anam ramఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మంత్రి నారాయణ స్వయంగా ఫోన్‌ చేసి ఆత్మకూరులో నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని కోరినా రామనారాయణ రెడ్డి వినలేదు. నేనుండడం లేదు, మీ పాటికి మీరు చేసుకోండని చెప్పినట్లు తెలుస్తోంది. 8వ తేదీ చంద్రబాబు పర్యటనకు హాజరు కావాలని కోరినా తాను ఆరోజు నెల్లూరులో ఉండడం లేదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన టీడీపీని వీడనున్నాడనే విషయం అర్ధమైపోయింది. ఆయనను పార్టీలో నిలబెట్టాలని నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫల మయ్యాయి. అయితే ఆత్మకూరులో జరిగిన రాజకీయ పరిణామాలను చూసి స్థానికంగా వున్న ఓ వర్గం వాళ్ళు మాత్రం తెలుగు దేశం పార్టీ వాళ్ళకు ఇలా జరగాల్సిందేలే అని చంకలు గుద్దుకుంటున్నారు.

ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరిన తర్వాత అప్పటి వరకు ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహ రించిన గూటూరు కన్నబాబును పక్కనపెట్టారు. ఇన్‌ఛార్జ్‌గా కన్నబాబు అప్పుడప్పుడే ఆత్మకూరులో వర్గాన్ని పెంచుకుంటున్నాడు. 2014 ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ఇన్‌ఛార్జ్‌గా వుంటూనే పార్టీ అధికారంలో వుంది కాబట్టి అన్ని శాఖలపై అజమాయిషీ చేసాడు. అనుచరులకు పనులు చేసిపెట్టాడు. కొంతవరకు వర్గాన్ని కూడగట్టాడు. సడెన్‌గా ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడం, ఇన్‌ఛార్జ్‌గా ఆయనను నియమించడంతో కన్నబాబు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

ఇప్పుడు ఆత్మకూరులో తెలుగుదేశం బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే ప్రశ్న వస్తోంది. కన్నబాబుకు బాధ్యతలు ఇచ్చినా మళ్ళీ మొదటి నుండి పరుగు మొదలుపెట్టాలి. మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును రంగంలోకి దించినా పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. ఆయన ఆత్మకూరుకు దూరమై పదేళ్ళు కావస్తోంది. ఇక్కడ మునుపటి హవా వుండకపోవచ్చు. మొత్తానికి ఆనం వెళితే ఆత్మకూరు టీడీపీలో రాజకీయ శూన్యత ఖాయం.

ramnaనెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు.

ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలమిచ్చేలా రామనారాయణ రెడ్డి వ్యవహారశైలి కూడా వుండింది. తన మరణానికి ముందు ఆనం వివేకానందరెడ్డి తన తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డితో... మనం దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల తప్పు చేసామని, టీడీపీలో చేరి పొరపాటు చేసామని ఇక ఈ పార్టీలో వుండొద్దని చెప్పినట్లు బయటకు పొక్కడం తెలిసిందే! దీనికి తగ్గట్లుగానే ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరనున్నాడని, ఆత్మకూరు లేదా వెంకటగిరిలలో ఒక సీటు ఆయనకు ఇవ్వొచ్చని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. వివేకా ఆసుపత్రిలో వున్నప్పుడు పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళితే కూడా రామనారాయణరెడ్డి అక్కడ వుండకుండా వచ్చేసాడు. పార్టీ మారాలను కున్నాడు కాబట్టే సీఎం ముఖం చూడడానికి ఇష్టపడలేదని ఆరోజు అందరూ అనుకున్నారు.

అయితే ఆ తర్వాత ఆనం కుటుంబంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవించలేదు. వైసిపి నుండి క్లియరెన్స్‌ లేకపోవడంతో ఆయన ఆ పార్టీలో చేరలేదు. ఈలోగా వివేకా స్వర్గస్థులు కావడం, ఏప్రిల్‌ 25వ తేదీన నెల్లూరులో జరిగిన ఆయన అంత్యక్రియలకు చంద్రబాబు రావడం, ఆనం కుటుంబ సభ్యులతో సమావేశమై పరామర్శించడం జరిగాయి. ఇటీవల అమరావతిలో జరిగిన నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల సమావేశానికి కూడా ఆనం రామనారాయణరెడ్డి హాజరు కాలేదు. కాని ఆ సమావేశంలో చంద్రబాబు మాత్రం రామనారాయణరెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల రాలేదని, ఆనం కుటుంబం మనతోనే వుంటుందని జిల్లా నాయకులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు అయితే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలోనే వున్నాడు. టీడీపీ నాయకత్వం కూడా ఆయనను పార్టీలో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆత్మకూరుకు ఆయన్నే అభ్యర్థిగా ప్రతిపాదిస్తోంది.

అయితే ఇక్కడ ఆనం అనుచరుల పరిస్థితి ఇంకోరకంగా వుంది. ఆత్మకూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా అయితే గెలవలేమని వాళ్ళు రామనారాయణరెడ్డితోనే చెబుతున్నారు. ప్రజల్లో మీరంటే అభిమానం వుంది, అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకత వుంది. ఈ పార్టీలో వుంటే కష్టం. వైసిపిలోకి పోదామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే వైసిపి నుండి ఎటువంటి హామీ లేకుండా పార్టీ మారాలనే ఆలోచనలో ఆయన లేడు. ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఆత్మకూరు కంటే కూడా ఉదయగిరిలో పోటీ చేయాలని ఆ ప్రాంత నాయకులు ఆనంను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి ప్రాంతంలోనూ ఆనం రామనారాయణరెడ్డికి మంచి పేరుంది. ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరుకే కాక ఉదయగిరి ప్రాంతానికి కూడా సోమశిల హైలెవల్‌ కెనాల్‌ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టాడు. అదీగాక ఈ నియోజకవర్గానికి కొత్త నాయకుడవుతాడు. నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో సత్సంబంధాలున్నాయి. ఈ దృష్ట్యా టీడీపీలోనే వుంటే ఆయనకు ఉదయగిరి బెటర్‌ అనే అభిప్రాయం వినపడుతోంది.

ప్రస్తుతానికైతే ఆయన రాజకీయ ఊగిసలాటలో వున్నట్లే! ఎలక్షన్‌లో పనిచేయాల్సిన అనుచరులే టీడీపీ నుండి అయితే ఆత్మకూరులో మనం ఓడిపోతామని పదేపదే చెబుతుంటే ఎవరైనా వెనకడుగు వేయాల్సిందే! అలాగని వైసిపి వాళ్ళు పిలవకుండా ఆ పార్టీలోకి పోలేడు. ఇంకొన్ని నెలల పాటు ఆనం రామనారాయణకు ఈ అయోమయ పరిస్థితి తప్పకపోవచ్చు.

viveka cigarనెల్లూరు చరిత్రను రెండు భాగాలుగా విభజిస్తే స్వాతంత్య్రానికి పూర్వం మనకు తెలిసిన రాజు మనుమసిద్ధి మహారాజు. నెల్లూరుసీమను గొప్పగా ఏలాడని పేరు. రెండో భాగంలో స్వాతంత్య్రం అనంతరం చూస్తే నెల్లూరును ఏకచత్రాధిపత్యంగా 20ఏళ్ళ పాటు ఏలిన రారాజుగా ఆనం వివేకా మనకు కనిపిస్తాడు. జిల్లా రాజకీయాలలోనే కాదు, బహుశా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఇలాంటి విలక్షణ, విశిష్ట రాజకీయ లక్షణాలున్న నాయకుడు మనకు కనిపించడు.

విలక్షణం అతని లక్షణం

రాజకీయాలలో విలక్షణతకు మారుపేరు వివేకా. ఆయన రూటే సపరేటు. అందరూ నడిచిన దారిలో ఆయన నడవడు. ఆయన ముఖ్యమంత్రి కాదు... కనీసం మంత్రిగా కూడా చేయలేదు. కాని రాష్ట్ర స్థాయిలో పాపులారిటీ సంపాదించాడు. వివేకా అంటే వెరైటీ నాయకుడు అనే బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఆయన భాష... ఆయన గెటప్‌... ఆయన సెటప్‌... ఎలాంటి డ్రెస్‌లనైనా వేయగలడు. పంచ రంగుల కళ్ళద్దాలు పెట్టగలడు. ఎలాంటి టోపీనైనా తన తలపై పెట్టుకోగలడు. చిన్నపిల్లలతో కలిసిపోగలడు, వృద్ధులతో కలిసి నడవగలడు. అందుకే అలాంటి నాయకుడు ఇక నెల్లూరుకు దొరకడం కష్టమే.

జీవితంలో ఆయనకి తోడు 9849459590

నాగార్జున హీరోగా నటించిన 'శివమణి' సినిమా చూసే వుంటారు. ఆ సినిమాలో హీరో పాత్రధారి నాగార్జున తన సెల్‌ నెంబర్‌ ప్రజలకిచ్చి.. ఏ క్షణంలోనైనా ఫోన్‌ చెయ్యండి... రెండు కిలోమీటర్ల దూరంలో వున్నా రెండు నిముషాల్లో మీముందుంటా అని చెబుతుంటాడు. వివేకా ధోరణి కూడా అలాగే వుండేది. సాధారణంగా ఎమ్మెల్యేల సెల్‌ నెంబర్లు సామాన్య ప్రజలకు దొరకడం కష్టం. దొరికినా వీళ్ళు ఫోన్‌ చేస్తే ఎమ్మెల్యేలు ఫోన్‌ ఎత్తడం ఇంకా కష్టం. కాని వివేకా అలా కాదు. ఆయన మున్సిపల్‌ ఛైర్మెన్‌గా వున్నప్పటి నుండి కూడా ఆయన సెల్‌ నెంబర్‌ 9849459590 నెల్లూరు ప్రజల మైండ్‌లో ఎప్పుడూ వుండేది. ఎవరు ఏ సమయంలో ఏ సమస్య వచ్చి ఫోన్‌ చేసినా ఆయన ఎత్తుకునేవాడు. ఒకవేళ బిజీగా వుండి ఆ క్షణంలో ఫోన్‌ ఎత్తకపోయినా ఆయనే మిస్‌డ్‌కాల్స్‌ చూసి తిరిగి చేసేవాడు. ఇలా వివేకాతో ఫోన్‌ ద్వారా మాట్లాడినవాళ్ళు నగరంలో వేలమంది వున్నారంటే అతిశయోక్తి కాదు.

1995 నుండి 2017 దాకా...

వివేకా రాజకీయ ప్రయాణంలో అత్యంత విలువైన కాలం ఈ ఇరవైఏళ్ళే! సాధారణ రాజకీయ నాయకుడిగా వున్న ఆయనను ప్రజానాయకుడిగా, ప్రజాకర్షణ నాయకుడిగా, ప్రజానాడి తెలిసిన నాయకుడిగా, ప్రజాదరణ పొందిన నాయకుడిగా మలచింది ఈ 20ఏళ్ళ కాలమే! 1995లో మున్సిపల్‌ ఛైర్మెన్‌గా గెలుపొందాక ఆయన పూర్తిస్థాయిలో ప్రజల మధ్య తిరగసాగాడు. ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలకు అందు బాటులో వుండే నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ ప్రజాభిమానం వల్లే వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. 20ఏళ్ళ పాటు నెల్లూరు నగరాన్ని ఏలిన ఏకైక నాయకుడు వివేకా అనిపించుకున్నాడు.

నెంబర్‌ వన్‌ భక్తుడు

వివేకాలో భక్తి విశ్వాసాలు మెండుగా వుంటాయి. నిద్రలేస్తే ఆయన ప్రస్తానం ఏదో ఒక గుడి వద్ద నుండే మొదలవుతుంది. రంగనాథస్వామి గుడి, మూలాపేట శివాలయం, వేణుగోపాలస్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, రాజరాజేశ్వరమ్మ, ఇరుకళలమ్మ దేవాలయాలను ఆయన తరచూ దర్శించుకుంటుంటారు. ఆరోగ్యం బాగున్నంతకాలం శరన్నవరాత్రుల రోజుల్లో రాజరాజేశ్వరమ్మ గుడిలో రోజూ 108 ప్రదక్షిణలు చేసేవాడు. ఇక బారాషహీద్‌ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగన్నా, గుడ్‌ఫ్రైడే నాడు శిలువను మోయడం అన్నా ఆయనకు ఎంతో ఇష్టం. తరుచూ తిరుమలకు వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకునేవాడు. వెంకటేశ్వరస్వామితో పాటు ఏసు ప్రభువును కూడా అమితంగా విశ్వసిస్తాడు.

నెల్లూరు వ్యాపారులకు బ్రాండ్‌ అంబాసిడర్‌

నెల్లూరులో వాణిజ్య సంస్థల వాళ్ళు తమ షోరూంల ప్రారంభోత్సవాలకు ఇప్పుడు సినిమా యాక్టర్లను తీసుకొస్తున్నారుగాని, ఒకప్పుడు నగరంలో ఏ షోరూం అయినా, ఏ షాపైనా ఆయన చేతుల మీదుగా ప్రారంభించాల్సిందే! ఆయన చేత్తో ప్రారంభించిన వ్యాపారం ఏదైనా బాగా జరుగుతుందనే నమ్మకం నెల్లూరీయులలో వుంది. అందుకే ఆయన డేట్స్‌ తీసుకుని మరీ ఓపెనింగ్‌లు పెట్టుకునేవాళ్ళు.

సినిమా, సిగరెట్‌ ఆయన బలహీనతలు

సెకండ్‌షో సినిమా అన్నా, ''డ్రమ్‌'' సిగరెట్లన్నా ఆయనకు భలే ఇష్టం. వారంలో కనీసం 7సినిమాలన్నా చూడాల్సిందే, రోజుకి 20 సిగరెట్లన్నా తాగాల్సిందే!

కిర్రు చెప్పులు

ఏదైనా వెరైటీగా చేసే వివేకా, వేసుకునే చెప్పులు కూడా వైవిధ్యమే. ప్రత్యేకంగా తయారు చేయించుకున్న కిర్రుచెప్పులనే ఆయన ఎక్కువగా వాడేవాడు.

కాపువీధికి కాపలాదారుడు

కాపువీధిలో బంగారు షాపులు, గుడ్డల అంగళ్ళు, ఇతర వ్యాపార సంస్థలు దండిగా వుంటాయి. వాటిలో విలువైన వస్తువులుంటాయి. అయితే రాత్రిళ్ళు ఇక్కడ కాపలాదారుడు, సెక్యూరిటీ గార్డులను నియమించుకునే పనుండేది కాదు. కాపువీధికి వివేకానే కాపలాదారుడు. రాత్రిళ్ళు ఆయన వెంట అనుచరులు కూడా ఉండేవాళ్ళు. దీంతో అర్ధరాత్రి దాటాక కూడా ఈ సెంటర్‌లో జనం వుంటుండడంతో దొంగలకు ఇటువైపు దోపిడీ ఆలోచన వచ్చేది కాదు.

మీడియాకు మిత్రుడు

వివేకా రాజకీయ ప్రస్థానంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ మీడియా పాత్ర చాలా వుంది. మీడియా ప్రతినిధులను ఎంతో గౌరవించేవాడు. అభిమానించేవాడు. నెల్లూరు మీడియాలో చాలా మంది విలేకరులకు ఆయన ఆప్తమిత్రుడు. 2008లో దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కొత్తూరు వద్ద 20ఎకరాల భూమిని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు కేటాయించడంలో వివేకా చేసిన కృషిని ఇంటి స్థలం పొందిన ఏ విలేకరి కూడా మరువలేడు.

నలుగురికీ నచ్చినదీ... నాకసలే నచ్చదులే!

నలుగురికీ నచ్చేది వివేకాకు నచ్చదు. జనానికి నచ్చనిది ఆయనకు నచ్చుతుంది. అదే ఆయన స్పెషల్‌. '8' అంకెను ఎవరూ ఇష్టపడరు. కాని వివేకా కొనే ప్రతి కారుకు '8' టోటల్‌ నెంబర్‌ వుంటుంది. ప్రతి కారుపై 116 రిజిష్టర్‌ నెంబర్‌ వుంటుంది. ఇక ఒంటెల బొమ్మలను ఇంటిలో పెట్టుకోవడం అశుభం అనుకుంటారు, కానీ వివేకా బెడ్‌రూంలోనే కాదు, ఆయన కారు వెనుక కూడా ఒంటె బొమ్మలే వుంటాయి. అమావాస్య, రాహుకాలం, యమగండం మనం అశుభం అనుకుంటే ఆయన ఆ కాలాలలోనే ఏ పనైనా మొదలుపెడతాడు.

ఆహారప్రియుడు

సాంప్రదాయ వంటలను వివేకా ఎక్కువుగా తినేవాడు. నాటుకోడి, తలకాయ కూర, చేపల పులుసు, బిర్యాని... వేణుగోపాల స్వామి గుడిలో చేసే హల్వా, పొంగలి, దద్దోజనం అంటే ఎంతో ఇష్టంగా తినేవాడు.

'గల్పిక' ద్వారా 'స్టైల్‌ ఆఫ్‌ సింహపురి'

'పద్మశ్రీ', 'పద్మభూషణ్‌' వంటి బిరుదులు ఇచ్చివున్నా వివేకాలో సంతోషం వుండేది కాదేమో... కాని 'స్టైల్‌ ఆఫ్‌ సింహ పురి' అనే బిరుదు మాత్రం ఆయనను ఎంతో సంతోషపరిచేది. ఆ పేరుతో ఆయనను సంభోదిస్తుంటే ఎంతో ఆనందపడేవాడు. 1998 నుండి 'లాయర్‌' వారపత్రికలో వస్తున్న 'గల్పిక' శీర్షిక ద్వారా ఆయనను 'స్టైల్‌ ఆఫ్‌ సింహపురి'గా పాఠకులకు పరిచయం చేసే అదృష్టం 'లాయర్‌'కు దక్కింది. క్రమేణా అది వాడుకలోకి వచ్చి ఆయన అభిమానులు, అనుచరుల మనసుల్లోకి ఎక్కిపోయింది. ఈరోజు 'స్టైల్‌ ఆఫ్‌ సింహపురి వివేకా'గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. 'లాయర్‌' పత్రికలో వారం వారం వచ్చే వ్యంగ్య రాజకీయ కథనం 'గల్పిక' శీర్షిక అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ శీర్షిక ద్వారా వెలువడిన అనేక స్టోరీలలో ఆయనదే ప్రధాన పాత్రగా వుండేది. గల్పికకు ఆయనకు అవినాభావ సంబంధముండబట్టే 2007 జూన్‌10న జరిగిన 'లాయర్‌' 26వ వార్షికోత్సవ వేడుకల్లో 'గల్పిక' శీర్షికల మొదటి భాగం పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించడం విశేషం.

వివేకా జీవిత చరిత్ర చాలా పెద్దది. అతని జీవితం 67ఏళ్లే అయినా ఇంకా 67ఏళ్ళకు చెప్పుకోవడానికి సరిపడా విశేషాలు ఆయన జీవితంలో కనిపిస్తాయి. తవ్వుకుంటూ పోతుంటే తరగని జ్ఞాపకాల గని వివేకా!

Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter