mekapatiవన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో గెలవాలంటే కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు... ప్లేయర్లు కూడా సమర్ధవంతంగా ఆడాలి. టీమ్‌ శక్తిసామర్ధ్యాల మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్‌ ఒక్కడే ఆడి టీమ్‌ను గెలిపించలేడు. వైసిపి అనే టీమ్‌కు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి కెప్టెన్‌ లాంటోడు. 2014 ఎన్నికల్లో జట్టులోని మిగతా సభ్యులతో పనిలేదు... నేనొక్కడినే ఆడి జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తానని ఎం.ఎస్‌.ధోని లాగా అతివిశ్వాసంతో ముందుకుపోయి బోల్తా పడ్డాడు.

ఇంతకాలానికి కెప్టెన్‌ ఒక్కడే ఆడితే చాలదు, మిగతా ఆటగాళ్ళు కూడా సమర్ధులై, ఆట తెలిసినవాళ్ళై వుండాలని తెలుసుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే రాజకీయంగా మంచి ఆటగాళ్ళను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ పరంపరలోనే పార్టీలోకి రావాలనుకుంటున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిని వైకాపాలోకి తీసుకోవడం ఇందులో భాగమే! జిల్లాలో వైసిపి బలంగావుంది. ఆనం పార్టీలో చేరితే నాలుగైదు నియోజకవర్గాలలో ఇంకొంత బలం చేకూరుతుంది. అదీగాక జిల్లాలో పార్టీ బలానొక్కటే నమ్ముకోలేం. అభ్యర్థుల బలం కూడా వుంటే మరీ మంచిది. ఏ కోణంలో చూసినా వైకాపాకు ఆనం రామనారాయణరెడ్డి బలమైన నాయకుడు. ఆయనను పార్టీలోకి తీసుకోవడాన్ని ఎవరూ రాజకీయం చేయాల్సిన పనిలేదు.

కాని, ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంగా ఆనం రామనారాయణరెడ్డిపై మేకపాటి వర్గీయులు కొందరు కరపత్రాల ద్వారా దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన పలు పార్టీలు మారాడని ప్రచారం చేస్తున్నారు. ఈ జిల్లాలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, జక్కా వెంకయ్య లాంటి వారికి తప్పితే పార్టీలు మార్చని చరిత్ర ఎవరికుంది! మేకపాటి బ్రదర్స్‌ పార్టీలు మార్చలేదా? జనతా నుండి కాంగ్రెస్‌లోకి, అక్కడనుండి తెలుగుదేశంలోకి తిరిగి కాంగ్రెస్‌లోకి... ఇప్పుడు వైకాపాలో... పార్టీలు మార్చడంలో మరి ఆనంకు వీళ్ళకు తేడా ఏముంది. ఆనం రామనారాయణరెడ్డికి ఇంకా సొంత కెపాసిటీ అన్నా వుంది. ఈరోజు ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి వంటి నియోజకవర్గాలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసినా నువ్వా, నేనా అనే రీతిలో పోటీ ఇవ్వగలడు. మేకపాటి సోదరులలో ఎవరైనా సరే ఈరోజు వైసిపి నుండి కాకుండా తెలుగుదేశం నుండి పోటీ చేసి గెలవగలరా? కనీసం గట్టిపోటీ ఇవ్వగలరా? అసలు ఆనం రామనారాయణరెడ్డి 2014లోనే ఆత్మకూరులో గట్టిగా ఎలక్షన్‌ చేసుంటే నెల్లూరు లోక్‌సభలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఓడిపోయుండేవాడు. ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి గెలుపు సందేహంగా వుండేది.

ఆనం రామనారాయణరెడ్డిని తక్కువ అంచనా వేసి మాట్లాడడం కరెక్ట్‌ కాదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వైకాపాకే కాదు, జగన్‌కు ఆయనను నమ్ముకున్న నాయకులకు జీవన్మరణ సమస్యలాంటివి. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవకుంటే చాలామంది నాయకులు, అనుచరుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరికి ఏ సీటు ఇవ్వాలన్నది జగన్‌ చూసుకుంటాడు. తమ సీట్లు ఎక్కడ పోతాయోనని చెప్పి మేకపాటి సోదరులు బలమైన నాయకులు పార్టీలోకి రాకుండా అడ్డుకుంటే వీళ్ళు జగన్‌కు మిత్రులు కాదు అనుకూల శత్రువులుగా మారుతారు.

chandiఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకోండి... కాంగ్రెస్‌ నాయకులకు రాహుల్‌గాంధీ చేసిన సూచన ఇది. ఏపిలో మనకు వైకాపానే ప్రధాన శత్రువు. రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఊమెన్‌చాందీ ఉక్రోషమిది.

రాజకీయాలలో విలువలు పాటించేవాళ్ళయినా, లేదా ప్రజల తరపున పోరాడేవాళ్ళయినా, అదీ కాదు అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నోళ్ళయినా అధికారంలో వున్న పార్టీని టార్గెట్‌ చేస్తారు. అధికార పార్టీపైనే యుద్ధం చేస్తారు. కాని, కాంగ్రెస్‌ నాయకులు ఆ పద్ధతిని వదిలేసారు. ప్రతిపక్షాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

దేశంలోనే కాంగ్రెస్‌కు తలా తోక లేకుండా పోయింది. ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి అంతకన్నా తలకాయ లేదనిపిస్తోంది. వీళ్ళ వింత చేష్టలు చూస్తుంటే కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అన్న ప్రధాని నరేంద్ర మోడీ కల సాకరమయ్యేందుకు ఎంతో దూరం లేదనిపిస్తోంది.

వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మీద కాంగ్రెస్‌ నాయకులు ఎంతగా కక్ష కట్టారనేదానికి వారి వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వై.యస్‌.జగన్‌ మీద కోపంతో కాంగ్రెస్‌ నాయకులు చంద్రబాబుకు సరెండర్‌ అయినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌-తెలుగుదేశంల మధ్య ఇటీవల కాలంలో సత్సంబంధాలు పరిఢవిల్లడం చూస్తున్నాం. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్‌కు కాస్తా దగ్గరయ్యింది. రేపు జాతీయ రాజకీయాలలో పరస్పర అవసరాల దృష్ట్యా స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లుగా వుంది. ఏపి కాంగ్రెస్‌ను మళ్ళీ బలోపేతం చేయాలని, పాత నాయకులందరినీ తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చెప్పి ఊమెన్‌ చాందీని అనే కేరళ నాయకుడిని ఏపికి ఇన్‌ఛార్జ్‌గా పంపారు. ఆయన ఊరు వాడ తిరుగుతూ పాత కాంగ్రెస్‌ నాయకులందరినీ కలుస్తున్నాడు. మాజీసీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిలాంటోళ్ళకు మళ్ళీ పార్టీ కండువాలు కప్పుతున్నారు.

ఏపిలో కాంగ్రెస్‌ బలోపేతం అనే ప్రక్రియకు చంద్రబాబే డైరెక్టర్‌ అని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైన ఓట్లకు ఈసారి బీజేపీ, జనసేనలు గండి పెట్టనున్నాయి. ఈ లోటును పూడ్చుకోవాలంటే వైసిపి ఓట్లలో చీలిక తేవాలి. ఇందుకు కాంగ్రెస్సే సరైన మార్గం. రాష్ట్రంలోని 175స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడితే ఆ పార్టీ ఓట్లు వైకాపాకు పోకుండా నిలువరించవచ్చన్నది చంద్రబాబు వ్యూహం. అందుకే కాంగ్రెస్‌ను ఆ దిశగా అప్రమత్తం చేసాడు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతే ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి భవిష్యత్‌ వుండదని, దాని స్థానంలో తిరిగి కాంగ్రెస్‌ బలం పెంచుకోవచ్చని, అలా కాకుండా ఆ పార్టీ గెలిచి లోక్‌సభలో, అసెంబ్లీలో మెజార్టీ సీట్లు సాధిస్తే ఇక కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో చోటుండదని, అదీగాక ఆ పార్టీకి వచ్చే లోక్‌సభ సీట్లు కూడా కేంద్రంలో బీజేపీకే ఉపయోగపడతాయని చంద్రబాబు నూరిపోయడంతో కాంగ్రెస్‌ నాయకులు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఏపిలో సరికొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు.

cm''వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌'' కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత కొంతకాలంగా భుజాలకెత్తుకున్న నినాదం. జమిలి ఎన్నికల వల్ల ఏ పార్టీ లాభపడుతుంది, ఏ పార్టీ నష్టపోతుంది అన్నది అప్రస్తుతం. కాని, దేశ ఆర్ధిక వ్యవస్థకు మాత్రం నష్టం తగ్గుతుంది. భారం తగ్గుతుంది. అధికార యంత్రాంగానికి ప్రయాస తగ్గుతుంది. ఎలక్షన్‌ వాతావరణం అంతా కూడా ఒకట్రెండు నెలల్లో ముగుస్తుంది. ఆ తర్వాత నాలుగేళ్ళ పది నెలల కాలంలో పరిపాలనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడానికి అవకాశముంటుంది.

కేంద్రం ఈ దిశగానే కసరత్తు ప్రారంభించింది. అన్ని పార్టీల అభిప్రాయ సేకరణ కోసం లా కమిషన్‌ను నియమించింది. జమిలి ఎన్నికలకు కొన్ని పార్టీలు వ్యతిరేకంగా వున్నాయి. మరికొన్ని పార్టీలు అనుకూలంగా తమ అభిప్రాయాల్ని వెల్లడించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు జమిలి ఎన్నికలకు 'సై' అంటున్నాయి. ఒక్క తెలుగుదేశం మాత్రం జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా వుంది.

జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు దీనికి అనుకూలంగా మాట్లాడింది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే! అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఆ తర్వాత పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టొచ్చంటూ ఆయన పలు సందర్భాలలో చెప్పాడు. కాని, ఇప్పుడు మాత్రం జమిలి ఎన్నికలకి ససేమిరా అంటున్నాడు.

జమిలి ఎన్నికలకు పోవాలంటే రాష్ట్ర అసెంబ్లీని ముందుగానే రద్దు చేయాల్సి వుంటుంది. దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి ఈ ఏడాది ఆఖర్లోగాని లేదా వచ్చే ఏడాది మొదట్లో గాని అను కూలంగా వుంటుంది. ఏపి అసెంబ్లీకి 2019 మే నెల దాకా గడువుంది. జమిలి ఎన్నికలకు వెళితే ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ బలంగా వుందో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబు ఖచ్చితంగా ఏదో ఒక కూటమి వైపు ఉండాల్సి వస్తుంది. బీజేపీకి దూరమైనప్పటి నుండి ఆయన కాంగ్రెస్‌తో సన్నిహితంగా వుంటున్నాడు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలను కూడగట్టి తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాడు. జమిలి ఎన్నికలు జరిగి బీజేపీ ఓడిపోయి తృతీయ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబుకు సమస్యేమీ లేదు. అలాకాకుండా మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తే చంద్రబాబుకు సినిమా మొదలవుతుంది. ఏపిలో తిరిగి అధికారం దక్కించుకుంటే నిలదొక్కుకోగలడు. కాని, ఓడిపోతే పరిస్థితి దారుణంగా వుంటుంది. అదే ఏపి అసెంబ్లీ కంటే ముందుగా పార్లమెంట్‌ ఎన్నికలు జరిగితే... ఫలితాలను బట్టి ట్రెండ్‌ అర్ధమవుతుంది. ఏపిలో తన పార్టీ పరిస్థితేంటో తెలుస్తుంది. సీట్లు తక్కువ వస్తే అసెంబ్లీ ఎన్నికలనాటికి సరిదిద్దు కోవడానికి అవకాశముంటుంది. అదీగాక బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో తెగిపోయిన సంబంధాలను మళ్ళీ అతికించుకునే ప్రయత్నాలు చేయవచ్చు. బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వస్తే... రాష్ట్రంలో ఆ పార్టీతోనైనా అంటకాగొచ్చు. కేంద్రంలో కాంగ్రెస్‌ సంబంధిత ప్రభుత్వమే వస్తే ప్రతిపక్ష నేత జగన్‌పై కేసులు తిరగతోడించి వైసిపిని బలహీనపరిచే ప్రయత్నం చేయవచ్చు. కేంద్రం అండతో వైసిపిలో వున్న పెద్ద లీడర్‌లను తిరిగి కాంగ్రెస్‌లోకే వెళ్ళే విధంగా ఒత్తిళ్ళు తెప్పించవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి ప్రాణం పోసుకుంటే వైసిపి ఓటు చీలి తాను లాభపడవచ్చు.

ఇన్ని రకాలుగా ఆలోచిస్తుండబట్టే చంద్రబాబు ముందుగా పార్లమెంటు ఎన్నికలు జరిగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలని చెప్పి అందరితోపాటు తానూ ముందస్తుకుపోతే మునిగిపోతాననే భయం ఆయనను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

Page 1 of 82

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter