Friday, 25 May 2018 09:17

బాబు లేకే బీజేపీకి కష్టం - భేతాళకథ

Written by 
Rate this item
(0 votes)

galpikaపట్టువదలని విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌థర్టీకల్లా నిద్ర లేచాడు. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి తన గది నుండి బయటపడ్డాడు. మూలాపేట సెంటర్‌లో బిర్యాని తిని మద్రాసుబస్టాండ్‌ వద్దకొచ్చి ఒక ఆటో ఎక్కి పెద్దాసుపత్రి వద్ద దిగాడు. పెద్దాసుపత్రిలోని మార్చురీ వద్దకు వెళ్ళి ఫ్రెష్‌గా వున్న బాడీని చూసుకుని భుజాన వేసుకుని జిఎన్‌టి రోడ్డు మీదుగా బోడిగాడితోటలోని రోటరీ క్లబ్‌ శ్మశానవాటిక వైపు నడవసాగాడు. టీటీడీ కళ్యాణ మండపం దాకా వెళ్ళేసరికి కాస్తున్న ఎండదెబ్బకు విక్రమార్కుడికి చెమటలు కారసాగాయి. ఇక లాభం లేదు... ఈ భేతాళుడు రాత్రి బాగా తాగి నిద్రపోతున్నట్లున్నాడు... ఇక నేను నడవ లేను... ఈ బాడీని ఆటోలో వేసుకుని పోదామనుకుని ఆటోను ఆపి బాడుగ మాట్లాడుతున్నంతలో బాడీలోని భేతాళుడికి మెలకువ వచ్చింది. వెంటనే అతను విక్రమార్కుడితో... రాజా, మనుషులు సైతం నడవడానికి భయపడే ఈ ఎండల్లో నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు జాలి, దయ రెండూ కంబైన్డ్‌గా కలుగు తున్నాయి. నీకు శ్రమ తెలియకుండా వుండేందుకు లేటెస్ట్‌ పొలిటికల్‌ స్టోరీ షార్ట్‌ ఎడిటింగ్‌లో చూపిస్తాను, అలా డిఆర్‌ బార్‌కు పోదాం పద అంటూ తీసు కెళ్ళాడు. బార్‌లో కూర్చున్నాక భేతాళుడు నాలుగు బీర్లు ఆర్డర్‌ చేసి కథ చెప్పడం మొదలుపెట్టాడు.

రాజా, ఇటీవలే కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాక హంగ్‌ ఏర్పడింది. పెద్ద పార్టీగా ఏర్పడ్డ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్‌ ఆహ్వానించడం, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం చకచక జరిగిపోయాయి. బీజేపీ పూర్తి మెజార్టీకి 8 సీట్ల దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు ఆ 8 మందిని ఎలా గైనా కొనాలని బేరసారాలు మొదలు పెట్టారు. ఈలోపు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించుకుపోసాగాయి. కర్నాటకలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, రాజ్యాంగ విలువలను బీజేపీ కాల రాసిందని రాజ్యాంగ రక్షక బిరుదాం కితుడు, తనకు అవసరం లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ లను, 23మంది ఎమ్మెల్యేలను హోల్‌ సేల్‌గా కొని రాజ్యాంగ విలువలను తు.చ తప్పకుండా పాటించిన చంద్రబాబు నాయుడు భలే బాధపడ్డాడు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా వున్న ఆ 3రోజులు ఆయన తిండి తినలేదు. కునుకూ తీయ లేదు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటారా అని ఆవేదన చెందాడు. ఎట్టకేలకు కొనుగోలు తంతు లేకపోవ డంతో ఊపిరిపీల్చుకుని ఇప్పుడు ప్రశాం తంగా కడుపుకు రెండు పుల్కాలు తింటు న్నాడు. కర్నాటక సంఘటనపై రాహుల్‌ గాంధీ కూడా భలే సీరియస్‌ అయ్యాడు. గతంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల ఉసురు తీసిన కాంగ్రెస్‌ పార్టీయే భారత ప్రజా స్వామ్యాన్ని రక్షించగలదని, బీజేపీ రాజ్యాంగ హననానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇక తెలుగు మీడియా(పచ్చ) ఛానెల్స్‌ అయితే బీజేపీపై విరుచుకుపడ్డాయి. పచ్చ ఛానళ్ళ ప్రతి నిధులే ప్రత్యర్థులుగా మారి టీవీ చర్చా వేదికలలో బీజేపీ నాయకులను ఉతికి ఆరేసారు. ఈ పరిస్థితులు ఇలా వుండగా కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో మెజార్టీ వున్న తమను కాదని, గవర్నర్‌ బీజేపీని ఆహ్వా నించడం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను విచా రించిన సుప్రీంకోర్టు బల నిరూపణకు గవర్నర్‌ ఇచ్చిన రెండువారాల గడువును ఒక్కరోజుకు తగ్గించేసింది. గవర్నర్‌ 15 రోజుల గడువు ఇచ్చాడుగా... తాపీగా బేరసారాలు చేసి కనీసం 10మంది ఎమ్మెల్యేలనన్నా లాగొచ్చులే అనుకున్న బీజేపీ నాయకులకు సుప్రీం ఇచ్చిన గడువుతో గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కుంది. అప్పటికప్పుడు హడావిడి చేసినా ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనలేక పోయారు. సీన్‌ ముందే వూహించిన యడ్యూరప్ప బలనిరూపణకు పోకుండానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏడుస్తూ వెళ్లిపోయాడు. యడ్యూరప్ప రాజీనామా చేయగానే ప్రజాస్వామ్యం బ్రతికి చీరకట్టిందని ప్రజాస్వామ్య పుత్రుడు చంద్రబాబు ప్రకటించాడు. ఇది రాజ్యాంగ విజయమంటూ రాహుల్‌ గాంధీ నొక్కివక్కాణించాడు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ భారీగా బాణాసంచా కాల్చి తన కార్యకర్తలకు బెంగాళీ స్వీట్స్‌ పంచింది. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆనందంతో చీపుర్లు పట్టుకుని రోడ్లు వూడ్చాడు.హైదరా బాద్‌లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పెద్ద దావత్‌ ఏర్పాటు చేశాడు. తీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ పీకల దాకా పచ్చిగడ్డి తిని పండగ చేసుకున్నాడు. బీజేపీ అధికారంలో వున్న మూడ్రోజులు తమతమ ఛానెల్స్‌లో ఏడుస్తూ వార్తలు చెప్పిన న్యూస్‌ రీడర్‌లు, యాంకర్‌ల ముఖాలలో బీజేపీ దిగి పోగానే ఆనందం వెల్లివిరిసింది. వారి ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి... అని భేతాళుడు స్టోరీ ముగించి.. రాజా, కేంద్రంలో ప్రభుత్వాన్ని పెట్టుకుని కూడా బీజేపీవాళ్ళు కేవలం 8మంది ఎమ్మెల్యే లను ఎందుకు కొనుక్కోలేకపోయారు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినా తెలియకపోయినా సచ్చినట్లు చెప్పా ల్సిందే... చెప్పకపోయావో టీటీడీలో సీనియర్‌ అర్చకుడివై చంద్రబాబు ద్వారా మానసిక క్షోభకు గురవుతావని బెది రించాడు.

దానికి విక్రమార్కుడు, భేతాళ... ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం చంద్రబాబు నాయుడు... అని చెప్పాడు. అదెలా అని భేతాళుడు అడిగాడు. అందుకు విక్ర మార్కుడు... బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలోనూ, వారి చేత క్యాంపులు నిర్వహించడంలోనూ నిష్టా గరిష్టుడైన చంద్రబాబును దూరం చేసుకున్నారు. 1985లో నాదెండ్ల వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలను కూడగట్టిన అనుభవశాలి... 1995లో అదే ఎన్టీ ఆర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను చీల్చిన ధీశాలి... 2014 నుండి వైసిపికి చెందిన 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసిన అపర మేధావి... ఈ కష్టకాలంలో ఆయనే గనుక బీజేపీకి తోడుండుంటే 8మంది ఎమ్మెల్యేలేం ఖర్మ 80మంది ఎమ్మెల్యేలను ఈజీగా లాగే సుండేవాడు. యడ్యూరప్పకు సీఎం సీటును వదలాల్సిన పని వుండేది కాదు. చంద్రబాబును దూరం చేసుకోబట్టే కర్నాటకలో కుర్చీ కమలానికి దూర మైందని చెప్పాడు. ఈ సమాధానానికి సంతృప్తి చెందిన భేతాళుడు ఇంకో రెండు బీర్లు చేతిలో పట్టుకుని డిఆర్‌ హోటల్‌ పైనే వున్న సెల్‌టవర్‌ ఎక్కేసాడు.

Read 45 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter