ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది?..ఈ దౌర్భాగ్యానికి కారకులెవరు?..నెల్లూరు నగరాన్ని ఊపిరితిత్తుల జబ్బు పీడిస్తున్నా, దుమ్మురోడ్లతో జనం నిత్యం వ్యాధుల బారిన పడి ఛస్తున్నా అటు కార్పొరేషన్వారికిగానీ, ప్రజారోగ్య అధికారులకు గానీ, సంబంధిత కాంట్రాక్టర్లు..వారి సిబ్బందికి గానీ, వీటినన్నిటినీ ఏసీగదుల్లో కూర్చొని పర్యవేక్షిస్తున్న మంత్రులకు గానీ, నాయకులకు గానీ కనీసం దోమకుట్టినట్లు కూడా లేపోవడం నెల్లూరు ప్రజల దౌర్భాగ్యమనే అందామా?...నెల్లూరు జనం ఎప్పుడు చేసుకున్న పాప ఖర్మో అని సరిపెట్టుకుందామా?..
దుమ్ము... ధూళి అనేవి ప్రకృతిసిద్ధంగా వస్తుం టాయి. అవి ఎప్పుడో గాలి వీస్తేనో లేదా, పెనుగాలి రేగితోనో దుమ్ము పెద్దఎత్తున పైకిలేస్తుంది. కానీ, అది కొద్దిసేపే. ఇంతలో ఏ చిన్న వానజల్లు కురిస్తే చాలు.. ఆ దుమ్మంతా మాయమైపోతుంటుంది. అయితే, నెల్లూర్లో అలా కాదు. ఇక్కడ దుమ్ము ప్రత్యే కించి తయారయ్యింది. భూగర్భడ్రైనేజీ కోసం రోడ్లన్నీ తవ్వి, అక్కడక్కడా గుంతలు వదిలేయడం, రోడ్లపై క్వారీ డస్ట్ను పోసి దుమ్ముధూళితో నగరవాసులు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నా రోజుల తరబడి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము ప్రతిరోజూ ప్రజలకి నరకాన్ని చూపిస్తోంది. నోళ్ళకి, ముక్కులకి గుడ్డలు చుట్టుకున్నా లాభం లేదు. ఎంతసేపని అలా ఉండగలం?.. ఒక్క నిమిషం ఏమారితే చాలు, ఆ దుమ్మంతా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుంది. దీంతో ఇక ఊపిరి తీయలేక జనం పడే అవస్తలు వర్ణనా తీతం. అయినా, అధికారులు కానీ, సంబంధిత కాంట్రాక్టర్లు కానీ ఇవేమీ పట్టించుకోరు. ఎంత దుమ్ము.. ఎంత కాలుష్యం నగరాన్ని చుట్టుముట్టేసి జనాన్ని ఆసుపత్రులు పాలుచేస్తున్నా ఎవరికీ ఏమీ పట్టదు. అమాయకపు జనం ఉంటేనేం.. పోతేనేం అన్నట్లుంటారు మన నాయకులు. ఎన్నిసార్లు ఈ బాధలు పేజీలకు పేజీలు రాసినా ఎవరికీ దోమ కుట్టినట్లు కూడా ఉండదు. అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు అంతా ఏసీ కార్లలో తలుపులు మూసుకుని హాయిగా, చల్లగా తిరుగుతుంటారు కనుక బయట జనం పడే అవస్తలు వారికి నల్ల అద్దాల్లోంచి కన పడవు. ఈ దుమ్ము, ధూళి ప్రజల ఆరోగ్యాలనెంత కలుషితం చేస్తోందో, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, గృహిణులు ఎంతమంది ఆ దుమ్ము వల్ల శ్వాసకోశ వ్యాధులకు గురై నెత్తీనోరు బాదుకుంటూ ఆసుపత్రుల్లో పడి అల్లాడుతున్నారో వారికి తెలియదు. తెలిసినా తెలియనట్లుండడమే వారి నైజం. మంచిరోడ్లు వేస్తారని జనం ఎంతో ఆశపడి సహకరిస్తున్నా, రోజులు గడిచిపోతూనే ఉన్నా, జనాన్ని దుమ్ములో వేయిస్తున్నారే తప్ప, ఈ దుమ్మురోడ్లను బాగుచేయక పోవడం ఏమిటని నగరప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రోజంతా ఆ దుమ్మే పీలుస్తుండడంతో ఊపిరితిత్తులు ఊపిరి పీల్చలేక డస్సిపోతున్నాయని వృద్ధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధలతో ఎంతోమంది ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారు. కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు, నాయకులు కానీ పట్టించు కోవడం లేదు. రోడ్లమీద క్వారీడస్ట్ను తాత్కాలికంగా వేసి, ఆ తర్వాత మంచిరోడ్లు వేస్తారేమోనని జనం ఉగ్గబట్టి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదు. సరికదా, దుమ్ము రోడ్లపై దుమ్ము లేవకుండా నిర్ణీతసమయాల్లో నీరు చల్లడం వంటి కనీస కంటితుడుపు చర్యలు కూడా నామమాత్రంగానే చేపడుతున్నారు. దీంతో, ఆ రోడ్ల పక్కనే ఉన్న ఇళ్ళు, షాపుల్లో దుమ్ము పేరుకుపోతోంది. వంటినిండా దుమ్ము..ఇంటినిండా దుమ్మే అన్నట్లుగా ఈ దుమ్ముతో రోజూ చస్తున్నా కార్పొరేషన్ వాళ్ళు కార్లల్లో ఇదే దారిన వెళ్తూ చోద్యం చూస్తున్నారే తప్ప సత్వర చర్యలు తీసుకునేందుకు చొరవ చూపడం లేదని జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకవేళ ఈ బాధలు తాత్కాలికమే అనుకున్నా, ఎన్నిరోజులు ఇలా గడపాలో తెలియడం లేదని, ఈలోగా ఊపిరితిత్తులు కాస్తా పాడైపోతే పరిస్థితి ఏమిటని జనం ఆవేదన.
నగరంలోని ప్రధానరోడ్లలో ఒకటైన మాగుంట లే-అవుట్ రోడ్డు, మినీబైపాస్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, ఏసినగర్, బాలాజీనగర్, దర్గామిట్ట ఇలా కనీసం ప్రధాన రోడ్లనైనా అధికారులు ఒక బృందంగా ఏర్పడి వెంటనే పరిశీలించి, ఎక్కడ వాటిని బాగు చేయాలో తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఈ దుస్థితి మారదని ప్రజలు సూచిస్తున్నారు. దుమ్మురోడ్లను వెంటనే బాగుచేసి, త్వరగా మంచిరోడ్లు వేయాలని, కార్పొరేషన్ అధికారులకు, సంబంధిత నాయకులకు ఇకనైనా అలాంటి మంచిబుద్ధి కలిగించాలని నగర ప్రజలు నిత్యం వేయిదేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.