Friday, 18 May 2018 15:54

బాబు దీక్షపై కేంబ్రిడ్జిలో పరిశోధనలు

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం. ఎం.ఏ లిట్‌ క్లాస్‌రూమ్‌... ప్రొఫెసర్‌ మార్గరెట్‌ హల్వా క్లాస్‌కు అటెండయ్యి రాజకీయాలలో నిరాహారదీక్షల పాత్ర అనే సబ్జెక్ట్‌పై లెసన్‌ మొదలుపెట్టింది. దీక్షలో ఎన్ని రకాలు, ఎన్నిరోజులు చేస్తారు అని ఆమె వివరిస్తుండగా ఫిలిప్‌పాల్‌కోవా అనే స్టూడెంట్‌ లేచి... మేడమ్‌ ఇండియాలో ఇటీవల కొందరు నాయకులు తరచూ దీక్షలు చేస్తున్నట్లు చదువుతున్నాం... ఆ దీక్షల గురించి చెప్పండి అని కోరాడు. అందుకు మార్గరేట్‌ హల్వా... చెప్పడం ఎందుకు చూపిస్తాను అంటూ ఒక స్క్రీన్‌ ఏర్పాటు చేయించి భారతదేశ చరిత్రలో మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, కేసీఆర్‌, జగన్‌ వంటి వాళ్ళు చేసిన దీక్షలను చూపించింది. అది చూసి ఫిలిప్‌పాల్‌కోవా... మేడమ్‌, వీటిలో ఏ దీక్షయినా గిన్నిస్‌ రికార్డుకెక్కిందా? అని అడిగాడు. గిన్నిస్‌రికార్డుకు అవి అర్హత సాధించలేదు. ఈ దీక్ష మాత్రం అర్హత సాధించింది అని స్క్రీన్‌పై చంద్రబాబు 12గంటల దీక్షను ఆన్‌ చేసింది.

--------

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌... అక్కడ హాల్‌లో తెలుగుదేశం ఎంపీలు మురళీమోహన్‌, గల్లా జయదేవ్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్‌, సుజనాచౌదరిలు కూర్చుని వున్నారు. అప్పుడే రాష్ట్రపతి కార్యదర్శి అక్కడకు వచ్చి... సార్‌ రమ్మంటున్నారు అని చెప్పాడు. అందరూ రాష్ట్రపతి ఛాంబర్‌లోకి వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని, విషయం ఏంటని అడిగాడు. సుజనాచౌదరి ఒక ఆహ్వానపత్రికను రాష్ట్రపతి చేతిలో పెట్టి తప్పకుండా రావాల్సార్‌ అని అడిగాడు. వస్తారు సరే... ఏంటిది అని అడిగాడు. అప్పుడు మురళీ మోహన్‌.. మా నాయకుడు చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం విజయవాడలో 12గంటల నిరాహారదీక్ష చేస్తున్నాడు సార్‌. ఆ దీక్షకు రావాలని చెప్పి అందర్నీ కార్డులు కొట్టి ఆహ్వానిస్తున్నాం. మంచి ఈవెంట్‌ సార్‌, మిస్‌ కావద్దు... మంచి ఫుడ్డు ఉంటుంది. అరగంటకోసారి మజ్జిగ, కూల్‌డ్రింక్స్‌, స్నాక్స్‌ వుంటాయి. ఇక ఎండ సెగ అన్నదే తగలకుండా చుట్టూ ఏసిలుంటాయి. మీకు హిమాలయాల్లో వున్నట్లే వుంటుంది. ఇక 12గంటల పాటు బోర్‌ కొట్టకుండా వుండేందుకు రకుల్‌ప్రీత్‌సింగ్‌, కాజల్‌, తమన్నా, అనుష్కలచే నృత్యప్రదర్శనలు, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యంలచే సంగీత విభావరి, చమ్మక్‌ చంద్ర, హైపర్‌ ఆది, బుల్లెట్‌ భాస్కర్‌, సుడిగాలి సుధీర్‌, అనసూయలచే జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లుంటాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో పాటు ఇంకా పలు దేశాల ప్రతినిధులు, మన దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఇలాంటి దీక్ష మీరు చరిత్రలో ఎప్పుడు చూసి వుండరు. ప్రపంచ దేశాధినేతలందరు కూడా చంద్రబాబు దీక్ష చేస్తున్నారనే సరికి ఇందులో ఏదో వెరైటీ వుంటుందనుకుని అందరూ అదిపనిగా వస్తున్నారు. మీరు గంట ముందే వచ్చి కూర్చోండి, లేకపోతే సీట్లు దొరకడం కష్టం అని చెప్పాడు. రామ్‌నాథ్‌కోవింద్‌ అయోమయంగా... నిరాహారదీక్షకు ఇంత సీనా అని మనసులో అనుకుంటూ అలాగే వస్తానని వాళ్ళకు చెప్పాడు. ఢిల్లీలో ఇంకా పిలవాల్సినవాళ్ళు చాలామంది ఉన్నార్సార్‌ అంటూ అందరూ అక్కడనుండి లేచారు.

-----------

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం... వేదిక మీద, వేదిక ముందు ఎక్కడ పట్టినా ఏ.సి మిషన్‌లే... బండలు పగిలే రేంజ్‌లో కాస్తున్న ఎండల దెబ్బకు దారినపోయే జనాలు కూడా అక్కడ కూర్చుని సేదతీరసాగారు. అక్కడే భోజనం, స్నాక్స్‌, మజ్జిగ, కూల్‌డ్రింక్స్‌ ఇస్తుం డడంతో పనులకు పోయేవాళ్ళు కూడా మానుకుని అక్కడే కూర్చుండి పోయారు. దేశ విదేశాల ప్రతినిధులందరూ వచ్చి విఐపి సీట్లలో కూర్చున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులు కూడా వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుండి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి వచ్చారు. వచ్చిన అతిథులందరితో కరచాలనం చేస్తూ ఆయన వేదికపైకి వెళ్లారు. తర్వాత చైనా ప్రధాని జిన్‌పింగ్‌, సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లూంగ్‌లను వేదికపైకి ఆహ్వానించారు. వారిద్దరి చేత వేదికమీద జ్యోతిప్రజ్వలన కార్యక్రమం పెట్టారు. అది ముగియగానే వర్ల రామయ్య మైకు పట్టుకుని... ఇప్పుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులు వేదికమీదకొచ్చి చంద్రబాబు గారికి చెరో చెంబు బత్తాయి జ్యూస్‌ తాగించి దీక్షను ప్రారంభిస్తారని ప్రకటించాడు. ఆ మాటకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఎవరన్నా దీక్ష విరమించేటప్పుడు జ్యూస్‌ తాగిస్తారు. దీక్ష మొదలుపెట్టేటప్పుడు ఈ జ్యూస్‌ తాగించడమేంటి... అది కూడా చిన్నగ్లాస్‌ కాదు, చెంబుడంట అనుకుంటూ ఇద్దరూ వేదికపైకి వెళ్ళి చంద్రబాబుకు చెరో చెంబు జ్యూస్‌ తాపించారు. దాంతో ఆ నిముషం నుండి దీక్ష మొదలైనట్లయ్యింది. ఇక పక్కనే ఏర్పాటు చేసిన వేదికపై సినీ యాక్టర్ల డ్యాన్స్‌లు, కామెడీ షోలు, సంగీత విభావరి కార్యక్రమాలు యధావిధిగా జరగసాగాయి. స్టేజీమీ దున్నోళ్లకి, స్టేజీ ముందున్నోళ్లకు గ్యాప్‌ లేకుండా జ్యూస్‌లు, ఆహార పొట్లాలు అందించసాగారు. ఈలోపు నాయకులు వేదికమీదకెక్కి స్పీచ్‌లు దంచ సాగారు. టైం దండిగా వుండడంతో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రసంగాలలో తమ టాలెంట్‌ చూపసాగారు. నిరాహారదీక్ష చేయడంలో గాంధీ, పొట్టి శ్రీరాములు, కేసీఆర్‌లు చంద్రబాబు ముందు దిగదుడుపేనన్నట్లు మాట్లాడ సాగారు. అప్పుడే సభా ప్రాంగణంలోకి లోకేష్‌ వచ్చాడు. అతని చేతిలో '30రోజుల్లో తెలుగుభాష' అనే పుస్తకం వుంది. అది చూడగానే చంద్రబాబు గుండె గతుక్కుమంది. వెంటనే పక్కనేవున్న మంత్రి నారాయణను పిలిచి... లోకేష్‌ వేదికపైకి వచ్చి మాట్లాడతాడేమో... అతని చేతిలో వున్న బుక్‌ను చూస్తుంటే భయమేస్తుంది... అసలే ఈరోజు నా బర్త్‌డే... వాడేం మాట్లాడతాడో తెలీదు... కాబట్టి స్టేజీ ఎక్కకుండా చెయ్‌ అని బ్రతిమలాడాడు. నారాయణ 'మైహూనా' అంటూ చంద్రబాబుకు హామీ ఇచ్చాడు. అంతలో వూహించని విధంగా బాలకృష్ణ స్టేజీ ఎక్కి మైకందుకున్నాడు. తనదైన శైలిలో ప్రసంగం మొదలుపెట్టాడు. రామ్‌నాథ్‌ కోవింద్‌ను చూస్తూ... హిందీలో... ''మోడీ మన్‌కే బాద్‌... హమారీ దిల్‌కేధడక్‌'' అంటూ కట్‌ హిందీ మాట్లాడాడు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అర్ధం కావాలని చైనీస్‌ భాషలో... ''చుంగే చాంగ్‌ చుప్‌కీ లక్‌చక్‌ వాంగ్‌ జులాంగ్‌ లపాంగ్‌'' అని మాట్లాడాడు. జపాన్‌ ప్రధాని షింజో అబేకు అర్ధం కావాలని కొద్దిసేపు ''మికీచువా చమ్లి చివో చెమ్మామ ఇఫినే మిత్సుబిషి హోండా ఒనిడా'' అంటూ మాట్లాడాడు. బాలకృష్ణ అన్ని భాషలు మాట్లాడడం చూసి చంద్రబాబుకే మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. అక్కడే వున్న దేవినేని ఉమను పిలిచి మా బాలయ్య అన్ని భాషలు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు అని అడిగాడు. నోట్లో నుండి ఇతర భాషలు బయటకు రావాలంటే చదువుకోబల్లేదు సార్‌ అంటూ దేవినేని వెళ్ళిపోయాడు. చంద్రబాబుకు ఆ మాట అర్ధం కాక బుర్రగోక్కోసాగాడు. అంతలో సాయంత్రం 7గంటలయ్యింది. వర్ల రామయ్య మైకందుకుని చారిత్రాత్మకమైన చంద్రబాబు గారి దీక్ష ముగిసిందని ప్రకటించాడు.

-----------

ఇక్కడితో స్క్రీన్‌ మీద సీన్‌లు అయిపోయాయి. తర్వాత ప్రొఫెసర్‌ మార్గరేట్‌ హల్వా విద్యార్థులనుద్దేశించి ప్రపంచ చరిత్రలో ఇంతవరకు గిన్నీస్‌బుక్‌ రికార్డు సృష్టించిన దీక్ష ఇదే! దాదాపు 30కోట్లు ఖర్చుపెట్టిన దీక్షగా ఇది రికార్డుల్లో కెక్కింది. ఈ దీక్షపై మీరు పరిశోధనలు చేయగలరా? అని ఆమె ప్రశ్నించింది. వెంటనే విద్యార్థులు... మూకుమ్మడిగా మేము చేస్తాం... మేము చేస్తాం... అంటూ చేతులు పైకెత్తారు.

Read 50 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter