17 May 2018 Written by 

కన్నడ కొలనులో... విరిసిన కమలం

bjpసరిగ్గా నెలరోజుల క్రితం కర్నాటకలో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు అను కూలంగా ఉండింది. ఏ సర్వే చూసినా కాంగ్రెస్‌ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందనే చెప్పాయి. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని, ఈ ప్రభావం కర్నాటక ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని కూడా భావించాయి.

కాని, నెలరోజుల్లోనే అక్కడ సీన్‌ను మార్చేసింది అమిత్‌షా బృందం. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారంతో అక్కడ ట్రెండ్‌ మారింది. 21చోట్ల ప్రధాని మోడీ రోడ్‌షోలు జరిగాయి. బయట రాష్ట్రాలకు చెందిన 50వేల మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు కర్నాటకలో దిగిపోయారు. కర్నాటక ఆరెస్సెస్‌ శాఖలు వీరికి సహకరించాయి. నియోజకవర్గానికి 500మంది కార్యకర్తలను బూత్‌లెవల్‌ ప్రచారానికి వినియోగించారు. అమిత్‌షా బెంగుళూరులోనే తిష్టవేసి ఎన్నికలను పర్యవేక్షించాడు. ఆయన బృందంలోని సభ్యులు గెలుపే లక్ష్యంగా శ్రమించారు. కర్నాటకలో 222 స్థానాలుంటే తమ అభ్యర్థి కాంగ్రెస్‌, జేడిఎస్‌ల కంటే వెనుకబడి వున్నాడన్న నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. గెలుపు ఖాయమనుకున్న స్థానాలతో పాటు రెండో స్థానంలో వున్నామని రిపోర్ట్‌ వచ్చిన స్థానాలపై ప్రత్యేకదృష్టి పెట్టారు. కాబట్టే కాంగ్రెస్‌ కంటే మొత్తంగా ఓట్లు తగ్గినా సీట్ల పరంగా మొదటి స్థానంలో నిలవగలిగారు. కేవలం వ్యూహాత్మక రాజకీయాలతోనే బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది.

దేశమంతటా ఉత్కంఠ రేపిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 15వ తేదీ వెలువడ్డాయి. పలు సర్వే సంస్థలు ఊహించినట్లే హంగ్‌ ఫలితాలు వచ్చి కర్నాటకలో అధికార కుర్చీ ఆట మొదలైంది. బీజేపీకి 104 సీట్లు వచ్చి పూర్తి మెజార్టీకి 8సీట్ల దూరంలో ఆగింది. ఇక అధికార కాంగ్రెస్‌ 78సీట్లతో రెండో స్థానానికి పరిమితం కాగా, జేడీఎస్‌ 38సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ఫలితాల సరళినిబట్టి ఒక దశలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తుందనుకున్నప్పటికీ చివరిలో కాంగ్రెస్‌ పుంజు కోవడంతో బీజేపీ అధికారానికి 8సీట్ల దూరంలో ఆగింది.

అప్రమత్తమైన కాంగ్రెస్‌...

హంగ్‌ ఫలితాలు వచ్చాయని తెలియగానే కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. గతంలో గోవా, నాగాలాండ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకత్వం అప్రమత్తమైంది. సోనియాగాంధీనే నేరుగా జేడీఎస్‌ అధినేత దేవేగౌడకు ఫోన్‌ చేసి కుమారస్వామిని ముఖ్య మంత్రిని చేస్తామని ప్రతిపాదించింది. దీంతో జేడీఎస్‌ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సై అంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు సులభమే!

రేవణ్ణకు బీజేపీ ఆఫర్‌...

అయితే బీజేపీ కాంగ్రెస్‌కు ఛాన్స్‌ ఇస్తుందా? కాంగ్రెస్‌ కుమార్‌స్వామికి గాలం వేస్తే బీజేపీ దేవేగౌడ్‌ పెద్దకొడుకు రేవణ్ణకు వల విసిరింది. జేడీఎస్‌లో కుమార స్వామి, రేవణ్ణ వర్గాలు వేర్వేరుగా వున్నాయి. తమ్ముడు సీఎం అవుతుంటే అన్న రేవణ్ణ చేతులు ముడుచుకుని వుంటాడా? బీజేపీ వాళ్ళు రేవణ్ణలో పదవీ ఆకాంక్షను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్‌ చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్‌లో వున్న లింగాయత్‌ కులానికి చెందిన ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేడీఎస్‌, కాంగ్రెస్‌ల నుండి కొంతమంది ఎమ్మెల్యేలు చీలి వచ్చినా బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమే అవుతుంది.

ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు గవర్నర్‌ చేతిలో వుంది. పెద్దపార్టీని మొదట ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే బీజేపీ పట్ల గవర్నర్‌ తన స్వామిభక్తిని చాటుకున్నట్లే! ఎందుకంటే ఇటీవలే గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పెద్దపార్టీగా అవతరిస్తే అక్కడి గవర్నర్‌ పెద్దపార్టీ కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. జేడీఎస్‌ - కాంగ్రెస్‌ కూటమికి మొదటి ఛాన్స్‌ ఇచ్చేంత సాహసం గవర్నర్‌ చేయకపోవచ్చు. ఎంతైనా ఆయనా ఒకప్పటి బీజేపీ నాయకుడే కదా!

కాబట్టి మొదటి అవకాశం బీజేపీకే ఇచ్చి బలనిరూపణకు సమయం ఇవ్వొచ్చు. ఈలోపు మిగతా ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు జేడీఎస్‌, కాంగ్రెస్‌లను చీల్చి తెచ్చుకోవచ్చు.

కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధం

కర్నాటకలో ఓటమి కాంగ్రెస్‌ చేజేతులా తెచ్చుకున్నదే! ఇక్కడ సిద్ధ రామయ్య ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. సీఎంగా యడ్యూరప్ప, కుమారస్వామిలకంటే ఆయనవైపే ప్రజలు మొగ్గుచూపారు. కాని కొన్ని సొంత తప్పులే కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసాయి. జేడీఎస్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ సక్సెస్‌ కాలేకపోయింది. పొత్తు కుదిరివుంటే ఈరోజు ఫలితం ఇంకో విధంగా వుండేది. ఇక మతపరమైన సెంటిమెంట్ల జోలికి పోయి హిందువులలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఎవరూ అడగకపోయినా టిప్పుసుల్తాన్‌ జయంతి అంటూ ఆర్భాటం చేయడం, లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ కేబినెట్‌లో ఆమోదించడం వంటివి ఆయనపై కొన్ని వర్గాల్లో అసంతృప్తిని కలిగించాయి. బీజేపీ ఎన్నికల ప్రచారంలో వీటిని బాగానే వాడుకుంది. రాహుల్‌, సోనియాలొచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఉప యోగం లేకుండాపోయింది. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్న పెద్ద రాష్ట్రం ఇదే! ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా చేజారిపోయినట్లే!

దీంతో కాంగ్రెస్‌ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయినట్లయ్యింది. పంజాబ్‌, మిజోరాం రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో వుంది. అంటే కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నా లక్ష్యం అన్న మోడీ లక్ష్యం దాదాపు 90శాతం నెరవేరినట్లయ్యింది. బీజేపీ మాత్రం మిత్రపక్షాలతో కలిసి 20 రాష్ట్రాలలో వుండగా కర్నాటకలో కూడా అధికారం చేపడితే అది 21వ రాష్ట్రం అవుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter