విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చచ్చిపోయింది. తన గోతి తానే తవ్వుకుంది. తన నెత్తిన తానే మట్టి పోసు కుంది. ఇదీ చాలామంది అభిప్రాయం. కాని, లోతుగా పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోలేదు... తెలుగుదేశం రూపంలో బ్రతికొచ్చింది.
'యముడికి మొగుడు' సినిమాలో ఇక చనిపోతాడనుకున్న 'చిరంజీవి' పాత్రధారి శరీరంలోకి యమలోకంలో వున్న మరో చిరంజీవి ఆత్మను ప్రవేశపెడతారు. 2014 ఎన్నికల సమయంలోనూ రాష్ట్రంలో ఇదే జరిగింది. అప్పటికే ఈ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ చిక్కి శల్యమైపోయింది. అంతకుముందు ఐదేళ్లలో వై.యస్. ప్రజా పాలన దెబ్బకు శిథిలమైపోయింది. చాలా చోట్ల అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. అటువంటి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ పాలిట సోనియాగాంధీ ఇటలీ దేవత అయ్యింది. ఆంధ్రుల పాలిట దెయ్య మైంది. రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశంకు ప్రాణ ప్రతిష్ట చేసింది. ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, రాజకీయాలలో మనుగడ లేదు అనుకున్న చంద్రబాబుకు రాజకీయ పునర్జన్మనిచ్చింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్‌డెడ్‌కు గురై, కోమాలో వున్న తెలుగుదేశంకు తన గుండె, కిడ్నీలు, కాలేయం, కళ్ళు దానం చేసింది. దాంతో కాంగ్రెస్ ఆత్మ, అవయవాలు అన్నీ కూడా తెలుగుదేశంలో అంతర్భాగమై, ఆ పార్టీ కోమా నుండి కోలుకుంది. ఒకరకంగా చెప్పాలంటే సోనియాగాంధీ తన బిడ్డలైన కాంగ్రెస్వాళ్ళను చంపుకుని, పరాయి బిడ్డ లైన చంద్రబాబు, కేసీఆర్‌లను ముఖ్య మంత్రులను చేసిందనే చెప్పవచ్చు. ఇందులో ఆమెకు ప్రత్యక్ష పాత్ర లేకపో యినా, రాష్ట్ర విభజన ద్వారా ఆమె తీసు కున్న నియంతృత్వపు విధానాలే దీనికి కారణమయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పుడున్నది ఎన్టీఆర్ ఆశయాలకనుగుణంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక లాంటి పార్టీ కాదు. తెలుగుకాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ ఆత్మతో, కాంగ్రెస్ అవయవాలతో మనుగడ సాగి స్తున్న పార్టీ. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ నాయకులే దిక్కయ్యారు. ఆ పార్టీ గెలుపుకు దోహదం చేసింది కాంగ్రెస్ నాయకులే! చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రివర్గంలోను, నామినేటెడ్ పదవు ల్లోనూ వారిదే హవా! సోనియాగాంధీకి రెండుసార్లు కేంద్రంలో తమను గద్దెనెక్కిం చడానికి ఏపి నుండి మెజార్టీ లోక్‌సభ సీట్లు అందించిన వై.యస్. కుటుంబం కంటే కూడా చంద్రబాబే ఎక్కువయ్యాడు. చంద్రబాబుతో కలిసే జగన్‌ను కేసుల్లో ఇరికించి ఇబ్బందులపాల్జేసారు.
ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. చంద్ర బాబు మాత్రం అవసరమైతే అధికారం కోసం కాంగ్రెస్‌తో కూడా పొత్తుపెట్టుకు నేటట్లున్నాడు. ఎందుకంటే ఆయన బ్లడ్‌లో కాంగ్రెస్ వుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితం స్వచ్ఛమైన తెలుగుదేశం నేతగా మొదలైంది. చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే మొదలైంది. కాబట్టి ఆ లక్షణాలు ఎక్కడికీ పోవు. ఎన్టీఆర్ ఫీల్డ్‌లో వున్నంతవరకు, వెన్నుపోటుకు గురి కానంతవరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకతాటి పైకి తెచ్చాడు. కాని, చంద్రబాబు చేతిలోకి రాగానే 1996లో ఆయన చేసిన మొదటి పని కాంగ్రెస్ మద్దతు తీసుకుని కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం. 2009 ఎన్నికల దాకా రాష్ట్రంలో కాంగ్రెస్సే ప్రధానపార్టీ కాబట్టి ఆయన ఆ పార్టీతో ఫైట్ చేస్తూ వచ్చాడు. 2014 ఎన్నికల నుండి సీన్ మారింది. రాష్ట్రంలో వైసిపి ప్రధాన ప్రత్యర్థి అయ్యింది. ఇప్పుడాయన కాంగ్రెస్‌తో స్నేహం చేసినా ఇబ్బంది లేదు. తెలంగాణలో ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏతో డైవోర్స్ అయ్యింది. ఇక కలవక పోవచ్చు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు చంద్రబాబు మీద పగబట్టి వున్నారు కాబట్టి వాళ్ళు చేసేది చేయకమానరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఇంకో 5ఏళ్ళు కేసుల భయం లేకుండా గడపొచ్చు. ఆ దిశగానే చంద్రబాబు స్నేహ గీతం మారుస్తున్నట్లుగా సమాచారం.