23 March 2018 Written by 

దేశాన్ని ఇంకా ముక్కలు చేస్తారా?

రాజకీయములందు..ఓట్ల రాజకీయములు వేరయా!.. అన్నట్లు ఇప్పుడు కొత్తగా కర్నాటకలో రాజకీయాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల రాజకీయాలను రసవత్తరంగా నడిపేందుకు ఉరకలు వేస్తోంది. కర్నాటకలో బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ, మతపరమైన మైనార్టీ హోదాను కల్పించే 'వ్యూహం'పై అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా కర్నాటకలో కాంగ్రెస్‌ కొత్త నాటకానికి తెరలేపినట్లయింది. కర్నాటక మంత్రివర్గం లింగాయత్‌ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిసూ తాజాగా చేసిన తీర్మానం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు, వాదోపవాదాలు ప్రారంభం కావడంతో సర్వత్రా రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఎందుకంటే కర్నాటకలో లింగాయత్‌లు రాజకీయంగా ఎంతో ప్రధానమైన పదవుల్లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు పదిహేనేళ్ల పాటు లింగాయత్‌లే అక్కడ ముఖ్య మంత్రులుగా ఏలారు. అంత ప్రాభవ వైభవాలు లింగాయత్‌లకు ఉన్నాయి. జనాభాలో సుమారు 17 శాతం దాకా ఉన్న లింగాయత్‌లు దాదాపు నూరు నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే, లింగాయత్‌ సామాజిక వర్గాన్ని మతంగా గుర్తిస్తూ వారికి మత పరమైన మైనార్టీ హోదాను కల్పించాలన్న రిటైర్డ్‌ జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌ కమిటీ సిఫారసులకు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, దానిని త్వరలో కేంద్రానికి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయానికి సంతోషిస్తూ రాష్ట్రవ్యాప్తంగా లింగా యత్‌లు సంబరాలు చేసుకుంటున్నారు కూడా. అయితే, వీరశైవులు మాత్రం ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణలు కూడా జరిగాయి. ఏదేమైనా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కర్నాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. తాము తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా తదుపరి మరింత విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు జరిపేందుకు కూడా కర్నాటక ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అయితే, లింగాయత్‌లు-వీరశైవుల ఈ రిజర్వేషన్ల విధానానికి బిజెపితో సహా పలు హిందూ సామాజికవర్గాలు తొలి నుంచి దూరంగానే ఉంటున్న నేపథ్యంలో, తాజాగా కర్నాటకలో సిఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ బిజెపి విమర్శల బాణాలను ఎక్కుపెట్టింది. రాజకీయ అవసరాల కోసం కర్నాటక ప్రభుత్వం కులాలను, మతాలను విభజిస్తోందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం సిద్ధరామయ్య నిప్పుతో చెలగాట మాడుతున్నారని, ఇది మంచిది కాదని బిజెపి హితవు పలుకుతోంది. అసలు వీరశైవులు- లింగాయత్‌లు ఒకటేనని, ఈ రెండు సామాజికవర్గాలు హిందూత్వంలో భాగమేనని, అయితే కర్నాటక ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు వీరిని విడగొడుతున్నారని, ఇదంతా కర్నాటకలో కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకమే అని బిజెపి దుయ్యబడుతోంది. ఇదిలావుంటే, చాలా కాలంగా లింగాయత్‌లు ప్రత్యేక మతంగా లింగాయత్‌లను గుర్తించాలంటూ కోరుకుంటూనే ఉన్నారు. దీంతో వారికి మతపరమైన మైనార్టీ హోదాను ఇవ్వాలన్న అంశం కూడా ఎంతోకాలంగా అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడు కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు సమీపించిన సందర్భంగా ఈ అంశం లేవనెత్తడం వల్ల తమకెంతో మేలు జరుగుతుందనేది కాంగ్రెస్‌ రాజకీయం. అక్కడి ముఖ్యమైన నేత యడ్యూరప్ప కూడా లింగాయత్‌ సామాజికవర్గానికి చెందినవారే కనుక, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, దీంతో ఇటు యడ్యూరప్పను, అటు బిజెపిని కూడా దీనిద్వారా దెబ్బకొట్టవచ్చన్నది కాంగ్రెస్‌ వ్యూహం. అందువల్ల హటాత్తుగా లింగాయత్‌లకు ప్రత్యేక మతం పేరుతో మైనార్టీ అంశాలను అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అసలు వీరశైవులు, లింగాయత్‌లు ఒక్కటేనని, అందరికీ ప్రత్యేక మత హోదా ఇవ్వాలని మరోవైపు అఖిలభారత వీరశైవ మహాసభ సూచిస్తోంది. అయితే, కొంతమంది మాత్రం కేవలం లింగాయత్‌లకు మాత్రమే ఆ తరహా హోదాను ఇవ్వాలని పట్టుబడు తున్నారు. రాష్ట్రంలో 17శాతం దాకా ఉన్న లింగా యత్‌-వీరశైవ లింగాయత్‌లకు మతపరమైన హోదాను ఇవ్వవచ్చు అని నాగమోహన్‌దాస్‌ కమిటీ సూచించడంతో ఆ మేరకు గుర్తింపునిచ్చేందుకు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం తహతహలాడుతోంది. అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమి టంటే, ఈ విషయంలో కర్నాటక క్యాబినెట్‌ నిర్ణయం తుది నిర్ణయమేమీ కాదు. ఆ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదముద్ర కావాలి. బిజెపికి ఆ ప్రతిపాదన తొలినుంచి ఇప్టం లేదు కనుక అది ఎటూ అమలు జరగదు. ఆ విషయం కర్నాటక ప్రభుత్వనేతలకు తెలియనిదేమీ కాదు. ఎందుకంటే ఈ ప్రతిపాదనను తొలినుంచి బిజెపి వ్యతిరేకిస్తోందని, అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కావాల్సింది కూడా ఇదే. తాను అడిగినట్లు ఉండాలి..అడిగినా అవతలివారు కాదన్నట్లు ఉండాలి. తాము ఇస్తామన్నా కేంద్రం ఒప్పుకోలేదని చెప్పుకున్నప్పుడే ఓట్లు అటు నుంచి ఇటువైపుకు వచ్చి రాలుతాయన్నది...వ్యూహం. ఇదీ కాంగ్రెస్‌ రాజకీయం. తీరా ఇవన్నీ ప్రజల్లోకి వచ్చేసరికి ఇందులో ఎంతవరకు ఏ పార్టీవారి మాట నెగ్గుతుందో చూడాలి. ఈ అంశంలో ఇరుకునపడినట్లున్న బిజెపి ఆ పీటముడి నుంచి బయటపడడానికి మరొక వ్యూహంతో పావులు కదుపకుండా ఉంటుందనుకోలేం. అయినా, ఎన్నికలు వస్తున్నాయంటే ఒక్క కర్నాటకలోనే కాదు, దాదాపు దేశమంతటా ఇలాంటి రాజకీయాలే!.. కులాల పేరుతో, మతాల పేరుతో దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు ఏనాటికీ మంచివి కావు. ఎవరైనా సరే, నేతలు ఏ పార్టీ వారైనా సరే ప్రజల ఆశలు ఆకాంక్షలకు తగ్గట్గుగా కార్యాలు నిర్వర్తించాలే తప్ప ఓట్లకు తగ్గట్టుగా నిర్ణయాలు చేయడం తగదు!... ఇలాంటి రాజకీయాలు చివరికి ఎలాంటి ఫలితాలిస్తాయో వేచి చూడాల్సిందే.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter