Print this page
Friday, 16 February 2018 08:30

ప్లాస్టిక్‌ రహిత నగరంగా... నెల్లూరును మార్చలేమా?

Written by 
Rate this item
(0 votes)

plasticస్వచ్ఛసర్వేక్షన్‌లో నెల్లూరును దేశంలోనే 20వ స్థానంలో నిలపాలంటూ మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌ ఫోటోలతో నగరంలో అక్కడక్కడా ఫ్లెక్సీలు చూస్తున్నాం. నిజమే... స్వచ్ఛసర్వేక్షన్‌లో నెల్లూరును అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అందరు కూడా సహకరించాలి. దేశంలో నెల్లూరుకు 20వ స్థానం కాదు, 1వ స్థానం వచ్చినా ఆనందమే! అసలు ఏ స్థానం రాకున్నా నగరం పరిశుభ్రంగా వుంటే ఇంకా ఆనందం. నెల్లూరును పరిశుభ్ర నగరాల జాబితాలో టాప్‌టెన్‌లో నిలపాలంటే ఎంతోకొంత ఖర్చుతో కూడుకున్న పని. అసలు నయాపైసా ఖర్చు లేకుండా చేయగల పని నెల్లూరును ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల రహిత నగరంగా మార్చడం. మున్సిపల్‌ మంత్రిగా వున్న పి.నారాయణే ముందుగా దీనికి పూనుకోవాలి. ప్లాస్టిక్‌ బ్యాగులు వాడని తొలి కార్పొరేషన్‌గా నెల్లూరును తయారుచేయాలి. ఆయన తలచుకుంటే ఇది పెద్ద సమస్య కూడా కాదు.

నేటి మానవసమాజాన్ని ప్లాస్టిక్‌ సంచులు ఏ విధంగా ఆక్రమించాయో చూస్తూనే వున్నాం. నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా మన దైనందిన కార్యకలాపాలలో అవి ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఉదయాన్నే ప్లాస్టిక్‌ పాలప్యాకెట్‌తోనే జీవితం మొదలవుతుంది. ప్లాస్టిక్‌ కవర్లలో కూరగాయలు, ప్లాస్టిక్‌ క్యాన్‌లలో

నీళ్ళు... ప్లాస్టిక్‌ కవర్‌లు, ప్లాస్టిక్‌ డబ్బాలలో టిఫిన్‌, వేడివేడి సాంబార్‌ పార్సిళ్ళు, ప్లాస్టిక్‌ బౌల్స్‌లో బిర్యాని పార్శిళ్ళు, ప్లాస్టిక్‌ కవర్లలో కర్రీస్‌ పార్సిల్‌... ఇలా ఒకటేమిటి... ప్రతి చోటా మనకు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు నిత్యావసర వస్తువులుగా మారాయి.

ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులతో వచ్చే అనర్ధాల గురించి ప్రతి రోజూ వైద్యులు చెబుతూనే వున్నారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధితో పాటు మరెన్నో వ్యాధులకు ఈ ప్లాస్టిక్‌ భూతమే కారణం. ప్లాస్టిక్‌ తొందరగా మట్టిలో కలిసిపోదు, డ్రైనేజీ కాలువల్లో ఈ కవర్లు పడితే డ్రైనేజీ బ్లాక్‌ అవుతుంది. చెత్తకుండీల వద్ద పడివున్న వృధా ఆహారపదార్ధాలతో పాటు ఈ ప్లాస్టిక్‌ కవర్లను మింగేయడం వల్ల ఆవులు మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు చేటుగా మారిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను నిషేధించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. 40మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ కవర్లు అమ్మకూడదని ప్రభుత్వం కూడా నిషేధం పెట్టింది. అయితే నెల్లూరులో ప్లాస్టిక్‌ నిషేధం అమలు కావడం లేదు. గతంలో నాలుగైదు సార్లు దాడులు నిర్వహించి, ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను స్వాధీనం చేసుకుపోవడం తప్పితే పకడ్బందీగా అమలు చేసిన దాఖలాలు లేవు. ముందు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల ఉత్పత్తులను నిలిపేయాలి. దుకాణాలలో గుడ్డసంచులు లేదా జనపనార సంచులు మాత్రమే అమ్మాలి. నిషేధించిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను అమ్మే లేదా వాడే వ్యాపార దుకాణాలపై గట్టి చర్యలు తీసుకోవాలి. అధికారులతో తరచు తనిఖీలు నిర్వహిస్తుంటే ప్రజలు కూడా క్రమక్రమంగా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించుకుంటారు.

Read 105 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

Latest from Lawyer

Related items