Friday, 04 May 2018 15:03

ఇంద్రుడికి మొగుడు

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ఇంద్ర లోకం రాజధాని అమరావతి. అప్పుడే తెల్లారింది. దేవేంద్రుడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి మేకప్‌ వేసుకుని తన ఆస్థానానికి చేరుకున్నాడు. సభా సభ్యులంతా లేచి గౌరవ మర్యాద లతో ఆయనను స్వాగతించారు. దేవేంద్రుడు సింహాసనాన్ని అధిష్టించి.. ఈరోజు నా మనసు ఎంతో ఉల్లాసంగా వున్నది... ఈ ఆనంద సమయంలో ఈ మనసు ఏదో వినోదము కోరుతున్నది అని చెబు తుండగా... సభలో నుండి 'ఇదే మీకు చివరి ఉల్లాసము' అనే వాయిస్‌ వినిపించింది. అది విని దేవేంద్రుడు ఎవరది... ఏమిటా పరిహాసము అని ఆవేశంగా అడిగాడు. అప్పుడు సభలో నుండి ఓ వ్యక్తి ముందు కొచ్చాడు. నీ పేరేంటని ఇంద్రుడు అడిగాడు. దానికతను... నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి అని చెప్పాడు. నాకు ఇదే చివరి ఉల్లాసదినము అని అంటివి... ఎందుకలా అన్నావు అని ఇంద్రుడు అడిగాడు. నేను ఆ మాట ఎందుకన్నానో మీకు చెబితే అర్ధం కాదు. మీరే అనుభవపూర్వ కంగా తెలుసుకుంటారు. ఇప్పుడే భూలోకం నుండి ఒక బుల్లెట్‌ ఈ లోకానికి దూసుకువచ్చింది. ఇక నీ పని 'జింతాక చిత చిత జింతాక తానే' అంటూ రెండు చేతులతో అక్కడే వున్న బల్ల మీద దరువేస్తూ చెప్పాడు నేదురుమల్లి. దానికి ఇంద్రుడు ఈ మానవుడు చెబుతున్నదేంటో నాకు అర్ధం కావడం లేదు. అయినా ఈ ఆనంద సమయంలో ఈ ఆటంకాలెందుకు... వెళ్ళి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలను తీసుకురండి.. వారి నాట్య విన్యాసాలను చూసి మైమరచిపోదామని అన్నాడు. అందుకు అక్కడే ఉన్న ఇంద్రుడి పి.ఏ నాగసేనుడు... ఇంకెక్కడి రంభ, మేనకలు రాజా... భూలోకం నుండి ఎవరో కొత్త మానవుడు వచ్చాడు. మనిషి చాలా వెరైటీగా వున్నాడు ప్రభు. మన లోకానికి వచ్చిన మానవులెవరూ అతనిలా లేరు. మేనక, రంభ, ఊర్వశి, తిలోత్తమలు అతని చుట్టూ చేరారు. అతన్ని వదిలి రావడం లేదు అని చెప్పాడు. ఆ మాటకు దేవేంద్రు డికి అరికాల్లో మండింది. ఆ మానవుడు నాకంటే అందగాడా... నాకంటే శృంగారధీరుడా... ఎవరతను... అతని సంగతేంటో చూద్దాం పదండి అంటూ లేచాడు.

అమరావతిలోని కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ హాల్‌. ప్రేక్షకులతో నిండిపోయి వుంది. దేవేంద్రుడు తన భటులతో కలిసి హాల్‌లోకి అడుగుపెట్టాడు. అప్పుడే డిటిఎస్‌ మ్యూజిక్‌ మొదలైంది. స్టేజీ మీద ధగధగ లైట్లు వెలుగుతుండగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు నలుగురూ నాలుగు వైపుల వున్నారు. వారి మధ్యలో కళ్ళకు నల్లద్దాలు, నల్ల టీషర్ట్‌, నల్లఫ్యాంట్‌, నల్లబూట్లు వేసుకుని మెగాస్టార్‌ చిరంజీవిలా ఓ వ్యక్తి వున్నాడు. అతన్ని చూసి దేవేంద్రుడు పి.ఏ నాగసేనుడితో... అతని పేరేమిటి అని అడిగాడు. నేను చెప్పిన వెరైటీ మానవుడు ఇతనే ప్రభూ..! పేరు 'స్టైల్‌ ఆఫ్‌ సింహపురి' ఆనం వివేకానందరెడ్డి అట. నెల్లూరు నుండి వచ్చాడు అని పి.ఏ చెప్పాడు. ఇంత చిన్నవయసులోనే మన లోకానికి వచ్చాడు. నిండా పాతికేళ్ళు కూడా లేనట్లున్నాయి. రంభ, ఊర్వశిల మీద మనసుపడి వచ్చాడా అని దేవేంద్రుడు అడిగాడు. ఆయనకు పాతికేళ్ళేంటి ప్రభూ, 67ఏళ్ళు. అతను భూలోకంలో పేరుమోసిన రాజకీయ నాయకుడు. యోధానుయోధులనే మట్టి కరిపించాడు. ఆయన ఇక్కడకు వచ్చాడంటే... నాకేదో మీకు మూడిందనిపిస్తుందని అను మానం వ్యక్తం చేశాడు. అందుకు దేవేంద్రుడు... ఇలాంటి పిల్ల కాకులు నన్నేం చేస్తాయి. ఈ ఇంద్రుడిని పెద్ద పెద్ద రాక్షసులే ఏమీ చేయలేకపోయారని పగలబడి నవ్వుతూ అన్నాడు.

అంతలో స్టేజీ మీద నుండి పాట రాసాగింది. యముడికి మొగుడు సినిమాలో ''నో నో నో నో నో... నోనోనో.. నాట్యమిదా... నోనోనో... గానమిదా...'' అనే పాటకు వివేకా నలుగురి నడుములు తిప్పుతూ చిరంజీవి లెవల్లో స్టెప్పులేసాడు. తర్వాత గమ్‌ గమ్‌ స్టార్‌ డ్యాన్స్‌, ఆ తర్వాత లుంగీ డాన్స్‌, చివరగా రంగమ్మ మంగమ్మ పాటకు డ్యాన్స్‌ ఇరగదీసాడు. వివేకా డ్యాన్స్‌తో హాల్‌ చప్పట్లు, ఈలలతో మోతెక్కింది. వివేకా స్టేజీ దిగగానే రంభ, ఊర్వశిలతో పాటూ అక్కడున్న అమ్మాయిలందరూ వివేకా ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. వివేకా ఓపిగ్గా అందరికీ ఆటోగ్రాఫ్‌లిస్తూ... ప్రేమగా పలుకరించసాగాడు. అప్పుడు అక్కడున్న జనంలో నుండి ఒకడు 'మిర్చి' సినిమాలో 'పండుగలా దిగివచ్చావు... ప్రాణానికి వెలుగి చ్చావు' అనే పాట పెట్టాడు. ఆ పాటకు వివేకా చుట్టూ జనం మూగిపోయి... వివేకన్నా జిందాబాద్‌ అంటూ జేజేలు పలక సాగారు. ఆ సీన్‌లన్నీ చూసేసరికి దేవేంద్రుడికి కడుపు గ్యాస్‌తో మండిపోయింది. తట్టుకోలేక రంభ, ఊర్వశి, మేనకలను పిలిచి... నా ఆస్థానం నుండి మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రమ్మన్నారు... ఈ తుచ్ఛమానవులతో మీరు కలిసి నృత్యం చేయడమేంటి... ఇది స్వర్గం అనుకుంటున్నారా, నరకం అనుకుంటున్నారా... అంటూ వారిపై కోపంతో చిందులు తొక్కసాగాడు. అప్పుడు వివేకా... ఇంద్రా ఆగు... అంతకుమించి వారి గురించి ఒక్క మాట మాట్లాడినా బాగుండదు. అసలు స్త్రీ అంటే ఎవరనుకున్నావు. మన బట్టలను ఇస్త్రీ చేసే దేవత... స్త్రీ అంటే ఎవరనుకున్నావ్‌... మన ఇంటికి ముఠామేస్త్రి.. స్త్రీ లేనిదే జననం లేదు... స్త్రీ లేనిదే మరణం లేదు... స్త్రీ లేనిదే... మన ఒంటిమీద అట్లకాడ వాతలు లేవు... స్త్రీ గొప్పతనం గురించి ఓ జపాన్‌ కవి ఏమన్నాడో తెలుసా...? అని ఆవేశంగా అడిగాడు. ఏమన్నాడు అని దేవేంద్రుడు ఆసక్తిగా ప్రశ్నించాడు. 'నేడీ డయసోరా ఒకసో సమోసా హిటూచి నిప్పో ఒనిడా మాకి హిటో సంసంగో' అని వివేకా చెప్పాడు. ఆ మాటలు అర్ధంకాక దేవేంద్రుడు బుర్రగోక్కోసాగాడు. స్త్రీ గొప్పతనం గురించి వివేకా అంత బాగా చెప్పడం చూసి అక్కడున్న మహిళలు, స్వర్గలోకపు నృత్య కళాకారిణు లందరూ వివేకా ఫ్యాన్స్‌ అయిపోయారు. అప్పటికప్పుడు వివేకా అభిమాన సంఘం ఏర్పాటు చేయడమేకాక, ఇంద్రుడు డౌన్‌ డౌన్‌... వివేకా జిందాబాద్‌... స్వర్గలోకపు అధిపతిగా వివేకాను నియమించాలని నినాదాలు చేయసాగారు. అంతలో అక్కడకు నంది వాహనంపై శివుడు ప్రత్యక్షమయ్యాడు. దేవదేవా... మీ ఆకస్మిక పర్యటనకు కారణమేమి అని ఇంద్రుడు అడిగాడు. శివయ్య సెల్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి ఒక పిక్చర్‌ ఆన్‌ చేసాడు. కొన్ని నిముషాల ముందే రంభ, ఊర్వశి, మేనకలను ఇంద్రుడు దూషించిన సన్నివేశాలు వస్తున్నాయి. అది చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. స్వామి, ఇక్కడ జరిగింది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు. దానికి శివయ్య... వివేకాను చూపిస్తూ... ఈ మానవుడే నువ్వు తిట్టేటప్పుడు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి నాకు పంపించాడు. ఈ సన్నివేశాలు మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, మీడియా కంటపడితే మన దేవలోకం పరువు ఏం కావాలి... ఇది ఫస్ట్‌ వార్నింగ్‌, ఇక నుండి జాగ్రత్తగా వుండు... ముఖ్యంగా ఈ వివేకా ఇక్కడున్నంత కాలం నీ చుట్టూ సి.సి.కెమెరాలున్నట్లే... అని చెప్పి మాయమయ్యాడు. అప్పుడు అక్కడే వున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి దేవేంద్రుడితో... నేను చెప్పానా, నీకు ఉల్లాసంగా అనిపించే చివరిరోజు ఇదేనని అని వెటకారంగా అన్నాడు.

హాస్యానికి నిలువెత్తు చిరునామా, వ్యంగ్యానికి వ్రాసిపెట్టిన వీలునామా 'స్టైల్‌ ఆఫ్‌ సింహపురి' ఆనం వివేకాకు ఈ 'గల్పిక' అంకితం.

Read 30 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter