తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మనుషులను, వారి మాటలను నమ్మడు. ఆయన నమ్మేది కంప్యూటర్లను, డ్యాష్‌బోర్డు సమాచారాన్ని, ఇంటలిజన్స్ నివేదికలను, సర్వే సంస్థల రిపోర్ట్‌లను. రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితి ఎలా వుంది, తమ నాయకుల పనితీరు ఎలా వుంది అన్నదానిపై ఆయన తరచూ సర్వేలు నిర్వహిస్తుంటాడు. ఈ సర్వే ఫలితాలు ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంటాడు.
ఇటీవల నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో నెల్లూరు జిల్లా నుండి ఆయనకు చేదు ఫలితాలే చేరాయి. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు లేదా ఇన్‌ఛార్జ్‌ల పనితీరును బట్టి ఏ ప్లస్, ఏ, బి,సి గ్రేడ్లుగా ర్యాంకులు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధానం, వాటిపై ప్రచారం, జన్మభూమి కార్యక్రమాల నిర్వహణ, పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమావేశాలు, ప్రజల్లో వచ్చిన సానుకూలత, లేదా పెరిగిన వ్యతిరేకత వంటివి దృష్టిలో పెట్టుకుని ఈ గ్రేడ్లను విభజించుకుంటూ వచ్చారు.
జిల్లాలో పది అసెంబ్లీలుంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఏ ప్లస్ గ్రేడ్ రాలేదు. వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు మాత్రం ఏ-గ్రేడ్లు దక్కాయి. విచిత్రమేంటంటే ఈ రెండు నియోజకవర్గాలలోనూ సిటింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వుంది.
ఇక నెల్లూరు నగరం, నెల్లూరురూరల్, కోవూరు, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు,
ఉదయగిరి నియోజకవర్గాలకు బి-గ్రేడ్లు దక్కాయి. నెల్లూరు నగరంలో ఒకరికి నలుగురు నాయకులు తంటాలు పడుతున్నారు. మంత్రి నారాయణ కూడా అప్పుడప్పుడూ వారికి తోడవుతున్నాడు. కాకపోతే నాయకులు నలుగురు నాలుగు దారులన్నట్లుగా వుండడంతో ఇక్కడ పార్టీ బలం పుంజుకోవడం లేదు. నెల్లూరురూరల్ ఇన్‌ఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. కోవూరులో వర్గ విభేదాలు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆత్మకూరులోనూ ఆనం వర్గ సమీకరణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఆనం వల్ల పార్టీలోకి కొత్తగా వచ్చి చేరిన వాళ్లెవరూ లేక పోగా వున్న పార్టీయే రెండుగా చీలింది. కావలిలో బీద మస్తాన్‌రావు పూర్తిస్థాయిలో మనసు పెట్టడం లేదు. ఉదయగిరిలో ఎమ్మెల్యేపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వుంది. సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బాగానే తిరుగుతున్నాడు. తన కొడుకు రాజగోపాలరెడ్డినే పూర్తిస్థాయిలో తిప్పుతున్నాడు. పార్టీ పరంగా చేయాల్సిందంతా చేస్తున్నాడు. అయినా కూడా ఈ నియోజకవర్గాన్ని బి గ్రేడ్‌లో చూపించారు. అన్నింటికంటే అధ్వాన్నం సూళ్ళూరుపేటకు సి-గ్రేడ్ లభించడం. ఇన్ఛార్జ్ పరసా రత్నంకు ఇప్పటికే పెట్టాల్సిన కాడికి పెట్టారు.
ఇక ఎన్నికలకు గట్టిగా ఏడాది సమయముంది. ఈలోపు పార్టీ పుంజుకోకుంటే జిల్లాలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ దిశగానే టీడీపీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.