anam brosవి.ఆర్‌ విద్యాసంస్థలు... ఒకప్పుడు వెంకటగిరి రాజా విద్యాసంస్థలు అని పేరు. గత మూడు దశాబ్దాలుగా వివేకా నందరెడ్డి విద్యాసంస్థలుగా పేరుబడ్డాయి. ఈ విద్యాసంస్థలు ఆనం కుటుంబం చేతు ల్లోకి వచ్చాక వెంకటగిరి రాజాల పేరు మరుగునపడిపోయింది. వాళ్ళ పేరు సంబంధిత విద్యాసంస్థల డాక్యుమెంట్లలో తప్పితే ఎక్కడా కనిపించేది కాదు. విద్యా సంస్థలపై మొత్తం పెత్తనం ఆనందే అయ్యింది. కరస్పాండెంట్లు వాళ్ళే, కోశాధి కారులు వాళ్ళ మనుషులే. విఆర్‌ విద్యా సంస్థలను దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిం చారు. అయితే ఇన్నేళ్ళ పాటూ విఆర్‌ విద్యాసంస్థలు వారి చేతుల్లో అక్రమంగానే వున్నాయనే విషయం నిన్నటి సుప్రీం కోర్టు తీర్పుతో వెల్లడైంది. 1986లో జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నికైన పాలకవర్గం ఎన్నిక చెల్లదంటూ 27వ తేదీన సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇదే ఫైనల్‌ తీర్పు కావడంతో విఆర్‌ విద్యా సంస్థలపై ఆనం ప్రాభవానికి తెరదించి నట్లయ్యింది. ఈ ఏడాది జులై లోపు కొత్త కమిటీని ఎన్నుకోవాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది.

హిందూ మత ప్రాధాన్యతతో వెంకట గిరి రాజాలు 1875లో విఆర్‌ విద్యాసంస్థ లను ప్రారంభించారు. ఇవి అంచెలం చెలుగా విస్తరిస్తూ వచ్చాయి. 1940 నుండి విఆర్‌ విద్యాసంస్థల పాలకవర్గానికి ఎన్ని కలు నిర్వహించసాగారు. విఆర్‌ విద్యా సంస్థల కమిటీకి 1950, 1960, 1970 లలో ఎన్నికలు జరిగాయి. 1970లో ప్యాట్రన్‌గా వున్న పెద్ద రాజా యాచేంద్ర చనిపోయారు. అప్పుడు అధ్యక్షుడిగా వున్న కుమార రాజాను ప్యాట్రిన్‌గా, ఆనం వెంకటరెడ్డిని కొత్త అధ్యక్షుడిగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ప్రతి ఐదేళ్ళకోసారి నిర్వహించాల్సిన ఎన్నికలను జరపకుండా ఆనం వాళ్ళు కాలాన్ని నెట్టుకు రాసాగారు. 1985లో విఆర్‌ విద్యాసంస్థల పాలక వర్గానికి ఎన్నికలు జరపాలంటూ ఏబివిపి నాయకులైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆమం చర్ల శంకరనారాయణ, నందిమండలం చంద్రశేఖర్‌రాజులు నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ దాకా వెళ్లడంతో ఆయన స్పందిం చారు. నెల్లూరొచ్చి విఆర్‌ పాలకవర్గానికి ఎన్నికలు జరిపిస్తానని హామీ ఇచ్చి వీరిచేత దీక్షను విరమింపజేసారు. వీళ్ళు ఎన్నికల నైతే పెట్టించగలిగారు గాని ఆనం వాళ్ళు ఇంకో రూట్లో వెళ్ళి వీరి ప్రయత్నాలకు గండికొట్టారు. అప్పటి వరకు కమిటీలో సభ్యులుగా మెజార్టీవాళ్ళు ఆనంకే మద్ద తుగా వుండడంతో బైలాను సవరించారు. పూర్వవిద్యార్థులకు ఓట్లు లేకుండా చేసి 1986లో ఎన్నికలు నిర్వహించారు. అయితే పూర్వవిద్యార్థులు దీనిపై నెల్లూరు సివిల్‌ కోర్టులో కేసు వేయడంతో ఫలితాలు వెల్లడించలేదు. 1993లో పూర్వవిద్యార్థు లకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీంతో 1986లో జరిగిన ఎన్నికలకు సంబంధించి 1993లో ఫలితాలను వెల్ల డించారు. ఆ ఫలితాల ద్వారా ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌గా భారీ మెజార్టీతో గెలిచాడు. పూర్వవిద్యార్థుల ఓట్లు వుంటే ఫలితం ఇంకో విధంగా ఉండేదేమో! ఆనంవాళ్ళు దీనిని గ్రహించే పూర్వవిద్యార్థులకు ఓట్లు లేకుండా చేసారు.

అయితే పూర్వవిద్యార్థులైన ఆమంచర్ల శంకరనారాయణ, గూడూరు విజయరామి రెడ్డి, పోతుల రమణయ్యలు నెల్లూరు సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై 1996లో హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 15ఏళ్ళ తర్వాత ఈ కేసు 2015లో విచారణకొచ్చింది. ఆడిటర్‌ ఆమంచర్ల శంకరనారాయణ పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ కేసు గురించి పోరాడాడు. వాదోపవాదనల తర్వాత 2017 మార్చి 6వ తేదీన ఆనం వివేకా నందరెడ్డి కరస్పాండెంట్‌గా కొనసాగుతున్న పాలకవర్గం చెల్లదని హైకోర్టు తీర్పుని చ్చింది. వెంటనే విఆర్‌ విద్యాసంస్థలకు ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పును పునఃపరిశీ లించాలని ఆనం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో చివరి ప్రయత్నంగా ఆనం సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీ లించిన సర్వోన్నత న్యాయస్థానం ఆనంకు వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది. అంటే ఈ తీర్పు ప్రకారం 1993 నుండి ఇప్పటివరకు దాదాపు 35ఏళ్ళ పాటు చట్టవిరుద్ధంగానే విఆర్‌ విద్యాసంస్థలపై ఆనం వాళ్ళు పెత్తనం చెలాయించారన్నది అర్ధమవు తుంది. విఆర్‌ విద్యాసంస్థల చరిత్రలో వెలుగు, చీకట్లు అన్నీ కూడా ఈ 35ఏళ్ల లోనే జరిగిపోయాయి. విఆర్‌ విద్యాసంస్థ లలో సీటు దొరకడం గగనం అనే పరిస్థితి నుండి, అసలు సీట్లే భర్తీకాని నేటి పరిస్థితి వరకు ఎన్నో మలుపులు చూసాం. విఆర్‌ ప్రాథమిక పాఠశాల నుండి హైస్కూల్‌, ఇంటర్‌, డిగ్రీ, న్యాయకళాశాల, విఆర్‌ ఐఏఎస్‌, విఆర్‌ ఐపిఎస్‌, విఆర్‌ బి.ఇడి... ఇలా అన్ని దశలనూ చూసాం. హిందూ విద్యాసంస్థలుగా నెలకొల్పబడ్డ విఆర్‌ విద్యాసంస్థల ముందు అన్యమత విగ్రహాలు నెలకొల్పడం చూసాం. విఆర్‌ విద్యాసం స్థలు విద్యారంగంలో వెలిగిపోవడం కాని, కాలక్రమేణా గత వైభవాన్ని కోల్పోవడం కాని... అంతా ఈ మూడున్నర దశాబ్దాల కాలంలోనే జరిగింది.

ఆనం బ్రదర్స్‌ రాజకీయాలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో, ఈ విద్యాసంస్థలపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చారు. కేవలం విద్యాసంస్థలను తమ చేజారకుండా కాపాడుకోవడం కోసమే తెలుగుదేశంలో చేరారు. ఆఖరకు మంత్రి నారాయణను సైతం ప్రసన్నం చేసుకునే పరిస్థితికొచ్చారు. 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వున్నంత వరకు విఆర్‌ విద్యాసంస్థల వ్యవహారాలలో ఎవరు కూడా వేలుపెట్టడానికి సాహసించే వాళ్ళు కాదు. కాని తెలుగుదేశం అధికారం లోకి వచ్చాక మంత్రి నారాయణ విఆర్‌ విద్యాసంస్థల కార్యకలాపాలలో తల దూర్చినా, ఆనంవాళ్ళు ఆయనను నిలువ రించలేకపోయారు. విఆర్‌ను చేజార కుండా చూడడానికి వాళ్ళు ఎంతగా పాకు లాడినా... సుప్రీం కోర్టు తీర్పుతో ఆ ప్రయ త్నాలన్నీ వృధాగానే మిగిలిపోయాయి.

anam batchరాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరు కింగ్‌లవుతారో, ఎవరు తెరమరుగవుతారో అంతే పట్టదు. రాజకీయాలలో ఎల్లకాలం వెలగడం అన్నది ఎవరికీ శాశ్వతం కాదని చాలామంది నాయకుల చరిత్రను పరిశీలిస్తే అర్ధమవుతుంది.

నెల్లూరుజిల్లాలో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉం డేది ఆనం కుటుంబానికే! 60ఏళ్ల రాజకీయ చరిత్ర వున్న కుటుంబమది. ఏ పార్టీలో వున్నా జిల్లా అగ్ర నేతలుగా చక్రం తిప్పుతూ వచ్చారు. అధికారంలో వున్నా ప్రతిపక్షంలో వున్నా జిల్లా రాజకీయాలకు ఏ.సి సెంటర్‌ కేంద్రబిందువుగా వుండేది. అలాంటి సెంటర్‌ మూడేళ్లుగా కళా విహీనంగా మారింది. అక్కడ రాజకీయ సందడే కనిపించడం లేదు. ఇది రాష్ట్ర రాజకీయాలలో వచ్చిన మార్పు ఫలితమా? లేక ఆనం సోదరుల స్వయంకృతాపరాధమా?

2009 సెప్టెంబర్‌ 2వ తేదీన హెలికాఫ్టర్‌ ప్రమా దంలో వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణించకపోయి వున్నా, 2014లో రాష్ట్ర విభజన జరగకపోయి వున్నా ఆనం బ్రదర్స్‌ రాజకీయ భవిష్యత్‌లో పెద్ద మార్పు లుండేవి కావు. ఈ రెండు సంఘటనలు వారి రాజ కీయ ప్రయాణాన్ని వూహించని మలుపులు తిప్పాయి. వై.యస్‌. మరణం తర్వాత జగన్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ను స్థాపించడం, జగన్‌ మీద కోపంతో సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు పూనుకోవడం తెలిసిందే! ఈ పరిణామం నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనావస్థకి చేరుకుంది. రాష్ట్రంలోని ప్రధాన కాంగ్రెస్‌ నాయకులందరు కూడా అటు తెలుగుదేశం లోకో, ఇటు వైకాపాలోకో... రాజకీయ సురక్షిత కేంద్రాల్లోకి వెళ్లిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఎలక్షన్‌కు మూడు నెలల ముందైనా ముఖ్యమంత్రి పీఠం అప్పగించకపోతారా అనే ఉద్దే శ్యంతో కాంగ్రెస్‌లోనే ఉండిపోయాడు. ఆయనతో పాటు ఆయన అన్న వివేకా కూడా కాంగ్రెస్‌లోనే వుండిపోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికలప్పుడు ఆనం సోదరులను తెలుగుదేశంలో చేరమని చంద్ర బాబే స్వయంగా పిలిచాడు. ఆత్మకూరు, నెల్లూరు సీట్లతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా వారి కోసం ప్రయత్నించాడు. ఆనం ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి అయ్యుంటే, ఆదాల ఎంపీగా గెలిచివుండేవాడు. కాని, ఆరోజు వాళ్లు కాంగ్రెస్‌ను వీడలేదు. ఎన్నికలకు ముందే వాళ్లు తెలుగుదేశంలో చేరుంటే ఈరోజు జిల్లా పార్టీలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వుండేది. కాని, ఎన్నికల తర్వాత తెలుగుదేశంలో చేరిన దానివల్ల వాళ్ళు మాటలు పడాల్సివస్తోంది. ఆ పార్టీలో వున్న సీనియర్‌ నాయ కుల ముందు వీళ్లు చిన్న నాయకులైపోయారు. పార్టీలో వీరికి విలువ తగ్గిపోయింది. ఒకప్పుడు వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిల్చున్న నాయకులు కూడా ఇప్పుడు వాళ్లను లెక్కచేయడం లేదు. తెలుగు దేశంలో చేరాక రాజకీయంగా వారి పరిస్థితి దిగ జారింది. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా వాళ్లను పిలవడం లేదు. పార్టీలో చేర్చుకునేటప్పుడు చంద్ర బాబు వారికిచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ ఇచ్చారు. కాని, పక్కనే కన్నబాబు అనే బల్లేన్ని కూడా వుంచారు. ఇటీవల ఆనం కన్నీళ్లు తుడవడానికన్నట్లు ఆనం రంగమయూర్‌రెడ్డిని జిల్లా తెలుగు యువత అధ్య క్షుడుగా చేసారు. అయితే వివేకాకు ఎమ్మెల్సీ రాలేదని ఆవేశంతో రగిలిపోతున్న ఆనం కుటుంబం ఆ పద విని తీసుకోలేదు. ఆనంబ్రదర్స్‌ ఇప్పుడు తెలుగుదేశంపై పూర్తిస్థాయి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ దశలో వాళ్లు తెలుగుదేశాన్ని వీడుతారా? లేక అవమానాలను దిగమింగుకుని కొనసాగుతారా? అన్నది పెద్దప్రశ్న?

తెలుగుదేశాన్ని వీడితే రాష్ట్రంలో వున్న మరో రాజకీయ ప్రత్యామ్నాయం వైసిపినే! బీజేపీ, కాం గ్రెస్‌లు ఇప్పట్లో రాష్ట్రంలో బలమైన శక్తులుగా ఎదిగే అవకాశం లేదు. మరి వైసిపిలోకి వెళ్లడానికి గల అవకాశాలకు వీళ్లే గండికొట్టుకున్నారు. కాంగ్రెస్‌లో వున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ నాయ కులూ నోరు పారేసుకోనంతగా ఆనం వివేకా, రామ నారాయణలే జగన్‌పై నోరు పారేసుకున్నారు. ఎవరి మెప్పుకోసమో తమ స్థాయికి దిగజారి తమ నోటితో అనరాని మాటలన్నారు. వీళ్ల మాటలను వైసిపి నాయకులే కాదు, చివరకు తెలుగుదేశం నాయకులు కూడా అసహ్యించుకున్నారు. పోనీ తెలుగుదేశంలో చేరాకన్నా కుదురుగా, నోరు విప్పకుండా వుండుంటే జగన్‌కు వీరికి మధ్య ఒక సానుకూల వాతావరణ మన్నా వుండేది. గతంలో చేసిన విమర్శలు మరుగున పడి వైకాపాలో చేరడానికి మార్గం ఏర్పడేది. కాని, కొంతకాలం క్రితం అమరావతిలో చంద్రబాబును కలిసాక జగన్‌పై వివేకా చేసిన పచ్చిబూతు విమర్శ లతో వైకాపా తలుపులను శాశ్వతంగా మూసేలా చేసింది. ఈరోజు ఆనం సోదరులను వైసిపిలో చేర్చుకుంటామన్నా, ఆ పార్టీలోని మిగతా నాయకులు అంగీకరించే పరిస్థితి లేకుండాపోయింది.

రాజకీయంగా ఆనం బ్రదర్స్‌కు గడ్డుకాలం కొనసాగుతోంది. ఉన్న పార్టీలో ఇమడలేకపో తున్నారు. అవతలి పార్టీ వాళ్ళు రమ్మనడం లేదు. వారి భవిష్యత్‌ రాజకీయ ప్రయాణం ఇక ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!

anam brosసూది దూరే సందిస్తే చాలు... దబ్బళాన్ని కాదు పెద్ద దూలాన్నే దూర్చేసే టాలెంట్‌ వున్న పొలిటికల్‌ ప్రొఫెసర్లు ఆనం సోదరులు. కాంగ్రెస్‌లో వున్నప్పుడు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిలాంటి కొమ్ములు తిరిగిన రాజకీయ యోధుడినే మడతపెట్టిన ముదుర్లు ఆనం బ్రదర్లు.

ఇప్పుడు తెలుగుదేశంలోనూ చాపక్రింద నీరులా చల్లగా పాకే ప్రయత్నం మొదలైంది. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే! అయితే వాళ్లు ఆత్మకూరు వరకే ఆగిపోతారా? అన్నది ప్రశ్న! అక్కడితో ఆగిపోతే వాళ్ల పెత్తనం ఏముంది. జిల్లాలోని పది ఎమ్మెల్యే లింగాలలో ఆయనా ఓ లింగం. కాని అక్కడితో వాళ్లు ఆగే ప్రసక్తే లేదు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన నెల్లూరునగరంలో రాజకీయంగా పట్టు లేకపోతే ఆనం ప్రాబల్యం దెబ్బతింటుంది. గత 20ఏళ్లుగా వాళ్లు నెల్లూరుపై ఆ విధమైన పెత్తనం సాగించారు. ఈ రెండున్నరేళ్ల పాటు అధికారం లేక, నెల్లూరుపై పట్టు లేక ఆ బాధను అనుభవించారు. రాజకీయంగా గాని, అధికారికంగా గాని జిల్లాపై పట్టు సాధించాలంటే నెల్లూరు నగరంలో రాజకీయంగా బేస్‌ వుండాలి. అందుకే నెల్లూరు సిటీ, రూరల్‌లో ఒక సీటును వాళ్లు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దశలో నెల్లూరు సిటీకి ఆనం వివేకాను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి రూరల్‌కు మంత్రి పి.నారాయణను ఇన్‌ఛార్జిగా పెట్టాలని ప్లాన్‌ వేసుకున్నారు. అయితే అది సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు ఆత్మకూరుతో పాటు నెల్లూరు సిటీని కూడా

వాళ్లు గట్టిగా కోరుతున్నారు. అయితే చంద్రబాబు ఇంకా హామీ ఇవ్వలేదు. ముందు ఆత్మకూరు చూడండి, నెల్లూరుసిటీపై అందరితో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. కాని భవిష్యత్‌లో నెల్లూరు సిటీని కూడా ఆనంకే అప్పగించే అవకాశాలు లేకపోలేదు. సిటీ అభ్యర్థిగా వివేకా తనయుడు ఏ.సి.సుబ్బారెడ్డిని రంగంలోకి దించాలన్నది ప్లాన్‌. ఇప్పుడే నెల్లూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో అసంతృప్తి వస్తుందని, నిదానంగా నెల్లూరును ఆనంకు సెట్‌ చేయొచ్చని చంద్రబాబు ఆలోచన. 20ఏళ్ల పాటు జిల్లాలో ఆనం రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టింది నెల్లూరు నగరంలో వివేకా మున్సిపల్‌ ఛైర్మెన్‌గానో, ఎమ్మెల్యేగానో

ఉంటుండబట్టే! అలాంటి నెల్లూరు నగరాన్ని వాళ్లు వదులుకుంటారా!?

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter