చంద్రబాబునాయుడు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక జరిగిన అన్ని ఎన్నికలలోనూ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానాన్ని మహిళలకు ఇస్తూ వచ్చాడు. 1999లో వెంకట గిరిని సినీ నటి శారదకు, 2004లో గూడూరును ఉక్కాల రాజేశ్వ రమ్మకు, 2014 ఎన్నికల్లో గూడూరు సీటును డాక్టర్ బి.జ్యోత్స్న లతకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆ కాన్సెప్ట్‌ను అమలు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒక సీటును మహిళలకు గాని లేదంటే మైనార్టీలకు గాని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన గూడూరు సీటును ఈసారి వైకాపా నుండి జంప్ చేయించిన సిటింగ్ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కే ఇవ్వొచ్చు. కాబట్టి అక్కడ ఆశ లేదు. వున్న అవకాశమల్లా నెల్లూరుసిటీ లేదంటే సూళ్ళూరుపేట! ఈ రెండు సీట్లలోనే ప్రయో గాలు చేయగలరు! మహిళలకు నెల్లూరుసిటీ లేదా సూళ్లూరుపేట లలో దేనినైనా ఇవ్వొచ్చు. సూళ్ళూరుపేట అయితే ఎస్సీ మహిళను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పరసా రత్నం మీద వ్యతిరేకత బలంగా వుంది. స్థానికంగా వున్న టీడీపీ నాయకులు ఈసారి అభ్యర్థిని మార్చాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా అభ్యర్థి పోటీకి అవకాశముంది. ఇక రెండోది నెల్లూరు నగరం. ఇక్కడ జనరల్ మహిళ లేదంటే మైనార్టీలకు సీటివ్వడానికి అవకాశముంది. మహిళలకే సీటివ్వాలనుకుంటే మాజీమున్సిపల్ ఛైర్పర్సన్ టి.అనూరాధతో పాటు పార్టీలో ఇటీవల కీలకంగా మారిన వసంత లక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ శ్రీమతి వసంతలక్ష్మి లాంటి వాళ్ళున్నారు. నెల్లూరు నగరంలో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి ఆ వర్గానికి చెందిన వారికి కూడా అవకాశముంది. మేయర్ అబ్దుల్ అజీజ్ ఈ ప్రయత్నాల్లోనే వున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వున్న 10సీట్లలో టీడీపీ నుండి ఒక సీటు మైనార్టీలకు గాని మహిళలకు గాని గ్యారంటీ అని చెప్పొచ్చు.
నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్ మేయర్ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత నాలుగేళ్ల కాలంలో 9మంది కమిషనర్లు మారారు. ఇక సొంత పార్టీ కార్పొరేటర్లతోనూ వివాదాలే. అధికార పార్టీ నాయకులందరితోనూ విభేదాలే!
ఇంతకాలం రాజకీయ వివాదాలే తెరకెక్కుతూ వచ్చాయి. ఇప్పుడు వ్యాపార పరమైన వివాదాలు కూడా ఆయనను చుట్టుముడుతున్నాయి. ఇటీవల చెన్నైకు చెందిన ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ అజీజ్పైన, ఆయన కుటుంబసభ్యులపైన కేసు పెట్టడం తెలిసిందే! స్టార్ ఆగ్రోకు తామిచ్చిన 42కోట్ల రూపాయలను తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్ళించు కున్నారంటూ జెంపెక్స్ కంపెనీ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు కావడం, ఈ సంఘటన జిల్లాలో అలజడి రేపడం తెలిసిందే! తాజాగా యూనియన్ బ్యాంక్ ఇండియా వాళ్లు కూడా స్టార్ ఆగ్రోపై ఫిర్యాదు చేశారు. స్టార్ ఆగ్రోకు అజీజ్‌కు సంబంధం లేదంటూ వాళ్ళ తమ్ముడు, కార్పొరేటర్ జలీల్ మీడియా ముందుకొచ్చాడు. మరి యూనియన్ బ్యాంకు వాళ్ళయినా, జింపెక్స్ కంపెనీ వాళ్లయినా డబ్బులు కట్టింది, లోన్లు ఇచ్చింది అజీజ్‌తో జరిపిన లావాదేవీలవల్లనా? లేక ఆయనకు సంబంధం లేకుండానే ఇన్నేసి కోట్లు లోన్లు ఇచ్చారా? ఎవరు అబద్ధం చెబుతున్నట్లు? ఎవరు నిజాయితీగా వున్నట్లు? త్వరలో తేలకుండాపోతుందా?
ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర పార్టీల నుండి అరువు తెచ్చుకున్న నాయకుల వల్లే ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోతోంది.
మొన్న చూస్తే ఎమ్మెల్సీ వాకాటి నారా యణరెడ్డి... బ్యాంకులకు దాదాపు 700 కోట్లు బకాయిలు... మొదటి నుండి కాం గ్రెస్ మనిషి... 2015లో కాంగ్రెస్‌లో ఇక లాభంలేదని తెలుగుదేశంలో దూరాడు. అప్పటికే బ్యాంకు బకాయిలు పక్వానికి చేరివున్నాయి. అయినా కూడా చంద్రబాబు గత ఏడాది మళ్ళీ స్థానిక ఎమ్మెల్సీ నుండి నిలబెట్టి గెలిపించాడు. ఆయనను ఎమ్మె ల్సీగా గెలిపించాక బ్యాంకు బకాయిలు, కేసులు వంటివి బయటకు రావడంతో పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ నుండి వాకాటిని సస్పెండ్ చేసారన్న పేరే గాని, ఇటీవల చంద్రబాబు జన్మభూమి సభలో ఆయన ప్రత్యక్షం కావడం చూసాం.
వాకాటి అంశం అలా వుంచితే, ఇప్పుడు మేయర్ అజీజ్ వ్యవహారం పార్టీలో భగ్గుమంటోంది. తాము స్టార్ ఆగ్రో కంపెనీకి పంపించిన 42కోట్ల రూపాయలను అజీజ్ దారి మళ్ళించా రంటూ చెన్నైకు చెందిన ప్రసాద్ జెంపెక్స్ కంపెనీ చెన్నై క్రైమ్‌బ్రాంచ్‌లో కేసు పెట్టడం తెలిసిందే! తెలుగుదేశంపార్టీలోనే ఇది కలకలం రేపుతోంది. నెల్లూరు కార్పొరేషన్ లోనే మేయర్ అజీజ్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్ల సిండికేట్ ఏర్పడివుంది. మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డిలతో పాటు ఆదాల, ముంగమూరులతో కూడా అజీజ్‌కు పడదు. వీళ్ళ అనుచర కార్పొ రేటర్లందరు కూడా అజీజ్‌కు వ్యతిరేకంగా వున్నారు. అజీజ్ వ్యక్తిగత కేసుల కోసం పార్టీని ఎందుకు భ్రష్టు పట్టించాలనేది వీరి వాదన. ఇప్పటికి వ్యక్తిగత ఆర్ధిక లావా దేవీల కేసులే బయటకు వచ్చాయి. వాకాటి వంటి ఆర్ధిక కేసులు బయటపడితే అజీజ్‌పై వ్యతిరేక ముఠా దాడి ముమ్మరం చేసే అవకాశముంది. అయితే ఆయనను మేయర్ పదవి నుండి దించాలనే డిమాండ్ తెరపైకి రావచ్చు. అయితే మైనార్టీ అనే రక్షణ కవచం అజీజ్‌కు వుంది. ఆ బ్రాండ్ తోనే ఆయన మేయర్ అయ్యాడు. రేపు కూడా ఈ గండం నుండి ఆ బ్రాండే కాపాడొచ్చు. ఈ విషయంలో ప్రతిపక్ష వైకాపా పార్టీ ఇంకా తల దూర్చలేదు. అజీజ్ వైకాపా బ్రాండ్ మీద వచ్చిన నాయకుడే! ఆ పార్టీకే జలక్ ఇచ్చి టీడీపీలో చేరాడు. వీళ్ళు కూడా మైనార్టీ అని చెప్పే వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు.
అజీజ్ వ్యవహారంలో పార్టీ ఇబ్బంది పడకుండా పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర చాకచక్యంగా వ్యవహరించారు. అజీజ్ అమాయకుడని, ఆయన ఎవరినీ మోసం చేయలేదని, పార్టీ ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జరిగిన లావాదేవీలలో అజీజ్‌కు ఏ సంబంధం లేదని తేలితే సరే సరి! అజీజ్ తప్పుందని తేలితే... ఆరోజు కూడా ఇదే విధంగా అండగా నిలుస్తారా? లేక వాకాటిని సస్పెండ్ చేసినట్లే చేస్తారా? కాలమే నిర్ణయిస్తుంది!