13 April 2018 Written by 

ఆంధ్రాలో అస్తవ్యస్త పాలన

apస్వర్ణాంధ్రపాలన దిగ్విజయంగా సాగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకుంటున్నా, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తున్నానని పదేపదే ప్రకటించుకుంటున్నా..అవన్నీ కేవలం ఊకదంపుడు ప్రచారార్భాటాలే తప్ప వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని తేలిపోయింది. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, నిధులు నీరుగారిపోతున్నాయని, పెద్దపెద్ద ప్రాజెక్టులకు సైతం నీళ్ళొదిలేసుకోవాల్సి వస్తోందని, నష్టాలు భారీగా ఉంటున్నాయని.. అప్పులు కుప్పలు తెప్పలుగా పెరుగు తున్నాయని, ఆర్థికవ్యవస్థ అడుగంటిపోతోందని వీటన్నిటికీ ప్రధాన కారణం రాష్ట్రంలో ఆర్ధిక నియంత్రణ సజావుగా లేకపోవడమేనని 'కాగ్‌' నివేదికలు కుండబద్దలు కొట్టాయి. ఒకవైపు అవినీతి అక్రమాలు, మరోవైపు నిర్లక్ష్యం, పొంతనలేని సర్వేలు, నిబంధనలు పాటించని వైనాలు.. అన్నీ కలసి ఆంధ్రప్రదేశ్‌లో పాలన అస్తుబిస్తుగా మారిందని విమర్శలకు గురవుతుండడంతో ప్రభుత్వం, పాలకులు ఆత్మరక్షణ దిశలో పడిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన 'కాగ్‌'(భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) అన్ని వివరాలు సమగ్రంగా పరిశీలించి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే నిష్పాక్షికంగా నివేదిలు అందజేస్తుందన్న విషయం అందరికీ తెలి సిందే. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇచ్చిన నివేదికల్లోని పలు అంశాలు ప్రభుత్వ అస్తవ్యస్త పాలనా తీరును ఏకిపారేయడంతో రాష్ట్ర పాలకులు ఆందో ళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణ తీరు నుంచి ప్రభుత్వరంగ సంస్థల్లో నష్టాల వరకు, 'కాగ్‌' నివేదిక అనేక వాస్తవాలను బయట పెట్టింది. జాతీయ గ్రామీణ తాగునీటి పథకంలో ఏకంగా 491.83 కోట్ల నిధులు నిష్ఫలమయ్యాయని, రాష్ట్రంలో 271 చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో ఏకంగా 28వేల కోట్లకు పైగా అంచనాలు పెంచేశారని, సకాలంలో ప్రాజెక్టులు పూర్తికాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. 64 ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని, అవి 25,367 కోట్ల రూపాయల మేరకు నష్టాల్లో పడిపోయాయని, ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని 'కాగ్‌' తప్పుపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నియంత్రణ సరిగా లేదని, వ్యయ నియంత్రణ - పర్యవేక్షణ రెండూ బలహీనంగానే ఉన్నాయని కాగ్‌ స్పష్టం చేసింది. కేటాయింపులకు మించి ఖర్చులు చేయడం, కొన్ని సందర్భాల్లో కేటాయించిన నిధులను ఖర్చుచేయకపోవడం వల్ల నిధులు భారీగా మిగిలిపోవడం జరిగాయని, గ్రాంట్‌లకు మించి అదనంగా ఖర్చుచేయడం కూడా నిబంధనలను అతిక్ర మించినట్లేనని, మొత్తం 35 పద్దుల కింద 21,967 కోట్లు నిధులు మిగిలిపోయాయని, అదే సమయంలో 5 పద్దుల కింద 1686.83 కోట్లు అధిక ఖర్చు చేశారని, ఈ పరిస్థితుల వల్ల ప్రధమ ప్రాధాన్య అంశాలకు నిధుల లభ్యత లేకుండా చేసినట్లయిందని, ఆశించిన ఫలితాలు చేకూరేందుకు నిధులు ఇవ్వలేని పరిస్థితికి దారితీసిందని కాగ్‌ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికవ్యవస్థకు ఒక తీరుతెన్నూ లేకుండా పోయిందంటూ అక్షింతలు వేసింది. రానున్న ఏడేళ్లలో ఏకంగా 76,888 కోట్ల రూపాయల మేరకు అప్పులు చెల్లించాల్సి ఉందని, ఈ భారం బడ్జెట్‌లపై ఎంతో ప్రభావం చూపుతుందని, ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంది.

జాతీయ గ్రామీణ నీటిసరఫరా పథకం కింద రాష్ట్రంలో ఏడు పథకాలను నిర్మించినా ప్రారంభించలేక పోయారని, నీటి ఆధారం లేకపోవడమే అందుకు కారణమని, మరో ఏడు ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయని, దీంతో 491.83 కోట్లు నిష్ఫలమయ్యాయని తేల్చింది. పథకాలను పూర్తిచేయడంలో జాప్యం, పథకాలను సరైన సమయానికి ప్రారంభించలేకపోవడం వల్ల 2017 మార్చి నాటికి 110.57 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయిందని, పలు పథకాల పనులు ప్రారంభించకపోవడం వల్ల మరో 455.02 కోట్ల మేరకు కేంద్రం ఇచ్చిన సాయాన్ని రాష్ట్రం వినియోగించుకోలేకపోయిందని కాగ్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో లోపాలవల్ల 607.51కోట్ల ఆదాయానికి గండిపడిందని, సుమారు 369 కార్యాలయాల్లో తక్కువ పన్ను విధింపు, ఆస్తివిలువ తక్కువగా నిర్ధారించడం వగైరాల వల్ల ఈ నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. అంతేకాదు, రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో సుమారు నూటపాతిక కోట్ల ఖరీదైన 431.98 ఎకరాల పంచాయతీరాజ్‌ భూములు ఆక్రమ ణల్లో ఉన్నాయని, భూ నిర్వహణకు సంబంధించిన ఆస్తుల రిజిస్టర్‌ను నిర్వహించలేదని తప్పుపట్టింది. అంతేకాక, 501.85 కోట్లకు సబంధించిన ఖర్చులకు వివరణాత్మక బిల్లులు లేవని, దాని వల్ల అసలు ఖర్చు జరిగిందో లేదో నిర్ధారించడం కష్టమని పేర్కొంటూ, ఇలాంటి తీరువల్ల అవినీతికి, నిధుల దుర్వినియో గానికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందని కాగ్‌ స్పష్టం చేసింది. ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్ర పాలనలోని డొల్ల తనాన్ని ఎండగడుతూ, ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు జరి గాయో.. జరుగుతున్నాయో లెక్కలేసి మరీ స్పష్టం చేసింది. దీంతో బిజెపికి ఊపు పెరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట్రం విఫలమవుతోందని, నిధులను దారిమళ్లిస్తోందని, పాలన అస్తవ్యస్తంగా ఉందని కొన్నాళ్ళుగా బిజెపి చేస్తున్న విమర్శలను ఇప్పుడు టిడిపి కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అందులోనూ, ఎవరూ కాదనడానికి వీలులేని స్పష్టమైన 'కాగ్‌' నివేదిక అది. దీంతో టిడిపి ఇప్పుడు ఇరకాటంలో పడిపోయింది. చేసిన తప్పులు తప్పించుకోవడానికి.. లేని గొప్పలు చెప్పుకునే టిడిపి రాజకీయ వ్యూహం బెడిసికొట్టినట్లయింది.

ఏదేమైనా, నీతి-నిజాయితీలతో, పారదర్శకంగా ఉంటూ..సకల జనరంజకంగా ప్రగతిపథంలో ముందుకు సాగాల్సిన రాష్ట్రపాలన ఇలా అస్తవ్యస్తంగా మారతూ విమర్శలకు గురవుతుండడం ఎంతైనా విచార కరం. ఈ విమర్శల నుంచి, ఈ అప్రదిష్ట నుంచి గట్టెక్కడానికి టిడిపి నేతలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారో.. మరెలాంటి వ్యూహాలు రచిస్తారో... వేచిచూడాల్సిందే మరి!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter