అని అడి గాడు. పిల్లాడు కదా... నోరు తెరిచి అడిగాడు అని ఆమె కాదనలేకపోయింది. దీపమ్మ చేసి పెట్టిన చికెన్‌, దోశలు, వడలు లాగించాడు. ఆ తర్వాత అరిశెలు, లడ్లు, కారప్పూస తిన్నాడు. ఆ తర్వాత బయటకొచ్చి ఇతర పిల్లకాయలతో కలిసి వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుకున్నాడు. గంగిరెద్దులను తీసుకొచ్చి ఆడించాడు. సైకిల్‌ తొక్కుకుంటూ కసుమూరు, చవటపాళెం వెళ్లొచ్చాడు. సాయంత్రంగా మళ్ళీ ట్రస్ట్‌ వద్దకు వచ్చి... అమ్మా, మన బాలయ్యబాబు సినిమా 'జై సింహా' సూపర్‌గా వుందంట... నెల్లూరుకు సినిమాకు పోదామమ్మా అని అడిగాడు. అందుకు దీపా... నాకు సినిమా చూసేంత ఆనందం లేదులే బాబూ అని చెప్పింది. వెంకయ్య కోసం జరుగుతున్న సెర్చింగ్‌లో భాగంగా ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, హైటెక్‌రత్న, సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు అందరూ వచ్చారు. వెంకయ్య కనిపించకపోవడంతో అందరిలోనూ టెన్షన్‌. అప్పుడే కళ్లకు నల్లద్దాలు పెట్టి స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66) అక్కడకు వచ్చాడు. మోడీ వుండి వివేకాతో... వెంకయ్య ఎక్కడకు వెళ్ళి వుంటాడు వివేకా అని అడిగాడు. దానికి వివేకా... ఆయన ఎక్కడకీ పోడు... ఇక్కడే వుంటాడు. ఆయనను ఎలా బయటకు రప్పించాలో నాకు తెలుసు. నేనేం చేసినా మీరు కామ్‌గా వుండండి అంటూ రెండు కిళ్లీలు నోట్లో వేసుకుని బాగా నమిలి అక్కడే క్లీన్‌గా వున్న గోడమీద ఉమ్మేసాడు. అంతే అది చూసిన దీపా వెంకట్‌ను సిని మాకు పోదామని బ్రతిమలాడుతున్న కుర్రాడు పరుగెత్తుకుంటూ... ఏయ్‌ వివేకా బుద్దుందా... మన ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్‌ అని పదేపదే మొత్తుకుంటుంటే, నువ్విలా గోడలను ఖరాబ్‌ చేస్తావా... అంటూ మండిపడసాగాడు. అప్పుడు వివేకా నవ్వుతూ ఆ కుర్రాడి తల పట్టుకున్నాడు. అతని తల మీద వున్న విగ్గు ఊడి చేతికొచ్చింది. విగ్గు తీసి చూస్తే అతనే వెంకయ్యనాయుడు. అందరూ షాక్‌ తిన్నారు. ఎందుకిలా చేసారు నాన్నా అని దీప అడిగింది. సంక్రాంతి పండు గను చిన్నతనంలో ఎంజాయ్‌ చేసానమ్మా... మళ్ళీ అలాంటి ఆనందం కావాలనిపిం చింది. అందుకే ఈ పండుగరోజుల్లో ఎవర్నీ ఇక్కడికి రావద్దని చెప్పింది అని తన కోసం ఆదుర్దా చెందిన అందరికీ థ్యాంక్స్‌తో పాటు సారీ చెప్పాడు వెంకయ్య.

Read 120 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter