అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలలోనే తమ పార్టీ జెండాను పాతిన బీజేపీ అంతో ఇంతో అనువుగా వుండే ఆంధ్రప్రదేశ్‌ను వదిలిపెడు తుందా? ఈ రాష్ట్రంలో పాతుకుపోవడానికి ప్రయత్నించకుండా వుంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రాను వదిలిపెట్టదు. ఇప్పుడు కాకపోతే రేపు... ఏపిలో పట్టు సాధిస్తామనే ధీమా ఆ పార్టీలో వుంది. రేపు పట్టు సాధించాలంటే ఈరోజే అడుగు వేయడం మొదలుపెట్టాలి.
ఆ దిశగానే బీజేపీ ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా వుండే రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ బలం పెంచుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. రెండు ప్రాంతీయపార్టీలలో ఒక పార్టీని తెరమరుగు చేస్తేనే ఆ స్థానంలో జాతీయపార్టీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రణాళికనే బీజేపీ ఏపిలోనూ అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పొమ్మన కుండానే టీడీపీకి పొగబెట్టి ఎన్డీఏ నుండి ఆ పార్టీని బయటకు నెట్టింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఆశ బీజేపీకి లేదు, కాకపోతే తెలుగుదేశం ఓడిపోవాలనేది వాళ్ళ టార్గెట్! వైసిపి అధికారంలోకి వస్తే జగన్ రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతాడు. అదే చంద్రబాబు మళ్ళీ గెలిస్తే జాతీయ రాజకీయాలలో కూడా బీజేపీకి పుండు అవుతాడు.
టిడిపి ఓడిపోవాలన్నదే లక్ష్యం
రాష్ట్రంలో బీజేపీ బలపడాలి, టీడీపీ బలహీనపడాలి. ఇందుకోసం మొదట తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు అభి మానపాత్రుడిగా వున్న తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును అధ్యక్ష పదవి నుండి తప్పించడం... ఆ పనైపో యింది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా కాపు సామాజికవర్గానికి చెందిన వాళ్ళను పెట్టడం. ఇందులో భాగంగానే సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడి కొండల మాణిక్యాల రావుల పేర్లు తెరమీద కొచ్చాయి. అలాగే ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి పేరు కూడా ప్రధానంగా రేస్‌లో వున్నట్లు తెలుస్తోంది. టీడీపీని నిర్వీర్యం చేసి తాము బలపడాలనేది బీజేపీ అనుసరించనున్న వ్యూహం! ఇం దుకు ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుం టుందో? లేదా కాపు సామాజికవర్గాన్ని మార్గంగా ఎంచుకుంటుందో త్వరలోనే తేలబోతోంది!
రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల పాటు సమర్ధవంతంగా పనిచేయని ప్రతిపక్షం ఒక్క నెలలో పుంజుకుని అధికారంలోకి రావొచ్చు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే!
ఇలాంటి ట్రెండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నడుస్తోంది. రెండు నెలల క్రితం దాకా కూడా రాష్ట్ర రాజకీయా లలో ఒక విధమైన వాతావరణం వుండింది. 2019 ఎన్నికల్లోనూ తిరిగి తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు అనుభవజ్ఞుడని, ఆయన తిమ్మిని బమ్మిని చేసైనా పార్టీని గెలి పించుకోగలడని నమ్ముతూ వచ్చారు. ముఖ్యంగా జగన్ ఎంత అరచి గీపెట్టుకున్నా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తప్పితే గుంటూరు నుండి శ్రీకాకుళం దాకా వైసిపికి పెద్దగా సీట్లు రావని, చంద్రబాబే మళ్ళీ సీఎం అంటూ విశ్వసించారు. దీనికితోడు చంద్రబాబు అనుకూల మీడియా కూడా ఆయనకే బాకా ఊదసాగింది.
కాని రాష్ట్ర రాజకీయాలలో కేవలం రెండు నెలల కాలంలోనే పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. జగన్ తీసుకున్న స్థిరమైన నిర్ణయాలు ప్రజల్లో వైకాపా ఇమేజ్ను పెంచగా, చంద్రబాబు 'యూ టర్న్' రాజకీయాలు ఆయన పార్టీకి పెద్ద డామేజీ అయ్యాయి. ఏపికి ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు వైఖరి ప్రజలకు నచ్చలేదు. ముఖ్యంగా యువత విశ్వాసాన్ని ఆయన కోల్పోయాడు. ఓటర్ల జాబితా నుండి వృద్ధులు తొలుగుతుంటారు, యువత కొత్తగా చేరుతుంటుంది. ప్రత్యేక హోదా ఉద్యమం యువత కోసమే. కాబట్టే వాళ్ళు జగన్ పట్ల అభిమానం చూపుతున్నారు. హోదా ఉద్యమంలో జగన్ దూకుడు ప్రజల ఆమోదం పొందింది. ప్రత్యేకహోదాను మొదట వ్యతి రేకించి తర్వాత హోదానే కావాలన్న చంద్రబాబు డ్రామాలను ప్రజలు అంగీకరించడం లేదు.
దీనికితోడు ఎన్డీఏ నుండి బయటకొచ్చాక టీడీపీ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు పెరిగాయి. చంద్రబాబు అవినీతిని లెక్కలతో సహా వివరిస్తామని బీజేపీ నాయకులు పేపర్లు పట్టుకుని తిరుగు తున్నారు. మరోపక్క జనసేన పవన్‌కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు కూడా తెలుగుదేశంను అతలాకుతలం చేసాయి. ఇక నాలుగేళ్ళ చంద్రబాబు పాలనలో అన్నీ వైఫల్యాలే. ఒక్క విజయమూ లేదు. చెప్పుకోదగ్గ పని ఒక్కటీ లేదు.
చంద్రబాబుపై నమ్మకం సడలిపోయింది. అదే సమయంలో జగన్‌పై ప్రజలలో నమ్మకం పెరుగుతోంది. ప్రత్యేకహోదా ఉద్య మంలో ఒకే మాట, ఒకే బాట అంటూ నాలుగేళ్ళుగా జగన్ సాగించిన పోరాటం ఆయనకు మైలేజీని పెంచింది. ఇక ప్రజా సంకల్పయాత్ర అంటూ ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం దాకా ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర జైత్రయాత్రలాగా సాగుతోంది. వైసిపికి పట్టున్న కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే కాదు, టీడీపీ కంచుకోటలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ జగన్ పాదయాత్ర ప్రభంజనంలా మారింది. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషణలు సైతం మారిపోయాయి. కొద్ది నెలల క్రితంవరకు మళ్ళీ తెలుగుదేశందే అధికారం అంటున్న గొంతులు కూడా ఇప్పుడు పెగలడం లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటేసిన ప్రతి పదిమందిలో ఐదుమంది ఆ పార్టీ పనితీరుపై అసంతృప్తితో వున్నారు. కాని, అదే ఎన్నికల్లో వైసిపికి ఓటేసిన ప్రతి పదిమందిలో తొమ్మిదిమంది వైసిపితోనే వున్నారు.
కరెక్ట్‌గా ఇంకో ఏడాదిలో ఎన్నికలు... ఎలక్షన్ ట్రెండ్ మొద లైనట్లే! ఇక్కడనుండే ఎత్తులు, పైఎత్తులు మొదలవుతాయి. ఇప్పటికైతే రాష్ట్రంలో వైసిపికి అనుకూల వాతావరణముంది. చంద్రబాబు సరిదిద్దుకోలేనంత వ్యతిరేకత తెచ్చుకున్నాడు. శత్రువు బలహీనతనే జగన్ తన బలంగా మలచుకుంటే ఇదే ట్రెండ్ ఎలక్షన్లలో ఉపయోగపడుతుంది.
నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న అసంతృప్తిని, వ్యతిరేకతను చాలావరకు తగ్గించుకోగలిగారు.
ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా వైకాపాకు చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేయడం, వెనువెంటనే ఆంధ్రాభవన్ వద్ద నిరాహారదీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ ఐదుగురిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి వయసులో పెద్దోడు. 73ఏళ్ళు. ఆ వయసులో నిరాహారదీక్ష వంటివి ఆయన ఒంటికి పడవు. అయినా పట్టుదలగా కూర్చున్నాడు. రెండోరోజే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ వయసులో కూడా ఆయన నిరాహారదీక్షకు కూర్చోవడం, జగన్ మాటకు కట్టుబడి రాజీనామా చేయడం వంటివన్నీ ఆయనపై ప్రజల్లో వున్న వ్యతిరేకతను చాలావరకు తగ్గించాయని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో సిటింగ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుండింది. కాబట్టే భారీ క్రాస్‌ఓటింగ్ జరిగి, లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీలలో 5 నియోజకవర్గా లలో వైసిపి అభ్యర్థులు గెలిచినా ఈయన కేవలం 13వేల ఓట్లు మెజార్టీతో గెలిచాడు. వ్యతిరేకత లేకుంటే దాదాపు లక్ష ఓట్లు మెజార్టీ వుండాలి. రాబోయే ఎన్నికల్లో ఆయనపై అంతటి వ్యతిరేకత రాకపోవచ్చు. క్రాస్‌ఓటింగ్‌కు ఈసారి ఆస్కారం వుండదు.
తిరుపతి ఎంపీ వరప్రసాద్ మీద ఇటీవలకాలం వరకు ఆయన నియోజకవర్గ పరిధిలో వ్యతిరేకత వుండింది. వైసిపిలో కూడా కొంతమంది నాయకులు ఆయనపై అసంతృప్తితో వున్నారు. అయితే ఇటీవల ప్రత్యేకహోదా విషయంలో వరప్రసాద్ చురుకైన పాత్ర పోషించాడు. లోక్‌సభలో దీనిపై ప్రభుత్వాన్ని కదిలించేలా ప్రసంగిం చాడు. వైసిపి ఎంపీలలో మేకపాటి తర్వాత వయసులో ఆయనే పెద్దోడు. ఆ వయసు లోనూ దీక్షకు కూర్చుని పోరాడాడు. ఏదేమైనా ఈ ఇద్దరు ఎంపీలకు ప్రత్యేకహోదా ఉద్యమం ఒక ఆక్సిజన్‌లాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు.