conge bjpఆంధ్రప్రదేశ్‌ అనే వ్యక్తిని కాంగ్రెస్‌ అనే హంతకుడు కత్తితో కిరాతకంగా పొడిచి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదే సమయంలో అక్కడకు బీజేపీ అనే వాడొచ్చాడు. అతను సరిగా స్పందించి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆసుపత్రిలో చేర్చివుంటే బ్రతికి వుండేవాడేమో? కాని బీజేపీవాడు ఆ పని చేయలేదు. కొన ఊపిరితో వున్నావు కదా అంటూ... గొంతులో తులసినీళ్ళు పోసాడు. మరి ఈ మొత్తం ఎంపిసోడ్‌లో నిందితుడెవరు? పొడిచి పారిపోయిన కాంగ్రెసోడా? లేక కాపాడకుండా ప్రేక్షకపాత్ర పోషించిన బీజేపీ వాడా?

కర్నాటక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ వాళ్ళు నిర్వహించిన ప్రచారం తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలే రాకమానవు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కొందరు మంత్రులు బీజేపీని ఓడించాలంటూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ కోసం ఆర్ధిక సహకారం కూడా అందించినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే అది చంద్రబాబు సత్తానేనని ప్రచారం చేసుకోవచ్చని వీరి ప్లాన్‌. అందుకే గతంలో సమైక్యాంధ్ర

ఉద్యమాన్ని తాకట్టుపెట్టి చంద్రబాబుకు బిళ్ళబంట్రోతుగా పనిచేస్తున్న ఎన్జీఓల నాయకుడు అశోక్‌బాబును కూడా కర్నా టకా ఎన్నికల ప్రచారానికి పంపించారు.

కర్నాటకలో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం ప్రచారం చేసింది. అక్కడి తెలుగుప్రజల్లో విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేసింది. సరే, అక్కడ బీజేపీని ఓడించాలంటే ఎవరిని గెలిపించమని అర్ధం... ఒకటి కాంగ్రెస్‌, రెండోది జేడిఎస్‌. ముందు జేడిఎస్‌ను చూద్దాం.. ఇది పక్కా ప్రాంతీయ పార్టీ. ఆంధ్రా ప్రయోజనాల కంటే కర్నాటక ప్రయోజనాలకు ప్రాధాన్యత నిచ్చుకుంటారు. ఒకవేళ కేంద్రం ఏపికి ప్రత్యేకహోదా ఇద్దామనుకున్నా దానిని వ్యతిరేకించే పార్టీలలో జేడిఎస్‌ వుంటుంది. అదీగాక ఈ పార్టీ వ్యవస్థాపకులు దేవేగౌడ ప్రధానిగా వున్న సమయంలోనే కర్నాటకలో ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచి కృష్ణ నీళ్ళు కిందకు రాకుండా ఆంధ్రా నోట్లో మట్టి కొట్టాడు. మరి అలాంటి పార్టీకేమన్నా టీడీపీ నాయకులు ఓట్లేయమంటారా?

ఇక కాంగ్రెస్‌ను చూద్దాం. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో యూపిఏను నిలబెట్టిందే ఏపిలో సాధించిన లోక్‌సభ సీట్లు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాలేదు. అలాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏం చేసింది. విభజన పేరుతో కుక్కలు చింపిన విస్తరి చేసింది. అత్యంత కర్క శంగా, పాశవికంగా, దారుణాతిదారు ణంగా రాష్ట్రాన్ని విభజించింది. ఆస్తుల పంపకం చేయలేదు. హైదరాబాద్‌లో మన వాటాను ప్రస్తావించలేదు. విభజన బిల్లులో కనీసం ప్రత్యేకహోదా అంశాన్ని కూడా చేర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విష యంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేసింది కాంగ్రెస్‌పార్టీ. కనీస కనికరం కూడా ఏపి పట్ల చూపకుండా వ్యవహరించింది. ఆనాటి రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు చూసిన వాళ్లెవరు కూడా వారి జన్మలో కాంగ్రెస్‌కు ఓటెయ్యరు. ఏపి ప్రజల మీద పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నట్లుగా సోనియాగాంధీ విభజనకు పాల్పడింది. ఏపి పట్ల ఇంత రాక్షసత్వంగా వ్యవహరిం చిన కాంగ్రెస్‌కు ఓట్లేయమంటాడా చంద్రబాబు?

ఏపికి బీజేపీ కూడా అన్యాయమే చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మొహం చాటేసింది. అయితే బీజేపీకి ఏపికి న్యాయం చేయడానికి ఇంకా అవకాశం మిగిలేవుంది. ఈరోజు కాకపోతే రేపు ప్రత్యేకహోదా ఇచ్చి, విభజన హామీ లను అమలు చేసినా బీజేపీ తన పాపానికి ప్రాయశ్చితం చేసుకున్నట్లే! కాంగ్రెస్‌కే ఆ అవకాశం లేదు. ఏపి ప్రజల దృష్టిలో ఆ పార్టీ ఎప్పటికీ హంతకుడిగానే మిగిలి పోద్ది. కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ గెలవా లని కోరుకుంటున్న చంద్రబాబు కూడా కాం గ్రెస్‌ సహనిందితుడిగానే మిగిలిపోతాడు.

jaganఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలపై పార్లమెంటులో ఎవరి నాటకాలు వాళ్లాడుతున్నారు. ప్రత్యేకహోదాపై ఎవరి పిల్లిమొగ్గలు వాళ్లేస్తున్నారు. ఒక పార్టీ వాళ్ళు పార్లమెంటు బయట పగటి వేషాలేస్తుంటే.. పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయని నటనాయకుడొకరు జేఏసీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇలాంటి పగటి వేషాలకు, ఇట్లాంటి జేఏసీ యాక్షన్‌లకు కేంద్రం తలవంచుతుందా? ప్రధాని నరేంద్ర మోడీ తల దించుతాడా...?

టీడీపీ, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ డ్రామాలకు చెక్‌పెడుతూ ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష నేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి సంధించిన రాజీనామాస్త్రం ఇప్పుడు అధికారపక్షంలో గుబులు రేపుతోంది. పిల్లిమొగ్గలు, పగటి వేషాలతో కాకుండా ఆయన ప్రత్యేకహోదా కోసం నేరుగా కేంద్రంతో కయ్యానికే సిద్ధమైయ్యారు. పార్లమెంటు వేదికగానే ప్రత్యేకపోరుకు శ్రీకారం చుట్టాడు. ఏపికి ప్రత్యేకహోదా కోసం అవసరమైతే తమ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్‌ గతంలోనే ప్రకటించి వున్నాడు. చివరి బడ్జెట్‌లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా కాదు కదా సరైన న్యాయం కూడా చేయలేని పరిస్థితులలో 'ప్యాకేజీ వద్దు - ప్రత్యేకహోదానే ముద్దు' అంటూ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో జరిగిన సభలో ప్రత్యేకపోరుకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకహోదాపై పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను ఆయన అశేష ప్రజానీకం సమక్షంలోనే ప్రకటించారు. మార్చి

1వ తేదీ నుండి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా ఉద్యమాలు జరుగుతాయి. మార్చి 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట వైసిపి ఆధ్వర్యంలో ధర్నా, కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 5వ తేదీన వైసిపి ఎంపీలు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం ధర్నా నిర్వ హిస్తారు. 3వతేదీన జగనే తాను పాద యాత్ర చేస్తున్న చోటు నుండి జెండా ఊపి వీరిని ఢిల్లీకి సాగనంపుతారు. మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వైసిపి ఎంపీలు పాల్గొని సభలో ఏపికి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తారు. ఏప్రిల్‌ 6వ తేదీ దాకా జరిగే సమావేశాలలో ప్రత్యేకహోదాపై కేంద్రం నుండి ఎటువంటి హామీ రాక పోతే, దానికి నిరసనగా వైసిపి ఎంపీలు సమావేశాల చివరిరోజున తమ రాజీ నామాలను స్పీకర్‌కు ఇచ్చేసి రాష్ట్రానికి వచ్చేస్తారు. ఆ తర్వాత నుండి కూడా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని కొనసాగించేలా జగన్‌ వ్యూహరచన చేసారు.

ప్రత్యేకహోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయించాలని జగన్‌ చేసిన ప్రయోగం తిరుగులేని అస్త్రం. ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పి జగన్‌ బంతిని ప్రత్యర్థుల కోర్టులోకి కొట్టాడు. ఇప్పుడు ప్రత్యర్థులది కక్క, మింగలేని పరిస్థితి.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం, రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకహోదానే మేలైన మార్గమని భావిస్తూ జగన్‌ ఆఖరి పోరాటానికి సిద్ధపడ్డాడు. ప్రతిపక్ష నాయకుడే ఏపికి ప్రత్యేకహోదా కోసం ఇంతకు తెగించి పోరాడుతుంటే, ఇక ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అధికారం అనుభవిస్తున్న చంద్రబాబు ఇంకెంత పోరాటం చేయాలి. కాని, చంద్రబాబు ప్రత్యేకహోదా పోరాటాన్ని ఎప్పుడో వదిలేసాడు. ప్రత్యేకప్యాకేజీయే చాలనుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని కాదని సలహా కూడా ఇచ్చాడు. ప్రత్యేకహోదా అనే అంశాన్ని ఆయన తన ఆలోచనలలో నుండి ఎప్పుడో తీసేసాడు. ఇప్పుడు బడ్జెట్‌లో ఏపికి నిధులివ్వలేదని ఏడుస్తున్నాడేగాని ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం లేదు.

ఇంకో పక్క చంద్రబాబు సైగలతో పనిచేసే పవన్‌కళ్యాణ్‌ జేఏసీ అంటూ వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనది ప్రత్యేకహోదా పోరాటమో, ఇంకెవరి కోసమన్నా ఆరాటమో అర్ధం కావడం లేదు. ఆయన భవిష్యత్‌ కార్యా చరణ ప్రణాళిక ఏంటో కూడా తెలియదు. ఒకవేళ ఆయనకన్నా తెలుసోలేదో? వామపక్షాల వాళ్ళు మాత్రం మొదటినుండి ఏపికి ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధితో వున్నారు. ఇప్పుడు వైకాపా నాయకత్వంలో వాళ్ళు కూడా ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశముంది.

మొత్తానికి జగన్‌ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయ్యుండాలి. ఆయన అటు తెగించి కేంద్రంతో పోరాడ లేడు... ఇటు చేతులు కట్టుకుని జనం మధ్య పలుచన కాలేడు. ప్రత్యేకహోదా కోసం నోరు తెరవలేని పరిస్థితి. జగన్‌ మాత్రం ప్రత్యేకహోదా కోసమే ప్రత్యేకంగా పట్టుబట్టి ఉద్యమానికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రజలలో సైతం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రత్యేకహోదాపై ఇక రాజీ లేని పోరు సాగిస్తే... జగన్‌కు చెల గాటం... బాబుకు సంకటమే! హోదాపై అసలైన గేమ్‌ ఇప్పుడే మొదలైంది...!

ivankaఛార్మినార్‌... గోల్కొండ... సాలార్‌జంగ్‌ మ్యూజియం... నిజాం హాస్పిటల్‌... అసెంబ్లీ భవనం... చారిత్రక హైదరాబాద్‌ నగరం చిహ్నాలు... ట్యాంక్‌ బండ్‌... హైటెక్‌ సిటి... శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌... ఔటర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే... మెట్రో... ఇవన్నీ ఆధునిక హైదరాబాద్‌ నగర ప్రతిరూపాలు. చారిత్రక నిర్మాణాల నిర్మాతలు నిజాం నవాబులైతే, ఆధునిక నిర్మాణాల సారధులు ఆంధ్రులే! ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు. ఆధునిక హైదరాబాద్‌ అభివృద్ధిలో ప్రధాన పాత్రధారులు ఆంధ్రా ప్రాంతపు ముఖ్యమంత్రులే!

హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌ లాంటి ట్యాంక్‌బండ్‌ నిర్మాత స్వర్గీయ నందమూరి తారకరామారావు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటిని నిర్మించి హైటెక్‌ బాట పట్టించింది చంద్రబాబునాయుడు, ఇక దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో అయితే హైదరాబాద్‌ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. వై.యస్‌. హయాంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, పి.వి.నరసింహా రావు ఎక్స్‌ప్రెస్‌ హైవేలతో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయి నగర రూపురేఖలు దిద్దుకుంది. ఇక ఇప్పటి మెట్రో ప్రాజెక్ట్‌కు ఆద్యుడు కూడా వైయస్సే! మెట్రో ప్రాజెక్ట్‌ను వై.యస్‌ తెచ్చాడు. మెట్రోను కేసీఆర్‌ వ్యతిరేకించాడు. ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణంలో ఆంధ్రుల పాత్ర ఎంతో వుంది. హైదరాబాద్‌ నగర నగిషీలుగా చెప్పుకునే ఏ ఒక్కదానిలోనూ కేసీఆర్‌ పాత్ర లేదు.

కాని, నిన్న జరిగిన మెట్రో ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి గాని, అమెరికా అధ్య క్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ పాల్గొన్న కార్యక్రమానికి గాని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం ఆంధ్రులను అవమానించడమే! హైదరా బాద్‌ ఉమ్మడి రాజధాని. మెట్రో ప్రాజెక్ట్‌ ఉమ్మడి రాష్ట్రాల హక్కు. ఇంకా ఆరున్న రేళ్ళు హైదరాబాద్‌పై ఆంధ్రులకు హక్కు వుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి కూడా! మరి ఆంధ్రా సీఎంను ఎందుకు గుర్తించలేదు? ఎందుకు గౌరవించలేదు. 2023దాకా హైదరాబాద్‌ నుండి మనల్ని ఎవరూ కదిలించలేరు, విభజన చట్టమే మనకు ఆ అవకాశమిచ్చింది. కాని చంద్రబాబే ఓటు-నోటు కేసులో ఇరుక్కుని హైదరా బాద్‌ను వదిలేసి వచ్చాడు. ఆయనంటే హైదరాబాద్‌ను వదిలేసినా కేంద్రమన్నా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వున్న అధికారాన్ని గుర్తించనక్కరలేదా?

ఈ కార్యక్రమాలకు చంద్రబాబును ఉద్దేశ్యపూర్వకంగానే పిలవలేదా లేక ఆయన మీదున్న అనుమానంతో పిలవ లేదా అన్న సందేహాలు కూడా వున్నాయి. ఏ సభలో చూసినా హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసానని చంద్రబాబు చెప్పు కుంటుంటాడు. వై.యస్‌.తో పోలిస్తే హైదరాబాద్‌ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర చాలా తక్కువ. అయినా డబ్బా కొట్టుకోవడంలో ఆయనే ముందుంటాడు. అలాంటి వ్యక్తిని మెట్రో, ఇవాంకా కార్య క్రమాలకు పిలిస్తే అక్కడకూడా అదే డబ్బా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా డామినేట్‌ చేయాలని చూస్తాడు. ఇక ఏ కార్యక్రమంలోనైనా చంద్రబాబును హైలెట్‌ చేసి చూపించడానికి పచ్చమీడియా రెడీగా వుంటుంది. చంద్రబాబును పిలిస్తే ఇలాంటి పరిణామాలుంటాయని ఊహించే ఆయనను పట్టించుకోలేదని తెలుస్తోంది.

కేసీఆర్‌, కేటీఆర్‌లు ఈ కార్యక్రమాల విషయంలో నియంతల మాదిరిగా వ్యవహరించారు. హైదరాబాద్‌ నగరానికి ప్రథమ పౌరుడైన మేయర్‌ బొంతు రామ్మో హన్‌కు కూడా ప్రాధాన్యత కల్పించక పోవడం వివాదం రేపింది. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడైతే, గవర్నర్‌ రాష్ట్రానికి ప్రథమపౌరుడైతే, మేయర్‌ నగరానికి ప్రథమపౌరుడవుతాడు. ప్రోటో కాల్‌లో మంత్రులకంటే కూడా మేయర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి మేయర్‌ను కూడా పక్కనపెట్టేశారు. ఏపి సీఎంను పిలవకపోవడం, మేయర్‌ను పక్కన పెట్టడం వంటి సంఘటనలు రాజకీ యంగా వివాదం రేకెత్తిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఎలా వున్నా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి కేంద్రం గాని, తెలంగాణ ప్రభుత్వం గాని కనీస గౌరవం ఇవ్వకపోవడం, ప్రోటోకాల్‌ పాటించి ఆయనను ఆహ్వానించకపోవడం ఆంధ్రు లను చిన్నచూపు చూడడమే!

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter