నెల్లూరులో నేడు (123)

tankbundఎట్టకేలకు స్వర్ణాల చెరువు త్వరలోనే సరికొత్త సొగసులను సంతరించు కోబోతోంది. మనకంటూ నగరంలో ఒకమంచి ఆహ్లాదకర ప్రాంతం లేదే అని దిగాలుపడుతున్న పౌరులకు ఇదో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం కానుంది. సింహపురీయుల కల మరో ఏడాదిన్నరలోనే సాకారం కాబోతోంది. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం కావడం సంతోషకరం.

పురజనులు తీరికవేళల్లో ఆనందంగా, ఆహ్లాదంగా గడిపేందుకు నెల్లూరు చెరువు ఒక ఆహ్లాద కేంద్రంగా ఏర్పాటు కాబోతోంది. నగరాన్ని సుందర నందనం చేయాలనే ఆలోచనల్లో భాగంగానే, నెల్లూరు చెరువు (స్వర్ణాల చెరువు) అందుకు కేంద్రం కానుంది. దాదాపు 36 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చెరువును అత్యంత సుందరంగా, ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎంతో విశాలంగా వున్న ఈ చెరువు మధ్యలో ఒక ద్వీపాన్ని అభివృద్ధి చేయాలని, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ఆమరణదీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆ ద్వీపం మధ్యలో భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో వున్న బుద్ధుని విగ్రహం మాదిరిగానే శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేసి, రాత్రి వేళల్లో సైతం ఈ ప్రాంతమంతా విద్యుత్‌ శోభలతో శోభాయమానంగా వుండేలా తీర్చిదిద్దాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెరువు వద్ద అందమైన రీతిలో స్వాగత ద్వారాలు నిర్మించాలని, ఇక్కడకు వచ్చేవారిని బాగా ఆకట్టుకునేవిధంగా ఈ ప్రాంతంలో అన్ని విధాలైన హంగులు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. చెరువు మధ్యలో ఏర్పాటు చేయనున్న ద్వీపం ప్రాంతమంతా చక్కని పూల మొక్కలతో సుందరమైన ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని, పచ్చదనంతో.. పూలమొక్కలతో కళకళలాడేలా చూడాలని, మంచి రంగులు, ఆందమైన డిజైన్లతో.. నీటి ఫౌంటెన్‌లతో.. విద్యుత్‌ కాంతులతో ఆ ప్రాంతమంతా ఆకర్షణీయంగా వుండాలనే లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

అంతేకాదు, చెరువు కట్టమీది నుంచి చెరువు మధ్యలో వున్న ఆ ప్రాంతం దాకా వెళ్ళేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు అత్యాధునికమైన మరపడవలు కూడా సిద్ధం చేస్తున్నారు. చెరువును సందర్శించే ప్రజలకు, చిన్నారులకు పడవ ప్రయాణం ఒక మరపురాని అనుభూతిగా వుండేలా చూడాలని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు చెరువు వద్ద వున్న ఏడెకరాల స్థలంలో యోగా కేంద్రం, క్రీడలకు ఏర్పాట్లు, ఆహార దుకాణాలు తదితరాలన్నిటినీ ఏర్పాటు చేయాలని, చెరువు చుట్టూ దాదాపు ఆరు కిలోమీటర్లు వున్న చెరువుకట్టను పటిష్టం చేసి, సైకిల్‌ట్రాక్‌, నడకదారి ఏర్పాటు చేసి ప్రజలకు ఆనందం..ఆహ్లాదం పంచాలని భావిస్తున్నారు. ఈ సుందరీకరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకం నుంచి 36కోట్లు కేటాయించిందని, నిపుణుల బృందం దీనిని పరిశీలించి నివేదిక కూడా అందించిందని, త్వరలోనే ఈ పథకం అమలు కానుందని భావిస్తున్నారు. ఒకటిన్నర సంవత్సరం లోపే ఈ పనులన్నీ పూర్తిచేయాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులు ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనులు త్వరితగతిన ప్రారంభ మయ్యేందుకు కృషిచేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే.. స్వర్ణాల చెరువుకు స్వర్ణకాంతులు వచ్చినట్లే మరి!...

roadsభూగర్భ డ్రైనేజీ పేరుతో నెల్లూరులోని రోడ్లన్నింటిని ధ్వంసం చేసారు. నగరంలోని ప్రతి వీధిలోనూ సిమెంటురోడ్డు వేసి వుండడం తెలిసిందే! 1994-2004ల మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలోనూ 2004-2014ల మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ నగరంలో సిమెంట్‌రోడ్లు బాగానే పడ్డాయి. ముఖ్యంగా 2011-2014ల మధ్య ఆనం రామనారాయణరెడ్డి ఆర్ధికమంత్రిగా వున్నప్పుడు నెల్లూరుకు భారీగానే నిధులు రావడం, పెద్దఎత్తున సిమెంటురోడ్లు వేయడం జరిగింది.

నగరంలో వందలకోట్ల ఖర్చుతో వేసిన సిమెంట్‌రోడ్లన్నింటిని ఇటీవల భూగర్భడ్రైనేజీ పైపులు వేయడం కోసం ధ్వంసం చేయడం తెలిసిందే! ప్రతి వీధిలో ప్రతి సిమెంట్‌రోడ్డును మధ్యలో కోసి పైపువేసి తిరిగి మట్టితో పూడ్చారు. మధ్యలో కోసిన సిమెంట్‌రోడ్లను ఎక్కడా కాంక్రీట్‌తో పూడ్చలేదు. వీటన్నింటిని కాంక్రీట్‌తో సరిచేయడానికి ఇంకో సంవత్సరకాలం పట్టొచ్చు. కానీ ఈలోపు వర్షాలతో వీధులన్నీ బురదమయం అవుతున్నాయి. వర్షాలతో మట్టి కొట్టుకుపోయి సిమెంట్‌రోడ్ల మధ్యలో గోతులు ఏర్పడుతున్నాయి. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయకపోతే వాహనాలు ఈ గోతుల్లో పడే అవకాశాలున్నాయి. నిన్న మొన్న కురిసిన కొద్దిపాటి వర్షాలకే పగలగొట్టిన రోడ్ల మీద వాహనాలు తోలాలంటే భయపడుతున్నారు. రేపు భారీ వర్షాలొచ్చి రోడ్లు మీద నీళ్ళు పారుతుంటే పరిస్థితి ఇంకెలా ఉంటుందో?

credit cardదోపిడీ అనేది ఏ రూపంలో అయినా జరిగిపోతుంటుంది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ కరెన్సీని పెంచాలని ప్రభుత్వం ప్రచారం చేయడం తెలిసిందే! డిజిటల్‌ కరెన్సీతో దోపిడీలు, మోసాలు, టోటల్‌గా నేరాలు తగ్గుతాయన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం. ఇంట్లోనో, జేబులోనో కరెన్సీ రూపంలో నగదు వుంటే దోపిడీకి ఆస్కారం వుంటుంది. అదే డిజిటల్‌ కరెన్సీ అయితే దొంగల బాధ ఉండదనే నమ్మక ముంది. అయితే మోసగాళ్లు ఇంకా తెలివి మీరిపోయారు. డిజిటల్‌ కరెన్సీని కూడా వదలడం లేదు.

ఎల్లయ్యకు ఒక నెంబర్‌ నుండి ఫోన్‌ వచ్చింది.. ఎల్లయ్య ఫోన్‌ ఆన్‌ చేశాడు. అవతల నుండి వాయిస్‌... మేం కస్టమర్‌ కేర్‌ నుండి మాట్లాడుతున్నామండి, మీ ఏటిఎం కార్డు రెన్యూవల్‌ చేయాలి, ఒక్క సారి కార్డుపైన వున్న పిన్‌కోడ్‌ నెంబర్‌ చెబుతారా అని ఎంతో వినయంగా అడుగుతారు. ఎల్లయ్య వెంటనే కార్డు మీద నెంబర్‌ చూసి చెప్పేస్తాడు. తర్వాత సివివి నెంబర్‌, ఓటిపి నెంబర్లు కూడా అడిగాడు. ఎల్లయ్య చెప్పేసాడు. ఫోన్‌ పెట్టేయగానే ఎల్లయ్య ఫోన్‌కు మెసేజ్‌... అతని అకౌంట్‌లో 70వేలు కట్‌... ఎల్లయ్యకు పరిస్థితి ఏమీ అర్ధం కాలేదు. సైబర్‌ మోసగాళ్ళు క్షణాల్లోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా ఎల్లయ్య అకౌంట్‌లో వున్న 70వేల రూపాయలను ఊడ్చేసారన్నమాట. ఇది ఉదాహరణ. ఇటీవల జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువుగానే జరిగాయి. సైబర్‌ నేరగాళ్లు ఏ పశ్చిమబెంగాల్‌ నుండో బీహార్‌ నుండో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహిస్తుం టారు. అక్కడ నుండే ఇక్కడున్న వారి అకౌంట్లలో డబ్బులు ఊడ్చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పోయిన డబ్బులు తిరిగి రావనే ఉద్దేశ్యంతో బాధి తులు ఫిర్యాదు చేయడం లేదు. ముఖ్యంగా ఈ విషయంలో బ్యాంకులు, పోలీసులు, మీడియా కూడా ప్రజలను, ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులు వాడే ఖాతాదారులను అప్రమత్తం చేయాల్సి వుంది. క్రెడిట్‌ కార్డు పిన్‌ నెంబర్‌ చాలా రహస్యం. ఎవరు ఫోన్‌ చేసి పిన్‌ నెంబర్‌ అడిగినా వెంటనే చెప్ప కుండా ఖాతాదారులు జాగ్రత్త పడాలి. ఖాతాదారుడి క్రెడిట్‌ కార్డు పిన్‌కోడ్‌తో బ్యాంకు అధికారులకు పని లేదు. దానికి సంబంధించిన సమస్య ఏదైనా వుంటే ఖాతాదారులు నేరుగా బ్యాంకులకే వెళ్లి మాట్లాడుకోవచ్చు. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆ విధంగా చైతన్యపర చాల్సిన అవసరం వుంది.

kotam edupuసీనియర్‌ సిటిజన్‌లు, విశ్రాంత ఉద్యోగులు సేద తీరడం కోసం, నలుగురు కలిసి మంచిచెడ్డలు చెప్పుకుంటారనే సదుద్దేశ్యంతో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో 'పెద్దలకొలువు' పేరుతో వారికి విశ్రాంతి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదటి పెద్దల కొలువుకు నెల్లూరు, పొదలకూరురోడ్డులో ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు కొంచెం స్థలంలో సీనియర్‌ సిటిజన్స్‌ చేతుల మీదుగానే శంకుస్థాపన చేయించారు. తన స్వంత నిధులతో దీనికి స్లాబు కూడా వేయించారు. నగర కమిషనర్‌ నోటి మాట తీసుకునే ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు దీని నిర్మాణం చేపట్టాడాయన!

అయితే గత నెల 31వ తేదీ నుండి ఈ నెల 3వ తేదీ వరకు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరగడం తెలిసిందే! ఈ కూల్చివేతల పరంపరలో ఈ నెల 3వ తేదీన కార్పొరేషన్‌ సిబ్బంది 'పెద్దలకొలువు' విశ్రాంతి మందిరాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసేసారు. అడ్డుకోబోయిన వృద్ధులను పోలీసుల సాయంతో నెట్టేసారు. 'పెద్దలకొలువు'ను కుప్పకూల్చారన్న సంగతి ఓ పెళ్లి వేడుకకు హాజరై వున్న కోటంరెడ్డికి తెలిసింది. ఆయన వెంటనే సంఘటనా స్థలికి వచ్చారు. కుప్పకూలిన తన ఆశల సౌధం చూసి ఆయన మనసు ముక్కచెక్కలైంది. హృదయం మూగబోయింది. అక్కడే కూలబడిపోయి భోరున విలపించాడు. దాదాపు గంటసేపు మండుటెండలోనే కూర్చుని నిరసన తెలిపాడు. కార్పొరేషన్‌ కమిషనర్‌ ఢిల్లీరావు పరిస్థితి సీరియస్‌ కావడాన్ని గమనించి అక్కడకు చేరుకు న్నాడు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ సమన్వయ లోపంతోనే ఇలా జరిగిందని, పెద్దల కొలువుకు తానే మాట పూర్వకంగా అనుమతినిచ్చానని ఒప్పు కున్నారు. అనుమతి లేని భవనం కాబట్టి స్లాబుకు బొక్కలు పొడవమంటే, సిబ్బంది పూర్తిగా కూల్చారని, సమన్వయలోపం వల్లే ఇలా జరిగిందని బాధపడ్డారు.

'పెద్దలకొలువు' కూల్చివేతతో ఈ ప్రాంత ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వంలో, అధికా రంలో ఉన్నోళ్ళు చేయలేని పనిని ప్రతిపక్ష ఎమ్మెల్యే చేస్తుంటే, దానిని కూడా అడ్డుకో వడర ఎంత దుర్మార్గమని ప్రశ్నిస్తున్నారు.

కాగా, 4వ తేదీన కూల్చిన స్థలం లోనే తిరిగి 'పెద్దలకొలువు' పునరుద్ధర ణకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శ్రీకారం చుట్టాడు. ఈసారి ఇక కార్పొరేషన్‌ వాళ్ళు దానిజోలికి పోకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారికే కోటంరెడ్డి అంటే ఏంటో వాళ్ళు చూశారు.

busesఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లకు వెళ్తే... ఇన్సూరెన్స్‌ ఫిటింగ్‌...!

జిల్లా అధికారి చెప్పాడంటూ బెదిరింపులు

బెంబేలెత్తుతున్న వాహన యజమానులు

అతడు కేవలం కానిస్టేబుల్‌. హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ వచ్చినా ట్రాన్స్‌ఫర్‌ వస్తుందనే భయంతో ప్రమోషన్‌ని తిరస్కరించి ''పిట్‌నెస్‌'' విభాగ టేబుల్‌కే పదమూడేళ్ళుగా పరిమితమైపోయిన పవర్‌ఫుల్‌ కానిస్టేబుల్‌.

కుటుంబసభ్యుల పేరుతో ఇన్సూరెన్స్‌ కంపెనీ పెట్టాడు, దొడ్డిదారిలో అక్రమార్జన మరిగాడు. స్కూళ్ళ యజమానులకు చుక్కలు చూపిస్తున్నాడు. వందలాది వాహనాలకు తానే ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా మారాడు. ఆ ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా దొడ్డిదారిన భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వాహన యజమానులు, స్కూళ్ళ యజమాన్యాలూ దిక్కు తెలియక ఎవరికి మొరపెట్టుకోవాలో అర్ధంకాక సతమతమౌతున్నారు.

నెల్లూరు నగరంలో ఇప్పుడు 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌' ఏమిటంటే, 'ఫిట్‌నెస్‌' సర్టిఫికెట్ల మాయాజాలమే. ఎక్కడ విన్నా దీనిగురించే చర్చ జరుగుతోంది. ఈ సర్టి ఫికెట్‌ల పేరుతో వాహనాల యజమాను లను నిలువుదోపిడీ చేస్తున్నారనే విషయం నగరమంతా వినిపిస్తోంది. రవాణా శాఖలో జరుగుతున్న ఈ మాయాజాలం పై ప్రజలు, వాహనాల యజమానులు జోరుగానే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే, ఆర్టీఏ కార్యాలయంలో ఓ పేరుమోసిన కాని స్టేబుల్‌ ఈ తంతు అంతా గుట్టుచప్పుడు కాకుండా కానించేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నెల్లూరు నగరంలో కనీసం వెయ్యికి పైగానే స్కూల్‌ బస్‌లు వున్నాయి. ఇవి కాక, ఆటోలు, ఇతరత్రా వాహనాలు పెద్దసంఖ్యలోనే వున్నాయి. అయితే, ఇవన్నీ ఏడాదికోసారి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసు కోవాలి. ఇదే అదనుగా, ఆ విభాగంలో వున్న ఓ కానిస్టేబుల్‌ ధనార్జనకు మరిగి, అక్రమాలకు తెరతీసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ ప్రహసనం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక ఆయనదే ఇష్టారాజ్యమైపోయిందని,

గత పదమూడేళ్ళుగా అదే సీట్‌లో పాతుకుపోయిన ఆయన, తన కుటుంబ సభ్యుల పేరుతోనే ఓ ఇన్సురెన్స్‌ కంపెనీ కూడా ప్రారంభించి, వందలాది వాహ నాలకు తానే ఇన్సురెన్స్‌ ఏజెంట్‌గా మారాడని, ఈ సర్టిఫికెట్‌ల మాయా జాలంతో రెండుచేతులా అక్రమార్జన చేస్తున్నాడని వాహనాల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. తనకు హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ వచ్చినా, ఆ ప్రమోషన్‌ను అంగీకరిస్తే తానెక్కడికి బదిలీ అవాల్సివస్తుందేమోనని ప్రమో షన్‌ను కూడా తిరస్కరించిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఇంతగా ఆయన అక్కడ పాతుకుపోయినా పట్టించుకునే అధికారే లేడని వారు వాపోతున్నారు. అదేమని అడిగితే, జిల్లా ఉన్నతాధికారుల పేరు చెప్పి బెదిరిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ పరువు పోయే విధంగా, తన విభాగాన్నే అక్ర మాల అడ్డాగా మార్చుకుని అడ్డదిడ్డంగా ముడుపులు మూటగట్టుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ఉన్నతాధికారులైనా ఈ విష యాలు పరిశీలించి, నిజానిజాలు వెల్ల డించాలని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల పేరుతో జరుగుతున్న ఈ నిలువుదోపిడి విషయాన్ని విచారించి తగు చర్యలు తీసుకోవాలని వాహనాల యజమానులు కోరుకుంటు న్నారు. వాహనాల యజమానుల పట్ల ఇలా అక్రమరీతిలో వ్యవహరించడం అన్యాయమని, ఇకనైనా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల పంపిణీలో రవాణా అధికారులు నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించేవారిని ఆ విభాగంలో నియ మించాలని వాహనాల యజమానులు కోరుకుంటున్నారు.

pigsనెల్లూరు నగరంలో మంత్రులు, మేయర్‌, కార్పొరేటర్లు... అందరూ వందల కోట్లలో అభివృద్ధి పనుల గురించి మాట్లాడేవాళ్లే! కాని మూడేళ్లుగా చూస్తున్నాం కదా... మాటలెక్కువ, పనులు తక్కువ అన్నట్లుగా వుంది పనితీరు. నగరంలో ప్రజలకు ప్రధాన సమస్యగా మారింది పందులు, దోమలు. ఇప్పుడు కాస్తున్న ఎండల దెబ్బకు ముదురుదోమలు మలమల మాడి చస్తున్నాయి. కాని, పం దులు మాత్రం తగ్గడం లేదు. నెల్లూరులో మనుషుల కంటే పందులు సంఖ్య పెరిగి పోతోంది. కొంతమంది వీటిని కోసుకుని తింటుండబట్టి సరిపోతుంది గాని లేకుంటే నెల్లూరు రోడ్లు, వీధుల్లో మనుషులు నడవ డానికి కూడా సందులేనంతగా పందులు తిరుగుతుండేవి. నెల్లూరు నగరంలో మురికివాడల్లోనే కాదు, నెల్లూరు జూబ్లీ హిల్స్‌గా చెప్పుకునే మాగుంట లే అవుట్‌, ఆదిత్యనగర్‌ వంటి ప్రాంతాల్లో కూడా పందులు మందలు మందలుగా తిరుగు తున్నాయి. పందుల పెంపకందార్ల దెబ్బకు జడిసి పాలకులు పందుల ఏరివేత జోలికి పోవడం లేదు. కాని, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఢిల్లీరావు మాత్రం పందుల విషయంలో చాలా సీరియస్‌గా వున్నాడు. 22వ తేదీ ఆయన తన ఛాంబర్‌లో శానిటేషన్‌ అధికా రులు, పందుల యజమానులతో మీటింగ్‌ పెట్టుకున్నారు. పందుల ఏరివేతకు వాళ్లకు 45రోజుల గడువిచ్చారు. ఆ గడువు తర్వాత ఏ సందులో పంది కనిపించినా కాల్చివేస్తామని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. ఈ విషయంలో కమిషనర్‌ గట్టిగానే వున్నట్లు కనిపిస్తోంది. ఆయన వార్నింగ్‌ పనిచేస్తే 45రోజుల తర్వాత మనకు నగరంలో చూద్దామనుకున్నా పందులు కనిపించకపోవచ్చు.

kotamరోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బుజబుజనెల్లూరు జాతీయ రహదారి ప్రాంతంలో సర్వీస్‌రోడ్డు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం జి.ఓ జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతవాసులు ఆనందభరితు లవుతున్నారు. నెల్లూరు నగరం ట్రంక్‌రోడ్డు జాతీయ రహదారిలో కలిసే చోట నుండి బుజబుజనెల్లూరు ప్రాంతం మొదటి భాగం వరకు సర్వీస్‌రోడ్డు లేదు. నెల్లూరులో నుండి బుజబుజనెల్లూరులోకి వాహనాలలో వెళ్లే వాళ్ళు చుట్టూ తిరుక్కుని పోలేక రాంగ్‌రూట్‌లో హైవే మీదనే పోతున్నారు. దీంతో అత్యంత వేగంగా వచ్చే వాహనాల వల్ల పలు ప్రమాదాలు జరిగాయి కూడా! నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ సర్వీస్‌ రోడ్డు యొక్క ప్రాధాన్యతను గుర్తించారు. నగరంలో సర్వీస్‌ రోడ్డు, అండర్‌పాస్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలంటూ 5 నెలలుగా పోరాడుతున్నాడు. ఈ సమస్యను కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తద్వారా వారి నుండి సర్వీస్‌రోడ్లు, అండర్‌ పాసింగ్‌ బ్రిడ్జిలకు హామీ సాధించారు. ఆయన కృషి ఫలితమే ఇప్పుడు బుజబుజనెల్లూరు సర్వీస్‌రోడ్డు పనులు మొదలయ్యాయి.

water problనెల్లూరులో తాగునీటి సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. గత ఏడాది వర్షాలు లేకపోవడం మూలంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బావులు, బోర్లు ఎండిపోయాయి. ఆయా కాలనీవాసులతో పాటు అపార్ట్‌మెంట్లలో వుండేవాళ్లు సైతం కార్పొరేషన్‌ నీళ్ల మీదే ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్‌లు బ్లాకై నీళ్ళు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. హోటల్స్‌, హాస్పిటల్స్‌ వంటి వ్యాపార సంస్థలతో పాటు అపార్ట్‌మెంట్లలో వుండే వాళ్లు కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్ళను కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేషన్‌ ఇచ్చే నీళ్ళు తాగడానికే సరిపోకపోతుండగా, కొందరు నీటిని ఇంటి వరండాలు తడపడానికి, ఇళ్లల్లో కార్లు కడగడానికి వృధా చేస్తున్నారు. కొన్ని కొళాయిల వద్ద వాల్వ్‌లు, టాప్‌లు పోయి నీటి వృధా ఎక్కువుగా ఉంటోంది. నీటివృధాపై కూడా కార్పొరేషన్‌ అధికారులు దృష్టి పెట్టాల్సివుంది.

theifనెల్లూరు నగరంలో జూబ్లీహిల్స్‌లాగా పేరుబడ్డ మాగుంట లే అవుట్‌లో ఇప్పుడు దొంగల భయం వెంటాడుతోంది. రాత్రిళ్లు ప్రశాంతంగా కునుకుతీసే పరిస్థితి లేకుండా పోయింది. 

ఇటీవల ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న వరుస సంఘటన లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత పదిరోజుల్లోనే లెక్చరర్స్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అర్థరాత్రి దాటాక గుర్తు తెలియని దుండగులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడేవున్న సెక్యూరిటీ గార్డ్‌ వారిని అడ్డగించడంతో దుండగులు అతని మీద దాడిచేసి పారిపోయారు. ఆ పక్కరోజే ఇదే కాలనీలో నివాసముంటున్న ఓ రిటైర్డ్‌ లెక్చరర్‌ ఇంటిలోకి దుండగులు ప్రవేశించారు. అయితే అలికిడికి ఆ ఇంటిలోని వారు లేచి అరవడంతో దుండగులు పరారయ్యారు. ఇవి జరిగిన పక్కరోజే మాగుంట లేఅవుట్‌ ఒకటి, రెండో వీధిల్లో వుంటున్న ఓ రెండిళ్లలో దోపిడీలకు దుండగులు స్కెచ్‌ వేశారు. సురేంద్రరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకులు ముందుగా అక్కడున్న సి.సి. కెమెరాలను గుడ్డలతో కప్పారు. వాచ్‌మెన్‌ రూమ్‌కు బయట గడిపెట్టి ఆ ఇంట్లోకి జొరబడాలని చూసారు. అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో, ఆ ఇంటి వెనుకే వున్న బాలచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించారు. కత్తితో కిటికీకున్న మెష్‌ను కత్తిరించి లోపల తగిలించి వున్న తాళాలను తీసుకున్నారు. వెనుకవైపు నుండి తలుపులు తెరచి లోపలకు ప్రవేశించారు. బీరువాను తెరచి నగదు, నగలు దొరక్కపోవ డంతో విలువైన పట్టుచీరలను మూటగట్టారు. ఈ సమయంలో బాలచంద్రారెడ్డి భార్యకు మెళుకువ రావడం, ఇంట్లో ఎవరో దూరినట్లు ఆమె గుర్తించి అలికిడి చేయడంతో ఆగంతకులు పారిపోయారు.

మాగుంట లే అవుట్‌లో గతంలోనూ ఇంటి దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువుగానే జరిగి వున్నాయి. మాగుంట లే అవుట్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ పెట్టినా పెద్దగా

ఉపయోగం లేదు. ఇందులో పోలీసులే ఉండడం లేదు. రాత్రి గస్తీలు అంతంత మాత్రంగా వుంటున్నాయి. దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసుల నుండి వెంటనే స్పందన రావడం లేదు. పోలీసుల నిఘా కొరవడడం వల్లే దొంగలు యధేచ్ఛగా రెచ్చిపోతున్నారు. మాగుంట లే అవుట్‌లో రాత్రి గస్తీలు ముమ్మరం చేస్తేనేగాని ఈ ప్రాంత ప్రజలు ప్రశాం తంగా ఉండలేరు.

mangoesకృత్రిమ రసాయ నాలతో పండ్లను మాగ బెట్టి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడితే సహించేది లేదంటూ న్యాయస్థానాలు చేసిన హెచ్చరికలు సత్ఫ లితాలనే ఇస్తున్నట్లుంది. ఎండాకాలం అంటే మామిడిపండ్ల సీజన్‌. వీటితో పాటు పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, నేరేడు వంటి కాయలు మార్కెట్‌లోకి వచ్చినా ఈ సీజన్‌లో మామిడిపండే కింగ్‌! ఈ కాలంలో మామిడి పండు తినని మనిషంటూ ఉండడు. మామిడిపండ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ప్రతి ఏడాది కాయ కాపుకు రాకముందే చెట్ల నుండి కోసి రసాయనాలతో మగ్గబెట్టేవాళ్ళు. దీనిమూలంగా పండు పైతొక్క నిగనగలాడుతుండేది, కోసి చూస్తే లోపలంతా చెడిపోయి ఉండేది. ఇలాంటి పండ్లు రుచిగా కూడా వుండవు. ఎవరైనా ఆరోగ్యం కోసం పండ్లు తింటారు. కాని రసాయనాలతో మాగేసిన మామిడిపండ్లను తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లుండేది. న్యాయస్థానం దీని మీద చాలా సీరియస్‌గా స్పందించడమే కాక ఒకట్రెండు కేసుల్లో ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వ్యాపారులకు శిక్షలు కూడా వేసింది. దీంతో రసాయనాలతో మాగేసే విధానం తగ్గిపోవడంతో మార్కెట్‌లో మామిడి పండ్లు చాలా తక్కువుగా కనిపిస్తున్నాయి. లేకుంటే ఇదివరకే మామిడి పండ్లు మార్కెట్‌లో గుట్టలు గుట్టలుగా ఉండేవి.

Page 1 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter