adalaఎన్నికలు దగ్గరకొస్తున్నాయంటే చాలు... రాజకీయ వర్గాలలో ప్రధానంగా చర్చకు వచ్చే పేరు ఆదాల ప్రభాకర్‌రెడ్డి. పార్టీలకు ఈయనంటే సంక్రాంతి పందెంకోడి లెక్క. ఆయన ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం వుంది. అదే సమయంలో అధికారంలోకి వచ్చే పార్టీలోనే ఆయన చేరుతుంటాడనే వాళ్లూ లేకపోలేదు. 1999లో తెలుగుదేశం నుండి అల్లూరు అభ్యర్థిగా పోటీ చేసాడు. ఆ ఎన్నికల్లో ఆయన గెలవడమే కాదు, తెలుగుదేశం పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 2004, 2009లలో సర్వేపల్లి నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆ రెండుసార్లు కూడా ఆయన గెలవడమే కాదు, కాంగ్రెస్‌ కూడా అధికారంలోకి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తిరిగి తెలుగుదేశంలో చేరాడు. నెల్లూరు లోక్‌సభ నుండి పోటీ చేసాడు. లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోతాడనుకున్న స్థానంలో గట్టిపోటీ ఇచ్చి కేవలం 15వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఆదాల ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌ వుంది.

రాబోయే ఎన్నికలనాటికి ఆయన ఏ పార్టీలో వుంటాడన్నది చర్చనీయాంశమైంది. తన మీద వస్తున్న ఊహాగానాలకు తెరదించడానికే ఆయన ఇటీవల విలేకరుల సమావేశం పెట్టి తాను తెలుగుదేశం పార్టీని వదిలే ప్రసక్తేలేదని చెప్పుకొచ్చాడు.

ఉదయం ఆరునూరైనా పార్టీ మారేది లేదని చెప్పి, సాయంత్రానికి పార్టీ జెండాను మారుస్తున్న నాయకులున్న కాలమిది. కాబట్టి ఆదాల మాటలను నూరు శాతం నమ్మాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంలో ఆయనకు సీటు ఢోకా లేదు. నెల్లూరు లోక్‌సభ కాని, లేదా ఏదో ఒక అసెంబ్లీ సీటు గాని ఆయనకు గ్యారంటీ!

అదే సమయంలో వైసిపి నుండి కూడా ఆయనకు ఆఫర్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి నెల్లూరు పార్లమెంట్‌కు టీడీపీ నుంచి అయితే ఆయన గట్టి పోరాటం చేయాల్సి వుంటుంది. అదే వైసిపి నుండైతే గెలుపు అవకాశాలు ఎక్కువ. అదీగాక ఈసారి నెల్లూరు పార్లమెంటు సీటును సిట్టింగ్‌ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన మీదున్న వ్యతిరేకత లోక్‌సభ ఎన్నికలపైనే కాకుండా అసెంబ్లీ అభ్యర్థుల మీద కూడా పడే అవకాశముంది. కాబట్టి ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఆయన వద్దని ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు కోరుకుంటున్నారు. ఎంపీగా ఆదాల వస్తే తమనెత్తిన పాలు పోసినట్లని, గెలుపు అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఆదాల ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

tddతిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గాన్ని త్వరలో భర్తీ చేసే అవకాశా లున్నాయి. టీటీడీ ఛైర్మెన్‌ పదవి కోసం రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్‌లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఎంపీలకు టీటీడీ ఛైర్మెన్‌ ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో తెరపైకి కొత్త ఆశావహులొచ్చారు. ఇందులో నెల్లూరు జిల్లా నాయకులు కూడా ఉండడం విశేషం. 2014ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి పోటీ చేసి గట్టి పోటీనిచ్చి ఓడిపోయిన మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పదవిని ఆశిస్తున్నాడు. చంద్రబాబు మనసుపెట్టి ఆదేశిస్తే టీటీడీ ఛైర్మెన్‌గా పనిచేసి చరిత్రలో నిలిచిపోవాలని భావిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో అన్ని విధాలా నష్టపోయిన ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎటువంటి పదవులు ఇవ్వలేదు. పార్టీలో మాత్రం బాధ్యతలు పెంచారు.

రాజధాని కమిటీసభ్యులుగా వున్న బీద మస్తాన్‌రావు బీసీ వర్గాల తరపున టీటీడీ ఛైర్మెన్‌ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడు బిఎంఆర్‌. పార్టీకి ఆర్ధికంగా కూడా అండగా నిలిచాడు. పార్టీని కష్టకాలంలో వీడకుండా నడిచాడు. 2014 ఎన్నికల్లో కావలి నుండి ఓడిపోయిన ఆయన ఆ తర్వాత రాజ్యసభ సీటును ఆశించాడు. అయితే అది నెరవేరలేదు. ఇప్పుడు టీటీడీ ఛైర్మెన్‌ పదవికి రేస్‌లో వున్నట్లు తెలుస్తోంది. అలాగే నెల్లూరు మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధ పేరు కూడా మహిళా కోటాలో టీటీడీ బోర్డు సభ్యురాలుగా వినిపిస్తోంది. జిల్లాలో ఎవరికి ఛైర్మెన్‌ పదవి వచ్చినా రాకున్నా వీరిలో ఒకరికి మాత్రం టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా అవకాశం రావచ్చు.

adalaనెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం చివరి దాకా ప్రయత్నించిన మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు మొండిచేయి చూపించాడు. మంత్రి నారాయణ, తనయుడు లోకేష్‌ అండదండలు దండిగా వున్న వాకాటి నారాయణరెడ్డినే అభ్యర్థిగా ఖరారు చేశారు.

పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మరికొందరు నాయకులు కూడా ఆదాల ఎమ్మెల్సీ అయితే నెల్లూరులో మరో పవర్‌ సెంటర్‌ ఏర్పాటవుతుందని భావించి ఆయనకు సీటు రాకుండా అడ్డుకున్నారు. అదీ కాకుండా ఇప్పటికే జిల్లా నుండి ఎమ్మెల్సీలుగా వున్న నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రలు నెల్లూరులో ఉండేవాళ్లే! కాబట్టి ఆదాలకిస్తే ఆయన కూడా నెల్లూరు చుట్టే తిరిగేవాడు. అదే వాకాటికిస్తే గూడూరు డివిజన్‌ కోటాలోకి వెళతాడు. నెల్లూరుకు రాకుండా ఆ సూళ్లూరుపేట చుట్టుపక్కల తిరుగుతుంటాడు... ఈ కోణంలోనే ఆయనకు అవకాశం వచ్చింది.

మరి వాకాటికన్నా ఆదాల ఎందులో వెనుకబడ్డట్లు? వాకాటి కంటే ముందే పార్టీలోకి వచ్చాడు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకుంటే ఆదాల పోటీ చేసాడు. ఉపఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి దాదాపు 3లక్షల మెజార్టీతో గెలిచిన ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మెజార్టీని ఆ ఎన్నికల్లో 13వేలకు దించాడు. ఒక దశలో మేకపాటిని ఓడించినంత పని చేశాడు. ఎంపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేయబట్టే తెలుగుదేశం కొంతన్నా పటిష్టమైంది. ఆదాల వల్ల తెలుగుదేశం గట్టిపడింది. మరి ఎన్నికల్లో ఓడిపోయాక ఆదాలకు పార్టీ ఏం ఇచ్చింది. రాజ్యసభకు పంపిస్తానన్న చంద్రబాబు హామీ పేలపిండిలాగా గాలికిపోయింది. నెల్లూరు పార్లమెంటుతో పాటు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా ఆయనను నియమించారు. వాటి వల్ల అధికారిక హోదా రాదు. చంద్రబాబు ఇస్తానన్న రాజ్యసభపై ఆశలు లేవు. ఈ దశలో ఎమ్మెల్సీ అన్నా ఉంటే బాగుంటుందని ఆదాల భావించారు. అందుకోసమే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులోకి వచ్చాడు. ఈ సీటు తనకు కావాలని బలంగానే పట్టుబట్టాడు. కాని ఈ సీటు వాకాటికి ఎప్పుడో రిజర్వ్‌ చేసి పెట్టారు. లోకేష్‌ వద్దే దీని తంతు ముగిసింది. మొన్న నామినేషన్ల ముందురోజు దాకా ఆదాల పేరును కూడా పరిశీలిస్తున్నట్లు డ్రామా ఆడారు. చివరకు తమ మదిలో వున్న వాకాటి పేరునే బయటపెట్టారు. ఆదాల అడ్డం తిరక్కుండా ఆయనను బుజ్జగిస్తున్నారు. అదేదో నామినేటెడ్‌ పదవికి కూడా ఆశపెట్టారు. ఆదాలకు ఏ పదవి ఆశ చూపినా కూడా ఎమ్మెల్సీ సీటు విషయంలో మాత్రం వాకాటి ముందు ఆయనను చిన్నచూపు చూసినట్లే!

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter