Friday, 01 June 2018 09:22

స్పృహతప్పి పడిపోయిన శ్రీవారు

Written by 
Rate this item
(0 votes)

galpikaకలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం. అప్పుడే సుప్రభాతం, అర్చన, తోమాలసేవ వంటి సేవలు ముగిసి ఆరగింపుసేవ మొదలైంది. అర్చకులు పెద్దపాత్రలలో ప్రసాదాలు తెచ్చిపెట్టారు. శ్రీవారు తనకిష్టమైన లడ్డును ఒక పాత్రలో నుండి తీసుకుని నోట్లో పెట్టుకోబోతుండగా... 'ఉన్నావా అసలున్నావా... ఉంటే కళ్ళు మూసుకున్నావా... ఈలోకం కుళ్ళు చూడకున్నావా...' అనే పాట వినిపించింది. ఆ పాట దెబ్బకు ఉలిక్కిపడి శ్రీనివాసుడు ఆ పాట పాడింది ఎవరా అని చూసాడు. అక్కడచూస్తే కేసీఆర్‌ పాట పాడు తున్నాడు. ఆయనతో పాటే డొనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్ర మోడీ, వై.యస్‌.జగన్‌, గాంధీజీ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ తదితరులున్నారు. స్వామి వారిని చూస్తూ... ఏం ఇలా వచ్చారు, ఏం కష్టమొచ్చింది నాయనలారా అని అడిగాడు. అప్పుడు కేసీఆర్‌ ఏం చెప్పమంటారు స్వామి... చెబితే అయ్యేది కాదు మీరే చూడండి అంటూ గాల్లో వేళ్ళతో స్క్రీన్‌ గీసి సీన్స్‌ ప్లే చేసాడు.

------

అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు. హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు ఈ హైదరాబాద్‌ ఈరోజు ఇలా వుందంటే దానికి కారణమెవరు... నేనే. 60ఏళ్ళ పాటు ఈ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు. పార్టీ వేదికమీదే వున్న టీడీపీ నేత ఎల్‌.రమణకు ఏదో సందేహం వచ్చి... సార్‌, మీ వయసు ఇప్పుడు 68ఏళ్ళు... 60ఏళ్ళ నుండి హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేసారు... అంటే మీరు 8వ యేట నుండే ఇక్కడ వున్నారా అని సందేహం వెలిబుచ్చాడు. దానికి చంద్రబాబు... 8ఏళ్ళ వయసులో మా అమ్మనాన్నలతో కలిసి హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చాను. అప్పుడు మా బంధువుల ఇంటి పక్కనే ఇంకొకరు ఇళ్ళు కట్టుకుంటూ ఇసుక తోలించి వున్నారు. అప్పుడు నేను ఆ ఇళ్ళు కట్టేవారికి నా చిన్ని దోసెళ్ళతో ఇసుక అందించాను... అంటే 60ఏళ్ళ క్రితం నుండి హైదరాబాద్‌ నిర్మాణానికి నేను కష్టపడుతున్నట్లే కదా అని చెప్పాడు. ఆ లాజిక్‌కు ఎల్‌.రమణ కళ్ళు గిర్రున తిరిగాయి. కొద్దిసేపటికి తేరుకుని తన కుర్చీలో కూర్చున్నాడు. చంద్రబాబు తన ప్రసంగం కొనసాగిస్తూ... హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టించింది నేనే అని చెప్పాడు. అది విన్న మరో టీడీపీ నాయకుడు నర్శిరెడ్డి... అదెలా కుదిరింది సార్‌ అని అడిగాడు. దానికి చంద్రబాబు... మీరు చదువుకునేటప్పుడు 'అట్లాస్‌' అనే బుక్‌ చూసే వుంటారు. అంతకుముందు ఇండియా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు మాత్రమే వ్రాసేవాళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్‌ అనే చోట హైదరాబాద్‌ అని కూడా రాయించాను. ఆ విధంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని వివరణ ఇచ్చాడు. ఓహో అట్లాగ పెట్టించారా అని నర్సిరెడ్డి కూర్చున్నాడు. చంద్రబాబు తన ప్రసంగం కొనసాగిస్తూ... తమ్ముళ్ళూ బేగంపేట ఎయిర్‌పోర్టు మన ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. నిమ్స్‌ ఆసుపత్రిని నా చెమట చిందించి మరీ కట్టాను. చార్మినార్‌ కట్టడానికి ఆరోజుల్లో లక్షరూపాయలు మంజూరు చేయించింది నేనే! హైదరాబాద్‌కు ఎలాగైనా విమా నాలను తీసుకురావాలని చెప్పి బేగంపేటలో ఎయిర్‌పోర్టును కట్టించాను. కళాకారుల కోసం రవీంద్ర భారతి, ప్రేమికుల కోసం ట్యాంక్‌బండ్‌ కట్టించాను. ప్రతిపక్షాలన్నీ గోల్కండ కోట కడుతుంటే వ్యతిరేకించాయి. కాని, నేను ప్రజా సంక్షేమం కోసం దానిని కట్టించాను. ఈరోజు హైదరాబాద్‌కు అదొక ల్యాండ్‌ మార్క్‌గా నిలిచింది. ఆరోజుల్లోనే భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు బ్రిటీష్‌ వారితో తెగ పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గాంధీతో కలిసి ఉప్పు, కందిపప్పు, మినపప్పు సత్యాగ్రహాలు నిర్వహించాం.. తెలంగాణ విమోచనోద్యమంలోనూ మన పార్టీ కీలకపాత్ర పోషించింది. నిజాంను బెండుతీసి లొంగదీయడానికి సైన్యాన్ని పంపించమని సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌కు సలహా ఇచ్చింది నేనే.. మద్రాసు నుండి విడిపోయాక తెలుగురాష్ట్ర రాజధానిని కర్నూలు నుండి హైదరాబాద్‌కు మార్చింది నేనే. మీకో విషయం తెలుసా తమ్ముళ్ళూ... ఐ.కె.గుజ్రాల్‌, దేవేగౌడ, వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోడీలు ప్రధానులు కావడానికి కారణం నేనే. సచిన్‌కు సిక్సర్‌లు కొట్టడం నేర్పింది, ధోనీని కీపింగ్‌ నేర్చుకోమన్నది నేనే... ఒలం పిక్స్‌లో సింధు తెచ్చిన స్వర్ణపతకం నా పుణ్యమే. సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్‌ సిఇఓ అయినా, సుందర్‌ పిచాయ్‌ గూగూల్‌ సిఇఓ అయినా నా నుండి స్ఫూర్తి పొందారు కాబట్టే. ఈరోజు అమెరికాలో వున్న ప్రవాసభారతీయులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా, ప్రపంచ దేశాలలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నడుస్తున్నాయన్నా, అసలు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాడన్నా దానికి కారణం ఎవరో తెలుసా? అని ఆవేశంగా ప్రశ్నించాడు. సభలో వున్న వాళ్ళు ''మీరే మీరే'' అంటూ కేకలేసారు.

ఇక్కడితో ఎయిర్‌ స్క్రీన్‌ మీద సీన్‌లు ఆగిపోయాయి. తర్వాత కేసీఆర్‌ ఇదీ స్వామి చంద్రబాబు పరిస్థితి. హైదరాబాద్‌లో ప్రతి అంగుళం నేనే అభివృద్ధి చేసానంటాడు. ఆయన ఏది చెబితే అదే వార్తన్నట్లు పచ్చమీడియా డప్పు కొడుతుంది స్వామీ అని చెప్పాడు. వేంకటేశ్వరస్వామి వారితో... చంద్రబాబు మాటలతో మీరంతా ఎఫెక్ట్‌ అవుతున్నారు బాగానే వుంది... మరి ఈ ట్రంప్‌ ఎందుకొచ్చినట్లు అని అడిగాడు. అప్పుడు ట్రంప్‌... నాకు తండ్రితో సమస్య లేదు స్వామి... వచ్చిన తలనొప్పంతా కొడుకు లోకేష్‌తోనే. ఇటీవల అమెరికాకు వచ్చిన ఆయన... అమెరికాలోనూ తెలుగుదేశాన్ని అధికారంలోకి తెస్తానని చెప్పాడు. అప్పటి నుండి నాకు భయం పట్టుకుంది. ఆ అబ్బాకొడుకులను మా అమెరికా వైపు చూడకుండా చేయండి స్వామి అని వేడుకున్నాడు. అంతలో లోపల నుండి పద్మావతి దేవి పరుగెత్తుకొచ్చింది... స్వామీ ఈ విచిత్రం చూసారా అంటూ టచ్‌స్క్రీన్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ టీవీ ఛానెల్‌ 9I9=99 ఛానెల్‌ పెట్టింది. విజయవాడలో తెలుగుదేశం మహానాడు... తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ... తిరుమల వెంకన్న అసలు పేరేంటో తెలుసా ''నారా వెంకన్నచౌదరి''... ఆయనను శిలగా మలచింది, ఆయనకు దేవుడి హోదా ఇచ్చింది మన చంద్రన్నచౌదరినే... మన చంద్రన్న చౌదరి కాంతితోనే ఆ వెంకన్నచౌదరి వెలిగిపోతున్నాడు... అని చెప్పాడు. ఆ మాటలకు శ్రీనివాసుడు కళ్ళు తిరిగి అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు.

Read 38 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter