Friday, 06 April 2018 15:31

అమరావతిని చూసి ఆశ్చర్యపోయిన శ్రీరాముడు

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది వైయస్సార్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ కళ్యాణోత్సవం కావడంతో ముఖ్యమంత్రి, హైటెక్‌రత్న, పాతిక ప్రపంచ మేటి నగరాలను ప్రపంచానికి ఒకే నగరంలో చూపించడానికి కృషి చేస్తున్న అమరావతి రాజధాని రూపశిల్పి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు పట్టుకుని కుటుంబసభ్యులతో కలిసి దేవాలయంలోకి అడుగుపెట్టాడు. అంతే... ఆ క్షణంలోనే ఆకాశంలో పెద్ద ఉరుములు, కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు... క్షణాల్లో ఈదురుగాలులు, పెద్ద పెద్ద వడగండ్లు... పది నిముషాలలో పెనువిధ్వంసం... పందిళ్ళు కూలిపోయాయి. స్థంభాలు పడిపోయాయి. అక్కడ వాతావరణం చెల్లాచెదురైంది. అప్పుడే సిబిఎన్‌ ఛానెల్‌ వాళ్లొచ్చారు. అక్కడ జరిగిన సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ... రిపోర్టర్‌ గ్యాస్‌ గన్నారావు స్టూడియోలో వున్న పుకార్ల పాపారావుతో... సార్‌ ఈరోజు రాష్ట్రానికెంతో శుభదినం... ఇదో అద్భుత మహిమాన్వితం... చరిత్రలో ఓ అపురూప ఘట్టం... మన ప్రియతమ ముఖ్యమంత్రి దేవాలయంలోకి అలా అడుగుపెట్టాడో లేదో ప్రకృతి పరవశించిపోయింది. వరుణుడు పులకించి వర్షపు ధారలను కాకుండా ఏకంగా వడగండ్లనే కురిపించాడు. అగ్ని దేవుడు ఉరుములు, మెరుపుల రూపంలో తన ఆశీస్సులందజేశాడు. వాయు దేవుడు ఈదురుగాలుల రూపంలో తన హర్షం ప్రకటించాడు. ఇలా రాములోరి కళ్యాణానికి చంద్రబాబు అడుగుపెట్టగానే సకల దేవతలు ప్రత్యక్షమై ఆనందాన్ని ప్రకటించారు పాపారావు... అని చెప్పాడు. ఈ అద్భుత సంఘటనపై శ్రీరాముడు, సీతాదేవిల స్పందన ఏంటో కనుక్కోలేకపోయారా గున్నారావుగారు అని స్టూడియో నుండి పాపారావు అడిగాడు. దానికి గున్నారావు... సీతారాములు షాక్‌లో వున్నారు. చంద్రబాబు పాదానికి ఇంత మహత్యం వుందా అని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు... 'ఈ పాదం దివ్యపాదం ఈ పాదం మహిమపాదం' అని పాట పాడి.. ఇట్లు కెమెరాఉమెన్‌ మంగతో గ్యాస్‌ గన్నారావ్‌ అని చెప్పి ముగించాడు. కళ్యాణోత్సవం ముగిసాక చంద్రబాబు అమరావతికి వెళ్ళిపోయాడు. ఉండవల్లిలోని తన నివాసంలో కూర్చుని టీవీ ఆన్‌చేసి తనకిష్టమైన 'ఆత్మసాక్షి' ఛానెల్‌ పెట్టాడు. స్క్రీన్‌పై రోజా కనిపించింది. చంద్ర బాబు గుండె కలుక్కుమంది. రోజా మాట్లాడుతూ... మీరే చెప్పండి ఐరన్‌లెగ్‌ ఎవరిదో... చంద్రబాబు ఒంటిమిట్టలో అడుగుపెట్టగానే పెనువిధ్వంసం జరిగింది. ఐదుమంది చనిపోయారు. 60మంది గాయపడ్డారు. ఈయన గోదావరి పుష్కరాలలో అడుగుపెట్టినప్పుడు పాతిక మంది చనిపోయారు. ఆయన చేత కళ్యాణం చేయించు కోవడం ఆ రాముడికీ ఇష్టం లేదు. ఒరిజినల్‌ ఐరన్‌లెగ్‌ ఆయనదే అంటూ దుమ్మెత్తి పోయసాగింది. అది చూసి చంద్రబాబుకు బాధేసింది. వెంటనే పూజామందిరం వద్దకు వెళ్ళి... ''రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, దేవుడంటే నువ్వేలే రామయ్య తండ్రి'' అంటూ పాటందుకున్నాడు. పాట ప్రారంభలో ఉండగానే రాముడు, సీతా లక్ష్మణ హనుమత్సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. వారిని చూసి చంద్రబాబు... నా పాట పూర్తికాకుండానే భలే ప్రత్యక్షమయ్యారే స్వామి అని అడిగాడు. పాట పూర్తిగా వినే శక్తి మాకు లేదు నాయనా... పాట పూర్తిగా వింటే మా హనుమంతుడు కుప్పిగంతు లేస్తాడని చెప్పి ముందుగానే ప్రత్యక్షమయ్యాను. ఇంతకూ అంత మధురంగా పాటెందుకు పాడావు నాయనా అని రాముడు అడిగాడు. ఈరోజు ఒంటిమిట్టలో అలా ఎందుకు జరిగింది స్వామీ... నేనేం తప్పు చేసాను అని చంద్రబాబు ప్రశ్నించాడు. అందుకు రాముడు... ఈ ప్రశ్నకు నేను తర్వాత సమాధానం చెబుతాను. ముందు నాకు అమరావతి రాజధాని చూపించు... చాలా అద్భుతంగా కట్టారట కదా... ఈ విశ్వంలోనే అటువంటి నగరం లేదని మా దేవలోకంలో టాక్‌... ఇంద్రుడు కూడా తన అమరావతి నగరం మొత్తాన్ని పగలగొట్టి మీ అమరావతిలాగానే కట్టుకోవాలనుకుంటున్నాడట... అని అడిగాడు. దానికి చంద్రబాబు అలాగే అని చెప్పి వారిని తన కారెక్కించుకుని బయలుదేరాడు. ఒక చోట ఆపాడు. అందరూ క్రిందకు దిగారు. అక్కడ దాదాపు వందమంది దాకా వున్నారు. వారందరి కళ్ళకు నల్ల కళ్లద్దాలున్నాయి. మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావులు అక్కడ నిలబడి వారందరికీ... ఇదే అద్భుత అమరావతి రాజధాని... అదిగో సైబర్‌ టవర్స్‌... ఆకాశాన్ని తాకుతున్నాయి చూడండి... అది ఫైబర్‌ టవర్స్‌... ఆ రెండు వందల అంతస్తుల భవనం చూసారా? అదే ట్రేడింగ్‌ సెంటర్‌. ప్రపంచంలోనే ఇంత ఎత్తైన భవనం లేదు. మనం ఎదురుగా చూస్తున్నది ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే... అది 16లైన్ల రోడ్డు. అదిగో ఆ పట్టిసీమ నదిలో స్టీమర్లు చూసారా... అవి వివిధ దేశాల నుండి నేరుగా ఇక్కడికే వస్తాయి. అమరావతిని చూడడానికి విదేశీ పర్యాటకులు రావడానికి అనువుగా నేరుగా అమరావతికే జల మార్గాన్ని నిర్మించాము. ఆ దూరాన కనిపించేది ఫిలిం సిటీ. దీనిముందు హాలీవుడ్‌ స్టూడియో కూడా పనికి రాదు. అక్కడ విమానాలు వరుసపెట్టి దిగుతున్నాయి చూసారా అదే ఎయిర్‌పోర్టు. అదిగో బుల్లెట్‌లా దూసుకుపోతుంది చూసారా అదే బుల్లెట్‌ ట్రైన్‌... అని పర్యాటకులకు మంత్రులు దగ్గరుండి చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్నవేవీ అక్కడ శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హను మంతుడులకు కనిపించలేదు. శ్రీరాముడు అదే డౌట్‌ను చంద్రబాబు ముందు వ్యక్తం చేశాడు. అద్భుత రాజధాని అంటున్నారు... అది ఇది అంటున్నారు. మాకు ఇక్కడ బీడు పడ్డ నేల తప్పితే ఇంకేమీ కనిపించడం లేదని అన్నాడు. అందుకు చంద్రబాబు... అమరావతి రాజధానిని కళ్ళతో చూడకూడదు. కలల్లో చూడాలి, మనసుతో చూడాలి. కళ్ళు మూసుకుని మనసులో 'ఓం అమరావతాయనమః' అనుకోండి... ఈ రాజధాని మీకు అద్భుతంగా కనిపిస్తుందని చెప్పాడు. శ్రీరాముడు, మిగతా ముగ్గురు అలాగే కళ్ళు మూసుకుని మంత్రం చదివారు. ఈలోపు మంత్రి పి.నారాయణ తెచ్చిన స్పెషల్‌ నల్లకళ్ళజోళ్ళను ఆ నలుగురి కళ్ళకు పెట్టారు. వాళ్ళు కళ్ళు తెరిచారు. అంతే వారి కళ్ళకు అద్భుత భవనాలు, విశాలమైన రహదారులు, అందమైన బృందావనాలు, ఎయిర్‌ పోర్టులు, ఐటి పార్కులు... వాటిని చూస్తూ శ్రీరాముడు అద్భుతం, అపూర్వం... ఇది ఎలా సాధ్యమైంది అని అన్నాడు. చంద్రబాబు వెంటనే శ్రీరాముడి కళ్ళకున్న అద్దాలను తీసి ఇలా... అని అన్నాడు. అంతే రాముడి కళ్ళకు మళ్ళీ బీడుబారిన నేలే కనిపించసాగింది. ఏంటి చంద్రబాబు ఇదంతా అని రాముడు అడిగాడు. నేను ఊహించిన రాజధాని కట్టాలంటే ఎన్ని యుగాలు పడుతుందో తెలియదు. అందుకే ఈ త్రీడీ ఎఫెక్ట్‌ గ్లాస్‌ను ప్రత్యేకంగా చేయించాను. నా ఊహల అమరావతి అంతా కూడా ఈ గ్లాస్‌లలో పెట్టించాను. ఇది పెట్టుకుని చూస్తే అమరావతి చాలా అందంగా కనిపిస్తుంది. మా మీడియా వాళ్ళకు కూడా ఇవే గ్లాసులు పెట్టి అమరావతిని చూపించాను. వాళ్ళు అదే లోకంలో వున్నారు. ఇప్పుడు చెప్పండి... నా అమరావతి ఎలా ఉంది? అని చంద్రబాబు అడిగాడు. అప్పుడు రాముడు... ఇంతకుముందు నువ్వు అడిగావు కదా ఒంటిమిట్టలో అంత భీభత్సం ఎందుకు జరిగిందని... ఇలాంటి పనులు చేస్తుంటే అలాంటి ఉపద్రవాలే వస్తాయి నాయనా అని చెప్పి నా టైం వేస్ట్‌ చేసావంటూ తన టీమ్‌తో సహా మాయమయ్యాడు.

Read 29 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter