Friday, 27 April 2018 07:33

ఖాళీ ప్లాట్లు.. జనం పాట్లు

Written by 
Rate this item
(0 votes)

kali flatఖాళీ స్థలాలను..ప్లాట్లను ఏళ్ళ తరబడిగా పట్టించుకోకుండా..అలా ఖాళీగానే వదిలేయడం వల్ల ఇరుగుపొరుగు జనానికి ఇక్కట్లు మొదలవుతున్నాయి. పిచ్చిమొక్కలు, ముళ్ళ పొదలు పెరిగిపోవడం, దోమలకు, కుక్కలు..పందులకు, విషసర్పాలకు ఆవాసం కావడం అనేకచోట్ల జరుగుతూ ఉంది. దీంతో నగరమంతా దుర్గంధంతో గబ్బుకొట్టి పోతోంది. ఇళ్ళమధ్యల ప్లాట్లతోపాటు, పరిసరాలన్నీ కుళ్ళు కంపుకొడుతున్నాయి.

నెల్లూరు నగరంలోని అనేక వీధులు, అనేక ప్రాంతాల్లో ఇళ్ళకోసం తీసుకున్న స్థలాలు, లేదా ప్లాట్లు కనిపిస్తుంటాయి. ఆ స్థలాల్లో ఇళ్ళు కట్టుకునేందుకు కారణాంతరాల వల్ల స్థల యజమానులకు వెసులుబాటు లేకపోవడంతో అనేకచోట్ల అవి ఎంతోకాలంగా ఖాళీగానే ఉంటున్నాయి. అక్కడ ఇళ్ళు కట్టుకునేందుకు తగు అర్ధిక వసతులు లేకపోవడం వల్లనో, లేదా మంచి ధర వస్తే విక్రయించుకోవచ్చనో ఇలా రకరకాల కారణాల వల్ల వాటిని అలా వదిలేస్తుండవచ్చు. అయితే, ఆ ప్లాట్లను చాలామంది అలా ఖాళీగానే వదిలేయడం వల్ల, సంవత్సరాలు గడుస్తున్నా వాటి అతీగతీ పట్టించుకోకపోవడం వల్ల ఇరుగుపొరుగు వారికి సమస్యలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇదే సమస్య చాలాచోట్ల ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఎంతోకాలంగా తిష్టవేసుకుని కూర్చుని ఉన్న పెద్ద సమస్య ఇది.

ఎక్కడ చూసినా గబ్బు గబ్బు!

ఈ ఖాళీ ప్లాట్లు అనబడు స్థలాల్లో కొన్ని చోట్ల సంబంధిత యజమానులు మాత్రం శ్రద్ధ తీసుకుని తమ స్థలాల్లోకి పశువులు, పందులు రాకుండా గేట్లు పెట్టడం, మంచి పూలచెట్లు నాటి వాటిని అందంగా తీర్చిదిద్దుకోవడం వంటి పనులు చేస్తుండడం అభినందనీయం. అంతా గబ్బుగబ్బుగా మారి, మురుగుదిబ్బల్లా ఉన్న ప్లాట్లలోకి అడుగుపెట్టాలంటేనే భయం. దూరం నుంచి చూసి ముక్కు మూసుకోవాల్సిందే తప్ప లోపలికి వెళ్ళే దారే ఉండదు. మురుగుగుంటల్లా మారిన ప్లాట్లు.. దోమలకు ఇళ్ళుగా మారిపోయాయి. ఈ ఖాళీస్థలాలు లేదా ప్లాట్లు వాటికి భలే దొరికాయి. ఈగలు దోమలతో పాటు, పశువులు, పందులు, కుక్కలు..ఎలుకలు, చుంచులు.. నలికీసులు.. ఇలా నానారకాల కీటక జంతుజాలమంతా ఆ ప్లాట్లలో యదేచ్ఛగా విహరిస్తుంటాయి. అక్కడే సందుచూసుకుని రకరకాల పాములు కూడా కాపురం పెడుతున్నాయి. కట్లపాములు, నాగుపాములు, జెర్రిపోతులు వంటి విషసర్పాలు కూడా జొరబడుతున్నాయి. వీటన్నిటికీ మన నిర్లక్ష్యమే మంచి ఆవాసం కల్గిస్తోందని చెప్పవచ్చు.

ఖాళీ ప్లాట్లా!..డంపింగ్‌యార్డ్‌లా?!....

ఈ ఖాళీప్లాట్లు రానురాను చెత్తదిబ్బలుగా మారుతున్నాయి. ఖాళీప్లాటు కనిపిస్తే చాలు..ఇక ఇరుగుపొరుగు చెత్తకు కొదవుండదు. కొన్నిచోట్ల ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా తమ ఇళ్ళలోని చెత్తనంతా శుభ్రంగా ఊడ్చి, ఖాళీగా ఉంది కదా.. అని ఇతరులకు చెందిన ఈ ఖాళీప్లాట్లలోనే కుమ్మరించేస్తుంటారు. దీంతో అలా ఆ ఖాళీ ప్లాట్లు జనానికి అనధికారిక డంపింగ్‌యార్డుల్లా మారిపోతున్నాయి.

ఆ చెత్త... తిరిగి మన నెత్తిమీదికే...

కొంతమంది సందు దొరికింది కదా అని..తమ ఇళ్ళలోని చెత్తాచెదారాన్ని, పనికిరాని ఆహారపదార్ధాలు వగైరాలన్నిటినీ భద్రంగా ప్లాస్టిక్‌కవర్లలో చుట్టి మూటగట్టి ఖాళీప్లాట్లలోకి విసిరేస్తుంటారు. పెద్దపెద్ద అపార్ట్‌మెంట్‌ల మధ్యలో ఓ ఖాళీస్థలం దొరికితే చాలు, జనానికి పండగ. ఇంట్లో ఉన్న చెత్తనంతా హాయిగా అక్కడ కుమ్మరించేస్తుంటారు. ఆ చెత్తంతా రోజూ కుప్పలు తెప్పలుగా ఆ ఖాళీస్థలాల్లో పడి, మురిగిపోయి కుళ్ళు కంపు కొడుతుంటుంది. చివరికి ఆ మురుగు గబ్బునంతా పీల్చాల్సింది ఆ చుట్టుపక్కల ఉన్న జనమే కదా?.. మన ఇంట్లో చెత్తనంతా ఖాళీప్లాట్లలో పోసేస్తే..మన చెత్తను మన నెత్తిన మనమే వేసుకున్నట్లేనని మనం అర్ధం చేసుకోవాలి.

మీ ప్లాట్లు బాగుంటే.. మేము బాగున్నట్లే...

ప్లాట్ల యజమానులు కూడా అవి 'మా స్థలాలు..మా ఇష్టం' అనే ధోరణితో కాక, ప్రజారోగ్యం కోసం అప్పుడప్పుడూ వాటి బాగోగులను పట్టించుకోవాలి. ఎందుకంటే ఆ ప్లాట్లు బాగుంటే మన ఆరోగ్యం బాగున్నట్లే. మీ ప్లాట్ల పరిశుభ్రతే..మా ఆరోగ్య భాగ్యం అంటున్నారు జనం. అందువల్ల మన చుట్టూ ఉన్న పరిసరాలు కాలుష్యానికి గురికాకుండా కాపాడుకోవాలి. కనుక, మీరూ ఒకసారి మీ ఖాళీప్లాట్లు, స్థలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ... మీ ఆలోచనల మేరకే వాటిని సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దుకొని పరిసరాలను-పరిశుభ్రతను పరిరక్షిస్తారని ఆశిద్దాం!...

Read 67 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter