02 March 2018 Written by 

అవినీతితో అప్రతిష్ట

corruptionఈ కలికాలంలో 'అవినీతే సర్వాంతర్యామి' అన్నట్లుగా ఉంది. ఎక్కడ చూసినా అవినీతే విలయతాండవం చేస్తోంది. అక్రమాలు, మోసాలు, కుంభకోణాలు భారీస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోనూ అవినీతి అక్రమాలకు కొదవే ఉండడం లేదు. 2జీ స్పెక్ట్రమ్‌, బొగ్గు కుంభకోణాలు వంటి అనేక అవినీతి అక్రమాలు గత కాంగ్రెస్‌ పాలనను తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. అప్పట్లో ఈ అవినీతి పుట్టలు పగిలి పాపాల పాములెన్నో బుసలుకొడుతూ బయటికి వచ్చినా, ఇక అలాంటి అవినీతికి తావే ఇచ్చేది లేదంటూ వచ్చి భరోసా ఇచ్చిన బిజెపిని చూసి ప్రజలెంతో సంతోషించారు. అయితే, ఆ సంతోషం ఎంతోకాలం నిలబడేట్లు కనిపించడం లేదు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవినీతికి ఎదురే లేదు.. అక్రమార్కులకు బెదురే లేదు.. అన్నట్లుగా ఉంది పరిస్థితి. తాజాగా అంతర్జాతీయస్థాయిలో వెలువరించిన అవినీతి సూచీలో మనదేశం 79 నుంచి 81 కి దిగజారడం ఇందుకు నిదర్శనం. న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, నార్వే, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు అవినీతి లేని నీతిమంతమైన దేశాలుగా ఫ్రఖ్యాతి చెందుతుంటే, భారత్‌ మాత్రం అవినీతి రోగంతో కుళ్ళిపోతోంది. మనదేశంలో అవినీతి అక్ర మాలు అన్ని రంగాల్లోనూ వేళ్లూనుకుంటున్నాయి. పైసాలోనే అంతా. ముడుపులు మూట కట్టందే ఇక్కడెవరూ పనులు చేయరు. అలా తేరగ్గా పనులు చేయడానికి ఇక్కడెవరూ లేరు.. అన్నట్లుగా ఉం టోంది వ్యవహారమంతా. అందులోనూ ప్రభుత్వరంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక చోటని కాదు..సర్వే సర్వత్రా అంతా అవినీతి అక్రమాలే విస్తరిస్తున్నాయి. రంగమేదైనా.. స్థాయిని బట్టి అవినీతి చెద అల్లుకుంటూనే ఉంటుంది. నకిలీ వ్యవహరాలతో ప్రజల్ని, దేశాన్ని దోపిడి చేసే డొల్ల కంపెనీల భరతం పడతాం అని ప్రధాని మోదీ పదేపదే హెచ్చరిస్తున్నా, సరిగ్గా అలాంటి డొల్లకంపెనీలతోనే బ్యాంకులకు టోకరా కొట్టే కొఠారి లాంటి వాళ్ళు ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మిగిలారు. ఇలాంటి అవినీతి మాయగాళ్ల భరతం పట్టడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేక పోవడం ఎంతైనా విచారకరం. ఆయా బ్యాంకులకు సంబంధించినవారే అక్రమార్కులకు సహకరించారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విస్తుపోతున్నాయి. దీనికంతటికీ కారణం అవినీతే. నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా వంటివారు బ్యాంకుల సిబ్బంది సాయంతోనే, బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి కోటానుకోట్ల రూపాయలు తీసుకుని ఎగవేయడం వెనుక ఉన్నది..ఆ అవినీతి రక్కసేనన్నది అందరికీ తెలిసిందే. బ్యాంకుల్లో సాధారణ ప్రజలకు ఓ లక్ష రుణం కావాలంటే సవాలక్ష యక్షప్రశ్నలతో నెలల తరబడి తిప్పుకుని కన్నీరు పెట్టిస్తారు. అదే బ్యాంకుల్నే బురిడీలు కొట్టించే మోసగాళ్ళకు మాత్రం కోటానుకోట్లు అప్పనంగా ఇచ్చేయడంలో అవినీతిదే కీలకపాత్ర అని వేరే చెప్పాల్సిన పనే లేదు. అన్ని రంగాలు, చివరికి ప్రభుత్వ కార్యాలయాలు కూడా అలాగే తయారవుతున్నాయి. ఓ చిన్న పని కావాలన్నా అక్కడి సిబ్బంది నిరుపేదలు, అభాగ్యులు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటారు. కరుణ, జాలి, దయ, చివరికి మానవత్వం అన్నది కూడా చాలామందిలో లేశమైనా ఉండడం లేదు. అదే అవినీతిపరులకు, అక్రమార్జనలతో కోట్లు గడించు కున్నవారికైతే ఎలాంటి పనికావాలన్నా సరే.. వారే క్షణాల మీద చక్కబెట్టేస్తుంటారు. కారణం.. అవినీతే. ముడుపులిస్తే చాలు ఎంతటి పనైనా అయిపోతుంది. ఇటీవల వజ్రాల వ్యాపారులు నీరవ్‌మోడీ, మొహుల్‌ చోక్సీ చేసిన భారీ మోసాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ మోసం మొత్తం విలువ ఎంతో తెలుసా?.. సుమారు రెండు బిలియన్‌ల డాలర్లట. అంటే, ఈ కుంభకోణం మొత్తం అక్షరాలా 12,717 కోట్లని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తాజా నివేదిక వెల్లడిస్తోంది. చూడండి ఎంత భారీ కుంభకోణమో!.. ఇంత భారీ మొత్తంలో మోసం చేసి బ్యాంకుల్ని దివాలా తీయించే అక్రమార్కులకు మనదేశంలో రెడ్‌కార్పెట్‌ పరిచే దుస్థితి..ఎంత ఘోరమో కదా!.. ఈ కుంభకోణంలో నిందితుడైన నీరవ్‌మోడీ మాత్రం హాయిగా అమెరికాలో దివాలా దరఖాస్తు పెట్టుకోవడం చూస్తే... ఇలాంటి ఘరానా మోసగాళ్ళ బరితెగింపు ఎలాంటిదో విశదమవుతుంది. నీరవ్‌మోదీ, విక్రమ్‌ కొఠారీ వంటి మోసగాళ్ళకు, లోపాయికారిగా సహకరించి బ్యాంకుల డబ్బును కోట్లకు కోట్లు దోచిపెట్టడం వెనుక ఉన్నది కూడా..అవినీతి భూతాలే. అయినా, బ్యాంకుల్లో ఇలాంటి ఇంటిదొంగలు ఇంకా ఎంతమంది ఉన్నారో, ఎన్ని కోట్లు తిన్నారో..ఇంకా తింటూనే ఉన్నారో కేంద్ర నిఘా దర్యాప్తు బృందాలు లెక్క తేల్చాల్సి ఉంది. తిన్నదంతా కక్కించాల్సి ఉంది. అంతేకాదు, కాన్పూర్‌కు చెందిన విక్రమ్‌ కొఠారి అక్రమాలు తవ్వే కొద్దీ దర్యాప్తు బృందాలే విస్తుపోతున్నాయిట. బోగస్‌ కంపెనీలను సృష్టించి ఏకంగా బ్యాంక్‌ల నుంచి 3,695 కోట్లు రుణంగా తీసుకున్నాడని, నిబంధనలు ఉల్లం ఘించి కొఠారి రుణాలు పొందాడని చెప్తున్నాయి. వీటన్నిటి వెనుక అవినీతి జలగలు ఎన్ని ఉన్నాయనేది లెక్క తేల్చాల్సింది కేంద్ర దర్యాప్తు బృందాలే. ఈ నేపథ్యంలో, కేవలం రెండేళ్ళలోనే ప్రభుత్వరంగ బ్యాంకులకు సంబంధించిన 5200 మంది ఉద్యోగులు రకరకాల మోసాలకు పాల్పడ్డారని ఆర్‌బిఐ అధికారికంగా గుర్తించినట్టు తాజా సమాచారం. ఇలాంటి ఇంటిదొంగలు ఇంకెంతమంది ఉన్నారో ఆ దేవునికే ఎరుక. దేశంలో అవినీతి ఇంత హాయిగా తిష్టవేసుకుని ఉన్నా పట్టించుకోకపోవడాన్ని ఏమనాలి?...విశుద్ధ పాలన, అవినీతి రహిత పాలన వంటి నినాదాలు వినడానికి బావున్నా, ఆచరణలో కనిపించకుంటే భవిష్యత్తు అంధకారమవుతుంది.

కేంద్రం వెంటనే ఇలాంటి మోసాలపై కొరడా పట్టుకోకుంటే, డొల్లకంపెనీల భరతం పట్టకుంటే.. అవినీతి అక్రమాల అంతు చూడకుంటే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది. అవినీతిని పట్టించుకోక, కేవలం నీతులు వల్లించుకుంటూ పోతే.. చివరికి నిజంగా అవినీతే సర్వాంతర్యామి అవుతుంది. దేశం అవినీతి భారత్‌గా మారుతుంది. అవినీతి అక్రమాల గుప్పెట్లో దేశం అణగారిపోతుంది. అప్పుడు ఎవరెంతగా వగచినా.. ఫలితం మాత్రం శూన్యమే!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter