Friday, 23 February 2018 11:20

సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌

Written by 
Rate this item
(0 votes)

sudhakarదయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు కట్టిన డబ్బుకు 28రోజుల్లో రెట్టింపు ఇస్తామని ఓ భోగస్‌ కంపెనీ వాళ్ళు బోర్డు పెడితే తీసుకెళ్ళి లక్షలు లక్షలు కట్టారు. గ్రీన్‌ గ్లోరి అంటూ చైన్‌లింక్‌ స్కీం ద్వారా మీరు ఒకసారి డబ్బులు కడితే ఇక మీ ఇంటికి డబ్బుల వరదేనంటే... దానికీ కోట్లు కట్టారు. కొన్ని క్రిస్టియన్‌ సంస్థలు మనీ సర్క్యులేషన్‌ స్కీం అంటూ వందల కోట్ల రూపాయలకు జనం నెత్తిన టోపీ పెట్టాయి.

తాజాగా నెల్లూరు కేంద్రంగా అమాయక భక్తుల నెత్తిన ఓ బురిడీ బాబా టోపీ పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు మైపాడుగేటు సెంటర్‌లోని ప్రశాంత్‌నగర్‌లో సుధాకర్‌ మహరాజ్‌ ఆశ్రమం ఉంది. ఇతని పేరు సుధాకర్‌రావు. ఒకప్పుడు జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు. ఆ తర్వాత జడ్పీ ఛైర్మెన్‌లుగా వున్న చెంచలబాబు వద్ద, కాకాణి గోవర్ధన్‌రెడ్డిల వద్ద సి.సి.గా కూడా పనిచేశాడు. ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో వున్నప్పుడే జాతకాలు గట్రా చూసేవాడు. భవిష్యత్‌ వాణి అంటూ ఏదేదో చెప్పేవాడు. ఇలా అతను ఒక బాబాగా, మహిమలున్న ఆథ్యాత్మిక వేత్తగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి అమాయక, పిచ్చి భక్తులు ఏర్పడ్డారు. ఈ కాలంలో బాబా అంటే కొందరు రాజకీయ నాయకులు, కొందరు ఉన్నతాధికారులు వచ్చి పోతుండడం ఫ్యాషన్‌. ఈ సుధాకర్‌మహరాజ్‌ కూడా అలాంటి బ్యాచ్‌ను మెయింటెన్‌ చేయసాగాడు. బాగా చదువుకున్నోళ్ళే ఇలాంటి బాబాలను నమ్ముతుంటే, ఇక అంతంత మాత్రం జ్ఞానం వున్న సామాన్య ప్రజల పరిస్థితేంటి? వాళ్ళు కూడా ఈయన దగ్గర ఏవో మహిమలున్నాయని చెప్పి నమ్మసాగారు. ఆయన వద్దకు పోసాగారు. ఇలా పెరిగిన పిచ్చి భక్తులతో సుధాకర్‌ భక్తి వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక్కడ నిత్యం హోమాలు, పూజలు నిర్వహించేవాళ్ళు. వచ్చిన వాళ్ళకు టిఫిన్‌, తిండి దండిగా పెట్టేవాళ్ళు. భక్తులు ఇక్కడే కొంత బెండ్‌ అయ్యేవాళ్ళు. గత ఏడాది డిసెంబర్‌ నుండి ఆశ్రమంలో 'నవనాత సంప్రదాయ శ్రీ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహాయాగం' మొదలుపెట్టారు. ఈ ముసుగులోనే మంత్ర పీఠికల పేరుతో మోసానికి పాల్పడ్డారు. వెయ్యి రూపాయలు పెట్టి ఒక మంత్రపీఠికను తీసుకెళ్ళి 12రోజుల లోపల తిరిగి తెచ్చిస్తే ఆశ్రమం వాళ్ళు 1400 రూపాయలు ఇస్తారు. ఇలా నెలలో రెండుసార్లు తీసుకెళితే పెట్టుబడి రెరడింతలవుతుంది. ఇంకేముంది పిచ్చి జనం ఎగబడ్డారు. పది కాదు, పాతిక కాదు, 50వేలు... ఇలా పెట్టుబడులు పెట్టి మంత్ర పీఠికలు తీసుకెళ్లేవాళ్ళు. 12రోజులకు మళ్ళీ తెచ్చిచ్చే వాళ్ళు. పెరిగిన వాళ్ళ పెట్టుబడికి తగ్గట్లుగా మళ్ళీ మంత్రపీఠికలు తీసుకెళ్ళే వాళ్ళు. ఇలా మంత్ర పీఠికలు తీసుకెళ్ళడమే కాని ఎవరూ డబ్బులు తీసుకోలేదు. చైన్‌లింక్‌ స్కీంలాగా భక్తుల నమ్మకాన్ని డబ్బుల రూపంలో మూటగట్టుకున్నారు. ఇటీవల వాసవి అనే మహిళ పెద్దపెద్ద సంచుల్లో ఆశ్రమం నుండి డబ్బును తరలించే ప్రయత్నం చేస్తుండగా భక్తులు అడ్డుకోవడంతో మోసం బయటపడింది. తన బండారం బయటపడడంతో సుధాకర్‌ బాబా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. డబ్బును తరలించడానికి ప్రయత్నించిన వాసవి అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 250మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం స్కాం ఎన్ని కోట్లో ఇంకా లెక్కలు తేలాల్సివుంది. రోజురోజుకూ బాధితులు పెరుగుతున్నారు. చాలారోజుల క్రితమే ఈ భాగోతానికి స్కెచ్‌ వేసినట్లు సమాచారం. సుధాకర్‌బాబాతో పాటు ఓ మీడియా ప్రతినిధి, వాసవి అలాగే ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ కూడా ఈ పాపానికి వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. తాను పారిపోవడం విఫలం కావడంతో సుధాకర్‌బాబు గతిలేక పురుగులు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నిం చాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలోనే ఉండి హైకోర్టు ద్వారా బెయిల్‌ సంపాదించు కునే పనుల్లో ఉన్నాడు. ఈ భాగోతంలో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్న నెల్లూరురూరల్‌ సిఐ శ్రీనివాసులురెడ్డి లోతుగా దర్యాప్తు నిర్వహిస్తూ ఈ భాగోతాన్నంతా బయటపెట్టేందుకు కృషి చేస్తున్నాడు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు బాధితులు మాత్రం పోలీసు స్టేషన్‌ల ముందు చేరి తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు. అక్షర జ్ఞానంలేని అమాయకులు కొంచెం ఆశకుపోయే పేదలు ఇలాంటి దొంగ సన్నాసులను నమ్మారంటే అర్ధముంది. ప్రజాప్రతినిధులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదివిన అధికారులు కూడా ఇలాంటి దొంగ బాబాలను నమ్మి ఫోటోలకు ఫోజులివ్వడం చూస్తుంటే అసలు అజ్ఞానం ఎవరిలో ఉందా అనే అనుమానం వస్తుంది! మొత్తానికి భక్తి ముసుగులో జనం అమాయకత్వంతో వ్యాపారం చేయొచ్చని ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైంది.

Read 275 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter