చంద్రబాబునాయుడు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక జరిగిన అన్ని ఎన్నికలలోనూ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానాన్ని మహిళలకు ఇస్తూ వచ్చాడు. 1999లో వెంకట గిరిని సినీ నటి శారదకు, 2004లో గూడూరును ఉక్కాల రాజేశ్వ రమ్మకు, 2014 ఎన్నికల్లో గూడూరు సీటును డాక్టర్ బి.జ్యోత్స్న లతకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆ కాన్సెప్ట్‌ను అమలు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒక సీటును మహిళలకు గాని లేదంటే మైనార్టీలకు గాని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన గూడూరు సీటును ఈసారి వైకాపా నుండి జంప్ చేయించిన సిటింగ్ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కే ఇవ్వొచ్చు. కాబట్టి అక్కడ ఆశ లేదు. వున్న అవకాశమల్లా నెల్లూరుసిటీ లేదంటే సూళ్ళూరుపేట! ఈ రెండు సీట్లలోనే ప్రయో గాలు చేయగలరు! మహిళలకు నెల్లూరుసిటీ లేదా సూళ్లూరుపేట లలో దేనినైనా ఇవ్వొచ్చు. సూళ్ళూరుపేట అయితే ఎస్సీ మహిళను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పరసా రత్నం మీద వ్యతిరేకత బలంగా వుంది. స్థానికంగా వున్న టీడీపీ నాయకులు ఈసారి అభ్యర్థిని మార్చాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా అభ్యర్థి పోటీకి అవకాశముంది. ఇక రెండోది నెల్లూరు నగరం. ఇక్కడ జనరల్ మహిళ లేదంటే మైనార్టీలకు సీటివ్వడానికి అవకాశముంది. మహిళలకే సీటివ్వాలనుకుంటే మాజీమున్సిపల్ ఛైర్పర్సన్ టి.అనూరాధతో పాటు పార్టీలో ఇటీవల కీలకంగా మారిన వసంత లక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ శ్రీమతి వసంతలక్ష్మి లాంటి వాళ్ళున్నారు. నెల్లూరు నగరంలో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి ఆ వర్గానికి చెందిన వారికి కూడా అవకాశముంది. మేయర్ అబ్దుల్ అజీజ్ ఈ ప్రయత్నాల్లోనే వున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వున్న 10సీట్లలో టీడీపీ నుండి ఒక సీటు మైనార్టీలకు గాని మహిళలకు గాని గ్యారంటీ అని చెప్పొచ్చు.
Published in
సింహపురి సమాచారం
Tagged under
