anam brosదాదాపు రెండు దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి, నేదురుమల్లి వంటి రాజకీయ యోధులను కూడా దెబ్బతీసిన ఆనం సోదరులకు ప్రస్తుతం రాజకీయాలలో గడ్డు పరిస్థితి కొనసాగుతోంది.

వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం జిల్లాలో ఆనం వారి హవా కొన సాగింది. వై.యస్‌. మరణం తర్వాత రోశయ్య, కిరణ్‌ల హయాంలోనూ వారి పెత్తనం ఇంకా ఎక్కువుగానే కొనసాగినా పరోక్షంగా మాత్రం వై.యస్‌. మరణం వారి రాజకీయ జీవితచరిత్రను అనుకోని మలుపు తిప్పింది. వై.యస్‌. మరణం తర్వాతే కాంగ్రెస్‌ను వదిలి జగన్‌ సొంత పార్టీ పెట్టడం, ఆ కసితో సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనుకోవడం, విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్‌ మట్టి గొట్టుకుపోవడం, కాంగ్రెస్‌తో పాటు ఆనం సోదరులు కూడా రాజకీయంగా వెలుగు కోల్పోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి.

రాజకీయంగా మనుగడ సాగించా లంటే టీడీపీలోకో వైసీపీలోకో వెళ్లాలి. కాంగ్రెస్‌లోనే వుంటే ఆనం సోదరులు సి.వి.శేషారెడ్డి, చెంచలబాబుయాదవ్‌ల మాదిరిగా పార్టీ కార్యక్రమాలలో జెండాలు మోసుకోవడం, ఇందిరా వర్ధంతి, సోనియా బర్త్‌డేలు చేసుకుంటుండడం తప్ప ఇక చేసేదేమీ వుండదు. కాంగ్రెస్‌లో వున్న ప్పుడు జగన్‌ను అనరాని మాటలన్నారు కాబట్టి ఆనం సోదరులు ఆ పార్టీలోకి పోలేక తెలుగుదేశంలో చేరిపోయారు.

అయితే కాంగ్రెస్‌ సంస్కృతికి అలవాటు పడ్డ ఆనం సోదరులు తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో ఇమడలేకపోతున్నారు. ఒకప్పుడు వీళ్ల ముందు చేతులు కట్టుకుని తిరిగినవాళ్లు ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చేసరికి పార్టీలో మీకంటే మేం సీనియర్లం, మాపై పెత్తనం చెలాయించాలంటే కుదరదు అన్నట్లుగా వున్నారు. అదీగాక ఒకప్పుడు తాము లెక్కలేకుండా చూసిన మంత్రి నారాయణ వద్దకే ఇప్పుడు ఏ పని కావాలన్నా పోవాల్సి వస్తోంది. ఇది వాళ్లకు బాగా ఇబ్బంది కలిగించే విషయమే! తెలుగుదేశంలో చేరాక ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతను ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించడం తప్పితే రాజకీయంగా వారికి ఇక ప్రాధాన్యత నిచ్చిందేమీ లేదు. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దని చెప్పారు. కార్పొరేషన్‌ వ్యవహారాలలో అసలు కలుగజేసుకోవద్దని సంకేతాలు అందాయి. కార్పొ రేషన్‌లో కెలకనిదే ఆనం వివేకాకు నిద్రపట్టదు. పుండు మీద యాసిడ్‌ పోసినట్లు ఈమధ్య విఆర్‌ విద్యాసంస్థల కమిటీని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి మరింత బాధ కలిగిస్తోంది.

చంద్రబాబు ఏదన్నా కనికరించి ఎమ్మెల్సీ ఇస్తాడనుకుంటే అది కూడా అందని ద్రాక్షలాగే వుంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ రాలేదు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీని వాకాటికిచ్చారు, మేలో గవర్నర్‌ కోటా క్రింద రెండు ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సివుంది. దీంట్లో ఒకటి ఆనం సోదరులకు వచ్చి వుండేదే! అయితే కడపలో వైసిపి నుండి వచ్చిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని రామసుబ్బారెడ్డి వ్యతిరేకించారు. ఆయనను చల్లబర్చడానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి చంద్రబాబు ఆర్టీసీ ఛైర్మెన్‌ పదవిని రామసుబ్బారెడ్డికిచ్చి, ఎమ్మెల్సీని ఆనం వాళ్లకు ఇవ్వాలనుకున్నాడు. అయితే రామసుబ్బారెడ్డి ఆర్టీసీ ఛైర్మెన్‌కు లొంగకుండా ఎమ్మెల్సీకి రాజీపడ్డాడు. దీంతో ఉన్న రెండు ఎమ్మెల్సీలలో ఒకటి రెడ్లకు ఇస్తే, రెండోది ఇతర కులాలకు ఇవ్వక తప్పదు. ఉన్న ఒక్క ఎమ్మెల్సీ విషయంలో ఆనం బ్రదర్స్‌కు ఇక్కడ గండిపడింది. ఇక ఎన్నికల దాకా మధ్యలో పదవులొచ్చేదీ లేదు, పెట్టేదీ లేదు. ఎలక్షన్‌లో ఆత్మకూరు సీటు ఇవ్వడం తప్పించి ఆనం బ్రదర్స్‌కు చంద్రబాబు అంతుకుమించి ఏమీ చేయడు.

anam brothersనెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే చాలా ఆలస్యంగా విభేదాలొచ్చాయనుకోవచ్చు.

2014కు ముందు దాకా కూడా ఆనం సోదరులు నలుగురూ కలిసి మెలిసే వున్నారు. ఆనం వివేకానందరెడ్డి పెద్దరికాన్ని, పెత్తనాన్ని మిగతా ముగ్గురూ గౌరవిస్తూ వచ్చారు. రాజకీయాల్లో తమ అన్నలు ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డిలు ముందుకుపోతుంటే, వారి తమ్ముళ్ళయిన ఆనం జయకుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డిలు సహకరిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ ఎన్నికల్లో నిలబడితే వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మాని పని చేశారు. ఆనం వివేకా ఒకసారి మున్సిపల్‌ ఛైర్మెన్‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసాడు. ఆనం రామనారాయణరెడ్డి అయితే 1983 నుండి 2014 వరకు గ్యాప్‌ లేకుండా 8సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. వీళ్ళిద్దరి కోసం తమ్ముళ్లిద్దరూ కష్టపడ్డారు. వివేకా అనేక సంద ర్భాల్లో... మా రాజకీయ వారసులు మా కొడుకులు కాదు... మా తమ్ముళ్లే, ఇంతకాలం మా కోసం వాళ్ళు పని చేశారు. రేపు వాళ్ళ కోసం మేము పని చేస్తాం అని చెబుతుండేవాడు. మరిప్పుడు తమ తమ్ముళ్ళ కోసం పనిచేయడానికి అన్నలు సిద్ధంగా వున్నారా? అలా పనిచేసే అవకాశం వచ్చింది, మరి ఉపయోగించుకుంటారా?

2014 ఎన్నికలకు ముందే మూడో సోదరుడు ఆనం జయకుమార్‌రెడ్డి తన అన్న వివేకాతో విభేదించి ఇంటినుండే కాదు, ఆనం రాజకీయ కూటమి నుండి కూడా బయటకువచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశంలోనే ఆదాలతో కలిసి నడుస్తున్నాడు. 2014 ఎన్నికల తర్వాత ఆనం వివేకా, రామనారాయణరెడ్డిలు తెలుగుదేశంలో చేరిపోయారు. నాలుగో తమ్ముడు ఆనం విజయకుమార్‌రెడ్డికి తన అన్నలతో వ్యక్తిగత తగవులు, ఆస్తి వివాదాలు లేవు, కాకపోతే తెలుగుదేశంలో చేరడానికి అతని మనసు అంగీకరించలేదు. జిల్లా రాజకీయాలలో తమ కుటుంబానికి వై.యస్‌. ఎంత ప్రాధాన్యతనిచ్చాడో తెలిసిన మనిషి కాబట్టి తెలుగుదేశంలోకి పోలేక వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరాడు. ఈరోజు తెలుగుదేశం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ఆనం సోదరులు కూడా ఆశించారు. కాని చంద్రబాబు నిరాకరించారు. అదే సమయంలో వైకాపా మాత్రం స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డికి సీటిచ్చి నిలబెట్టింది. ఆనం విజయకుమార్‌రెడ్డి ఇంతవరకు సర్పంచ్‌, సొసైటీ ఛైర్మెన్‌, ఎంపీటీసీ వంటి పదవుల వరకే వచ్చాడు. ఇప్పుడు పోటీ చేస్తున్నది ఎమ్మెల్యే స్థాయి పదవి, గెలిస్తే రాజకీయంగా అతనికొక ముందడుగు పడినట్లే. కసి పెట్టుకుని ఆయనను ఓడించాలనేంత శత్రుత్వమైతే మిగిలిన ముగ్గురు సోదరులకు లేదు. కాకాపోతే అతనికొచ్చిన మొదటి అవకాశం ఇది. మరి ఇటు చూస్తే మిగిలిన ముగ్గురు సోదరులు తెలుగుదేశంలో వున్నారు. రాజ కీయమా? రక్తసంబంధమా? అనే ప్రశ్న ఇక్కడ పుట్టుకొస్తుంది. రాజకీయం ముందు రక్తసంబంధాలు బలాదూరే... మామను దించి అల్లుడు కుర్చీ ఎక్కిన చరిత్ర వున్న తెలుగుదేశంలో అయితే అనుబంధాలు, రక్త సంబం ధాలకు స్థానమే లేదు. కాబట్టి తమ్ముడు తమ్ముడే... పేకాట పేకాటే అన్న నీతిని ఆచరించక తప్పదు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తే ముగ్గురు అన్నలు కూడా విజయకుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా గట్టిగా పని చేయక తప్పదు. అలాగని వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తే ఆనం సోదరుల చరిత్రలో ఈ సంఘటన ఒక గుర్తుగా మిగిలిపోతుంది. మరి ముగ్గురు సోదరులు రాజకీయంలోనూ పేకాట సిద్ధాంతాన్నే అనుసరిస్తారో, ఏమూలన్నా రక్త సంబంధం కదిలిస్తే తమ్ముడి విజయం కోసం పరోక్షంగానైనా పని చేస్తారో త్వరలోనే తేలుతుంది.

anam brosవందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి రాజా కళాశాల అని పేరు. కాని ఇప్పుడు జనాల దృష్టిలో మాత్రం వి.ఆర్‌ అంటే వివేకానందరెడ్డి విద్యాసంస్థలు అని.

వి.ఆర్‌ విద్యాసంస్థలను తామే నెలకొల్పినట్లు, ఆ విద్యా సంస్థల నిర్మాణానికి తమ స్థలాన్ని దానం చేసినట్లుగా... ఆ విద్యాసంస్థలపై దాదాపు 3 దశాబ్దాలుగా పెత్తనం చేస్తున్న ఆనం సోదరులకు హైకోర్టు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చింది. వి.ఆర్‌ విద్యాసంస్థల కమిటీని రద్దు చేస్తూ ఈ నెల 6న హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే కమిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా

చెల్లవని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే... 1875లో విఆర్‌ విద్యా సంస్థలను ప్రారం భించారు. బ్రిటీష్‌ వారి హయాంలో క్రైస్తవ మిషనరీ విద్యాసంస్థలను ఎక్కువగా నెల కొల్పుతున్నప్పుడు హిందూ విద్యార్థుల కోసం వెంకటగిరి రాజాలు ప్రత్యేకంగా ఈ విద్యాసంస్థను నెలకొల్పి, వీటి నిర్వ హణకు వాళ్లే ధనం సమకూరుస్తూ వచ్చారు. 1940 ప్రాంతంలో రాజా యాచేంద్ర ఈ విద్యాసంస్థల పాలక వర్గంలో తమకు అధికారం ఉండేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. విద్యాసంస్థల పాలకవర్గ కమిటీకి ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరిగేలా బైలాను రూపొందిం చారు. ఈ కమిటీలో నలుగురు సభ్యులు వెంకటగిరి రాజా కుటుంబం నుండి వుంటే మరో నలుగురు సభ్యులను పూర్వ విద్యార్థులు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన 8మంది కలిసి ఐదుగురిని కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. కళాశాల ప్రిన్సి పాల్‌ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా కొనసాగు తారు. బైలాలో వ్రాసుకున్న నిబంధనల ప్రకారం 1950, 1960, 1970లలో కమిటీలకు ఎన్నికలు జరిగాయి. 1970 వరకు విద్యాసంస్థల కమిటీపై వెంకటగిరి రాజాల పెత్తనమే కొనసాగింది. 1970లో పెద్దరాజా యాచేంద్ర మరణించారు. ఆ ఏడాది జరిగిన కమిటీ ఎన్నికల ద్వారా ఆనం వెంకటరెడ్డి విద్యా సంస్థల అధ్యక్షు డయ్యాడు. అక్కడ నుండి విఆర్‌ విద్యా సంస్థల్లో ఆనం ఆధిపత్యం మొదలై క్రమంగా వెంకటగిరి రాజాలు తెరమరు గయ్యారు. ఆనం వెంకటరెడ్డి, ఆనం భక్త వత్సలరెడ్డిలు విద్యాసంస్థలను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 1970 తర్వాత 1985 వరకు కమిటీకి ఎన్నికలు జర క్కుండా లాక్కొచ్చారు. అప్పట్లో ఏబివిపి విద్యార్థి సంఘం నాయకులైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆమంచర్ల శంకరనారాయణ, చంద్రశేఖర్‌రాజులు కమిటీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ నెల్లూరులో ఆరురోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. ఎన్నికలు నిర్వహిస్తామని అప్పటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ ఇచ్చిన హామీతో వాళ్ళు దీక్ష విరమించారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే విఆర్‌ విద్యాసంస్థల కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. అయితే పూర్వ విద్యార్థుల ఓట్లతో ఎన్నికలు నిర్వహిస్తే తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించిన ఆనం కుటుంబీకులు బైలాను సవరించి పూర్వవిద్యార్థుల ఓట్లను రద్దు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆనం వివేకానందరెడ్డి పోటీ చేశారు. అయితే తమ ఓట్లను తొలగించ డాన్ని సవాల్‌ చేస్తూ నెల్లూరు సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో కమిటీ ఎన్నికల ఫలితాలను నిలిపివేశారు. 1993దాకా ఈ కేసు నడిచింది. ఆ ఏడాది కోర్టు తీర్పు వెలువరిస్తూ పూర్వవిద్యార్థులు వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో 1986లో జరిగిన కమిటీ ఎన్నికల ఓట్లను లెక్కబెట్టగా ఆనం వివేకానందరెడ్డి భారీ మెజార్టీతో గెలిచాడు. పూర్వవిద్యార్థుల ఓట్లు లేకుండా చేయబట్టి ఆయన గెలవగలిగాడు. ఇక అప్పటి నుండి ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌ కమ్‌ సెక్రటరీగా, ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షుడిగా.. అంతా తామే అయ్యి ఈ విద్యాసంస్థలను నడి పిస్తున్నారు. ఈ రెండున్నర దశాబ్దాల వారి హయాంలో విఆర్‌ విద్యాసంస్థల ప్రతిష్ట మసకబారుతూ వచ్చింది. దీనికితోడు కార్పొరేట్‌ విద్య విజృంభించడంతో విఆర్‌ విద్యాసంస్థలు విద్యార్థులు లేక బోసిపోతూ వచ్చాయి. విఆర్‌ హైస్కూల్‌, విఆర్‌ జూని యర్‌ కాలేజీ, విఆర్‌ ఐపిఎస్‌, విఆర్‌ ఐఏఎస్‌, విఆర్‌ లాకాలేజీ, వి.ఆర్‌. పి.జి కాలేజీ... వీటిలో ఒక్క హైస్కూల్‌, లా కాలేజీలు మాత్రమే ఇప్పుడు కొంతవరకు సక్రమంగా నడుస్తున్నాయి. మిగతా కాలేజీలన్నీ కూడా విద్యార్థులు లేక బోసి పోతున్నాయి. ఇదంతా చాలదన్నట్లు వివేకా ఈ విద్యాసంస్థల డబ్బుతోనే క్రైస్తవ మిషన రీలకు చెందిన వైఎంసిఏ గ్రౌండ్‌ స్థలాన్ని కొనుగోలు చేసారు. విఆర్‌ బిఇడి కళాశాల పెట్టాలని చెప్పి, పెద్దపెద్ద చర్చీలను తల పించే రీతిలో ఇక్కడ పెద్ద భవనం కట్టిం చారు. దానిలో ఇప్పుడు బి.ఇడి కాలేజీ లేకపోగా నిరుపయోగంగా వుంది. అలాగే హిందూ విద్యార్థుల కోసం ఉద్దేశించి స్థాపించిన విద్యాసంస్థల ముందు తన రాజకీయపిచ్చితో అన్యమతాల విగ్రహాలు, ప్రార్థనా మందిరం పెట్టించాడు. గతంలో దీనిపై బీజేపీ, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం తెలిసిందే!

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాని, ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కాని విఆర్‌ విద్యాసంస్థల జోలికి రాలేదు. అయితే విఆర్‌ విద్యాసంస్థలు కేంద్రంగా ఎన్నో వివాదాలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో వుంది. తెలుగుదేశం నాయ కులు విఆర్‌ విద్యాసంస్థలపై కన్నేసి తమ ఆధిపత్యానికి గండి కొడతారేమోనని అను మానించిన ఆనం సోదరులు... ఆ పరిస్థితి ఎదురుకాకముందే తెలుగుదేశంలో చేరి పోయారు. రాజకీయంగా తమకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.

అయినా కూడా పూర్వవిద్యార్థుల కేసు వారిని వదల్లేదు. 1993లో క్రింది కోర్టు పూర్వవిద్యార్థుల కేసును కొట్టేసినా, విఆర్‌ పూర్వవిద్యార్థులైన ఆమంచర్ల శంకరనారా యణ, గూడూరు విజయరామిరెడ్డి, పోతూరు రమణయ్యలు హైకోర్టును ఆశ్ర యించారు. 1996లో 126/96 నెంబర్‌ క్రింద హైకోర్టులో కేసు నమోదైంది. 2015లో ఈ కేసు కోర్టు ముందు విచారణ కొచ్చింది. రెండేళ్లుగా దీనిపై వాదనలు జరుగుతున్నాయి. వాదనలు ముగిసి ఈ నెల 6న హైకోర్టు తుది తీర్పును వెలువ రిస్తూ ప్రస్తుతమున్న కమిటీని రద్దుచేసింది. ఏ విఆర్‌ విద్యాసంస్థల మీద ఆధిపత్యానికై ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరారో ఆ లక్ష్యం నెరవేరకుండా పోయింది. వారి ఆధిపత్యానికి పూర్వవిద్యార్థులే గండి కొట్టారు. ఆనం సోదరులు ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచాడు. ఎట్టకేలకు విఆర్‌ విద్యాసంస్థలకు పట్టిన రాజకీయ గ్రహణం వీడినట్లయ్యింది.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter