రాజకీయ ప్రయాణంలో ఆయన తొలి అడుగు పడింది. ఆ అడుగు ఇంకెన్ని వేల అడుగులు వేస్తుందో... ఇంకెన్ని వేల కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందో... ఆ అడుగు ఎన్ని రాజకీయ మార్పు లకు శ్రీకారం చుడుతుందో...
నెల్లూరీయుడు, వదాన్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 5వ తేదీ
ఉదయం ప్రమాణస్వీకారం చేసారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మెన్ మరియు నెల్లూరీ యులైన యం.వెంకయ్యనాయుడు సాటి నెల్లూరీయుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఆ క్షణం నుండి ప్రజాప్రతినిధిగా ఆయన ప్రయాణం మొదలైంది. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన సాటి తెలుగోడు, నెల్లూరీయుడు విపిఆర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య అచ్చతెలుగులో శుభాకాంక్షలు తెలపడం విశేషం. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారంతో రాజ్యసభలో వైకాపా సభ్యుల సంఖ్య రెండుకు చేరింది. వైకాపా తరపున ఢిల్లీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయసాయిరెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తోడయ్యాడు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.... నెల్లూరీయులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆంధ్రా ప్రజలకు బాగా పరిచయం ఉన్న పేరు. రేపటి నుండి దేశ వ్యాప్తంగా కూడా పరిచయం కానున్న పేరు.
ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కంటే సేవాతత్పరుడిగా ఆయన ప్రజలకు సుపరిచితుడు. రాజకీయాల లోకి రాకముందు నుండే సేవారంగంలో వున్నాడు. సామాజిక, ఆథ్యాత్మిక రంగాలలో ఎన్నో సేవలందించారు. ఎన్నో మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తూ గొప్ప మానవతావాదిగా ముద్రపడ్డారు. రెండు దశాబ్దాల క్రితం నెల్లూరుజిల్లాలో మాగుంట కుటుంబానికి గొప్ప పేరుండేది. వాళ్ళ సాయం పొందని కుటుంబం వుండేది కాదు. ఈ దశాబ్దంలో అంతటి గొప్పపేరు తెచ్చుకున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. పల్లెల గొంతు తడపడానికి మంచినీళ్ళిచ్చినా... పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించినా, భారీ ఎత్తున ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్నో అనాధ, వృద్ధాశ్రమాలకు చేయూతనిచ్చినా... అవన్నీ కూడా ఆయనలోని మానవత్వానికి నిదర్శనాలే! ఒక వ్యక్తిగా ఇంతకాలం ఆయన ప్రజలకు ఎంతో సేవచేసాడు. ఒక మంచి వ్యక్తికి ఈరోజు అధికారం అనే శక్తి తోడైంది. ప్రజలకు ఇంకా మంచే జరుగుతుంది. మంచితనం మూర్తీభవించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టిన శుభసందర్భంగా 'లాయర్' అభినందనలు.