Friday, 23 February 2018 13:26

హోదాపై చేతులు కలిపిన ఏపి నేతలు

Written by 
Rate this item
(0 votes)

galpikaఢిల్లీలోని ప్రధాని కార్యాలయం. ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అనంతకుమార్‌, స్మృతి ఇరాని, నిర్మలా సీతారామన్‌ తదితరులున్నారు. నరేంద్రమోడీ వుండి వారితో... మన ప్రభుత్వ లక్ష్యాలు ప్రధానంగా రెండు... ఒకటి కాంగ్రెస్‌ రహిత భారత్‌. రెండు క్యాష్‌ రహిత భారత్‌. మొదటి విషయంలో చాలావరకు విజయం సాధించాం. కాంగ్రెస్‌పార్టీ బాధ్యతలను రాహుల్‌గాంధీకి అప్పగించేసారు కాబట్టి, మిగతాది ఆయన చూసుకుంటాడు. రెండోది క్యాష్‌ రహిత భారత్‌. ఇది ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించాడు. అప్పుడు అరున్‌జైట్లీ... సార్‌, నోట్ల రద్దు ద్వారా చాలామంది వద్దవున్న నగదును ఊడ్చేసాం. ఇక లలిత్‌మోడీ, నీరవ్‌ మోడీ, విజయ్‌మాల్యా వంటి వాళ్ళు బ్యాంకుల వద్ద నగదును ఊడ్చేసే పనిలో వున్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు, నీరవ్‌ మోడీ లాంటివాళ్ళకు ఫ్రీహ్యాండ్‌ ఇస్తే దేశంలో వున్న బ్యాంకులన్నీ క్యాష్‌లెస్‌ బ్యాంకులుగా మారుతాయి. ఇక జిఎస్టీ దెబ్బకు చాలామంది వద్ద డబ్బులేకుండా పోయింది. మనం పారిశ్రామికవేత్తలకు ఇలానే వేలకోట్లు ఋణాలు ఇచ్చుకుంటూ పోతే, జిఎస్టీ చట్టాన్ని ఇలాగే కఠినంగా అమలు చేసుకుంటూపోతే త్వరలోనే మనం క్యాష్‌ రహిత భారత్‌ను చూడగలం సార్‌. ఆ నమ్మకం నాకుంది అని చెప్పాడు. దానికి మోడీ... సరే ఆ ఇష్యూను మీరు హ్యాండిల్‌ చేయండి, ఇక ఏపి వాళ్ళ ప్రత్యేకహోదా గొడవ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. దానికి జైట్లీ... ఏపికి ప్రత్యేకహోదా కోసం తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించాడు. అంతేకాదు, తన పోరాటానికి కలిసి రావాలని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు కూడా పిలుపునిచ్చాడు అని చెప్పాడు. జగన్‌ అంత మాటన్నాడా అంటూ నరేంద్రమోడీ కళ్ళు తిరిగి కుర్చీలోనే కూలబడ్డాడు.

----------

విజయవాడ రైల్వేస్టేషన్‌... 7వ నెంబర్‌ ఫ్లాట్‌ఫారం మీద ఢిల్లీకి వెళ్ళే స్పెషల్‌ ట్రైన్‌ ఆగివుంది. అన్ని భోగీల నిండా టీడీపీ, వైసిపి, జనసేన, వామపక్షాల కార్యకర్తలున్నారు. అప్పుడే హైటెక్‌రత్న చంద్రబాబు వచ్చాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో 'తెలుగు వీర లేవరా... ప్రత్యేకహోదాకై పోరాడరా' అనే పాట పెట్టారు. చంద్రబాబు బి2 భోగీ వద్ద నిలబడ్డాడు. మంత్రి సోమిరెడ్డి వచ్చి... సార్‌, మీరు ఎక్కి కూర్చోండి అని అడిగాడు. అందుకాయన... ఇంకా జగన్‌ రాలేదు, ఆ అబ్బాయి కూడా వస్తే కలిసి ఎక్కుదాం అని చెప్పాడు. అప్పుడే ఫ్లాట్‌ఫారం మీదకు జగన్‌ వచ్చాడు. వెనుక వేలాదిమంది కార్యకర్తలు బ్యాక్‌గ్రౌండ్‌లో 'జగనన్నా జగనన్నా జగమంతా నువ్వన్నా... ప్రత్యేకహోదాకై పదరన్నా...' అనే పాట వచ్చింది. జగన్‌ నేరుగా బి2 భోగీ వద్దకు వెళ్లాడు. చంద్రబాబు ఎంతో అభిమానంగా జగన్‌ను కౌగిలించుకుని... జగన్‌ మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఢిల్లీ నుండి కదిలేదిలేదన్నాడు. దానికి జగన్‌... నేనెప్పుడో సిద్ధం... అందుకోసం ఓ పదిజతల బట్టలు కూడా తెచ్చుకున్నాను అని చెప్పాడు. ఈలోపల వామపక్షాల నాయకులు మధు, నారాయణ, రామకృష్ణ, లోక్‌సత్తా జేపి,

ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు కూడా వచ్చి అదే భోగీ ఎక్కారు. అప్పుడే సిగ్నల్‌ ఇవ్వడంతో రైలు కదలసాగింది. ఇక ఎక్కు జగన్‌ అని చంద్రబాబు అన్నాడు. మన పవన్‌ ఇంకా రాలేద్సార్‌ అని జగన్‌ చెప్పాడు. పవన్‌ ఫ్లైట్‌కేమన్నా వస్తాడేమోలే అని చంద్రబాబు అన్నాడు. లేదు, మనతో పాటే రైలులో వస్తానన్నాడు. మనతో కలిసే జర్నీ చేయాలని ఉందంట అని జగన్‌ చెప్పాడు. చైన్‌ అన్నా లాగి ట్రైన్‌ను ఆపుదామా అని చంద్రబాబు అడిగాడు. అడుగో వచ్చేస్తున్నాడు. ఫర్వాలేదు. ఇక ఎక్కేయండి అని జగన్‌ చెప్పాడు. చంద్రబాబు, జగన్‌లు ట్రైన్‌ ఎక్కి డోర్‌ వద్ద నిలబడ్డారు. పవన్‌ భుజాన బ్యాగ్‌తో పరుగెత్తుకుంటూ భోగీ వద్దకు వచ్చాడు. జగన్‌ డోర్‌ వద్ద నిలబడే చేయి చాచాడు. పవన్‌ ఆ చేయి పట్టుకుని ట్రైన్‌లోకి జంప్‌ చేశాడు. ఢిల్లీ వైపు ట్రైన్‌ దూసుకుపోసాగింది. బి2 భోగీలో ఏపి నేతలందరూ ఒకరితో ఒకరు సరదాగా వుండ సాగారు. జగన్‌ తాను తెచ్చుకున్న వేరుశెనగ ముద్దలను అందరికీ పంచితే, చంద్రబాబు బాదంపప్పు, జీడిపప్పు, హెరిటేజ్‌ మజ్జిగ ప్యాకెట్లను అందరికీ ఇచ్చాడు. పవన్‌, జగన్‌లైతే ట్రైన్‌ ఢిల్లీకి వెళ్ళే వరకు కూడా ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకుని ఎంతో స్నేహంగా వుంటూ ఏపికి ప్రత్యేకహోదా మీదనే చర్చించుకోసాగారు. రైలు ఢిల్లీకి చేరింది. నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రధాని కార్యాలయం ముందు నిరాహారదీక్షకు కూర్చున్నారు. చంద్రబాబు వుండి... మోడీ, ఇక్కడితో నీ వేషాలు ఆపు... మమ్మల్ని ప్యాకేజీతో మభ్యపెట్టాలని చూసావో ఖబడ్దార్‌... ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఇక్కడినుండి కదిలేది లేదు. నాలో జాలి, దయ ఎక్కువుగా వుండబట్టి ఇప్పటిదాకా నీ జోలికి రాలేదు, నేను కేంద్రంలో చక్రం తిప్పడం మొదలుపెట్టానో నీ చక్రం ఆగిపోతుంది. అని హెచ్చరించాడు. తర్వాత జగన్‌, పవన్‌, ఉండవల్లి, జెపి, మధులు కూడా మాట్లాడి హోదా ఇవ్వకుంటే మిమ్మల్ని గోదాట్లో కలిపేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. వెంటనే అక్కడ కూర్చున్న కార్యకర్తలందరు కూడా ''హోదా ఇవ్వాలి... హోదా ఇవ్వాలి'' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయసాగారు.

ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదు. లెక్కలు చెప్పి ప్యాకేజీ తీసుకోండి. మీ చంద్రబాబు అవినీతి పరుడు. మేం ఇచ్చిన నిధులన్నింటిని జల్సా చేస్తున్నాడు. మీరెంత అరిచినా హోదా ఇవ్వను, హోదా ఇవ్వను... అని ప్రధాని నరేంద్రమోడీ కలవరించసాగాడు. రాజ్‌నాథ్‌సింగ్‌ వెంటనే టేబుల్‌ గ్లాస్‌లో వున్న నీళ్ళను మోడీ ముఖాన చల్లాడు. అప్పుడు మోడీ కళ్ళు తెరిచాడు. అప్పటిదాకా తనకు వచ్చింది కల అని తెలుసుకోవడానికి అతనికి పది నిముషాలు పట్టింది. మోడీ ఈ లోకంలోకి వచ్చి... ప్రత్యేకహోదా పోరాటానికి కలిసిరావాలని చంద్రబాబును జగన్‌ కోరాడని చెబితిరి... ఆ షాక్‌తో కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడే ఏపి నేతలంతా కలిసి ఢిల్లీ వచ్చి పోరాడుతున్నట్లు కల వచ్చింది అని చెప్పాడు. అప్పుడు జైట్లీ... సార్‌, వాళ్ళలో అంత యూనిటీ వుంటే అసలు ఏపినే విడిపోయేది కాదు, భూమి ఆకాశాలు కలవవన్నది ఎంత నిజమో, ఏపి సమస్యల కోసం ఆ రాష్ట్ర నేతలు కలవరన్నది అంత నిజం. వీళ్ళు తమిళనాడు లాంటి డేంజర్స్‌ కాదు, మనం హాయిగా వుండొచ్చు అని చెప్పి లేచాడు.

Read 39 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter