గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేసినా నిప్పో భూ వినియోగమార్పిడి అంశాన్ని ఆమోదించారు.
నెల్లూరులో 'నిప్పో' బ్యాటరీల ఫ్యాక్టరీ ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. జపాన్ కంపెనీ భాగస్వామ్యంతో పొట్టిపాటి ఓబుళరెడ్డి నెల్లూరులో బ్యాటరీ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించాలనుకున్నారు. ఈ ప్రకారమే ప్రభుత్వానికి భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1972లో 11.74ఎకరాలు, 1977లో 1.28ఎకరాలు మొత్తం 13.02ఎకరాలను మార్కెట్ ధర ప్రకారం కొని రిజిష్టర్ చేసుకున్నారు. ఆరోజు పారిశ్రామిక అవసరాల నిమిత్తమే ప్రభుత్వం నుండి భూమిని కొనుగోలు చేసి రిజిష్టర్ చేసుకున్నారు. ఇండోనేషనల్ లిమిటెడ్ పేరుతో పరిశ్రమను స్థాపించి దాదాపు నాలుగు దశాబ్దాల పాటూ దానిని నడిపారు. నెల్లూరుజిల్లాకు చెందిన వేలాదిమందికి ఉపాధి కల్పించడమేకాక, ఎన్నో కోట్లు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించారు. ప్రత్యక్షంగానే కాదు 'నిప్పో' బ్యాటరీల ద్వారా పరోక్షంగా మార్కెట్ లోనూ ఎంతోమందికి ఉపాధి లభించింది.
ఈ నలభైఏళ్ళలో నగరం విస్తరించింది. 'నిప్పో' చుట్టూ నివాసాలొచ్చేసాయి. పరిశ్రమలో ఉత్పత్తులు చేస్తుంటే వెలువడు తున్న కాలుష్యం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి. ఈ దశలో తాము మార్కెట్ ధరకు కొని, తమ ఆధీనంలో వున్న నిప్పో పరిశ్రమకు సంబంధించిన 13.02ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ జోన్ నుండి కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లోకి మార్చాలని కోరుతూ నిప్పో యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం దీనిని పరిశీలించి ఆమోదం పంపమని నెల్లూరు కార్పొరేషన్‌ను కోరింది. గతంలో కౌన్సిల్లో రెండుసార్లు ఈ అంశాన్ని అజెండా పెట్టినప్పుడు రాజకీయ రాద్ధాంతం జరిగింది. 'నిప్పో' స్థలం ప్రభుత్వానిదని, అక్కడ పరిశ్రమ నడపకుంటే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, పేదలకు ఇళ్ళు, గుళ్ళు, మసీదులు, చర్చిలు కట్టించాలంటూ ఆయా పార్టీల నాయ కులు, సంఘాలు డిమాండ్ చేసాయి.
పరిశ్రమను పెడతానని నిప్పో ఓబుళరెడ్డి ప్రభుత్వం నుండి ఫ్రీగా భూమిని తీసుకుని వుంటే ఈరోజు వీళ్ళు చేసే డిమాండ్‌కు అర్ధం పర్ధం వుండేది. ఆయన ఆరోజు ఆ చుట్టుపక్కల పొలాలు ఎంత రేటున్నాయో ఈ పొలాన్ని కూడా అంతకంటే ఎక్కువ రేటు పెట్టే కొన్నాడు. ఆయన ప్రభుత్వ భూమిని కాకుండా అంతే డబ్బుతో ప్రైవేట్ భూమినే కొని వున్నా ఈరోజు వాటి విలువ కూడా వందలకోట్లకు చేరివుండేది. కాబట్టి 'నిప్పో' భూములపై వారి యాజమాన్యాన్ని ప్రశ్నించలేం. ఇక ఆ ప్రాంతమంతా నివాసాలు ఏర్పడ్డాయి కాబట్టి దానిని రెసిడెన్షియల్ జోన్‌గా మార్చడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇక తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలో వుంది.