మున్సిపల్ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు.
ఈ నాలుగేళ్ళలో మంత్రి నారాయణపై అనిల్ అవినీతి ఆరోపణలు చేసినంతగా ఇంకెవరూ చేసివుండరు. గతంలో పలు అంశాలలో మంత్రి నారాయణను ఏకిన అనిల్, తాజాగా వెంకటేశ్వరపురం యాష్‌పాండ్‌లో నిర్మిస్తున్న 'హౌస్ ఫర్ ఆల్' గృహ సముదాయాలపై పడ్డాడు. షేర్వాల్ టెక్నాలజీతో పేదల కోసం ఎంతో అందమైన ఇళ్ళు నిర్మిస్తున్నామని ఇంతకాలం నారాయణ గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఇళ్లతో నగరంలో తన పాపులారిటీ పెరుగుతుందని నారాయణ భావించారు.
అయితే అనిల్ మాత్రం ఈ ఇళ్ళ నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని చాలాకాలం నుండే విమర్శలు చేస్తున్నాడు. ఇక్కడ చదరపు అడుగు నిర్మాణానికి 1900 రూపాయలు అంటున్నారు. ఈమేరకు ప్రజల నుండి దండుకోవాలనుకుంటున్నారు. మాగుంట లే అవుట్, ఆదిత్యనగర్ లాంటి ఏరియాలోనే చదరపు అడుగు 2వేల రూపాయలలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్ముతున్నారు. 'హౌస్ ఫర్ ఆల్' ఇళ్ళకు స్థలం ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంట్ ఫ్రీ... ఇన్ని ఫ్రీ పెట్టుకుని చదరపు అడుగు 1900 రూపాయలేంటని, బయట ఏ బిల్డర్ అపార్ట్మెంట్ కట్టినా చదరపు అడుగు 1300 రూపాయలలో పూర్తి చేస్తారని, ఒక్కో ఇంటికి అడుగుకు 600 రూపాయలు మిగులుతాయని, ఇళ్ళ నిర్మాణం బాధ్యతను తనకు అప్పగించినా 1300 రూపాయలతో పూర్తి చేస్తానని అనిల్ వాదిస్తున్నాడు. తెలంగాణలో చదరపు అడుగు 1300 రూపాయలకే ఇస్తున్నారని, ఇక్కడ 1900 రూపాయలకు ఇస్తున్నారంటే ఎన్ని వందల కోట్ల దోపిడీ జరుగుతుందో అర్ధం చేసుకోవాలంటున్నాడు. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్, వామపక్షాల నాయకులను సైతం కలుపుకుని హౌస్ ఫర్ ఆల్ ఇళ్ళ నిర్మాణంలో అవినీతిపై ధ్వజమెత్తుతూ మంత్రి నారాయణపై దాడి చేస్తున్నాడు.