25 May 2018 Written by 

కాంగ్రెస్‌ది తప్పటడుగేనా?

congressరాజకీయాలలో ఉంటే రాజులా వుండాలి. లేదంటే రాజు అన్యాయాలను, అక్రమ పరిపాలనను ఎదురించే పోరాట యోధుడిలా వుండాలి. అంటే ప్రతిపక్షం అన్నమాట. ఈ రెండుపాత్రలు తప్పితే భారత రాజకీయాలలో ఇంకే పాత్రయినా నిరర్ధకమే!

గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో రాజకీయ చర్చకు కారణమైన కర్నాటక సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడి ప్రమాణస్వీకారం తంతును కూడా పూర్తి చేసింది. ఇరు పార్టీల మధ్య మంత్రి పదవుల పంపిణీ కూడా సజావుగానే జరిగింది. కర్నాటక రాజకీయాలలో కింగ్‌మేకర్‌ అవుతాడనుకున్న జెడి(ఎస్‌) అధినేత కుమారస్వామి ఏకంగా కింగే అయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ కర్నాటక పీఠం బీజేపీకి దక్కకూడదన్న సోనియాగాంధీ లక్ష్యమే కుమారస్వామికి లక్షణంగా సీఎం కుర్చీని అప్పగించింది.

మొదట గవర్నర్‌ పిలుపు ప్రకారమే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆయనకు బల నిరూ పణకు గవర్నర్‌ 15రోజులు గడువు ఇచ్చినా, సుప్రీం కోర్టు రూపంలో యడ్యూరప్పకు అపశకునం ఎదు రైంది. కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు యడ్యూరప్ప బలనిరూపణకు ఒకరోజే గడువు ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. విపక్షాల ఎమ్మెల్యేలను క్యాంపులు పెట్టి మరీ కట్టడి చేయడంతో తగినంత సంఖ్యా బలం లేక బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సివచ్చింది. ఆయన రాజీనామా చేయగానే కాంగ్రెస్‌తో పాటు ఆయా ప్రాంతీయపార్టీల నేతలు ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టిందని, రాజ్యాంగ విలువలను సుప్రీంకోర్టు కాపాడిందంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్టేట్‌ మెంట్లిచ్చారు. ఇలా ప్రజాస్వామ్య విలువలు గురించి ప్రవచనాలు చెప్పిన వారిలో తన రాష్ట్రంలో విపక్షానికి చెందిన ముగ్గురు ఎంపీలను, 23మంది ఎమ్మెల్యేలను రిటైల్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా వుండడం గమనార్హం.

కర్నాటకలో ఇంతవరకు ముగిసింది ఒక ఎపిసోడ్‌ మాత్రమే! ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన పాత్రే తనంతట తానుగా ఆత్మహత్యకు బాటలు వేసుకున్నట్లుగా వుంది. బీజేపీని నిలువరించడం కోసం జెడి(ఎస్‌)కు కాంగ్రెస్‌ మద్దతు పలికింది. అంటే కర్నాటకలో అధికారపక్షం కాకపోగా కనీసం ప్రతిపక్ష పార్టీ పాత్రను కూడా తనంతట తాను వదులుకుంది. కుమారస్వామి మంత్రి వర్గంలో కాంగ్రెస్‌కు విదిల్చింది ముష్టి మంత్రిపదవులే! అసలు అధికారం ముఖ్యమంత్రిదే! కాబట్టి కర్నాటకలో వుండేది జెడి(ఎస్‌) ప్రభుత్వమే అవుతుంది.

యడ్యూరప్ప రాజీనామా చేయగానే కర్నాటకలో ప్రజాస్వామ్యం తిరిగి ప్రాణం పోసుకుందంటున్నారు. ఏ విధంగా ప్రాణం పోసుకున్నట్లు? కర్నాటక ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి, తిరస్కరించిన పార్టీకి అధికారం అప్పగించింది కాంగ్రెస్‌. ఇదేనా ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవడం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, జెడి(ఎస్‌)ల మధ్య పొత్తులేదు. ఎవరికి వాళ్ళే విడివిడిగా పోటీ చేసారు. ఎన్నికల ప్రచారంలోనూ ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకున్నారు. ఇరు పార్టీలు కూడా అన్ని స్థానాలలో పోటీచేసాయి. ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీకి 104సీట్లొచ్చి పెద్దపార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇక అన్నిచోట్ల పోటీ చేసిన జెడి(ఎస్‌) 38స్థానాలలో మాత్రమే నెగ్గింది. అది కూడా ఆ పార్టీకి వచ్చిన సీట్లన్నీ దాదాపు ఒక ప్రాంతంలోనివే! సీట్ల పరంగా చూస్తే ప్రజలు బీజేపీని ఆదరించారు. ఓట్ల పరంగా చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్‌కు అదనంగా రెండు శాతం ఓట్లొచ్చాయి. అంటే అన్ని ప్రాంతాలలో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించ లేదు. కర్నాటక ప్రజల తీర్పు బీజేపీ లేదా కాంగ్రెస్‌లకు అనుకూలంగా వుండింది. జెడి(ఎస్‌) దాదాపు 150సీట్లలో మూడోస్థానంలో వుండడమో, డిపాజిట్లు కోల్పోవడమో జరిగింది. జెడి(ఎస్‌)ను కర్నాటక ప్రజలు అధికారంలో వుండాలని కోరుకోలేదు. కుమారస్వామిని ముఖ్యమంత్రిగా కోరుకోలేదు. ప్రజలు కోరుకోని దానిని కాంగ్రెస్‌ ప్రజల మీద రుద్దింది. కర్నాటకలో కాంగ్రెస్‌ తొందరపడి జెడి(ఎస్‌)కు మద్దతు తెలిపివుండ బల్లేదు. తమకు మద్దతునివ్వమని అడిగి వుండొచ్చు. కుమారస్వామికి డిప్యూటి సీఎంను ఆఫర్‌ చేసి ఉం డొచ్చు. ఒకవేళ జెడి(ఎస్‌) తమతో రాకుండా బీజేపీతో వెళ్ళివుంటే హూందాగా ప్రతిపక్ష పాత్రను స్వీకరించి ఉండొచ్చు. ఇప్పుడు కర్నాటకలో పూర్తిగా అధికారం లేక, అటు ప్రతిపక్షంగా లేక కాంగ్రెస్‌ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అయ్యింది.

ఒకపక్క కాంగ్రెస్‌ ఒక్కో రాష్ట్రంలో కనుమరు గవుతూ పోతుంది. ఈరోజు ఆ పార్టీకి ఉండేది రెండే రెండు రాష్ట్రాలు పంజాబ్‌, మణిపూర్‌. మరో పక్క బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటూ పోతోంది. బీజేపీ లక్ష్యం ఒక్కటే! ఏ రాష్ట్రంలోనైనా అధికారాన్ని సాధించడమా లేకుంటే ప్రతిపక్షంగానైనా ఉండడమా? ఈరోజు దేశంలో 20రాష్ట్రాలలో ఆ పార్టీ సొంతంగా లేదా భాగస్వామ్య పార్టీలతో అధికారంలో వుందంటే కారణం కొడితే అధికారం లేదంటే ప్రతిపక్షంగా పోరాటం అనే మార్గాన్ని అనుసరించడమే. కాబట్టే ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ జెండా కనపడడమే గగనం అనుకున్న రాష్ట్రాలలోనూ ఈరోజు ఆ పార్టీ అధికారంలో వుందంటే వారు అనుసరించిన మార్గమే దానికి కారణం. కమ్యూనిష్టు కంచుకోటలు పశ్చిమబెంగాల్‌, కేరళలోనూ ఆ పార్టీ ఎదుగుతుందంటే కారణం... టార్గెట్‌ అధికారమే కాదు, ప్రతిపక్షంగానైనా వుండాలన్న తపన కూడా! బీజేపీ ఎంచుకున్న మార్గానికి భిన్నంగా కాంగ్రెస్‌ పయనిస్తోంది. కాబట్టే ఒక్కో రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోతోంది. కర్నాటకను కూడా వాళ్ళు ఇలాగే చేసుకున్నట్లయ్యింది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter