09 March 2018 Written by 

ఈశాన్యాన్ని ఆక్రమించారు!

tripuraత్రిపురలో కమలం విరిసింది. బిజెపిలో ఆనందం వెల్లివిరిసింది. కమ్యూనిస్టు (మార్క్సిస్టులు)ల కోటగా ఉన్న ఈ రాష్ట్రంలో ఎవరూ ఊహించని రీతిలో కమల పతాకం రెపరెపలాడింది. త్రిపుర అంటే కమ్యూనిస్టులకు పెట్టిన కోట. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అక్కడ కమ్యూనిస్టులు అప్రతిహతంగా రాజ్యమేలుతున్నారు. అయినా, ప్రజల తీర్పు ఈసారి బిజెపినే వరించింది. ఇన్నేళ్ళు పాలించినా ప్రజల ఆశలు ఆకాంక్షలు ఫలించకపోవడంతో విసిగి వేసారి తాజాగా జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టుల పాలనకు తెరదించారు. నూతనోత్తేజంతో అక్కడి ప్రజలు బిజెపిని స్వాగతించారు. బిజెపి తన భాగస్వామి పక్షమైన ఐపిఎఫ్‌టితో కలసి మూడింట రెండువంతులకు పైగానే ఆధిక్యాన్ని సాధించి తన సత్తా చాటుకుంది. అయిదేళ్ళ క్రితం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కేవలం రెండుశాతం కన్నా కూడా తక్కువ ఓట్లు దక్కించుకున్న బిజెపి, ఇప్పుడు చరిత్ర తిరగరాసింది. తనకు తిరుగేలేదనిపించింది. త్రిపురలో ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో ఏకంగా 43 స్థానాలు బిజెపి కూటమికి లభించడం తిరుగులేని రికార్డు. విజయానికి అవసరమైన స్థానాలకంటే అధికంగా 35 స్థానాలు గెలుచుకోవడ మంటే చిన్నవిషయమేమీ కాదు. అందులోనూ ఇక్కడ అప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ అంటే నిజంగా రాజకీయ రంగంలో మాణిక్యమే.. ఓ మేలిమి ఆణిముత్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ వామపక్షాల చరిత్ర లోనే మాణిక్‌ సర్కార్‌ది ఒక ప్రత్యేక చరిత్ర. అంతటి నిజాయితీపరుడు.. నిరాడంబరుడాయన. అవినీతి మకిలి అంటని రాజకీయ యోధుడు. ఆయనకు ఎలాంటి ఆస్తులు, ఆడంబరాలు లేవు. అవి ఆయనకు నచ్చని విష యాలు కూడా. అటు రాజకీయంగా కానీ, వ్యక్తి గతంగా కానీ ఆయన్ను విమర్శించడానికి ఎలాంటి విషయాలూ లేని మచ్చ లేని మంచి నేత మాణిక్‌ సర్కార్‌. అయితే, ఆయన పాలనలో సగటు మనిషి బాధలు మాత్రం తీరలేదు. రాష్ట్రంలో పెరుగుతున్న పేదరికం, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, పారిశ్రామిక ప్రగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం, నిరుద్యోగం ప్రబలిపోవడం వంటి సమస్యలతో త్రిపుర కుదేలైపోయింది. రాష్ట్రంలో పాలనాపరంగా ఎన్నో సమస్యలున్నా ఏళ్ళ తరబడిగా అవి తీరనే లేదు. నాయకుడు ఎంత మంచివారైనా, నిజాయితీపరుడే అయినా ప్రజలు కోరుకునేది అభివృద్ధినే కదా!... నిజాయితీగా ఉంటూనే... ప్రజల సమస్యలు తీరుస్తూ రాష్ట్రాభివృద్ధి సాధించినప్పుడే ప్రజలు ఆదరిస్తారు. కాలానుగుణంగా సిద్ధాంతాలను మార్చుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సంకల్పించక తమ దారే తమది.. అదే గొప్పది అన్నట్లుగా మొండిగా వ్యవహరిస్తుండబట్టే వామపక్షాలు, వాటి కూటములు జనచైతన్యం వెల్లివిరుస్తున్న నేటి అధునాతన కాలంలో.. తమకు తామే పరాజయాల గుంతలు వెతుక్కుని మరీ అందులో పడుతున్నాయి. అప్పటికీ గత పాతికేళ్ళుగా కమ్యూనిస్టు కోటగానే త్రిపుర ఉండిందంటే ఎప్పటికప్పుడు ప్రజలు తమ కలలు నెరవేరుతాయనే ఆశతోనే ఇంత కాలం ఓపిక పట్టారు. అయినా, ఫలితం లేకపోయేసరికి ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపారు. ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఎన్నో బాధలు పడుతుండడం, ఉద్యో గులకు జీతాలు పెరగక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడం వంటివన్నీ కలసివెరసి బిజెపికి కలసివచ్చాయి. తమ ప్రభుత్వం వస్తే ఇలాంటి సమస్యలేమీ ఉండవని, అభివృద్ధిలో త్రిపురను అగ్రగామిని చేస్తామని బిజెపి వాగ్దానాలు చేయడంతో.. సరిగ్గా ఇలాంటి మార్పు కోసమే ఎదురుచూస్తున్న ప్రజానీకమంతా గుంపగుత్తగా బిజెపికి ఓట్లు వేసి కమలనాధులకు ఘన విజయం సాధించిపెట్టారు. 8 జిల్లాలు, 37 లక్షల మంది జనాభా ఉన్న చిన్న రాష్ట్రమైన త్రిపురలో కమ్యూనిస్టుల పాలనకు స్వస్తి పలికారు. కమ్యూనిస్టుల కోటగా ఉన్న పశ్చిమబెంగాల్‌లోనూ 2011లో ఇదే జరిగింది. త్రిపురలో గతంలో జరిగిన పది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ ఒక్కసారీ ఒక్క సీటును కూడా సాధించలేని బిజెపి ఇప్పుడు ఏకంగా రికార్డుస్థాయిలో 43 శాతం ఓట్లు సాధించిందంటే అద్భుతమే. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి కమలనాధులు తమ ప్రతిభను చాటుకున్నారు. 'అభివృద్ధికి పచ్చజెండా ఊపాలంటే..ఎర్రజెండాల్ని తొలగించాలంటూ' ప్రధాని ఎన్నికల్లో చేసిన ప్రచారాలు ప్రజల్ని బాగా ప్రభావితం చేశాయి. కనుకనే, ఇంతటి విజయం ఇక్కడ లభించిందను కోవచ్చు. దీంతో బిజెపి సైద్ధాంతికంగా కూడా కమ్యూనిస్టులపై ఘనవిజయం సాధించినట్లయింది. భిన్నధృవాలుగా ఉన్న బిజెపి-కమ్యూనిస్టుల ఎన్నికల సమరాంగణంలో ఇది బిజెపికి తిరుగులేని విజయ మేనని చెప్పకతప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిపురలో బిజెపి శూన్యం నుంచి శిఖరస్థాయికి ఎది గింది. కమ్యూనిస్టుల కోట కూలిపోయింది. ఇదంతా ప్రజల నుంచి వచ్చిన మార్పు. కాలం చెల్లిన సిద్ధాంతా లతో కమ్యూనిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక్క త్రిపురలోనే కాదు, నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికల ఫలితాలు కూడా బిజెపికి మరింత ప్రతిష్టను చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ, బిజెపి సారధి అమిత్‌షాల ప్రచారాలు ప్రజల్ని బాగా ప్రభావితం చేశాయి. ఇప్పటికే అస్సాం, మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో పాలన చేపట్టిన బిజెపి, తాజాగా త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయల్లోనూ తన సత్తా చాటుతోంది. త్రిపురలో మూడింట రెండువంతుల స్థానాలను తానే గెలుచుకున్న బిజెపి, నాగాలాండ్‌లో భాగస్వామ్యపక్షంతో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. అదేవిధంగా, మేఘాలయలో కాంగ్రెస్‌కు అధికస్థానాలు వచ్చినా, అక్కడ కూడా స్థానికంగా బలంగా

ఉన్న ఓ పార్టీతో కలసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

ఏదేమైనా, ఈశాన్యభారతంలో ఆయా రాష్ట్రాల ప్రజలు బిజెపి పట్ల, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఎంతో అభిమానం చూపుతున్నారనేందుకు, బిజెపికి పూర్తిస్థాయిలో తమ మద్దతు ఇస్తున్నారనేందుకు ఇటీవల ఈశాన్యభారతంలో జరిగిన ఈ ఎన్నికలే తాజా నిదర్శనం. ఈ ప్రభావం రానున్న కర్నాటక, కేరళ, పశ్చిమబెంగాల్‌ ఎన్నికలపై కూడా తప్పకుండా ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter