anam brosరాజకీయాలలో చంద్రబాబుతో పాటు ఆనం సోద రులు కూడా మాస్టర్‌ డిగ్రీలు చేసినవాళ్లే! కాకపోతే ఎన్టీఆర్‌ లాంటి మామ దొరకబట్టి చంద్రబాబు సీఎం అయ్యాడు. సోనియాగాంధీ లాంటి అతితెలివి నేత కాంగ్రెస్‌ అధి నేత్రిగా వుంది కాబట్టి ఏ గతీ లేక ఆనం సోదరులు కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు వద్దకు పోవాల్సి వచ్చింది.

నెల్లూరుజిల్లా నుండి ఆనం సోదరులను తెలుగుదేశంలోకి చేర్చుకుంటున్నాడంటే చంద్రబాబు వద్ద ఓ ధియరీ ఉంటుంది. ఓ లెక్క వుంటుంది. వీళ్ల వల్ల పార్టీకి అదనంగా వచ్చే ప్రయోజనంపై ఓ అంచనా ఉంటుంది. మనసు చంపుకుని తెలుగుదేశంపార్టీలో చేరారంటే ఆనం సోదరులకు కూడా ఓ లెక్క వుంటుంది. భవిష్యత్‌పై ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అంచనాలకు అనుగుణంగా ఆనం సోదరుల బలం, బలగం మ్యాచ్‌ కావాలి. దానికి వేదికే విజయవాడ. ఈ నెల 17న నెల్లూరు నుండి స్పెషల్‌ ట్రైన్‌, బస్సులను పెట్టి ఆనం సోదరులు తమ అనుచరులను విజయవాడ తీసుకెళుతోంది చంద్రబాబు అంచనాలను నిజం చేసేందుకే! తమ బల ప్రదర్శనకు వాళ్లు బెజవాడను ఎంచుకున్నారు.

ఎవరికైనా అనుమానం రావచ్చు. ఆనం బ్రదర్స్‌ ఎలాగూ పార్టీలో చేరిపోయారు. ఇక అనుచరులదేముంది... చంద్రబాబు నెల్లూరొచ్చినప్పుడు వాళ్ల అనుచరులను పార్టీలో చేర్చుండొచ్చు కదా... ఈ షో అంతా ఎందుకనే అనుమానాలు రాకమానవు. చంద్రబాబు నెల్లూరొచ్చినప్పుడు ఎన్ని వేలమంది జనం వచ్చినా, వారిలో ఆనం కోసం వచ్చిన వాళ్లున్నా అది చంద్రబాబు ఖాతాలోకే పోతుంది గాని, ఆనం ఖాతాలోకి రాదు. అదీగాక నెల్లూరులో సభ పెట్టి జనాలను తరలించడానికి ఆనం వాళ్లే అవసరం లేదు. కిలారి వెంకటస్వామి నాయుడు, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి నాయకులు వాహనాలను ఏర్పాటు చేసినా వస్తారు. మరి ఆనం వారి బలం ప్రత్యేకంగా తెలియాలంటే వారి కోసం జనం ఎక్కడికైనా వస్తారురా అని చూపించుకోవాలి. అలా చూపడానికి తమ అనుచరులను నెల్లూరు నుండి విజయవాడకు తీసుకెళుతున్నారు. చంద్రబాబుకు తమ బలం చూపించబోతున్నారు. అందుకు ముందు గానే వాళ్లు పెద్దఎత్తున జన సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే బలప్రదర్శన విషయంలో ఆనం సోదరులకు వారి సొంత సోదరుల నుండే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. సోదరులలో మూడోవాడైన ఆనం జయ కుమార్‌రెడ్డి 2014 ఎన్నికలకు ముందే ఆనం వివేకాతో విబేధించి కాంగ్రెస్‌ నుండి బయటకు వచ్చాడు. అప్పుడు వైకాపాలో చేరాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి జైసమైక్యాంధ్ర పార్టీలో చేరాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఇటీవల తన సోదరులు వివేకా, రామనారాయణరెడ్డిలు తెలుగుదేశంలోనే చేరినా ఆయన మాత్రం వారితో కలవడం లేదు. ఇక నాలుగో సోదరుడైన ఆనం విజయకుమార్‌రెడ్డి ఇప్పటివరకు తన అన్నలతోనే వున్నాడు. ఇప్పుడు మాత్రం తన అన్నల వెంట తెలుగుదేశంలో చేరే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీలో చేరడానికి ఆయన మనసాక్షి ఒప్పుకుంటున్నట్లు లేదు. తన రాజకీయ భవిష్యత్‌పై ఆయన సొంత అనుచరులతో కూడా సమావేశాలు జరిపారు. ఈ నెల 17వ తేదీ అయితే మాత్రం తన అన్నల వెంట విజయవాడకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక జిల్లా తెలుగుదేశం నాయకులు కూడా ఆనం రాకపట్ల అంత ఆనందంగా లేరు. నెల్లూరు పార్లమెంటుతో పాటు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే తన అనుచరులుకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే నెల్లూరు రూరల్‌ నియోజక వర్గంలో ఒక సందిగ్ధ రాజకీయ పరిస్థితి నెలకొంది. 2014 ఎన్నికలప్పుడే రూరల్‌ సీటు బీజేపీకివ్వడంతో చాలామంది కాం గ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం లోకి కాకుండా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కొద్దిమంది మాత్రం ఆరోజు తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థిగా వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైపు నిలిచారు. రూరల్‌ పరిధిలోని గ్రామాల్లో వున్న కాంగ్రెస్‌ కేడర్‌ అంతా కూడా వైకాపాకు, టిడిపికి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆనం సోదరులు తమ అనుచరులను కూడా తెలుగుదేశంలో చేర్చాలని చెప్పి అందర్నీ విజయవాడకు పిలుస్తున్నారు. రూరల్‌లో వైకాపా నుండి పెద్దగా పోవడం లేదు. ఇక తెలుగుదేశంలో వుండే వాళ్లు ఎలాగూ ఆదాల నాయకత్వంలో వున్నారు. ఇప్పుడు వాళ్లను కొత్తగా పార్టీలో చేర్చేదేముంది. ఆదాల కూడా తన అనుచరులకు ఇదే చెబుతూ ఎవరన్నా నన్ను కాదని ఆనం సోదరుల వెంట వెళ్లారో... అంతే సంగతులని వార్నింగ్‌ టైపులో చెబుతున్నట్లు సమాచారం.

ఆత్మకూరు నియోజకవర్గంలో చూస్తే ఇన్‌ఛార్జ్‌గా వున్న కన్నబాబుకు వీరి రాక కంటగింపుగా వుంది. ఆయన ఇప్పటికే ఆనం వ్యతిరేక శిబిరాన్ని ఏర్పాటు చేసు కున్నాడు. ఆనంకు వ్యతిరేకంగా బహి రంగంగానే ప్రకటనలిప్పిస్తున్నాడు. జిల్లా నాయకులలో చూస్తే సోమిరెడ్డికి, బీద రవిచంద్రకు వీళ్లు రావడం ఇష్టం లేదు. కాని అధినేత ఆజ్ఞలకు లోబడి తలా డించక తప్పలేదు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చొక్కా, ఫ్యాంటు చించుకుని పనిచేసిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అయితే బహిరంగంగానే ఆనం వ్యతిరేక జెండా పడుతున్నాడు. ఆనం వివేకా నుండి వచ్చిన ఫోన్‌కాల్‌కు కూడా కోటం రెడ్డి సరిగా స్పందించలేదని సమాచారం.

మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌దైతే విచిత్ర పరిస్థితి. కార్పొరేషన్‌ వ్యవహారాలలో జిల్లాలోని తెలుగుదేశం నాయకులెవరూ వేలు పెట్టడం లేదు. ఎవరికీ అంత అనుభవం కూడా లేదు. కాబట్టి అజీజ్‌కు హాయిగా వుంది. రేపట్నుండి వివేకా మొదటి వేలు పెట్టేది కార్పొరేషన్‌లోనే! గెలికేది కూడా అజీజ్‌నే! కార్పొరేషన్‌ మీద వివేకాకున్న అనుభవం అలాంటిది. వివేకా టీడీపీలో చేరడం అజీజ్‌కు షాకే! మంత్రి పి.నారాయణ తప్పితే మిగతా తెలుగుదేశం నాయకులెవరూ ఆనం సోదరులను చేర్చు కోవడానికి సుముఖంగా లేకపోయినా వీరి ఇష్టాలు, కష్టాలతో పని లేకుండా ఆ తంతు జరిగిపోయింది.

కనీసం తమ అనుచరులను కట్టడి చేసుకోవడం ద్వారా ఆనం సోదరుల బలంపై చంద్రబాబు అతిగా వేసుకున్న అంచనాలను తప్పని నిరూపించాలనే పట్టుదలతో ఈ నాయకులంతా వున్నారు. ఆనం సోదరులు ఛలో విజయవాడ అని పిలుపునిస్తుంటే... వీళ్లంతా నో విజయ వాడ అని తమ వాళ్లకు చెబుతున్నారు. ఆనం సోదరులు ఇప్పుడే వీరికి కొరుకుడు పడకుండా వుంటే ముందు ముందు పార్టీలో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా వుంటుందో?

anam brosఆనం వాళ్లకు అధికారం ఆసరా అవసరం. చంద్రబాబుకు నెల్లూరుజిల్లాలో బలమైన నాయకత్వం అవసరం. పరస్పర అవసరాలు ఇద్దరినీ దగ్గర చేసాయి. ఈ జిల్లాలో గత పదేళ్ల నుండి ఆనం వాళ్లతో పోరాడి ఇళ్లు ఒళ్లు గుల్ల చేసుకున్న తన పార్టీ నాయకుల సంగతి ఏంటని చంద్రబాబు ఆలోచించలేదు. ఇంతకాలం నోరు పగిలేలా చంద్రబాబును తిట్టి ఈరోజు ఆయన వద్దకే పోతే జనం ఏమనుకుంటారా అని ఆనం సోద రులూ ఆలోచించలేదు. వారిద్దరి కలయిక ఆ విధంగా జరిగిపోయింది.

అయితే చంద్రబాబు ఏ బలా న్నయితే ఆశించి ఆనం సోదరులను తన పార్టీలో చేర్చుకున్నాడో ఆ బలం ఇప్పుడు ఆనం సోదరుల వెనుక ఉందా? అన్నది ప్రశ్నగా మిగిలింది. నిజమే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వాళ్లు బలీయమైన రాజకీయశక్తులు. ఆనం వివేకానందరెడ్డి ఎప్పుడైతే మున్సిపల్‌ ఛైర్మెన్‌గా గెలిచాడో అప్పటి నుండి ఆనం వర్గం అంచలం చెలుగా పెరిగింది. 1999 నుండి ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఇక వారి ఊపుకు అడ్డే లేకుండా పోయింది. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. వై.యస్‌. వాళ్లకు ఫ్రీ హ్యాండిచ్చాడు. ఇంకేముంది జిల్లాలో అనకొండ లాంటి నేదురుమల్లి వర్గాన్ని కూడా చిత్తు చేసారు. 2009 ఎన్నికలొచ్చే సరికి నేదురుమల్లి వర్గాన్ని నామ రూపాలు లేకుండా చేసి జిల్లా కాంగ్రెస్‌పార్టీని పూర్తిగా ఆక్రమిం చేసారు. 2014 ఎన్నికలకు ముందు దాకా ఈ జిల్లాలో ఆనం హవా సాగింది. వీరి వెనుక పెద్ద అనుచర గణమే వుండేది. ప్రతి నియోజక వర్గంలోనూ మేం ఆనం అనుచరులం అని చెప్పుకునే నాయకులు పోగయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అయితే మేకపాటి సోదరుల సొంత గ్రామంలోనే కాంగ్రెస్‌ గెలిచే స్థాయికి ఆనం వర్గం బలపడింది. నెల్లూరులో అయితే వివేకా దెబ్బకు తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోయింది. ఆత్మకూరులో ఆనం వెనుక, నెల్లూరులో వివేకా వెనుక పెద్ద అనుచర నాయకగణం వుండేది.

కాని రాష్ట్ర విభజన చాలామందిలాగే ఆనం సోదరుల తలరాతను కూడా మార్చేసింది. తప్పని పరిస్థితుల్లో ఆనం కుటుంబం నుండి 2014ఎన్నికల్లో ముగ్గురు(ఆనం రామనారాయణరెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, ఏసి సుబ్బారెడ్డి) పోటీ చేసినా ఒక్కరికీ డిపాజిట్‌ దక్కలేదు.

వీళ్లు పోగుచేసిన కేడర్‌ అంతా కూడా ఆ ఎన్నికలప్పుడే తెలుగుదేశం, వైకాపాలలోకి వెళ్లిపోయింది. నెల్లూరులో అయితే ఏసి సెంటర్‌ వెలవెలబోయింది. వివేకా వెనుక అరకొర అనుచరులు మిగిలారు. ఇప్పుడున్న బలాన్ని ఆధారం చేసుకుంటే వీళ్ల చేరికవల్ల తెలుగుదేశంకు ఒరిగేదేమీ లేదు. ఆనం సోదరులు తమ పాత అనుచరులను తిరిగి సమీకరించుకోవాలి. కాంగ్రెస్‌ ఆల్‌రెడీ చచ్చుబడిపోయింది. ఈ పార్టీ నుండి కొత్తగా వచ్చి చేరేదేమీ లేదు. ఇక ఆనం అనుచరుల్లో కొంతమంది గత ఎన్నికలప్పుడే తెలుగుదేశంలో చేరుకున్నారు. వీరు ఎవరి అనుచరులుగా వున్నా పార్టీకి ఒక్కటే! నెల్లూరు నగరం, రూరల్‌, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలలో ఆనం అనచురులు పెద్దఎత్తున వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలోకి వలసపోయి వున్నారు. వాళ్లను వీళ్లు తిరిగి తెచ్చుకోగలిగితేనే ఆనం సోదరుల చేరిక వల్ల తెలుగుదేశంకు కొంతన్నా ఉపయోగముంటుంది. పాత అనుచరుల సమీకరణలో ఆనం సోదరులు ఎంతవరకు సక్సెస్‌ కాగలరో చూడాలి.

anam brosరాజకీయాలలో నాలుకకు ''నరం'' వుండదు, నాయ కుడికి స్థిరం వుండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ప్రస్తుతం రోజూ ఉదయాన్నే జరిగే టివి చర్చల్లో ఈరోజు ఈ పార్టీలో వుండేవాళ్ళు రేపు ఏ పార్టీలో వుంటారో, వుంటున్నారో టివి చూస్తున్న ప్రేక్షకుడికే అర్ధంకాని అయో మయ పరిస్థితి నేటి రాజకీయ రంగంలో నెలకొని వుంది. తిట్టే ముందు తాము ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ప్రతిపక్షాన్ని తిట్టేసి పూనకం వచ్చిన వాళ్లలా వూగిపోయే నేతలు కొద్ది రోజుల్లోనే తమ పంధా మార్చి, జెండాతో పాటు అజెండాను కూడా తమకిష్టమొచ్చిన రీతిలో మార్చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగింది. మొన్నటివరకూ జిల్లాలో తిరుగులేని నాయకులుగా వుండడంతో పాటు అధికారపార్టీపై పట్టు కలిగిన వ్యక్తులుగా చెలామణి అయిన ''ఆనం'' సోదరులు ఒక్కసారిగా అధికార అనాధలుగా మారిపోయారు. గడపల్లో సందడి తగ్గి గుండెల్లో గుబులు పెరగడంతో వారు తిరిగి తమ సొంత గూటికి చేరుకోవడానికి సంసిద్ధ మయ్యారు. మొన్నటి వరకు చంద్రబాబు నాలుక తెగ్గొయ్య మన్న వివేకానందరెడ్డి తన నాలుకనే మార్చి 'బాబు' జపం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు తమ రాజకీయ భవిష్యత్తుకు కొత్త బాటలు వేసుకునే ప్రయత్నంలో జెండా మార్చి జై తెలుగుదేశం అనేశారు.

ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారా యణరెడ్డిలు తెలుగుదేశంపార్టీలో చేరారు. నెల్లూరుజిల్లా రాజకీయాలకు సంబంధించి ఇదో సంచలనం! ఈ జిల్లాలో ప్రధాన రాజకీయవర్గం వారిదే! వాళ్లు ఇంత తొందరగా కాంగ్రెస్‌ను వదులుతారని, తెలుగుదేశంలో చేరుతారని ఎవరూ ఊహించలేదు. కాలం కలిసొస్తే ఏదీ ఆగ దన్నట్లు వాళ్లు సైకిలెక్కే పని జరిగింది.

కాంగ్రెస్‌ జీరో కాబట్టే!

విభజన పాపానికి ఒడిగట్టిన కాంగ్రెస్‌ ఈ రాష్ట్రంలో జీరో అయ్యింది. ఆ పార్టీలో వుండి అయిదు, లేదా పదేళ్లు కష్టపడితే ఆ తర్వాతయినా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. మొన్న ఎన్నికల దాకా ఆ పార్టీలో ఉండడమే గొప్ప. ఇక కాంగ్రెస్‌లో వుంటే అధికారం, పదవులు వుండవు. అధికారం లేకుండా సొంత ప్రాభవాన్ని నిలుపుకోవడం కష్టం. అందుకే కాంగ్రెస్‌ను వదిలేయాలని వాళ్లు నిర్ణ యించుకున్నారు.

మొదటి చూపు వైకాపా వైపే!

అయితే ఆనం బ్రదర్స్‌ మొదట వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. వీరికి అత్యంత సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ వైకాపాలోనే ఉండడంతో, వీరి చేరిక కూడా సులభమవుతుందను కున్నారు. అయితే ఆనం సోదరులను పార్టీలో చేర్చుకోవడాన్ని వైకాపా జిల్లా నాయకులు కొందరు తీవ్రంగా వ్యతి రేకించారు. దీంతో జగన్‌ వాళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. అందుకే తప్పని పరిస్థి తుల్లో వాళ్లు తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నాయకత్వం బలహీనంగా

ఉండబట్టే...

మాట తప్పం, మడమతిప్పం అనే పాలసీలు ప్రజలకిచ్చిన హామీల విష యంలో కరెక్టేమోగాని, రాజకీయాలు చేయడంలో పనికిరావు. 2004లో వైయస్‌ సిఎం అయ్యాక కాంగ్రెస్‌పార్టీని పటిష్టం చేయడం కోసం తెలుగుదేశం నుండి ఎంతోమంది నాయకులను లాగేసుకు న్నారు. కాని జగన్‌ 2014ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ను వదిలి వస్తామన్న నాయకులను వద్దన్నాడు. ఇప్పుడు ఆనం బ్రదర్స్‌ విష యంలోనూ అదే జరిగింది. కాని చంద్ర బాబు రాజకీయ అనుభవజ్ఞుడు. మాట తప్పడం, మడమ తిప్పడం వంటి పదా లను ఆయన పెద్దగా నమ్మడు. ఏ టైంకు ఏది చేయాలో అది చేసుకుంటూ పోతాడు. జిల్లాలో ఆనం సోదరుల అవసరం ఆయన కుంది. జిల్లాలో తెలుగుదేశం బలహీనంగా వుంది. 2014 ఎన్నికల్లో రెండు లోక్‌సభ, 10అసెంబ్లీలకు గాను తెలుగుదేశం గెలిచింది 3అసెంబ్లీలే! ఆనం సోదరులను చేర్చుకుంటే నెల్లూరు నగరం, రూరల్‌, ఆత్మకూరు నియోజకవర్గాలతో పాటు సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాలలో కూడా పట్టు పెరచుకోవచ్చు. అదీగాక ఈమధ్య చంద్రబాబు సొంతంగా చేయిం చిన సర్వేలో ఇప్పటికిప్పుడు 10అసెంబ్లీ లకు ఎన్నికలు పెడితే తెలుగుదేశానికి ఒక్క సీటు కూడా రాదని రిపోర్ట్‌ వచ్చిందని తెలిసింది. అందుకే ముందుచూపుతో వీరిని చేర్చుకున్నారు.

ఎవరు మొత్తుకున్నా లాభం లేదు

ఆనం బ్రదర్స్‌ను చేర్చుకోవడానికి చంద్రబాబు డిసైడ్‌ అయ్యాడు. జిల్లా నాయకులంతా వారిని తీసుకోవడాన్ని నిరసిస్తూ మేమంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్నా కూడా చంద్ర బాబు వాళ్లను తీసుకుని ఉండేవాడు. వాళ్లను తీసుకునేముందు జిల్లా నాయకు లతో ఆయన కంటి తుడుపుగా ఒక మీటింగ్‌ పెట్టాడంతే! అది కూడా వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదని! ఆనం వాళ్లొస్తే మేం రాజీనామా చేస్తామని ఎవరైనా అనుంటే చంద్రబాబు అలాగే చేయమని చెప్పుండేవాడు. వాళ్లను తీసు కోవడంలో ఆయన అంత బలంగా ఫిక్స య్యాడు. ఇక ఆనం వాళ్లకు ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలు మాత్రమే అప్పగించినట్లు, నెల్లూరు టౌన్‌లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు వారికి చెప్పినట్లు వార్తలొచ్చాయి. గుడారంలోకి ఒంటె మొదట తలకాయ పెడుతుంది, ఆ తర్వాత మావటివాడు బయటకు పోవాల్సి వస్తుంది. ఆనం వాళ్లు చేరాక పార్టీ అనే గుడారం పరిస్థితి కూడా అంతే!

వివేకా లేకుండా ఎందుకు?

ఆనం సోదరులలో వివేకాను వద్దని ఆనం రామనారాయణరెడ్డిని మాత్రమే చేర్చుకోవాలని జిల్లా నాయకులు చంద్ర బాబుకు సూచించారు. చంద్రబాబు అమాయకుడా? వివేకా లేకుండా రామ నారాయణరెడ్డిని చేర్చుకుని ఏం చేయాలి? అప్పుడు 'ఆనం' వాళ్లు పార్టీలో చేరారన్న ముద్ర ఎలా వస్తుంది. అసలు జిల్లా కేంద్రమైన నెల్లూరులో పార్టీ పట్టు పెంచు కోవాలంటే వివేకా అవసరం. కాబట్టి వివేకా లేకుండా కేవలం రామనారాయణ రెడ్డి ఒక్కడే పార్టీలో చేరతానంటే చంద్ర బాబు ఒప్పుకునేవాడు కాదు.

ఆనంపై విమర్శలు...

నిన్నటి దాకా చంద్రబాబును తిట్టి ఇప్పుడు ఆయన నాయకత్వంలో ఎలా పనిచేస్తారని ఆనం బ్రదర్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చంద్రబాబన్నా నయం. బాబు కంటే వీళ్లు జగన్‌ను ఇంకా ఘోరంగా తిట్టారు. వైకాపాలో చేరుంటే ఈ విమర్శలు ఇంకా ఎక్కువై వుండేవి.

ఆనం సోదరులకు ఒక రాజకీయ ఆశ్రయం దొరికింది. అలాగే జిల్లాలో బలహీనంగా వున్నామనుకున్న తరుణంలో చంద్రబాబుకు బలమైన నాయకత్వం దొరికింది. కాకపోతే గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆనం వారితో పోట్లాడి కొమ్ములు నలగ్గొట్టుకుని, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒంట్లో సత్తువ తెచ్చుకుని వారి కొమ్ములు వంచాలనుకున్న తెలుగుదేశం నాయకులంతా బకరాలయ్యారు.

తమ బాసులతో పాటూ తాము కూడా తిట్లపురాణాన్ని సాగించిన అనుయాయులు కూడా నేడు తమ నాలుక్కరుచుకుని చంద్రబాబుకీ జై అనడం మొదలెట్టారు.

ఆనం రాక పార్టీకి నష్టమో లాభమో అన్న రాజకీయ భీష్ముల ప్రశ్నలపై మరో సందర్భంలో చర్చించుకుందాం. రాజకీయమా వర్ధిల్లు.

Page 5 of 6

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter