27 April 2018 Written by 

గెలుపుగుర్రమెక్కేదెవరు?

karantakaఆ రెండు పార్టీలకూ ఇప్పుడు కర్నాటక ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారైంది. రానున్న ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్నదే ఆ పార్టీలకు గుబులుగా మారింది. వచ్చే నెల 12న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా హోరాహోరీగా తలపడుతున్న బిజెపి-కాంగ్రెస్‌ పార్టీల ప్రతిష్టకు ఇవి ఎంతో కీలకమైనవని వేరే చెప్పనక్కరలేదు. రాష్ట్రంలోని 224 స్థానాలకు మే 12న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ పార్టీల నాయకులకు నిదురే కరువవుతోంది. ఎక్కడ విన్నా ఎన్నికల మాటే. ఈ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందా.. కాంగ్రెస్‌ నిలుస్తుందా అన్న చర్చలే. ఈ రెండు పార్టీలతో పాటు, ఈ ఎన్నికల్లో జేడీ (ఎస్‌)పార్టీ మద్దతు పార్టీలపై మరింత కీలకంగా ఉంటుందని కూడా రాజకీయవర్గాల అంచనాలు వేస్తున్నాయి. అయితే, ఇప్పటికే వివిధ మీడియాసంస్థలు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. ఇక్కడ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరిస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని సర్వేలు బిజెపియే అధికస్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నాయి. పార్టీలకు స్వల్ప ఆధిక్యత వచ్చి 'హంగ్‌' ప్రభుత్వం ఏర్పడే అవకాశం కూడా లేక పోలేదు. కర్నాటక బిజెపి నేత, మాజీ సిఎం యెడ్యూ రప్ప, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య (కాంగ్రెస్‌)ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్లు ఎవరిని అందలమెక్కిస్తారో తెలియదు కానీ, ఈ ఎన్నికల పుణ్యమా అని కర్నాటక అంతా ఈ ఎండల్లో రాజకీయ సెగలతో మరింత వేడెక్కిపో తోంది. నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా బిజెపి బలోపేతం కావడం తెలి సిందే. అయితే, దక్షిణాదిలో ఇప్పుడు జరుగుతున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కో వడం బిజెపికి ఇదే తొలిసారి. ఇక్కడ విజయం సాధిస్తే బిజెపికి ఇక దక్షిణాదిలో కూడా తిరుగే ఉండదని ఆ పార్టీ గట్టిగా భావిస్తోంది. కర్నాటకలో గెలుపు ద్వారా దక్షిణాధిలో విజయభేరీ మోగించవచ్చని, తద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ తమకు ఎదురుండదని బిజెపి అంచనాలు వేసుకుంటోంది. అయితే, మారుతున్న రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఇక్కడి వాతావరణం అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నా, బిజెపి కూడా ఎక్కడా తగ్గకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తూనే ఉంది. ఇక్కడ విజయం అంత సులువు కాదని అర్ధమవుతున్నా, ఎలాగైనా పట్టుబట్టి విజయం సాధించాలనే పట్టుదలతో బిజెపి వ్యూహరచన చేస్తోంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా కర్నాటకలో బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే, అంతర్గత విభేదాలతో తన విజయావకాశాలను తనే దెబ్బతీసుకుంది. 2013 ఎన్నికల్లో అధికారాన్ని కాంగ్రెస్‌కు బంగారుపళ్లెంలో పెట్టి మరీ అందించింది. అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో కర్నాటకలోని అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు బిజెపికి లభించాయి. మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో 17 బిజెపికి రాగా, 9 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. అయితే, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారిందని, గతంలో ఉన్నంత మోడీ ప్రభంజనం ఇప్పుడు లేదని సర్వేలు పేర్కొంటు న్నాయి. మరోవైపు ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌, పూల్పూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం పాలవడంతో బిజెపి ఇప్పుడు మరింతగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మునుపున్నంత దూకుడుగా లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కర్నాటకలోని మఠాలు మఠాధిపతుల చుట్టూ తిరుగుతూ అమిత్‌షా బిజెపి ఓటుబ్యాంక్‌ను కాపాడుకోవాలని తీవ్రప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఎన్నికలో ఇక కర్నాటక నుంచి కాంగ్రెస్‌ తొలగిపోతుందని, ఇక్కడి గెలుపుతో దక్షిణాది జైత్రయాత్రకు సింహద్వారాన్ని తెరచినట్లేనని, ఇక్కడ గెెలిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో కూడా విజయదుంధుభులు మోగించవచ్చని బిజెపి నేత అమిత్‌షా కార్యకర్తలకు ఉత్సాహం నూరిపోస్తున్నారు. అయితే, మోడీ ప్రతిష్ట మసకబారిందని, మునుపటి పరిస్థితి ఇప్పుడు లేదని, ప్రజల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లినట్లు ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోందని, కనుక కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో విజయం తథ్యమని కాంగ్రెస్‌ నాయకులు ధీమాగా చెప్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి సిద్దరామయ్య రంగంలో ఉండడంతో, ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన గెలుపుకు ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై కూడా ప్రజలకు అభిమానమే ఉన్నా సొంతపార్టీలోనే అసమ్మ తుల కుంపట్లసెగ ఎక్కువగా ఉంది. కర్నాటకలో అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే లింగా యతుల ఓట్ల కోసం ఇరు పార్టీలు చేస్తున్న రాజకీయ వ్యూహాలతో కర్నాటకలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. లింగాయత్‌లకు మైనార్టీ హోదా ఇస్తామనే తాయిలంతో ఆ వర్గాన్ని సిద్ధ రామయ్య ఇప్పటికే తనవైపుకు తిప్పుకున్నారు. అత్యధికులైన లింగాయతులను తమవైపు తిప్పు కునేందుకు బిజెపి కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అదేవిధంగా, సుమారు 35 నియోజక వర్గాల్లో ప్రభావం చూపే తెలుగు ఓటర్లు కూడా కర్నాటకలో గణనీయంగానే ఉన్నారు. బెంగుళూరులోని అత్యధిక ప్రాంతాల్లో తెలుగువారే అధికం. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందనే ఆగ్రహం తెలుగువారిలో స్పష్టంగా ఉంది. ఈ వ్యతిరేకతే గతంలో కాంగ్రెస్‌ను మట్టికరిపించింది కూడా. ఇప్పుడు బిజెపి ఆ తప్పును సరిదిద్దకపోవడంతో కర్నాటకలోని ఆంధ్రులు బిజెపికి ఓట్లేసే పరిస్థితి ఉండదని, కనుక ఇది తమకు అనుకూలమని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఒకవైపు బిజెపి నేత అమిత్‌షా, మరోవైపు కారగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇప్పటికే కర్నాటకనంతా ఒక చుట్టు చుట్టేశారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌, దేశంలో బిజెపి అధికారంలో ఉండడం వల్ల ఆ రెండు పార్టీలకు డబ్బుకు కొదవలేదు కనుక ప్రచారార్భాటాలకు తక్కువేమీ లేదు. అయితే, ఎవరెలా ప్రచారాలు చేసుకున్నా తుది నిర్ణయం మాత్రం ఓటర్లదే కనుక, ఓటర్లు చివరికి ఎవరిని తిరస్కరిస్తారో.. ఎవరిని వరిస్తారో.. వచ్చే నెల 15న ఫలితాలు వెలువడే దాకా వేచిచూడాల్సిందే!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter