anam brothersనెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే చాలా ఆలస్యంగా విభేదాలొచ్చాయనుకోవచ్చు.

2014కు ముందు దాకా కూడా ఆనం సోదరులు నలుగురూ కలిసి మెలిసే వున్నారు. ఆనం వివేకానందరెడ్డి పెద్దరికాన్ని, పెత్తనాన్ని మిగతా ముగ్గురూ గౌరవిస్తూ వచ్చారు. రాజకీయాల్లో తమ అన్నలు ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డిలు ముందుకుపోతుంటే, వారి తమ్ముళ్ళయిన ఆనం జయకుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డిలు సహకరిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ ఎన్నికల్లో నిలబడితే వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మాని పని చేశారు. ఆనం వివేకా ఒకసారి మున్సిపల్‌ ఛైర్మెన్‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసాడు. ఆనం రామనారాయణరెడ్డి అయితే 1983 నుండి 2014 వరకు గ్యాప్‌ లేకుండా 8సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. వీళ్ళిద్దరి కోసం తమ్ముళ్లిద్దరూ కష్టపడ్డారు. వివేకా అనేక సంద ర్భాల్లో... మా రాజకీయ వారసులు మా కొడుకులు కాదు... మా తమ్ముళ్లే, ఇంతకాలం మా కోసం వాళ్ళు పని చేశారు. రేపు వాళ్ళ కోసం మేము పని చేస్తాం అని చెబుతుండేవాడు. మరిప్పుడు తమ తమ్ముళ్ళ కోసం పనిచేయడానికి అన్నలు సిద్ధంగా వున్నారా? అలా పనిచేసే అవకాశం వచ్చింది, మరి ఉపయోగించుకుంటారా?

2014 ఎన్నికలకు ముందే మూడో సోదరుడు ఆనం జయకుమార్‌రెడ్డి తన అన్న వివేకాతో విభేదించి ఇంటినుండే కాదు, ఆనం రాజకీయ కూటమి నుండి కూడా బయటకువచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశంలోనే ఆదాలతో కలిసి నడుస్తున్నాడు. 2014 ఎన్నికల తర్వాత ఆనం వివేకా, రామనారాయణరెడ్డిలు తెలుగుదేశంలో చేరిపోయారు. నాలుగో తమ్ముడు ఆనం విజయకుమార్‌రెడ్డికి తన అన్నలతో వ్యక్తిగత తగవులు, ఆస్తి వివాదాలు లేవు, కాకపోతే తెలుగుదేశంలో చేరడానికి అతని మనసు అంగీకరించలేదు. జిల్లా రాజకీయాలలో తమ కుటుంబానికి వై.యస్‌. ఎంత ప్రాధాన్యతనిచ్చాడో తెలిసిన మనిషి కాబట్టి తెలుగుదేశంలోకి పోలేక వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరాడు. ఈరోజు తెలుగుదేశం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ఆనం సోదరులు కూడా ఆశించారు. కాని చంద్రబాబు నిరాకరించారు. అదే సమయంలో వైకాపా మాత్రం స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డికి సీటిచ్చి నిలబెట్టింది. ఆనం విజయకుమార్‌రెడ్డి ఇంతవరకు సర్పంచ్‌, సొసైటీ ఛైర్మెన్‌, ఎంపీటీసీ వంటి పదవుల వరకే వచ్చాడు. ఇప్పుడు పోటీ చేస్తున్నది ఎమ్మెల్యే స్థాయి పదవి, గెలిస్తే రాజకీయంగా అతనికొక ముందడుగు పడినట్లే. కసి పెట్టుకుని ఆయనను ఓడించాలనేంత శత్రుత్వమైతే మిగిలిన ముగ్గురు సోదరులకు లేదు. కాకాపోతే అతనికొచ్చిన మొదటి అవకాశం ఇది. మరి ఇటు చూస్తే మిగిలిన ముగ్గురు సోదరులు తెలుగుదేశంలో వున్నారు. రాజ కీయమా? రక్తసంబంధమా? అనే ప్రశ్న ఇక్కడ పుట్టుకొస్తుంది. రాజకీయం ముందు రక్తసంబంధాలు బలాదూరే... మామను దించి అల్లుడు కుర్చీ ఎక్కిన చరిత్ర వున్న తెలుగుదేశంలో అయితే అనుబంధాలు, రక్త సంబం ధాలకు స్థానమే లేదు. కాబట్టి తమ్ముడు తమ్ముడే... పేకాట పేకాటే అన్న నీతిని ఆచరించక తప్పదు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తే ముగ్గురు అన్నలు కూడా విజయకుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా గట్టిగా పని చేయక తప్పదు. అలాగని వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తే ఆనం సోదరుల చరిత్రలో ఈ సంఘటన ఒక గుర్తుగా మిగిలిపోతుంది. మరి ముగ్గురు సోదరులు రాజకీయంలోనూ పేకాట సిద్ధాంతాన్నే అనుసరిస్తారో, ఏమూలన్నా రక్త సంబంధం కదిలిస్తే తమ్ముడి విజయం కోసం పరోక్షంగానైనా పని చేస్తారో త్వరలోనే తేలుతుంది.

anam brosతెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీ కావొచ్చేమో... చంద్రబాబు నాయుడు మాత్రం వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి కాలేడు... తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ ఈ పాటికి ఈ విషయం అర్ధమై ఉంటుంది. ఆనం సోదరులకు కాంగ్రెస్‌ నుండి తెలుగుదేశంలో చేరే ముందే ఈ విషయం తెలిసినా చంద్రబాబుతో వున్నచనువు కొద్ది మా విషయంలో మినహాయింపు ఉంటుందిలే అని అనుకున్నారు. చంద్రబాబు ఎవర్నీ నెత్తికెక్కించుకోడు... ఎవర్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతుంటాడు. ఎవరినైనా వాడుకోవడంలో మంచి ఎక్స్‌పర్ట్‌. అతనిముందు రాజకీయాలలో తలపండిన ఆనం సోదరుల ఆటలు సాగడం లేదు. జిల్లా తెలుగుదేశం పార్టీ పెత్తనాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకున్న వారి కలలు నెరవేరడం లేదు.

ఆనం సోదరుల రాజకీయ చరిత్రను ఒక సినిమాగా చూస్తే 60ఏళ్ల చరిత్రను ఒక పార్ట్‌గా తీసుకోవచ్చు, 2014 నుండి ఈ మూడేళ్ళ చరిత్రను రెండోపార్ట్‌గా అనుకోవచ్చు. 2014కు ముందు వాళ్ళు ఏ పార్టీలో వున్నా రాజకీయంగా కింగ్‌లే! క్రిందపడ్డా, నిలబడ్డా ఎప్పుడూ చక్రం మాత్రం తిప్పుతుండేవాళ్ళు. ఎక్కువకాలం వారి రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌పార్టీలోనే కొనసాగింది. మరీ ముఖ్యంగా 1999 నుండి 2014 మధ్యకాలంలో నెల్లూరుజిల్లా కాంగ్రెస్‌లో వారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా సాగింది. వై.యస్‌.తో ఏర్పడ్డ సాన్నిహిత్యంతో జిల్లా కాంగ్రెస్‌లో వారిని తిరుగులేని నాయకులుగా చేసింది. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి అంతటివాడు అడ్డంపడ్డప్పటికీ 1999లో వివేకాకు నెల్లూరు అసెంబ్లీ టిక్కెట్‌ వచ్చింది. 2004 ఎన్నికలొచ్చేసరికి నేదురుమల్లి అంతటి వాడు నెల్లూరు అభ్యర్థిగా వివేకానే సమర్ధుడు అంటూ కితాబిచ్చే పరిస్థితి వచ్చింది. 2009 ఎన్నికల నాటికి ఆనం సోదరులిద్దరికీ టిక్కెట్లు తెచ్చుకోవడమేకాదు, ఇంకా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో వీరి మాటకు ప్రాధాన్యత ఏర్పడింది. 2004-2009 ఎన్నికల మధ్యలో జిల్లా కాంగ్రెస్‌లో నేదురుమల్లిపై ఆనందే పైచేయి అయ్యింది. ఒకనాడు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీనే శాసించిన నేదురుమల్లి చివరకు తన వెంకటగిరి సీటుకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. వై.యస్‌. ఇచ్చిన ఫ్రీహ్యాండ్‌తో జిల్లా కాంగ్రెస్‌లో ఆనం సోదరులు తిరుగులేని నాయకులయ్యారు. వై.యస్‌. మరణం తర్వాత కూడా పార్టీలో వారికి అదే ప్రాధాన్యత లభించింది. 2014 ఎన్నికల దాకా జిల్లాలో వారి హవానే సాగింది. ఆ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలోనే కాదు, ఇక తమ గుండెల్లోనూ కాంగ్రెస్‌కు స్థానం లేదనుకున్నారు. కాంగ్రెస్‌పార్టీని వదిలేసి తెలుగుదేశంలో చేరారు. ఇక్కడితో సినిమా ఇంటర్వెల్‌ అనుకోవచ్చు.

రెండోపార్ట్‌లో చూస్తే నలుగురు బ్రదర్స్‌లో అప్పటికే ఒక బ్రదర్‌ ఆనం జయకుమార్‌రెడ్డి విడిపోయి వున్నాడు. ఎన్నికలకు ముందు 'జై సమైక్యాంధ్ర' పార్టీలో చేరిన ఆయన, ఎన్నికల తర్వాత ఆదాల ప్రభాకర్‌రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశంలోకి మారాడు. మరో తమ్ముడు ఆనం విజయకుమార్‌రెడ్డి తెలుగుదేశంలో చేరిన తన బ్రదర్స్‌తో విభేదించి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరాడు. ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డిలు మాత్రం చంద్రబాబు నాయకత్వాన తెలుగుదేశంతో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.

తెలుగుదేశం కాంగ్రెస్‌ అయ్యింది... అంటే ఇది పాత తెలుగుదేశం కాదు. 1983లో ఆనం కుటుంబమున్నప్పటి తెలుగుదేశం కాదు. ఇక్కడ సీనియార్టీతో పాటు సిన్సియార్టీకి విలువ లేదు. క్యాష్‌పార్టీల హవానే ఎక్కువుగా నడుస్తుంది. ఒకప్పుడు తమ విద్యాసంస్థలలో డెమాన్‌స్ట్రేటర్‌గా పనిచేసి, తమ చేతుల మీదుగా జీతం తీసుకున్న నారాయణ, ఇప్పుడు చంద్రబాబు కుడి భుజం. మంత్రి కూడా! తెలుగుదేశం పార్టీలో తమకు ఏ అవసరం వచ్చినా ఆనం సోదరులు పోయి నారాయణను కలవాల్సివస్తోంది. తమ ముందు చెడ్డీ లేసుకుని తిరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని వీరుడు, శూరుడు అంటూ పొగిడి ప్రచారం చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిని ఆనం సోదరులే నిర్ణయించే పరిస్థితి. ఇప్పుడు తమకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ కావాలని చంద్రబాబును అడుక్కునే దుస్థితి. అది కూడా ఆయన చేత కాదు, వీలుకాదు అనిపించుకునే దౌర్భాగ్యం. పార్టీలో మీకంటే మేం సీనియర్లం అంటూ వారిని చూసి మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వంటి ఛోటా నాయకులు కూడా కాలరెగరేస్తున్నారు. ఇదంతా ఎలా వుందంటే... 'సమరసింహారెడ్డి' సినిమాలో హీరో బాలకృష్ణ ఒక కాకా హోటల్‌లో కప్పులు కడిగే పనిలో వుంటాడు. అతని ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే అరివీరభయంకరమైన ఫ్యాక్షనిస్టన్న మాట! ఆనం రాజకీయ చరిత్ర కూడా ఇక ఆ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లాగా ఘనంగా మిగిలిపోతుందేమో?

iddaru iddareఈ నగరంలో నాయకులకు ఏమైంది... ఒకరు అవినీతి గురించి మాట్లాడు తున్నారు... ఇంకొకరు అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు అవినీతిపరుడి వంటే... నువ్వే పెద్ద అవినీతిపరుడివంటూ ఒకర్నొకరు వేలెత్తి చూపించుకుంటున్నారు. వీళ్లకు ఏమైంది... అసలు వీళ్లు అవినీతి గురించి మాట్లాడడమేమిటి? అవినీతిపై ప్రశ్నించడమేమిటి? వినడానికే రోతగా వుంది. అవినీతి గురించి వీళ్లు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుంది. ఐసిస్‌ చీఫ్‌ ఆల్‌బాగ్దాదీ శాంతి ప్రవచనాలు చెప్పినట్లుగా వుంది.

నెల్లూరు నగరపాలక సంస్థలో నెలకొన్న అవినీతిపై ఓ పక్క మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేస్తున్న విమర్శలు... ఇంకోపక్క మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ చేస్తున్న కౌంటర్‌ ఎటాక్‌ చూస్తూనే వున్నాం. నగరపాలక సంస్థ అవినీతి మయమైపోయిందంటూ మేయర్‌ అజీజ్‌ను టార్గెట్‌గా చేసుకుని వివేకా చేసిన తీవ్రమైన ఆరోపణలు చూసాం. కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారంటూ ఆయన మొసలికన్నీరు కార్చడం మీడియా ద్వారా లోకమంతా చూసింది. అయితే కార్పొరేషన్‌ అవినీతిమయమైపోయిందంటూ వివేకా విమర్శించడం 'గురివింద గింజ తన నలుపెరుగదు' అన్న సామెతను గుర్తు చేస్తుంది.

అసలు నెల్లూరు నగరపాలక సంస్థను ఈ విధంగా తయారు చేసిపెట్టింది, ఈ విధంగా భ్రష్టు పట్టించింది, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చింది వివేకా కాదా! కార్పొరేషన్‌లో ప్రతి అనైతిక చర్యకు అక్రమాల పరంపరకు ఆయన హయాంలోనే అంకురార్పణ జరిగింది.

స్వర్గీయ ఏ.సి.సుబ్బారెడ్డి నుండి టి.రమేష్‌రెడ్డి, తాళ్ళపాక అనూరాధ పాలన వరకు నెల్లూరు మున్సిపాల్టీ కొంత పద్ధతిగానే వుండింది. ఈమధ్యలో 1995 నుండి 1999వరకు వివేకానే మున్సిపల్‌ ఛైర్మెన్‌గా పని చేశారు. అప్పుడు కూడా కొంచెం పద్ధతిగానే నడి చింది. 2005లో నెల్లూరు మున్సిపాల్టీ నగర పాలక సంస్థగా మారింది. 2006లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, వివేకాకు ఇష్టం లేకుండానే పులిమి శైలజను మేయర్‌గా చేయాల్సి రావడం జరిగాయి. అక్కడ నుండే నెల్లూరు నగర పాలకసంస్థకు దరిద్రం పట్టినట్లయ్యింది. వివేకా చర్యల మూలంగా సొంత పార్టీ లోనే కుమ్ములాటలు మొదలయ్యాయి. పులిమి శైలజను దించడం కోసం

మూడేళ్లు పోరాడిన వివేకా, ఆ సమయం లోనే నగరపాలక సంస్థలో అభివృద్ధికి పోతరేసి, వర్గపోరును తెరకెక్కించాడు. పులిమి శైలజను దించేసి తన అనుచరు రాలు భానుశ్రీని మేయర్‌ పీఠం ఎక్కించాక నెల్లూరు నగరాన్ని ఇష్టారాజ్యంగా మలచు కున్నారు. అవినీతికి అందలం వేశారు. ప్రతి పనికి రేట్లు కుదిర్చారు. కాంట్రాక్ట్‌ పనుల్లో కమిషన్లు నొక్కారు. తమ కాళ్ల వద్దకొచ్చిన వారి అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాసారు. తమకు గిట్టని వారి నిర్మా ణాలను సక్రమంగా వున్నా కూలగొట్టిం చారు. వివేకా 'ఎస్‌' అంటే అది అక్రమమైనా సక్రమమే... వివేకా 'నో' అంటే అది సక్రమమైనా అక్రమమే... అన్నంతగా నగరంలో పరిస్థితులు మారిపోయాయి. 'బాస్‌' ఇచ్చిన చనువుతో వారి ఆస్థాన కార్పొరేషన్‌ సిబ్బంది కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయారు. పిచ్చిపిచ్చిగా సంపాదిం చారు. కార్పొరేషన్‌ను అవినీతి జమానాగా మలిచిందే వివేకా. ఇప్పుడు ఆయనే అవి నీతి ఆరోపణలు చేయడం చూస్తుంటే... కార్పొరేషన్‌ అక్రమాలపై వగలాడి ఏడు పులు ఏడుస్తుంటే... అన్నీ తెలిసిన నగర పౌరులు నవ్వుకుంటున్నారు.

'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అంటూ అజీజ్‌ కూడా మేయర్‌గా ఎన్నికైనదే తరువాయి ఆనం బాటలోనే పయనిస్తు న్నాడు. వివేకా తన అనుచరురాలు భాను శ్రీకి తన హయాంలో నెల్లూరు నగరాన్ని రాసిస్తే, ఇప్పుడు అజీజ్‌ తన తమ్ముడు జలీల్‌కు నెల్లూరును దత్తత ఇచ్చాడు. కావాల్సినంత దండుకోమన్నట్లు రాసి చ్చాడు. ప్రతి పనికి, ప్రతి నిర్మాణానికి, ప్రతి అనుమతికి రేట్లు నిర్ణయించి వీళ్లు కలెక్షన్లు దండుతున్నారు. వివేకా అందిం చిన అవినీతి వారసత్వాన్ని వీళ్లు బాగానే అందిపుచ్చుకున్నారు. కార్పొరేషన్‌ను అవి నీతి కేంద్రంగా తీర్చిదిద్దారు.

కార్పొరేషన్‌పై పట్టు కోసమే...

మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి దాదాపు 20ఏళ్లపాటు నెల్లూరు నగరంలో వెలిగాడు. ఆయన సామ్రాజ్యమే నడిచింది. నెల్లూరు నగరంలో ఆయన ఏదనుకుంటే అది చేయగలిగాడు. తనవాడు అనుకుంటే అడ్డదిడ్డంగా భవనాలు కట్టినవాళ్లకు సైతం ఎన్‌ఓసిలు వచ్చాయి. పరాయివాడు అన్న వాడి భవంతులు పేకమేడల్లా కూలాయి. గత 20ఏళ్లు ఆయన మాట శిలాశాసన మైంది. ఆయన కరుణిస్తే చాలు నగరంలో ఏ పనైనా అయిపోతుందనే పరిస్థితి ఉం డింది. నగరం మీద ఆయనకు ఇంత పట్టు రావడానికి కారణం ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినందువల్ల కాదు. నెల్లూరు నగరపాలక సంస్థలో మేయర్‌లుగా తన వారిని పెట్టుకోవడం వల్లే. నగరపాలక సంస్థలో సభ్యులు తన అనుచరులుండడం వల్ల. నగరపాలక సంస్థ సిబ్బంది కూడా ఎక్కువమంది వారి అనుచరులై ఉండడం, దీనికితోడు పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రభు త్వమే ఉండడం.

నెల్లూరు పాలక సంస్థలో పట్టు వుంటే చాలు నెల్లూరు నగరమంతా గుప్పిట్లో

ఉన్నట్లే! ఎందుకంటే నగరంలో ప్రతి ఒక్క రికీ పనిబడేది కార్పొరేషన్‌తోనే! ఇళ్లు కట్టుకోవాలన్నా, బర్త్‌ సర్టిఫికేట్‌, డెత్‌ సర్టిఫికేట్‌ కావాలన్నా, కొళాయిలు, డ్రైనేజీ, వీధి లైట్లు... ఇలా ప్రజల అవసరాలు చాలా వరకు నగరపాలక సంస్థతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి నగరపాలక సంస్థపై పట్టుంటే ప్రజల్లో పరపతి పెంచుకోవచ్చు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వివేకా చేసిం దిదే! పేరుకు ఎమ్మెల్యేగా వున్నా ఆయన పరోక్షంగా నిర్వహించిం దంతా మేయర్‌ విధులే!

ఈ కార్పొరేషన్‌కు 20ఏళ్లుగా అల వాటుపడ్డ ప్రాణం. ఇక్కడ అణువణువు తెలుసు. దీని టేస్ట్‌కు అలవాటుపడి పోయాడు. అంత తొందరగా కార్పొరేషన్‌ మీద అభిమానాన్ని చంపుకోలేడుగా? ఇప్పుడు వివేకా అదే పనిచేస్తున్నాడు. కార్పొరేషన్‌పై మునుపటి పట్టు కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. విచిత్రంగా వేషాలు వేసుకుంటూ నోరంతా పెద్దది చేసుకొని అరచి మరీ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలు వివేకా హావ భావాలు చూసి నవ్వుకుంటున్నారు.

ఇక, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ ఆనం అవినీతి బాటలోనే మేయర్‌ కూడా వెళుతున్నాడు. కోట్లు ఖర్చుపెట్టి మేయర్‌ కుర్చీని అతికష్టం మీద దక్కించు కున్న అజీజ్‌ ఊరుకుంటాడా మరి? కార్పొ రేషన్‌లో తనది కాకుండా ఇంకొకరి పెత్తనాన్ని సహిస్తాడా? తాను మేయర్‌గా ఉన్నంతకాలం తన రాజ్యమే నడవాలను కుంటాడు కదా! ఇక్కడే ఆనం, అజీజ్‌ వర్గాలు ఘర్షణ పడుతున్నాయి. మధ్యలో మైనార్టీలను కూడా ముగ్గులోకి లాగారు. మైనార్టీలు ఇరు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల తెలుగుదేశంలో చేరిన నాయకులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు నగరపాలక సంస్థలో సభ్యులు తెలుగుదేశం, వైకాపా సభ్యులుగా విడి పోయి అరుచుకోవడం లేదు. అజీజ్‌, ఆనం వర్గాలుగా విడిపోగా చాలామంది సభ్యులు మాకెందుకొచ్చిన తలనొప్పిలే అని తట స్థంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య పోరు ఇక్కడితో ఆగదు. ఆనంకు ప్రతి రోజూ అజీజ్‌ మీద బురద చల్లడమే పని. వాళ్లకు అది వెన్నతో పెట్టిన విద్య. పదవీ కాలం ముగిసేదాకా అజీజ్‌ ఈ బురదను కడుక్కోవడంతోనే సరిపోద్ది!

'అ' 'ఆ' మధ్య నారాయణ

అజీజ్‌ను, ఆ తర్వాత ఆనంను తెలుగుదేశంలోకి తీసుకొచ్చింది మంత్రి నారాయణ. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య పోరులో ఆయన నలిగిపోక తప్పదు. ఆయన అటు ఆనంను కాదనుకోలేడు, ఇటు అజీజ్‌ను వదులుకోలేడు. అందుకని ఈ కార్పొరేషన్‌ వర్గపోరు ఎపిసోడ్‌లో ఆయన 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' అన్న మార్గాన్ని అనుసరించే అవకాశా లున్నాయి.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • బాలయ్య మాటిచ్చాడు... చంద్రబాబు పదవిచ్చాడు
  నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) తొలి ఛైర్మెన్‌గా తెలుగుదేశం నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మెన్‌గా శీనయ్యతో పాటు డైరెక్టర్‌లుగా మరో ముగ్గురిని నియమించారు. కావలి నియోజకవర్గం నుండి బీద…
 • ఇఫ్కో అక్రమ భూములను స్వాధీనం చేసుకోవాలి
  ఇఫ్కో కిసాన్‌సెజ్‌ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకున్న 596 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని కోరారు. వివాదాలేమీలేని ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter