09 February 2018 Written by 

బడ్జెట్‌ రగిల్చిన చిచ్చు

budgetకేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యే చూపారు. కీలకమైన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఈ బడ్జెట్‌లోనైనా కరువుదీరా నిధులు వస్తాయని ఆశించిన ఆంధ్రరాష్ట్రానికి శూన్యహస్తమే మిగిలింది. కళ్ళు కాయలు గాచేలా ఎదురుచూస్తున్న ఆంధ్రుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ దశలో ప్రవేశపెట్టే చివరి, పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో రాష్ట్రానికి తగినన్ని నిధులు దక్కుతాయని అందరూ ఆశించారు. కానీ, కేంద్ర బడ్జెట్‌ దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ అందరిలో ఆశల మోసులెత్తించేదే అయినప్పటికీ, విభజనతో గాయపడ్డ మన రాష్ట్రానికి మాత్రం పూర్తిస్థాయి నిధుల మాట ఆకాశ పుష్పమే అయింది. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం పదోవంతు కూడా ఆర్ధికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వకపోవడం పట్ల అటు ప్రభుత్వంలోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్రమైన ఆవేదన కలుగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన ప్రాజెక్టుల విషయం కానీ, ముఖ్యమైన ప్రజోపయోగ పనుల నిధుల ప్రస్తావన గానీ, విభజనతో అష్టకష్టాల పాలైన ఆంధ్రరాష్ట్రాన్ని ఆదుకుందామన్న ప్రయత్నం కానీ అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిధుల కేటాయింపులో కనపడక పోవడంతో రాష్ట్రమంతటా నిరాశా మేఘాలు ఆవరిం చాయి. రాష్ట్రప్రభుత్వం పదేపదే కోరుతున్న ఒక్క ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ పడలేదు. కోరుకున్న ఒక్క పనీ జరగ లేదు. ఎంతోకాలం నుంచి కోరుకుం టున్న ప్రధాన ప్రాజెక్టులను సైతం బడ్జెట్లో ఖాతరు చేయకపోవడంతో అందరూ డీలా పడిపోయారు. కనీసం కొన్ని విన్నపాలకైనా కేంద్రం స్పందించి ఉంటే బావుండేదని, దీర్ఘకాలిక ప్రయోజనాలిచ్చే ప్రాజెక్టుల కైనా అంగీకారం తెలిపివుంటే సంతోషంగా ఉండేదని, కేంద్రబడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరిం చారనీ పాలకపక్షమైన టిడిపి వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. విభజనతో నానా కష్టాలు పడుతూ, రాజధాని కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఎలాగో తట్టుకుని నిలబడేందుకు నానాయాతనలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్ధికసమస్యల సుడిగుండంలోంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు తగు చేయూతనందించాలని కోరుతున్నా బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపడమే అందరికీ బాధనుకలిగిస్తోంది. మిత్రధర్మాన్ని ధర్మబద్ధంగా పాటిస్తున్నా రాష్ట్రానికి రిక్తహస్తమే మిగిలిందనే నిరాశ టిడిపి నేతలను అసంతృప్తికి గురిచేస్తోంది. రాజధానికి ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటుచేయాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈసారి కూడా ఆంధ్రకు అన్యాయమే జరిగిందనే బాధ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత ఉపాధి మండలి (కోస్టల్‌ ఎంప్లాయిమెంట్‌ జోన్‌) ఏర్పాటుచేస్తామన్న ప్రతిపాదన లకు నేటికీ ఒక కొలిక్కిరాకపోవడం బాధాకరం. ఎగుమతులను ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తూర్పుతీరంలోని ఆంధ్రప్రదేశ్‌లో, పశ్చిమతీరంలోని గుజరాత్‌లో ఈ జోన్లు ఏర్పాటుచేస్తామని నీతి ఆయోగ్‌ ప్రకటించివున్నా బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. ఒకవైపు మహారాష్ట్ర, కర్నాటకల్లో సబర్బన్‌ రైలుప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడం, ఆంధ్రరాష్ట్రంలోని విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల ఊసెత్తకపోవడం ఎంతో బాధాకరమని టిడిపి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఆశించిన నిధుల కేటాయింపులు లేకపోవడం పట్ల ఆవేదనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఢిల్లీ వంటి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని స్వయంగా ప్రధాని మోడీ గతంలో హామీ ఇచ్చివున్నా, రాజధాని నిర్మాణం కోసం మరో వెయ్యికోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చినా..తాజా బడ్జెట్‌లో మాత్రం వాటి ఊసే లేదు. రాజధాని అమరావతికి సంబంధించి రైల్వే అనుసంధానానికి రెండు ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం నిధులను కేటాయించి, రైల్వేలైన్ల పనులు పూర్తిచేయాలని రాష్ట్రం కోరుతున్నా ఆ ప్రతిపాదనలకు నేటికీ ఆమోదం లేదు. బడ్జెట్‌లో అసలు ఆ ప్రస్తావనలే లేవు. గిఫ్ట్‌ సిటీ కింద అహ్మదా బాద్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలు అమరా వతికి ఇచ్చి వుంటే బావుండేదనే అభిప్రాయం అంతటా వ్యక్తమవు తోంది. విభజనతో రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూలోటును భర్తీ చేస్తామని విభజన సమయంలో అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు. అయినా ఆ హామీలేమీ నెరవేరలేదు. దీంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి.2014-15 సంవత్స రానికి ఆ లోటు 16,078 కోట్లు అయితే, ఇప్పటికి కేంద్రం 3,970 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతా మొత్తాన్ని విడుదలచేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని పదేపదే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా కేంద్రం నుంచి తగు స్పందన ఉండడం లేదని, విభజనతో అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిపధంలో నడిపించేం దుకు కేంద్రం తగు చొరవతో శ్రద్ధ చూపితే ఎంతో సంతోషించేవారమని, అయితే, కేంద్రం ఆశించిన స్థాయిలో పట్టించుకోకపోవడంతో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ ఆ సమస్యలే కొనసాగుతున్నాయని టిడిపి నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ధికపరిస్థితి మెరుగుపడలేదని, నామమాత్రపు నిధులు, కంటితుడుపు కేటాయింపులతో సమస్యలు పరిష్కారం కావని విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే సమస్యలకు పరిష్కారం దక్కుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారు. కేంద్రం దృష్టికి తాము పలుసార్లు తీసుకువెళ్ళిన సమస్యలను, అంశాలను కేంద్రం ఇకనైనా సానుభూతితో పరిశీలించి పరిష్కరించాల్సి ఉందని అందరూ కోరుకుంటున్నారు. ఆశించిన నిధులందక ఆంధ్రప్రదేశ్‌ అనేక ఇబ్బందులు పడుతూనే ఉంది. ఒక్క పోలవరం విషయంలో తప్ప మిగిలిన అంశాల్లో ఆంధ్రకు తగు న్యాయం జరగడం లేదు. ప్రత్యేకహోదా లేదు..ప్రత్యేక ప్యాకేజీ కూడా ఆశించినరీతిలో రాలేదు. ఇప్పటికైనా కేంద్రం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని రెండుచేతులా ఆదుకునేందుకు ముందుకు రావాల్సి ఉంది. నవ్యాంధ్ర ప్రగతిపథంలో పయనించేందుకు తగు చేయూతను అందించాల్సి ఉంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter