akhilapakshamరామయ్య ఇంట కొడుకు పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి పనులన్నీ తన స్నేహితులైన చంద్రయ్య, రాజయ్యలకు అప్పగించాడు. చంద్రయ్యకు పని కంటే కూడా మాటలెక్కువ. రాజయ్యకు మాటలకంటే పని మీద ధ్యాస ఎక్కువ. పెళ్ళి ఏర్పాట్లన్నీ రాజయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడు. చంద్రయ్య మాత్రం నలుగురిని పోగేసుకుని తాను అంతటివాడినని ఇంతటి వాడినని డబ్బా కొట్టుకునే వాడు. పెళ్ళి పనులు చివరి దశలో వుండగా, అక్కడకు రామయ్య రావడాన్ని చంద్రయ్య చూసాడు. వెంటనే మాటలు కట్టేసి పెళ్ళి పనుల వద్దకు పరుగెత్తి అక్కడున్న టెంకాయ మట్టలను గుంజలకు కడుతూ నుదుటన చెమటను తుడుచుకుంటున్నట్లు ఫోజివ్వసాగాడు. పని అయ్యేదాకా కష్టపడింది రాజయ్య... చివరి దశలో పనిలో అడుగుపెట్టి... నేను పని చేయడం వల్లే అన్ని పనులు పూర్తయ్యాయి అన్నట్లు కలరింగ్‌ ఇవ్వాలనుకున్నాడు చంద్రయ్య. కాని, రాజయ్య, చంద్రయ్యలలో ఎవరి బుద్ధి ఏమిటో తెలిసిన వాడు రామయ్య.

ఇప్పుడు రామయ్య లాంటివారే ఆంధ్రా ప్రజలు. ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్ధితో నాలుగేళ్ళ నుండి పోరాటం చేస్తున్న వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిని నమ్ముతారా? లేక నాలుగేళ్ళ నుండి ప్యాకేజీ పాట పాడుతూ నాలుగురోజుల క్రితమే హోదా మాట మార్చిన చంద్రబాబును విశ్వసిస్తారా? అన్నదే చూడాలి! రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం బాగా రగులుకుంది. ప్రజల్లో చైతన్య మొచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు కూడా హోదా కోసం గళమెత్తాయి. రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకహోదాపై మొదటి నుండి గట్టిగా నిలబడింది, గట్టిగా పట్టుబట్టింది వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మద్దతుతో ముందుకు నడిపాడు.

ప్రత్యేకహోదా కోసం గట్టిగా పోరా డాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ప్రత్యేకప్యాకేజీ మాత్రమే ఇస్తామన్నప్పుడు అదే మహాప్రసాదం అన్నట్లుగా అంగీకరించిందేగాని హోదా ఎందుకు ఇవ్వరని ఏ రోజూ అడగలేదు.

ఈరోజు బీజేపీతో విభేదాలొచ్చేసరికి, ప్రతిపక్షం హోదా ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేసరికి ఉలికిపాటు మొద లైంది. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని హైజాక్‌ చేసే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏనాడూ అఖిలపక్ష సమావేశం జరపలేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేట ప్పుడు తెలుగుదేశంకు అఖిలపక్షాలు గుర్తుకురాలేదు. రాజధాని అన్నది తెలుగు దేశం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కాదు. 13జిల్లాల ప్రజలకు సంబంధించిన అంశం. భావితరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాల్సిన విషయం. ఆరోజు ఏ పక్షాన్ని పిలవకుండానే ఏకపక్షంగా అమ రావతిని రాజధానిగా నిర్ణయించేసారు. ఆ తర్వాత నాలుగేళ్ళలో ఏ అంశంపైన కూడా ప్రతిపక్షాన్ని పిలిచి అడగాలన్న స్పృహ ఈ ప్రభుత్వానికి తట్టలేదు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రభుత్వమే నాలుగేళ్ళుగా తొక్కి పట్టాలని చూసినా ప్రధాన ప్రతిపక్షం వైసిపి, ఇక వామపక్షాలు ఏదో రూపంలో ముందుకు తీసుకుపోతూనే వున్నాయి. ప్రత్యేకహోదా ఉద్యమం పరి పక్వ దశకు వచ్చిందని, హోదాకు జైకొట్టక పోతే ఆంధ్రా జనం తమను ఛీకొట్టడం ఖాయమని భావించిన చంద్రబాబు 'యూ' టర్న్‌ తీసుకున్నాడు. ఉద్యమాన్ని పూర్తిగా హైజాక్‌ చేసి పచ్చముద్ర వేసుకునేందుకు అఖిలపక్షం నాటకం మొదలుపెట్టాడు. ఈ అఖిలపక్షం సమావేశంకు ప్రధాన ప్రతి పక్షం వైసిపితో పాటు బీజేపీ, జనసేన వంటి పార్టీలు హాజరు కాలేదు. వామ పక్ష నాయకులు వెళ్ళినా ఈ నాలుగేళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారంటూ చంద్రబాబు ముఖాన్నే కడిగేసి బయటకొచ్చారు.

హోదా అంటే జైలుకే అని బెదిరించిన నాయకులే ఆ ఉద్యమానికి సారధ్యం వహిస్తామని చెప్పడం చూస్తుంటే గొర్రెల మందకు తోడేళ్లను కాపలా పెట్టడమే అవుతుంది. ఇలాంటి నాయకుల చేతుల్లోకి ఉద్యమం పోతే చివరకు అది ఏ దారి పడుతుందో తెలియదు. చంద్రబాబు హోదా ఉద్యమ హైజాక్‌ ప్లాన్‌కు ప్రతి పక్షాలు బలంగానే బ్రేక్‌ చేశాయి.

vijay saiఆయన్నొక సాధారణ ఆడిటర్‌ అనుకున్నారు... ఆయనకు లెక్కలు తప్ప రాజకీయాల్లో ఎక్కాలు తెలియవనుకున్నారు. ఆయనను రాజ్యసభకు పంపు తుంటే... ఈ ఆడిటర్‌ పార్లమెంటుకు వెళ్ళి ఏం చేస్తాడన్నారు. వై.యస్‌.కుటుంబం పట్ల విశ్వాసం చూపినందుకే రాజ్యసభకు పంపించారన్నారు.

నిజమే... వై.యస్‌. కుటుంబం పట్ల ఆయన చూపి స్తున్నది విశ్వాసం కాదు, అంతకుమించిన ప్రేమ, అభిమానం. అంతటి అభిమానం ఉండబట్టే జగన్‌తో పాటే కేసుల్లో ఇరుక్కున్నాడు. జగన్‌తో పాటే జైలులో గడిపాడు. ఈరోజు జగన్‌ కోసమే ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ప్రత్యర్థులను షేక్‌ చేస్తున్నాడు.

ఈరోజు వరకు కూడా రాజ్యసభలో వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వున్న ఒకే ఒక సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ఒక్కడైతేనేం వందమందితో సమానం. సభలోని 250 మందికి లెక్కలు చెప్పగల నైజం ఆయనది. పార్లమెంటు సమావేశాలలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. రాజకీయంగా అనుభవం లేకపోయినా, ఎంతో పరిణితి ప్రదర్శిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో వైసిపి 8 లోక్‌సభ స్థానాలను గెలిచింది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉండడం, కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం, బీజేపీ కంటే కాంగ్రెస్సే బద్ధశత్రువు కావడం మూలంగా జాతీయ రాజకీయాల్లో వైసిపి ప్రభావం పెద్దగా లేకుండా పోయింది.

అయితే రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎప్పుడు అడుగుపెట్టాడో అప్పుడే పొలిటికల్‌ సీన్‌ మారిపోయింది. జాతీయ రాజకీయాల్లోనూ, ఢిల్లీలోనూ వైసిపికి ఒక ట్రాక్‌ ఏర్పడింది. విజయసాయిరెడ్డి పార్లమెంటులో అడుగుపెట్టనంతవరకు జగన్‌ లక్ష కోట్లు తిన్నాడన్న టీడీపీ నేతల వాయిస్సే అక్కడ వినిపిస్తుండేది. కాని, విజయసాయిరెడ్డి ఢిల్లీలో అడుగుపెట్టాక ఏపి నుండి నిజాలు మాత్రమే వెళ్ళసాగాయి. జగన్‌పై పెట్టిన కేసుల్లో దురుద్దేశ్యాన్ని, అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంలో విజయసాయిరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. చంద్రబాబు మితిమీరిన అధికార దుర్వినియోగాన్ని దుబారాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడం వల్లే కేంద్రం ఈరోజు ఏపికి ఇస్తున్న నిధులపై గట్టిగా లెక్కలు అడుగుతోంది. ఆ లెక్కలు అడగబట్టే తన బొక్కలు బయటపడతాయని చంద్రబాబు ప్రత్యేకహోదా సొడ్డు పెట్టి ఎన్డీఏ నుండి బయటకొచ్చాడు.

ప్రత్యేకహోదా ఉద్యమం విషయంలోనూ జగన్‌కు విజయసాయిరెడ్డి కొండంత అండగా నిలిచాడు. జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్ర పరిధిలు దాటకుండా ఇక్కడే ఉద్యమానికి రూపకల్పన చేస్తుంటే, ఉద్యమ సెగలను పార్లమెంటును తాకేలా చేసింది విజయసాయిరెడ్డే! ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంలోను, దానికి అన్ని పక్షాల మద్దతు కూడగట్టడంలోనూ ఆయన చేసిన ప్రయత్నాలు అనిర్వచనీయం. బీజేపీకి అమిత్‌షా, రాంమాధవ్‌, కాంగ్రెస్‌కు అహ్మద్‌పటేల్‌, గులాంనబీ ఆజాద్‌, సమాజ్‌వాదీకి ఒకప్పుడు అమర్‌సింగ్‌ లాంటి నాయకులు ఎలా ఆయువుపట్టుగా వుండేవాళ్ళో, ఇప్పుడు వైసిపికి విజయసాయిరెడ్డి ఆయువుపట్టయ్యాడు. నాడు వై.యస్‌. కుటుంబానికి, నేడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి నమ్మినబంటు అయ్యాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. తాను కేవలం లెక్కల మాంత్రికుడినే కాదు, రాజకీయ తాంత్రికుడిని కూడా అని రుజువు చేసుకుంటున్నాడు.

jaganఒక తెలుగు సినిమాలో హీరో చిరంజీవిని విలన్‌లు చావగొడ తారు. చచ్చిపోయాడనుకుని గొయ్యి తీసి పూడ్చేస్తారు. అతని ప్రేయసిని చెరపట్టబోతారు. అప్పుడు ఆమె హీరోనుద్దేశించి... రాజా రాజా అని కేక వేస్తుంది... ఆ కేకలు మన హీరో చెవిని తాకుతాయి. హీరో కళ్ళు తెరు స్తాడు. మట్టిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. విలన్‌లపై విరుచుకుపడి వారికి నలుగుపెడతాడు. శుభం కార్డు పడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అన్నది కూడా అలాగే తయారైంది. రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాను చావగొట్టి గోతిలో పడేసింది. ''ప్రత్యేక హోదా వేస్ట్‌... ప్రత్యేక ప్యాకేజీయే బెస్ట్‌'' అంటూ ఆరోజు చంద్రబాబు స్వయంగా తన చేతులతోనే మట్టేసి ఆ గోతిని కప్పేసాడు. ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం ఆరోజు నుండి ప్రత్యేక హోదా... ప్రత్యేకహోదా... అని కలవరి స్తూనే వున్నాడు. కాకపోతే ఈమధ్య ఇంకాస్త స్వరం పెంచడంతో ఆ మాటలు మట్టి క్రింద కప్పేసి వున్న ప్రత్యేకహోదా చెవులను తాకాయి... ప్రత్యేకహోదా అంశం జగన్‌ పిలుపుతో మట్టిని చీల్చు కుంటూ పైకొచ్చి ఇప్పుడు రాష్ట్ర రాజకీయా లనే కాదు జాతీయ రాజకీయాలనూ షేక్‌ చేస్తోంది. ప్రత్యేకహోదాను వద్దన్న చంద్ర బాబును కూడా షేకయ్యేలా చేసింది.

ఎవరెన్ని వేషాలేసినా, ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రత్యేకహోదా

ఉద్యమాన్ని సజీవంగా వుంచింది, దాని కోసం చిత్తశుద్ధిగా పోరాడింది జగన్మోహన్‌ రెడ్డే! కొందరు మేధావులు టీవీ చర్చా వేదికల్లో దీనిపై తమ వాదన వినిపిస్తున్నా రాజకీయంగా ఈ పోరాటాన్ని వేడెక్కిం చింది, ఈ సెగలు ఢిల్లీని తాకేలా చేసింది వైకాపా అధినేతే!

ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటిస్తే దానికి వంతపాడింది తెలుగు దేశం నాయకులే! ప్రత్యేకహోదా ఏమన్నా సంజీవనియా అని చంద్రబాబు అంటే, హోదా ఉద్యమాన్ని పందులాటతో పోల్చి మొన్నటివరకు కేంద్రమంత్రిగా వున్న ఆ పార్టీ నాయకుడు సుజనాచౌదరి తన చపలత్వాన్ని చాటుకున్నాడు. హోదాతో

ఉద్యోగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తూ జగన్‌ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సీఎం పుత్రరత్నం లోకేష్‌ ప్రవచించాడు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం కంటే కూడా రాష్ట్ర ప్రజలను వంచనకు గురి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే!

కాని ఏరోజూ జగన్‌ ప్రత్యేకహోదా ఉద్యమం కాడెను కిందకు దించలేదు. ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. హోదా అంటే జైలుకే అని ప్రభుత్వం బెదిరిస్తున్నా ఆయన బెదరలేదు. దీక్షల నుండి కేంద్రంపై అవిశ్వాసతీర్మానం మొదలుకొని తన పార్టీ ఎంపీల రాజీనామా దాకా ఒక నిర్మాణాత్మక మార్గంలో ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ విషంలో జగన్‌ ఎక్కడా మాట మార్చలేదు, మార్గం తప్పలేదు, మడమ తిప్పలేదు.

ప్రత్యేకహోదా అంశంలో ఎన్నో మాటలు మార్చింది, ఎన్నో మలుపులు తిరిగింది చంద్రబాబునాయుడే! ప్రత్యేక హోదా ఉద్యమంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రజల్లో జగన్‌ పట్ల సాను కూలత పెరిగింది. ప్రత్యేకహోదా ప్రయోజ నాలపై ప్రజలకు అవగాహన పెరిగింది. ప్రత్యేకహోదా పట్ల తన వైఖరి మార్చు కోకుంటే వచ్చే ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవని గ్రహించాడు. అందుకే యూటర్న్‌ తీసుకున్నాడు. ప్రత్యేకహోదా అంశంపై వైసిపి ప్రవేశపెట్టే తీర్మానానికి మొదట మద్దతు ఇస్తామన్నాడు, కొన్ని గంటల్లోపే మాట మార్చాడు. వైసిపి అవిశ్వాసానికి మద్దతునిస్తే తాను వీక్‌ అవుతాననుకు న్నాడో ఏమో వెంటనే నాలుక మడత పెట్టాడు. ఎన్డీఏ నుండి బయటకొచ్చి తమ పార్టీ తరపునే అవిశ్వాస తీర్మానం పెడు తున్నట్లు ప్రకటించాడు.

ఒక అంశంపై ఒక నాయకుడు ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తాడా అన్నది చంద్రబాబు విషయంలోనే చూసాం. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా ప్రత్యేకహోదా విషయంలో పార్ట్‌టైం పోరాటం చేసాడే గాని, దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది లేదు. ప్రత్యేకహోదాపై మొదటనుండి ఒకే మాట మీద నిలబడింది, తన పోరా టంతో అందరినీ ఒకే బాటలోకి తెచ్చింది జగనే! ఎన్నికలకు ముందు ఇటలీ నియంత సోనియాను ఢీకొని ఔరా తెలుగు బిడ్డ... అనిపించుకున్నాడు. ఇప్పుడు ఇండియా నియంత మోడీని ఢీకొని తెలుగోడి సత్తాను ఢిల్లీ వీధుల్లో చాటుతున్నాడు... దటీజ్‌ జగన్‌. ప్రత్యేకహోదా పోరాట హీరో ప్రజల దృష్టిలో ముమ్మాటికీ అతనే!

Page 8 of 76

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter