Friday, 23 March 2018 11:28

బాబుకు సారీ చెప్పిన పవన్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaఉండవల్లిలోని హైటెక్‌రత్న, ఆంధ్రా సీఎం చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయం. నారా లోకేష్‌ ఒక పుస్తకం పట్టుకుని అటు ఇటు తిరుగుతూ... ''దివంగతులైన వారి పుట్టినరోజును జయంతి అనియు, మరణించిన రోజును వర్ధంతి అనియు'' అందరు... అని పదే పదే చదువుతున్నారు. లోకేష్‌ను చంద్రబాబు కుర్చీలో కూర్చుని బెత్తం పట్టు కుని చదివిస్తున్నాడు. అప్పుడే ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌బాబు లోపలకు వచ్చాడు. సార్‌, అబ్బాయి చదివి చదివి అలసిపోయినట్లున్నాడు. హెల్త్‌ డ్రింక్స్‌(బీరు) ఏమన్నా తెప్పించమంటారా? అని అడిగాడు. నీ డ్రింక్స్‌ ఏమీ అవసరం లేదు, గంటకోసారి వాళ్ళమ్మ బూస్ట్‌ అందిస్తుందిలే అని చంద్రబాబు చెప్పాడు. మళ్ళీ జవహర్‌ వుండి... లోకేష్‌బాబు... చదువుకునే రోజుల్లోనే ఇంత శ్రద్ధగా చదువుంటే ఏ ఐఏఎస్సో, ఐపిఎస్సో అయ్యుండేవాడయ్యా అని అన్నాడు. చంద్రబాబుకు ఆ మాటతో తిక్కరేగింది. చదువుకుని వుంటే ఐఏఎస్‌ అయ్యేవాడు, శ్రద్ధగా చదువుకోకపోబట్టి ఐఏఎస్‌లకు బాస్‌ అయ్యాడు... అని చెప్పాడు. వెంటనే జవహర్‌... దీన్నిబట్టి చదువుకోకపోవడమే మేలంటారా... మరి రాష్ట్రంలో ఇన్ని స్కూళ్లెందుకు, చదువుకోండని చెప్పి స్కాలర్‌షిప్‌ లెందుకు. మంచి ఫలితాలు రావాలంటూ అయ్యవార్ల మీద ఒత్తిళ్లెందుకు. చదువుకోకుంటే అందరూ మన లోకేష్‌బాబులాగా అభివృద్ధి చెందుతారు కదా అని చెప్పాడు. చంద్రబాబుకు కోపం అరికాల్లో కొచ్చింది. తమాయించుకుని నీతో ఈ సబ్జెక్ట్‌పై మళ్ళీ తాపీగా డిస్కషన్‌ చేస్తాను, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. మీరు ఏదో ఫ్రెస్టేషన్‌లో ఉన్నట్లున్నారు, మీకు కూడా రెండు హెల్త్‌ డ్రింక్స్‌ పంపించమంటారా? రిలాక్స్‌ అవుదురు అని జవహర్‌బాబు అడిగాడు. చంద్రబాబు రెండు చేతులు జోడించి మీతో మళ్ళీ మాట్లాడుతానని పంపించేసాడు. అప్పుడే మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు వచ్చారు. వాళ్ళ ముఖాలు కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లాగా వెలిగి పోతున్నాయి. ఏంటి విషయం అని చంద్రబాబు అడిగాడు. దానికి నారాయణ... ప్రత్యేకహోదా ఉద్యమం విషయంలో మీరు పడుతున్న బాధ చూడలేకేమో, మన పవన్‌ కళ్యాణ్‌ గుంటూరులో మీటింగ్‌ పెట్టాడు. జగన్‌ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని డైవర్ట్‌ చేస్తాడు. జగన్‌ అవినీతి మీద విమర్శలు చేస్తాడు. దాంతో వైకాపా వాళ్ళు హోదా ఉద్యమాన్ని వదిలేసి పవన్‌ను తిట్టడానికి మళ్ళుకుంటారు. మీకు ఏ సమస్యా వుండదు అని చెప్పాడు. చంద్రబాబు వెంటనే డిజిపి ఆఫీసుకు ఫోన్‌ చేసాడు. పవన్‌ కళ్యాణ్‌ మీటింగ్‌కు వెంటనే పర్మిషన్‌ ఇవ్వాలని ఆదేశించాడు. తర్వాత మంత్రులు ముగ్గురితో... పవన్‌ సభకు ఏర్పాట్లు చూడండి... స్టేజీ గట్టిగా వుండాలి. పవన్‌ మంగళగిరిలో మాట్లాడితే వెంకటగిరిలో వినిపించేలా మైక్‌సెట్లు ఏర్పాటు చేయండి, అన్ని జిల్లాల నుండి కార్యకర్తలు రావడానికి బస్సులు, కార్లు ఏర్పాటు చేయండి, జనం తగ్గే పరిస్థితి వుంటే మన కార్యకర్తలను కూడా తరలించండి, జన సమీకరణకు అవసరమైతే ఎంతైనా ఖర్చు చేయండి, మందు, బిర్యాని సప్లయ్‌ చేయండి... ఈ మీటింగ్‌తో జగన్‌కు దిమ్మ తిరగాలి... మన 'చంద్రజ్యోతి', 'ఈరోజు' టీవీ 9-9=99, ఏసిడిటి, నంగి టీవీ, టీవీ 2.5లకు కూడా సమాచారమివ్వండి... అన్ని టీవీలలో పవన్‌ సభ ప్రత్యక్ష ప్రసారం కావాలి. పత్రికలలో పవన్‌దే బ్యానర్‌ ఐటమ్‌గా రావాలి. పవన్‌ మనోడే అంతా మంచిగా జరిగిపోవాలి అని చెప్పాడు. అలాగే చేస్తాం సార్‌ అంటూ నారాయణ, పత్తిపాటి,

ఉమలు అక్కడ నుండి లేచారు.

్య్య్య్య్య

మంగళగిరిలోని కాజా వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ. పవన్‌ వేదికెక్కాడు. అభిమానులు కేరింతలు కొట్టారు. టీవీలన్నీ ఆ సభను ప్రత్యక్షప్రసారం చేయసాగాయి. పవన్‌కళ్యాణ్‌ చొక్కా జేబులో నుండి ఓ పేపర్‌ తీసి అప్పుడప్పుడు చూసుకుంటూ ఆవేశంతో మాట్లాడసాగాడు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. 2019 ఎలక్షన్‌లలో జగన్‌ను ఓడించడానికి నియోజకవర్గానికి పాతిక కోట్లు లెక్కన ఖర్చు పెడతారట. ఇన్ని కోట్లు వీళ్ళకు ఎక్కడనుండి వచ్చాయి. ఇది అవినీతి సొమ్ము కాదా? లోకేష్‌ అవినీతి చంద్రబాబుకు కనపడడం లేదా?... అంటూ చంద్రబాబు మీద, ఆయన కొడుకు లోకేష్‌ మీద తీవ్ర విమర్శలు చేసాడు. చంద్రబాబు అనుకూల ఛానెల్స్‌ అన్నీ కూడా ఇది ఆయన కాన్సెప్ట్‌లో భాగమేననుకుని మక్కీకి మక్కీ లైవ్‌ ఇచ్చాయి. టీవీలలో పవన్‌ ప్రసంగం చూసి చంద్రబాబు షాక్‌ తిన్నాడు. ఈ పవన్‌కు ఏమైంది... ఎందుకిలా జరిగింది... ఎందుకు అతను అడ్డం తిరిగాడు... ఇదే ఆలోచనతో ఆందోళన చెందసాగాడు.

్య్య్య్య్య

సభ ముగించుకుని పవన్‌ తన ఇంటికి వచ్చాడు. అప్పుడే ఫోన్‌ రింగయ్యింది. ఆన్‌ చేసాడు. అవతల నుండి చంద్రబాబు... ఏం పవన్‌ నీకు ఏం తక్కువ చేసామని మా మీద విరుచుకుపడ్డావ్‌, నువ్వు అడిగినట్లే అన్నీ చేస్తున్నాం కదా, మరి మామీద ఎందుకు అన్ని విమర్శలు చేసావ్‌ అని నిష్టూరంగా అడిగాడు. దానికి పవన్‌... అదేంటి సార్‌, మీరు పంపించిన స్క్రిప్టే కదా నేను చదివింది అని అన్నాడు. ఆ మాటకు బాబుకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. నేను ఆ స్క్రిప్ట్‌ పంపడమేంటి.. జగన్‌ను తిడుతూ వ్రాసిన స్క్రిప్ట్‌ కదా నీకు పంపించింది అని చంద్రబాబు అన్నాడు. అప్పుడు పవన్‌ ఆలోచనలో పడ్డాడు. సినిమా స్టైల్‌లో రివర్స్‌ లోకి వెళ్ళాడు.

్య్య్య్య్య

ప్రత్యేకహోదాపై పవన్‌ ఏర్పాటు చేసిన జెఎఫ్‌సి సమావేశానికి

ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జయప్రకాశ్‌నారాయణ, చలసాని శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. మీటింగ్‌ అయ్యాక అందరూ హడావిడిగా లేచారు. ఆ లేవడంలో ఉండవల్లి, పవన్‌లు ఒకరికొకకరు గుద్దుకుని వారి చేతుల్లోని ఫైళ్ళు ఎదురెదురుగా కిందపడ్డాయి. అలా ఇద్దరూ వంగి తీసుకోవడంలో ఉండవల్లి ఫైల్‌ పవన్‌ చేతిలోకి, పవన్‌ ఫైల్‌

ఉండవల్లి చేతిలోకి వచ్చింది. చంద్రబాబును తిట్టడానికి ఉండవల్లి వ్రాసుకున్న స్క్రిప్ట్‌ అలా పవన్‌ చేతుల్లోకి వెళ్ళి గుంటూరు సభలో తూటాలా పేలింది.

్య్య్య్య్య

ఫ్లాష్‌బ్యాక్‌లో విషయం అర్ధం కావడంతో పవన్‌ నాలుక్కరుచుకుని... పొరపాటు జరిగింది చంద్రబాబు గారు, పొరపాటున ఉండవల్లి స్క్రిప్ట్‌ను చదివేసాను, ఈసారి అలా జరగనివ్వనులే అని అన్నాడు. ఇక జరిగేదే ముంది... జరగాల్సింది జరిగిపోయింది. ఉండవల్లి నీ పక్కన చేరినప్పుడే అనుకున్నాలే... ఇలాంటిదేదో వుంటుందంటూ చంద్రబాబు విసురుగా ఫోన్‌ కట్‌ చేసాడు.

Read 60 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter