Friday, 09 March 2018 09:12

ప్రధాని కుర్చీలో చంద్రబాబు

Written by 
Rate this item
(0 votes)

galpikaఉండవల్లిలోని హైటెక్‌రత్న, ఆంధ్ర సీఎం చంద్రబాబు నివాసం. కేంద్రమంత్రులు అశోక గజపతిరాజు, సుజనాచౌదరి, ఎంపీలు గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు, కేశినేని నాని, ఎన్‌.శివప్రసాద్‌, మురళీమోహన్‌, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమలు వున్నారు. అశోక గజపతిరాజు వుండి... సార్‌, కేంద్రం వైఖరి ఏమీ బాగాలేదు. ఏపి నాయకులను వెర్రోళ్ళలాగా చూస్తున్నారు. మీరు చెబితే ఇప్పుడే రాజీనామా చేసొస్తామన్నాడు. ఆ మాటకు సుజనాచౌదరి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వెంటనే ఆయన... చేస్తావ్‌ చేస్తావ్‌ నీదేం పోతుంది... నీకేమయ్యా మీ ఊర్లో బ్యాంకులో నీకు లక్ష కూడా అప్పుండదు. అవతల బ్యాంకుల్లో మాకు వేలకోట్ల అప్పులున్నాయి. కేంద్రం నుండి ఇప్పుడు బయటకొస్తే మీకు పోయేదేమీ లేదు... నన్ను తీసుకుపోతారు. భలే వాడివే... కేంద్రంతో పేచీ వద్దు. ఎలక్షన్‌ దాకా మాకు న్యాయం చేయమని మోడీని బ్రతిమలాడుకుందాం, ఎలక్షన్‌ తర్వాత రిజల్ట్‌ను బట్టి ప్లేటు మారుద్దాం అని ప్రతిపాదించాడు. అప్పుడు సోమిరెడ్డి అందుకుని... ఆ బీజేపీవాళ్ళకు మనమంటే లెక్కలేకుండా పోయింది. మన చంద్రబాబు గారిని వాళ్ళు ఇంత వరకు ఒక సైడే చూసారు. ఇప్పుడు రెండో సైడ్‌ చూసే టైం వచ్చింది. జాతీయ రాజకీయాలలో మన చంద్రబాబు గారు ఇక చక్రం తిప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. చంద్రబాబు గారు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే ఏపిలో పార్టీ పరిస్థితి ఏంటని మురళీమోహన్‌ సందేహం వెలిబుచ్చాడు. అందుకు నారాయణ స్పందిస్తూ... ఉన్నాడుగా నా శిష్యుడు లోకేష్‌. జయంతిని వర్ధంతిగా మార్చిన ఘనాపాటి. అమెరికాలోనూ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురాగల ధీశాలి. అలాంటి ధీరుడు, వీరుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురాలేడా... ఏం భయం లేదు సార్‌, మీరు నిశ్చింతగా ఢిల్లీ వెళ్ళండి, ఇక్కడంతా లోకేష్‌ సారధ్యంలో మేం చూసుకుంటామని చెప్పాడు. ఆ మాటలతో చంద్రబాబు గాలి కొట్టిన బెలూన్‌లా ఉబ్బిపోయాడు. అయినా తమాయించుకుని వారితో... జాతీయ రాజకీయాలలోకి మనంతట మనంగా ప్రవేశిస్తే మన కాళ్ళు మనమే పిసుక్కున్నంత చీప్‌గా ఉం టుంది. సిచ్యుయేషన్‌ మనల్ని డిమాండ్‌ చేయాలి. దేశంలోని కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలన్నీ కూడా... ఈ మోడీని తట్టుకో లేకపోతున్నాం, ఆ పప్పు(రాహుల్‌)ను నమ్మలేకున్నాం... మీరే మాకు దిక్కు... జాతీయ రాజకీయాలలోకి రండి అని మన కాళ్ళకు మొక్కాలి. అప్పుడు ఎంట్రీ ఇస్తే అదిరిపోతుంది అని చెప్పాడు. అందుకు వెంటనే శివప్రసాద్‌... ఆరోజు త్వరలో వస్తుంది బాబూ, త్వరలో మీరు ప్రధాని అవుతారు బాబూ అని చెప్పాడు. టైం కోసం వెయిట్‌ చేద్దాం అని చంద్రబాబు చెప్పడంతో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి పోయారు. చంద్రబాబు స్నానం చేసి మనుమడు దేవాన్ష్‌తో కలిసి రెండు పుల్కాలు తిని తన బెడ్‌ మీద నడుం వాల్చాడు.

------

ఏవండీ... లేవండీ అని తనను తట్టడంతో చంద్రబాబు ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా తన శ్రీమతి భువనేశ్వరీదేవి... ఏంటని చంద్రబాబు అడిగాడు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఫోన్‌ చేసిందండి... మీతో అర్జంట్‌గా మాట్లాడాలంట అని చెప్పింది. చంద్రబాబు ఆమె చేతిలో వున్న ఫోన్‌ తీసుకుని హలో అన్నాడు. అవతల నుండి మమత... చంద్రబాబు గారు... నరేంద్ర మోడీ దూకుడుకు కళ్లెం వేయాలంటే మీరు జాతీయ రాజకీయాల లోకి రావాలి. వాళ్ళు ఒక్కో రాష్ట్రాన్ని కబళించుకుంటూ వస్తున్నారు. నెక్ట్స్‌ నా స్టేట్‌కు టార్గెట్‌ పెట్టారు. వాళ్ళు నా రాష్ట్రం మీదకు రాకముందే వాళ్ళనే సెంట్రల్‌లో లేకుండా చేయాలి. అది మీ వల్లే సాధ్యమవుతుంది అని చెప్పింది. చంద్రబాబు ఆమెతో... టైమొస్తే తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు. ఆయన అలా ఫోన్‌ పెట్టాడోలేదో... మళ్ళీ రింగయ్యింది. చంద్రబాబు ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి ఒరిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌... చంద్రబాబు గారు, మీరు అర్జంట్‌గా జాతీయ రాజకీయాల్లోకి రావాలి, మీరు రాకుంటే నేను మీ ఇంటి ఎదుట నిరాహారదీక్షకైనా కూర్చుంటాను. ఆ బీజేపీ వాళ్ళు నా ఒరిస్సాను కబళించాలని చూస్తున్నారు. వాళ్ళ నుండి మమ్మల్ని మీరే కాపాడాలని ప్రాధేయ పడ్డాడు. అలాగే... మీకు తప్పకుండా సాయం చేస్తానని చంద్రబాబు ఫోన్‌ పెట్టేసాడు. అప్పుడే ల్యాండ్‌ ఫోన్‌ రింగయ్యింది. ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి... చంద్రబాబు... నేను లాలూను, బీహార్‌ జైలు నుండి మాట్లాడుతున్నా... నువ్వు ఢిల్లీ రాజకీయాల్లోకి రావా లబ్బా... లేకుంటే ఈ బీజేపీ వాళ్ళతో కష్టం అని అడిగాడు. చంద్రబాబు అలాగే అంటూ ఫోన్‌ పెట్టేసాడు. అప్పుడే దేవాన్ష్‌ లోపలకు వచ్చి... తాతయ్య మీ కోసం... ములాయం సింగ్‌ యాదవ్‌ తాతయ్య, సీతారాం ఏచూరి మావయ్యా, మాయావతి అత్తయ్య, ప్రకాశ్‌ కారత్‌ అంకుల్‌ వచ్చారు. బయట హాల్‌లో వున్నారు అని చెప్పాడు. ఈ టైంలో వీళ్ళంతా కట్టకట్టుకుని ఎందుకు వచ్చారబ్బా అనుకుంటూ చంద్రబాబు హాల్‌లోకి వెళ్ళాడు. బాబును చూడగానే వాళ్ళంతా లేచి నమస్కరించారు. ఏం ఇలావచ్చారని చంద్రబాబు అడిగాడు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా తృతీయ ఫ్రంట్‌ నిర్మాణం జరగాలి. దానికి మీరే సారధ్యం వహించాలి. ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి కూడా మీరే అని ములాయం అన్నాడు. సీతారాం ఏచూరి వుండి... మాకు మొన్న బెంగాల్‌ పోయింది, నిన్న త్రిపుర పోయింది... మీరు తృతీయ ఫ్రంట్‌ను పెట్టకపోతే రేపు కేరళ కూడా పోతుంది. మా కోసమన్నా మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని చేతులు పట్టుకున్నాడు. అలాగే వస్తాను అంటూ చంద్రబాబు వారిని పంపించేసాడు. వాళ్ళు వెళ్ళాక ఆయన బిగ్గరగా నవ్వుతూ... సిచ్యుయేషన్‌ నన్ను డిమాండ్‌ చేస్తుంది. ఇక నేషనల్‌ పోలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తాను అని అరవసాగాడు. అప్పుడే ఏవండీ... ఏవండీ... అని ఎవరో తనను పిలవడం వినిపించింది. ఇంతకుముందే కదా నన్నలా పిలిచి తట్టి లేపింది... మళ్ళీ ఇంతలోనే ఇలా పిలుస్తున్నదెవరు అని మనసులో అనుకుంటుండగానే ముఖాన ఫోర్స్‌గా నీళ్ళు పడ్డాయి. ఆ దెబ్బతో అదిరిపోయి చంద్రబాబు కళ్ళు తెరిచాడు. ఎదురుగా భువనేశ్వరి... అంటే ఇప్పటిదాకా వచ్చింది కలన్నమాట... అని తనకు తాను తెలుసుకున్నాడు. తర్వాత తేరుకుని ఎందుకు లేపావ్‌ అని తన శ్రీమతిని అడిగాడు. ఆమె టీవీ ఆన్‌ చేసి 9I9=99 ఛానెల్‌ పెట్టి ఈ న్యూస్‌ చూడండి అంటూ వెళ్ళిపోయింది. స్క్రీన్‌పై న్యూస్‌ రీడర్‌ న్యూస్‌ చదువుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్న కేసీఆర్‌... తృతీయ ఫ్రంట్‌కు తానే సారధ్యం వహిస్తానని వెల్లడి. చంద్రబాబును కూడా కలుపుకుపోతానని చెప్పిన కేసీఆర్‌... కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మద్దతు తెలిపిన మమత, వామపక్షాల నేతలు.. ఈ న్యూస్‌ను వినగానే చంద్రబాబు తల వెయ్యికిలోమీటర్ల వేగంతో తిరగసాగింది.

Read 33 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter