16 February 2018 Written by 

'హోదా' రాజకీయం

special statusరాజకీయాలు పలు రకాలు. అందులోనూ మన రాష్ట్రంలో విభజనానంతరం రకరకాల రాజకీయా లొచ్చాయి. 'విభజన రాజకీయాలు', 'ప్రత్యేకహోదా రాజకీయాలు', 'ప్యాకేజీ రాజకీయాలు' లాంటివి కూడా వచ్చి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నదదే. 'హోదా' రాజకీయాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది.

నిండుగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చేసి.. అడ్డగోలుగా ముక్కలుచెక్కలు చేసిపారేసి కాంగ్రెస్‌ ఆ పాపం మూటగట్టుకుంది. అందులోనూ ఆంధ్రకు మరీ అన్యాయం చేసి, రాజధాని సైతం లేకుండా మొండిగానే వదిలేసి వెళ్ళిపోయింది. 'ప్రత్యేక హోదా' అంశం కూడా అప్పుడే తెరమీదకి వచ్చింది. విభజన సందర్భంలో కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వంతో వాదించి మరీ ఒప్పించుకున్న విషయమే 'ప్రత్యేక హోదా'. అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయిదేళ్ళు కాదు, పదేళ్ళుండాలని బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు పట్టుబట్టడం, పదేళ్ళు కాదు పదిహేనేళ్ళుండాలని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు కోరడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికలొచ్చాయి. ఎన్‌డిఏ నాయకులైన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలసి రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చేశారు. ఆ తర్వాత, అధికారంలోకి వచ్చాక ఇద్దరూ మాట మార్చారు. దీంతో మళ్ళీ గందరగోళం ప్రారంభ మైంది. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పడం, అందుకు ముఖ్యమంత్రి సరేనంటూ సమ్మతించడం జరిగిపోయాయి. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని, అదేమీ సంజీవని కాదని, ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతో నిధులు వరదలై వస్తాయని ముఖ్యమంత్రి అప్పట్లో సర్దిచెప్పుకున్నారు. ఆ తర్వాత కొంతమేరకు నిధులు కూడా వచ్చాయి. అలా రెండు మూడేళ్ళు జరిగిపోయాయి. నాలుగు బడ్జెట్‌లు జరిగిపోయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అరకొరగానే రావడంతో, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరకపోవడంతో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో, మళ్ళీ ఈ అంశమే తెరమీదకి వస్తోంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమిచ్చారంటూ తెలుగుదేశం నేతలు ఇప్పుడు స్వరం పెంచారు. అదేస్థాయిలో పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఆందోళనను ఉధృతం చేశారు. ఆ అడిగేదేదో తొలినుంచి అడిగివుంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో!... అప్పుడేమో అన్నిటికీ తలూపి, ఇప్పుడు నిధులు రావడం లేదనడం ఏమిటని ప్రతిపక్షం విమర్శ. అయితే, ఈ విషయంలో సాధ్యమైనంత ఉత్తమ పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తామని, ఆంధ్రప్రదేశ్‌లోని మా మిత్రులకు సంతృప్తినిచ్చేలా సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పట్ల తాము పూర్తి సానుభూతితో ఉన్నామని, వారి సమస్యలన్నీ సానుభూతితో పరిశీలిస్తామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అంటున్నారు. అయినా, ఏళ్ళు జరుగుతున్నా విభజన హామీలను పూర్తిస్థాయిలో తీర్చకపోవడమేమిటని, మాటలతోనే కాలయాపన జరిగిపోతోందని రాష్ట్ర నాయకుల ఆవేదన. ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా ఆ హోదా హామీని కేంద్రం నెరవేర్చివుంటే ఇప్పుడీ పితలాటకమంతా ఉండేది కాదు. రాష్ట్రానికి హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడైనా, ఆ నిధులేదో పూర్తిస్థాయిలో ఇచ్చి ఉంటే ఇప్పుడింత ఆందోళన ఉండేది కాదు. చివరికి అదీ లేదు..ఇదీ లేదు అన్నట్లుంది ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి. నాయకులకు ఆగ్రహం వచ్చినప్పుడొకసారి, అనుగ్రహం కలిగి నప్పుడొకసారి రకరకాలుగా మాటలు మారుతుండడం విచారకరం. నాలుగేళ్ళు గడిచిపోయాయి. కాకి అరుస్తూనే ఉంటుంది.. కరవాడ ఎండుతూనే ఉంటుందన్న సామెతగా వుంది ఇప్పటి పరిస్థితి. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు కూడా రానున్నాయి. ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ మాత్రం 'ప్రత్యేకహోదా'తోనే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని తొలినుంచి స్పష్టం చేస్తూనే ఉండడమే కాక, రాష్ట్రానికి ఇస్తామన్న ఆ ప్రత్యేక హోదా ఏప్రిల్‌ 6వ తేది నాటికైనా ఇవ్వకుంటే తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని కూడా ప్రకటించి కలకలం సృష్టిస్తున్నారు. నిధుల కోసం పోరాడాలంటూ తమ ఎంపీలకు టిడిపి నేతలు మరో వైపు గట్టిగా చెప్తున్నారు. ఇలా ప్రత్యేకహోదా ప్రస్తావన కొచ్చినప్పుడల్లా రాజకీయవర్గాల్లో రకరకాల వాద వివాదాలు, ఆందోళనలు బయలుదేరుతూనే ఉండడం అందరం చూస్తూ ఉన్నదే. హోదా కోసం పోరాడాలని కొందరు... వద్దనేవారు కొందరు. ఇవి కూడా గతంలో జరిగినవే. అప్పుడొక మాట... ఇప్పుడొక మాట. ఇవన్నీ రాజకీయా ల్లోని భాగాలే. అప్పుడప్పుడూ 'హోదా.. హోదా' అంటూ అరవడమే తప్ప మనం సాధించు కున్నదేమీ లేదు. వీటినే 'కాలయాపన రాజకీయాలు' అంటారు. చిత్త శుద్ధి లేని రాజకీయాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అయితే, ఇక్కడొక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఎన్నో విషయాలను రాజకీయంగా చూడొచ్చు కానీ, అన్ని విషయాలనూ అదేవిధంగా చూడకూడదు. అందులోనూ ప్రజాప్రయోజనాలు ముడిపడివున్న ఇలాంటి విషయాలను రాజకీయంగా చూడడం ఏనాటికీ మంచిది కాదు. రాజకీయాలను పక్కనపెట్టి అందరూ కలసికట్టుగా సాధించుకుంటే రాష్ట్రాభ్యున్నతి పెద్ద కష్టమేమీ కాదు. ఇదేమీ పార్టీల సమస్య కాదు..బీజెపి-టీడిపిల సమస్య అసలే కాదు. రాష్ట్ర ప్రజల సమస్య. అది 'హోదా' అయినా, నిధులైనా ఇవ్వాల్సింది కేంద్రమే. అందులోనూ విభజనతో, భారీ ఆర్థికలోటుతో అవస్తలుపడుతున్న రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. ఆ బాధ్యతను కేంద్రం విస్మరిస్తుందని అనుకోలేం. దేశంలోని అన్ని రాష్ట్రాలూ సమగ్రంగా అభివృద్ధి చెందినప్పుడే దేశసమగ్రాభివృద్ధి అనేది విజ్ఞులకు తెలియనిది కాదు. కేంద్రం.. రాష్ట్రాభ్యున్నతికి అవసరమైన ఆర్థికసాయాన్ని పూర్తిస్థాయిలో అందజేసి రాష్ట్రం తిరిగి అభివృద్ధిపథంలో సాగేందుకు తగు చేయూతనివ్వా లన్నదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. అందుకు అన్ని పార్టీలూ, రాజకీయాలకు అతీతంగా.. రాష్ట్రాభ్యున్నతే లక్ష్యంగా.. కలసి కృషిచేయడమే సరైన మార్గం!....Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter